డెడ్‌లైన్ దాటితే ఇరాన్‌ను ఒక్క రోజులో తుడిచిపెట్టేస్తాం: ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, బెర్న్‌డ్ డెబుస్‌మాన్ జూనియర్, టామ్ బేట్‌మాన్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
- చదివే సమయం: 4 నిమిషాలు
హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి తాను పెట్టిన డెడ్‌లైన్‌కు ముందు ఒప్పందం కుదరకపోతే ఇరాన్‌ను ''ఒక్కరాత్రిలో'' నాశనం చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు.
గల్ఫ్ మీదుగా ఎలాంటి ఆటంకాలు లేకుండా ఇంధన సరఫరా సహా అంగీకారయోగ్యమైన ఒప్పందం కోసం ట్రంప్ విధించిన డెడ్‌లైన్ భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం సుమారు అయిదున్నర గంటలకు పూర్తవుతుంది.
ఇరాన్ నేతలు కొందరు నిజాయితీగా చర్చలు జరుపుతున్నారని తాను భావిస్తున్నానని అయితే ఫలితంపై ఇంకా అనిశ్చితి ఉందని ట్రంప్ వ్యాఖ్యానించారు.
తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ప్రతిపాదనలను ఇరాన్ తోసిపుచ్చింది. యుద్ధాన్ని శాశ్వతంగా ముగించాలని, ఆంక్షలు ఎత్తివేయాలని కోరింది.
దక్షిణ ఇరాన్‌లో కూలిపోయిన ఎఫ్-15 ఫైటర్ జెట్‌లోని ఇద్దరు సభ్యులను అమెరికా బలగాలు రక్షించిన తర్వాత జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ డాన్ కైన్, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్‌తో కలిసి ట్రంప్ మీడియాతో మాట్లాడారు.

డెడ్‌లైన్‌లోగా తెరవకపోతే రాతియుగాలకే’
తమ సిబ్బందిని రక్షించిన తీరు గురించి ట్రంప్ తన మాటల్లో ఎక్కువగా వివరించారు. దీంతో పాటు తాను విధించిన డెడ్‌లైన్ లోపు హార్ముజ్ జలసంధిని తెరవకపోతే ఇరాన్ ఇంధన రవాణా మౌలిక సదుపాయాలపై అమెరికా దాడి చేయగలదని ట్రంప్ మరోసారి హెచ్చరించారు.
''మొత్తం దేశాన్ని ఒక్కరాత్రిలో తుడిచిపెట్టేస్తాం.. అది రేపు రాత్రి కూడా కావొచ్చు'' అని ట్రంప్ అన్నారు.
ఒక్కసారి డెడ్‌లైన్ ముగిస్తే ఇరాన్‌ను రాతియుగానికి తీసుకెళ్తామని ట్రంప్ వ్యాఖ్యానించారు.
''వాళ్లకు బ్రిడ్జిలుండవు. విద్యుత్ ప్లాంట్‌లుండవు'' అని ట్రంప్ హెచ్చరించారు.
అమెరికా డిమాండ్లను మొదట్లో ఇరాన్ వ్యతిరేకించింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో వరుసగా ఇరాన్ నాయకత్వం మరణిస్తుండడంతో ఇరాన్ నిజాయితీగా చర్చలు జరుపుతోందని ట్రంప్ భావిస్తున్నారు.
''మనకు త్వరలో తెలుస్తుంది'' అని ట్రంప్ అన్నారు.
ముందుగా కాల్పుల విరమణ జరగకుండా ఏ చర్చల్లోనయినా అర్ధవంతమైన పురోగతి ఉండబోదని చర్చలపై సమాచారం ఉన్న ఓ ప్రాంతీయ అధికారి చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
చర్చలకు కమ్యూనికేషన్ అంతరాయాలు
కమ్యూనికేషన్ల బ్లాక్‌అవుట్‌తో ఇరాన్ అధికారుల నుంచి సందేశాలు రావడం, వెళ్లడం కష్టంగా ఉన్న నేపథ్యంలో చర్చలు క్లిష్టంగా మారాయని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ అధికారి చెప్పారు.
''ఇరాన్‌కు సందేశాలు పంపించడం, సరైన టైమ్‌లో స్పందన లభంచడం సాధ్యం కావడం లేదు. స్పందన రావడానికి ఒకరోజు పడుతోంది'' అని ఆయన చెప్పారు.
పాకిస్తాన్, తుర్కియే, ఈజిప్ట్ మధ్యవర్తిత్వం చేస్తున్నాయి.
తన దగ్గర ''ఉత్తమ ప్రణాళిక'' ఉందని చెప్పిన ట్రంప్, దాని గురించి ఎక్కువ వివరాలు వెల్లడించలేదు.
ఇరాన్ మౌలికసదుపాయాలపై ఇష్టానుసారంగా దాడులు చేయడం యుద్ధనేరంగా పరిగణించవచ్చని న్యాయనిపుణులు హెచ్చరిస్తున్నారు.
''అన్ని విద్యుత్ కేంద్రాలను పూర్తిగా ధ్వంసం చేయడం, ప్రభుత్వాన్ని చర్చలకు ఒప్పించేందుకు ప్రజలపై తీవ్ర చర్యలు తీసుకుంటామని బెదిరించడం వంటివన్నీ అక్రమమైనవి'' అని ఒబామా హయాంలో నేషనల్ సెక్యూరిటీ లీగల్ ఎడ్వైజర్‌గా పనిచేసిన టెస్ బ్రిడ్జ్‌మ్యాన్ బీబీసీ అమెరికా పార్ట్‌నర్ సీబీఎస్‌తో చెప్పారు.
ఈ విషయంపై తనకు బాధలేదని, అయితే ప్రభుత్వాన్ని పడగొట్టడం తన అసలు ఉద్దేశం కాకపోయినప్పటికీ స్వేచ్ఛ కోసం బాధలుపడడానికి ఇరాన్ ప్రజలు సిద్ధంగా ఉంటారని ట్రంప్ వ్యాఖ్యానించారు.
యూకే, నాటో, దక్షిణకొరియాలాంటి అమెరికా కీలక మిత్రులపై కూడా ట్రంప్ విమర్శలు చేశారు. సంక్షోభం సమయంలో అమెరికాకు సాయం చేయడంలో అవి విఫలమయ్యాయన్నారు.
నేటోపై పడిన ఈ ముద్ర ఎప్పటికీ తొలగిపోదని, అమెరికాకు యూకే అవసరం లేదని ట్రంప్ వ్యాఖ్యానించారు.
యుద్ధం మొదలయిన దగ్గరినుంచి ఇరాన్ అంతటా అమెరికా 13వేలకుపైగా దాడులు చేసిందని అమెరికా మిలటరీ సెంట్రల్ కమాండ్ తెలిపింది.

ఫొటో సోర్స్, TELEGRAM/MFAIRA
ట్రంప్ బెదిరింపుపై ఇరాన్ స్పందించింది.
'తాత్కాలిక కాల్పుల విరమణ'ను తిరస్కరించింది. సంక్షోభానికి 'శాశ్వత ముగింపు' పలకాలని డిమాండ్ చేసింది.
తన అధికారిక వార్తా సంస్థ ఐఆర్ఎన్ఏ ద్వారా ప్రచురించిన ప్రతిపాదనలో ఇరాన్ తన డిమాండ్లను తెలియజేసింది.
- ఆంక్షలు ఎత్తివేయడం
- హార్ముజ్ జలసంధి మీదుగా నౌకల సురక్షిత ప్రయాణానికి హామీ ఇవ్వడం
- దాడుల వల్ల దెబ్బతిన్న ఇరాన్ పౌర మౌలిక సదుపాయాల పునర్‌నిర్మాణానికి సాయం అదించడం
ఇరాన్ఈ మూడు డిమాండ్లను చేస్తోంది.
అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్, ఇజ్రాయెల్, ఇతర పొరుగు దుశాలనూ క్షిపణి దాడులు కొనసాగించింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























