సిగరెట్ల‌కన్నా ఈ-సిగరెట్లు సురక్షితమా? పొగాకు ఏ రూపంలో తీసుకున్నా ప్రమాదమేనా?

స్మోకింగ్, పొగాకు, ధూమపానం ఆరోగ్యానికి హానికరం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, డాక్టర్ హిమానీ, రేడియేషనల్ ఆంకాలజిస్ట్
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ
  • చదివే సమయం: 8 నిమిషాలు

సిగరెట్ మాత్రమే పొగాకు కాదు. బీడీ, ఖైనీ, గుట్కా, జర్దా, పొగాకు కలిపిన పాన్, హుక్కా, చుట్ట, స్నఫ్ వంటి ఉత్పత్తులన్నీ ఆరోగ్యానికి హానికరమే. పొగాకు ఏ రూపంలో తీసుకున్నా ప్రమాదమే.

శరీరంలోని దాదాపు ప్రతి అవయవంపై పొగాకు వినియోగం తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కాబట్టి పొగ తాగడం లేదు, వేరే రూపంలో తింటున్నాం కాబట్టి నాకేం కాదు అనుకోవడం కూడా అపోహే.

పొగాకు వినియోగం ప్రపంచవ్యాప్తంగా నివారించగలిగే అనారోగ్యం, అకాల మరణాలకు ముఖ్యమైన కారణాల్లో ఒకటి. పొగాకు వల్ల క్యాన్సర్ మాత్రమే కాదు.. గుండె జబ్బులు, పక్షవాతం, ఊపిరితిత్తుల వ్యాధులు, నోటి సమస్యలు, కంటి సమస్యలు, సంతానోత్పత్తి సమస్యలు, రోగనిరోధక శక్తి తగ్గడం వంటి అనేక సమస్యలు వస్తాయి.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం పొగాకు వినియోగం ప్రతి సంవత్సరం 70 లక్షలకు పైగా మరణాలకు కారణమవుతోంది.

అన్ని రకాల పొగాకు వినియోగం హానికరమే. పొగాకు వినియోగానికి సురక్షితమైన మోతాదు అంటూ ఏదీ లేదు.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
స్మోకింగ్, పొగాకు, ధూమపానం ఆరోగ్యానికి హానికరం

ఫొటో సోర్స్, Getty Images

భారత్‌లో పొగాకు పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంది?

భారత్‌లో పొగాకు వినియోగం వివిధ రూపాల్లో జరుగుతుంటుంది. సిగరెట్‌తో పాటు బీడీ, ఖైనీ, గుట్కా, జర్దా, పొగాకు కలిపిన పాన్ వంటి పొగలేని ఉత్పత్తులను విస్తృతంగా వాడుతున్నారు.

భారత్‌లో నిర్వహించిన గ్లోబల్ అడల్ట్ టొబాకో సర్వే (GATS-2) 2016–17 ప్రకారం 15 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సున్న వారిలో 28.6% మంది అంటే సుమారు 26.7 కోట్ల మంది ఏదో ఒక రూపంలో పొగాకు వాడుతున్నారు. వీరిలో పొగతాగే పొగాకు వినియోగం 10.7%, పొగలేని పొగాకు వినియోగం 21.4%. 2009–10లో ఉన్న 34.6%తో పోలిస్తే మొత్తం పొగాకు వినియోగం తగ్గినప్పటికీ, దేశంలో వినియోగదారుల సంఖ్య ఇప్పటికీ చాలా పెద్దదే.

భారత్‌లో పొగాకు కారణంగా ప్రతి సంవత్సరం సుమారు 13.5 లక్షల మరణాలు సంభవిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, డబ్ల్యూహెచ్ఓ సమాచారం సూచిస్తోంది.

‘‘పొగాకు వల్ల కలిగే వ్యాధులు, అకాల మరణాల కారణంగా 2017–18లో 35 సంవత్సరాలు పైబడిన భారతీయులపై పడిన ఆర్థిక భారం సుమారు రూ. 1.77 లక్షల కోట్లు, అంటే దేశ జీడీపీలో 1% పైగా’’ అని డబ్ల్యూహెచ్ఓ అధ్యయనం అంచనా వేసింది.

ఇంకా ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే... 2020లో భారత్‌లోని మొత్తం క్యాన్సర్ కేసుల్లో సుమారు 27.1% (3.7 లక్షల కేసులు) పొగాకు సంబంధిత క్యాన్సర్లుగా ICMR-NCDIR అంచనా వేసింది.

స్మోకింగ్, పొగాకు, ధూమపానం ఆరోగ్యానికి హానికరం

ఫొటో సోర్స్, Getty Images

ఏ పొగాకు ఉత్పత్తి ఏ అవయవాన్ని ఎక్కువగా దెబ్బతీస్తుంది?

1. సిగరెట్ — ఊపిరితిత్తులకే కాదు, మొత్తం శరీరానికి ప్రమాదం.

సిగరెట్ పొగలో వేలాది రసాయనాలు ఉంటాయి. వాటిలో అనేకం విషపూరితమైనవి, క్యాన్సర్‌కు కారణమయ్యేవి.

సిగరెట్ కాల్చడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్, COPD, క్రానిక్ బ్రాంకైటిస్, ఎంఫిసీమా, గుండెపోటు, పక్షవాతం, రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం, నోరు, గొంతు, స్వరపేటిక క్యాన్సర్లు, అన్నవాహిక క్యాన్సర్, మూత్రాశయ క్యాన్సర్, మూత్రపిండ క్యాన్సర్, ప్యాంక్రియాస్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, కొలొరెక్టల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి.

సిగరెట్ పొగ ఊపిరితిత్తులను మాత్రమే దెబ్బతీస్తుందని అనుకోవడం తప్పు. పొగాకు శరీరంలోని దాదాపు ప్రతి అవయవాన్ని ప్రభావితం చేస్తుంది.

2. బీడీ – దీని చుట్టూ ఎన్నో అపోహలు

"సిగరెట్ కంటే బీడీ సహజమైనది" అనే అపోహ చాలామందిలో ఉంటుంది. బీడీ చిన్నది, ఆకులో చుట్టి ఉంటుంది కాబట్టి సిగరెట్ కంటే తక్కువ ప్రమాదకరమని చాలామంది భావిస్తారు. ఇది నిజం కాదు.

భారత్‌లో బీడీ వినియోగం చాలా ఎక్కువ. డబ్ల్యూహెచ్ఓ ప్రకారం 2022 నాటికి సుమారు 7.2 కోట్ల మంది బీడీని ఉపయోగిస్తున్నారు.

బీడీ పొగలో కూడా నికోటిన్, కార్బన్ మోనాక్సైడ్, టార్, ఇతర క్యాన్సర్ కారక పదార్థాలు ఉంటాయి.

బీడీ వలన ఊపిరితిత్తుల క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, అన్నవాహిక క్యాన్సర్, గుండె జబ్బులు, COPD, పక్షవాతం వంటి ప్రమాదాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

3. ఖైనీ, జర్దా, గుట్కా- వీటితో నోటి క్యాన్సర్‌కు పెద్ద ముప్పు

భారత్‌లో పొగలేని పొగాకు వినియోగం చాలా ముఖ్యమైన సమస్య.

ఖైనీ, జర్దా, గుట్కా, పొగాకు కలిపిన పాన్, మిష్రీ, గుల, గుడాకు వంటి ఉత్పత్తులను నోటిలో పెట్టుకోవడం లేదా దంతాలు, చిగుళ్లపై రాయడం చేస్తుంటారు.

పొగ లేకపోవడం వల్ల ఇవి సురక్షితమైనవని అనుకోవడం అపోహ. పొగలేని పొగాకులోని క్యాన్సర్ కారక పదార్థాలు నోటి కణజాలంతో ఎక్కువసేపు నేరుగా సంబంధంలో ఉంటాయి.

దీంతో ముఖ్యంగా ప్రభావితమయ్యే ప్రాంతాలు

నోరు → నాలుక → చెంప లోపలి భాగం → చిగుళ్లు → పెదవులు → నోటి అడుగు భాగం → గొంతు

వీటివల్ల నోటి క్యాన్సర్, నాలుక క్యాన్సర్, చెంప క్యాన్సర్ (కార్సినోమా buccal mucosa), నోటి అడుగు భాగం క్యాన్సర్, గొంతు క్యాన్సర్, చిగుళ్ల వ్యాధులు, పళ్లు ఊడిపోవడం, నోరు తెరవడం కష్టమవడం (trismus), సబ్ మ్యూకస్ ఫైబ్రోసిస్, నోటి ముందస్తు క్యాన్సర్ మార్పులు (pre-carcinomatous changes) వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

పొగాకు నమలడం ఎంత చిన్న వయసులో ప్రారంభించారో, ఎంతకాలం ఉపయోగించారో, రోజుకు ఎన్నిసార్లు ఉపయోగిస్తున్నారో అనే వాటిని బట్టి నోటి క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుందని IARC నివేదికలు సూచిస్తున్నాయి.

4. గుట్కా- పొగ లేకపోయినా క్యాన్సర్ ప్రమాదం

గుట్కాలో సాధారణంగా పొగాకు, సున్నం, సుపారీ/అరెకా గింజ తదితర పదార్థాలు ఉంటాయి.

సుపారీ కూడా పూర్తిగా సురక్షితమైనది కాదు.

పొగాకు ఉన్న గుట్కా నోటి క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. అరెకా నట్ వినియోగం స్వతంత్రంగానూ, నోటి కణజాలంలో ఓరల్ సబ్‌మ్యూకస్ ఫైబ్రోసిస్ వంటి ముందస్తు క్యాన్సర్ పరిస్థితులతో సంబంధం కలిగి ఉంటుంది.

అందువల్ల "పొగ తాగడం మానేశాను, గుట్కా మాత్రమే వాడుతున్నాను" అనేది ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం కాదు.

5. పొగాకు కలిపిన పాన్ — రుచికరమైన అలవాటుగా మొదలై ప్రమాదకరంగా మారవచ్చు.

పాన్‌లో పొగాకు, జర్దా లేదా ఇతర పొగాకు ఉత్పత్తులు కలిపితే నోటి క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది.

భారత్‌లో నోటి, నోటి వెనుక భాగం (oropharynx), గొంతు క్యాన్సర్ల అధిక భారానికి smokeless tobacco, బీడీ, betel quid వంటి అలవాట్లు ముఖ్యమైన కారణాలుగా IARC గుర్తించింది.

6. హుక్కా

హుక్కా పొగ నీటిలోంచి వెళ్తుంది కాబట్టి హానికర పదార్థాలు తొలగిపోతాయని చాలామంది అనుకుంటారు. అది అపోహ.

హుక్కా ద్వారా కూడా నికోటిన్, కార్బన్ మోనాక్సైడ్, టార్, క్యాన్సర్ కారక రసాయనాలు శరీరంలోకి చేరే ప్రమాదముంది.

దీర్ఘకాలంలో ఊపిరితిత్తులు, గుండె, రక్తనాళాలపై ఇది ప్రభావం చూపుతుంది.

అందుకే పొగాకు ఉత్పత్తులన్నింటినీ సురక్షితమైనవిగా భావించకుండా ఉండాలని డబ్ల్యూహెచ్ఓ స్పష్టం చేస్తోంది.

స్మోకింగ్, పొగాకు, ధూమపానం ఆరోగ్యానికి హానికరం

ఫొటో సోర్స్, Getty Images

పొగాకు వల్ల ఏ అవయవానికి ఏమవుతుంది?

డబ్ల్యూహెచ్ఓ ప్రకారం పొగాకు కార్డియోవాస్కులర్ డిసీజ్, స్ట్రోక్, క్రానిక్ రెస్పిరేటరీ డిసీజ్‌తో పాటు 20కి పైగా రకాల క్యాన్సర్లకు ముఖ్యమైన ప్రమాద కారకం.

అవయవం - ప్రధాన ప్రభావాలు

నోరు - తెల్ల/ఎర్ర మచ్చలు, precancerous lesions, నోటి క్యాన్సర్

నాలుక - క్యాన్సర్, పుండ్లు, నొప్పి

గొంతు - గొంతు/ఫ్యారింక్స్ క్యాన్సర్

స్వరపేటిక - స్వరం మారడం, క్యాన్సర్

ఊపిరితిత్తులు - COPD, ఎంఫిసీమా, ఊపిరితిత్తుల క్యాన్సర్

గుండె - గుండెపోటు, కరోనరీ ఆర్టరీ డిసీజ్

మెదడు - పక్షవాతం

రక్తనాళాలు - పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్, రక్త ప్రసరణ తగ్గడం

అన్నవాహిక - క్యాన్సర్

కడుపు - కడుపు క్యాన్సర్, ఇతర జీర్ణాశయ సమస్యలు

ప్యాంక్రియాస్ - ప్యాంక్రియాటిక్ క్యాన్సర్

మూత్రపిండాలు/మూత్రాశయం - క్యాన్సర్

రీప్రొడక్టివ్ వ్యవస్థ - సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గడం

కళ్లు - కొన్ని కంటి వ్యాధుల ప్రమాదం పెరగడం

చర్మం - చర్మ ఆరోగ్యం దెబ్బతినడం, ప్రిమెచ్యూర్ ఏజింగ్

రోగనిరోధక వ్యవస్థ - ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశం పెరగడం

స్మోకింగ్, పొగాకు, ధూమపానం ఆరోగ్యానికి హానికరం

ఫొటో సోర్స్, Getty Images

ఊపిరితిత్తులకు పొగాకు చేసే నష్టం, పాసివ్ స్మోకింగ్ వల్ల కలిగే ప్రమాదం

పొగాకు పొగలోని విష పదార్థాలు ఊపిరితిత్తులలోని చిన్న వాయు మార్గాలు, alveoliని దెబ్బతీస్తాయి.

దీర్ఘకాలంలో దగ్గు → కఫం → ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది → COPD → ఆక్సిజన్ తగ్గడం → respiratory failure వరకు పరిస్థితి వెళ్లవచ్చు.

అదే సమయంలో ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదం కూడా గణనీయంగా పెరుగుతుంది. డబ్ల్యూహెచ్ఓ ప్రకారం లంగ్ క్యాన్సర్ కేసుల్లో ఎక్కువ శాతానికి ధూమపానమే ప్రధాన కారణం.

"నేను పొగ తాగను కాబట్టి నాకు ప్రమాదం లేదు" అనడం కూడా పూర్తిగా సరైంది కాదు.

ఇంట్లో ఒకరు పొగతాగితే వారి చుట్టూ ఉన్న కుటుంబ సభ్యులు కూడా సెకండ్ హ్యాండ్ స్మోక్‌కు గురవుతారు.

ఇది పిల్లల్లో తరచూ శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, ఆస్థమా సమస్యలు, నిమోనియా, చెవి ఇన్ఫెక్షన్లు పెరగడానికి కారణమవుతుంది.

పెద్దల్లో కరోనరీ హార్ట్ డిసీజ్, స్ట్రోక్, లంగ్ క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది. డబ్ల్యూహెచ్ఓ ప్రకారం సెకండ్ హ్యాండ్ స్మోక్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 16 లక్షల మందికి పైగా పొగ తాగనివారు అకాల మరణం పాలవుతున్నారు.

అందుకే ఇల్లు, కారు — రెండూ పూర్తిగా పొగ రహిత ప్రాంతాలుగా ఉండాలి.

స్మోకింగ్, పొగాకు, ధూమపానం ఆరోగ్యానికి హానికరం

ఫొటో సోర్స్, Getty Images

ఈ-సిగరెట్లు సురక్షితమైనవేనా?

ఈ-సిగరెట్‌ను సిగరెట్‌కు "సురక్షిత ప్రత్యామ్నాయం"గా ప్రచారం చేస్తున్న సందర్భాలు కనిపిస్తుంటాయి. కానీ దీన్ని పూర్తిగా సురక్షితమైన ఉత్పత్తిగా భావించకూడదు.

ఈ-సిగరెట్లలో నికోటిన్ ఉండవచ్చు. వాటి aerosolలో కూడా హానికరమైన పదార్థాలు ఉండవచ్చు. వీటిని ఆరోగ్యానికి హానికరమైనవిగా డబ్ల్యూహెచ్ఓ పేర్కొంటోంది.

భారత్‌లో ఎలక్ట్రానిక్ సిగరెట్ల నిషేధ చట్టం, 2019 ప్రకారం ఈ-సిగరెట్లు, ఇలాంటి ఉత్పత్తులపై ఉత్పత్తి, దిగుమతి, ఎగుమతి, రవాణా, అమ్మకం, పంపిణీ, నిల్వ, ప్రకటనలపై నిషేధం ఉంది.

స్మోకింగ్, పొగాకు, ధూమపానం ఆరోగ్యానికి హానికరం

ఫొటో సోర్స్, Getty Images

పొగాకు మానేయడం వల్ల ప్రయోజనం ఏమిటి?

పొగాకు ఎప్పుడు మానేసినా అది మంచి నిర్ణయమే.

మానేసిన వెంటనే శరీరంలో అనేక మార్పులు ప్రారంభమవుతాయి. దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు క్రమంగా తగ్గుతాయి. గుండె, రక్తనాళాలు, క్యాన్సర్‌కు సంబంధించిన ప్రమాదాలు కూడా క్రమంగా తగ్గుతాయి.

పొగాకు మానేయడానికి ముందుగా "రోజుకు రెండు సిగరెట్లకు తగ్గిస్తాను" అనడం కంటే పూర్తిగా మానేయడమే ఉత్తమ పని.

పొగాకు వ్యసనం కేవలం "మానసిక బలహీనత" కాదు. నికోటిన్ తీవ్రమైన వ్యసనంలా మారుతుంది. అందువల్ల చాలామందికి వైద్య సహాయం, కౌన్సెలింగ్, అవసరమైతే మందుల సహాయం అవసరం.

స్మోకింగ్, పొగాకు, ధూమపానం ఆరోగ్యానికి హానికరం

ఫొటో సోర్స్, Getty Images

పొగాకు నుంచి ఎలా రక్షించుకోవాలి?

1. పూర్తిగా మానేయాలి

సిగరెట్, బీడీ, గుట్కా, ఖైనీ, జర్దా, పొగాకు పాన్ — ఏ రూపమైనా మానేయాలి.

2. "ఒక్కసారి మాత్రమే" అనే ఆలోచనను నివారించాలి

ఒకసారి మానేసిన తర్వాత మళ్లీ ఒక్క సిగరెట్/గుట్కాతో ప్రారంభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల అలాంటి ఆలోచనే వద్దు.

3. ట్రిగ్గర్‌లను గుర్తించాలి

టీ, కాఫీ, మద్యం, స్నేహితుల సమూహం, ఒత్తిడి, భోజనం తర్వాత వంటి సందర్భాల్లో పొగాకు మీదకు దృష్టి పోతుంటే వాటికి ప్రత్యామ్నాయ అలవాట్లు ఏర్పరచుకోవాలి.

4. కుటుంబ సభ్యుల సహాయం తీసుకోవాలి

ఇంట్లో ఉన్నవారు ప్రోత్సహిస్తే మానేసే ప్రక్రియ మెరుగుపడుతుంది.

5. వైద్య సహాయం తీసుకోవాలి

కౌన్సెలింగ్‌తో పాటు అవసరమైతే నికోటిన్ రీప్లేస్‌మెంట్ థెరపీ లేదా ఇతర ఎవిడెన్స్-బేస్డ్ మందులను వైద్యుల సలహాతో ఉపయోగించవచ్చు.

6. పిల్లలను ప్రారంభం నుంచే రక్షించాలి

పిల్లలు పొగాకు ప్రకటనలు, పొగతాగే పెద్దల ప్రవర్తనను అనుకరించే అవకాశం ఉంటుంది. అందుకే ఇంట్లో పొగాకు రహిత వాతావరణం ఉండాలి.

7. నోటి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు

పొగాకు వాడే వ్యక్తికి నోటిలో 3 వారాలకు మించి తగ్గని పుండు, తెల్ల/ఎర్ర మచ్చ, గడ్డ, రక్తస్రావం, నోరు తెరవడంలో ఇబ్బంది, మింగడంలో ఇబ్బంది లేదా స్వరం మారడం వంటి లక్షణాలుంటే వెంటనే వైద్యుడిని/దంత వైద్యుడిని సంప్రదించాలి.

IARC ప్రకారం అధిక ప్రమాదంలో ఉన్నవారిలో క్లినికల్ ఓరల్ ఎగ్జామినేషన్ ద్వారా ముందస్తు నోటి క్యాన్సర్ మార్పులను గుర్తించడం ఉపయోగకరంగా ఉండవచ్చు.

స్మోకింగ్, పొగాకు, ధూమపానం ఆరోగ్యానికి హానికరం

ఫొటో సోర్స్, Getty Images

భారత్‌లో పొగాకు మానేయడానికి సహాయం ఎక్కడ లభిస్తుంది?

పొగాకు మానేయడానికి ప్రయత్నిస్తున్నవారు ఒంటరిగా పోరాడాల్సిన అవసరం లేదు.

భారత ప్రభుత్వ నేషనల్ టొబాకో క్విట్‌లైన్ ద్వారా ఉచిత కౌన్సెలింగ్ పొందవచ్చు.

టోల్-ఫ్రీ నంబర్ 1800-11-2356 కు కాల్ చేసి, పొగాకు మానేయడానికి కౌన్సెలింగ్, ఫాలో-అప్, సహాయాన్ని అనేక భారతీయ భాషల్లో పొందవచ్చు.

ఒక వ్యక్తి పొగాకు మానేస్తే అతని ఆరోగ్యం మాత్రమే కాదు, అతని కుటుంబం కూడా సెకండ్ హ్యాండ్ స్మోక్ నుంచి రక్షణ పొందుతుంది. వైద్య ఖర్చులు తగ్గుతాయి, పని సామర్థ్యం మెరుగవుతుంది.

పొగాకు మానేయడానికి సరైన రోజు "రేపు" కాదు... ఈ రోజే.

గుర్తుంచుకోవాల్సిన ఐదు మాటలు

పొగాకు ఏ రూపంలోనైనా హానికరమే.

పొగలేని పొగాకు కూడా సురక్షితం కాదు.

బీడీ సిగరెట్‌కు సురక్షిత ప్రత్యామ్నాయం కాదు.

పాసివ్ స్మోకింగ్ కూడా ప్రమాదకరమే.

మానేయడం ఎప్పుడూ ఆలస్యం కాదు.

(గమనిక: రచయిత ఓ డాక్టర్. వైద్యపరమైన విధానాలు, చికిత్సలపై అవగాహన కల్పించడమే ఈ ఆర్టికల్ ఉద్దేశం. ఆరోగ్యపరమైన ఏ నిర్ణయమైనా డాక్టర్‌ను సంప్రదించి మాత్రమే తీసుకోగలరు)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)