సర్వైకల్ క్యాన్సర్: లైంగికంగా కలిసిన తరువాత హెచ్‌పీవీ వ్యాక్సీన్ పనిచేయడం మానేస్తుందా? పురుషాంగానికి క్యాన్సర్ రాకుండా మగవారూ ఈ వ్యాక్సీన్ తీసుకోవచ్చా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, డాక్టర్ హిమాని
- హోదా, బీబీసీ కోసం
- చదివే సమయం: 4 నిమిషాలు
సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయ ముఖద్వారంలో వచ్చే క్యాన్సర్. ప్రపంచ వ్యాప్తంగా మహిళల్లో సాధారణంగా వచ్చే క్యాన్సర్లలో ఇదొకటి.
మన దేశంలోనూ ఎక్కువగా గ్రామీణ ప్రాంత మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్ కేసులు నమోదు అవుతున్నాయి.
సర్వైకల్ క్యాన్సర్‌కు 95 శాతం కారణం హ్యూమన్ పాపిలోమా ( హెచ్‌పీవీ) అనే వైరస్.
హెచ్‌పీవీ 6, 11, 16 హెచ్‌పీవీ 18 రకాలు సర్వైకల్ క్యాన్సర్‌కు ఎక్కువగా కారణమవుతాయి.
ఈ వైరస్ ప్రధానంగా లైంగిక సంబంధం ద్వారా వ్యాపిస్తుంది.
కొన్నిసార్లు చర్మం, స్పర్శ ద్వారానూ సోకవచ్చు. అయితే హెచ్‌పీవీ సోకిన అందరికీ క్యాన్సర్ రాదు.
రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండి, దీర్ఘకాలంగా ఇన్ఫెక్షన్ ఉన్న వారిలో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది.


ఫొటో సోర్స్, Getty Images
సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలు, నిర్ధరణ
- అసాధారణ రక్త స్రావం
- తెల్ల మైలు
- పొత్తి కడుపు నొప్పి
- నడుము నొప్పి
- మూత్రంలో మంట
నిర్ధరణ ఎలా అంటే...
సీటీ /ఎంఆర్ఐ లేదా పీఈటీ సీటీ స్కాన్
బయాప్సీ (ముక్క పరీక్ష) ద్వారా సర్వైకల్ క్యాన్సర్ నిర్ధరణ చేసి ఏ స్టేజ్‌లో ఉందో తెలుసుకోవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
హెచ్‌పీవీకి వ్యాక్సీన్ ఉందా?
హెచ్‌పీవీ వ్యాక్సీన్ తీసుకోవడం వలన సర్వైకల్ క్యాన్సర్‌ను నివారించవచ్చు. భారత్‌లో నాలుగు రకాల హెచ్‌పీవీ వ్యాక్సీన్లు అందుబాటులో ఉన్నాయి. అవి గార్డసిల్ 4, గార్డసిల్ 9, సర్వారిక్స్, సర్వావాక్. వీటిలో గార్డసిల్, సర్వావాక్ వ్యాక్సీన్‌లు ఎక్కువ హెచ్‌పీవీ రకాలకు రక్షణ ఇస్తాయి.
1. 9–14 సంవత్సరాల పిల్లలకు - రెండు డోసులు
2. 15–26 సంవత్సరాల యువతులు - మూడు డోసులు
3. 26 ఏళ్ల పైబడిన వయసువారు
లైంగిక కలయిక ముందు వరకు వ్యాక్సీన్ తీసుకోవచ్చు. పెళ్లి తర్వాత లేదా లైంగిక కలయిక తరువాత వ్యాక్సీన్ తీసుకోవాలి అనుకునే వారు డాక్టర్‌ను సంప్రదించి హెచ్‌పీవీ వైరస్ ఇన్ఫెక్షన్ ఉందో లేదో పరీక్ష చేయించుకుని, లేదని నిర్థరించుకుని వాక్సీన్ తీసుకుంటే దాని ఫలితం ఉంటుంది.
హెచ్‌పీవీ వ్యాక్సీన్ల వల్ల ఎలాంటి దుష్ప్రభావాలూ వుండవు. ఇది చాలా సురక్షితమైన వ్యాక్సీన్.
ఈ వ్యాక్సీన్ వలన సర్వైకల్ క్యాన్సర్ రాకుండా 90% పైగా రక్షణ పొందవచ్చు.
ఈ వ్యాక్సీన్ మగవారూ తీసుకోవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
హెచ్‌పీవీ వ్యాక్సీన్ అపోహలు - నిజాలు:
- ఇది కేవలం ఆడవారికే అనేది అపోహ. మగ పిల్లలు, పురుషులు కూడా ఈ వ్యాక్సీన్ తీసుకుని హెచ్‌పీవీ వల్ల వచ్చే క్యాన్సర్ల నుంచి రక్షణ పొందవచ్చు.
- ఈ వ్యాక్సీన్ లైంగిక సామర్థ్యంపై ప్రభావం చూపిస్తుందనేది అపోహ.
- హెచ్‌పీవీ వ్యాక్సీన్ సర్వైకల్ క్యాన్సర్‌కు మాత్రమే రక్షణ ఇస్తుంది అనుకుంటారు. కానీ హెచ్‌పీవీ ఇన్ఫెక్షన్ వల్ల ఆడవారిలో కలిగే సర్వైకల్, వెజైనల్, వల్వల్ క్యాన్సర్‌తో పాటు మగవారిలో అంగానికి వచ్చే క్యాన్సర్, ఓరో ఫారింజియల్ క్యాన్సర్ల నుంచి రక్షణ లభిస్తుంది.
- ఒకసారి లైంగిక కలయిక జరిగిన తరువాత వ్యాక్సీన్ పని చేయదు అనేది అపోహ. హెచ్‌పీవీ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉంటే ఎప్పుడైనా వ్యాక్సీన్ తీసుకోవచ్చు.
- హెచ్‌పీవీ వ్యాక్సీన్ వల్ల దుష్ప్రభావాలు ఉంటాయి అనేది అపోహ. ఇంజెక్షన్ ఇచ్చిన చోట స్వల్పంగా వాపు లేదా చాలా కొద్ది మందిలో జ్వరం వచ్చే అవకాశం ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్
30 నుంచి 65 సంవత్సరాల వయసు గల మహిళలు, వ్యాక్సీన్ వేసుకున్న వారు కూడా స్క్రీనింగ్ పరీక్షలు కచ్చితంగా చేయించుకోవాలి.
Pap smear test ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి, హెచ్‌పీవీ డీఎన్ఏ టెస్ట్ ప్రతి ఐదేళ్లకు ఒకసారి చేయించుకోవాలి.
హెచ్‌పీవీ వ్యాక్సీన్ తీసుకుంటే సర్వైకల్ క్యాన్సర్‌ను మనం నివారించవచ్చు. స్క్రీనింగ్ టెస్టులతో ప్రారంభ దశలోనే గుర్తించి, చికిత్స అందించటం ద్వారా దీనిని నయం చేయవచ్చు.
(గమనిక: రచయిత డాక్టర్. వైద్యపరమైన విషయాలను సులభంగా వివరించి అవగాహన కల్పించడానికి రాసిన కథనం మాత్రమే ఇది)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)































