గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్‌కు భయపడాలా? బహిష్టు సమస్యల నుంచి సంతానలేమి వరకు.. దీనివల్ల కలిగే పరిణామాలు ఏంటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, డాక్టర్ హిమానీ, రేడియేషనల్ ఆంకాలజిస్ట్
- హోదా, బీబీసీ కోసం
- ప్రచురణ
- చదివే సమయం: 7 నిమిషాలు
మహిళల్లో కనిపించే సాధారణ గైనిక్ సమస్యల్లో గర్భాశయ ఫైబ్రాయిడ్స్ (Uterine Fibroids) ఒకటి.
బహిష్టు సమయంలో అధిక రక్తస్రావం, కడుపు కింది భాగంలో నొప్పి, పొత్తి కడుపు ఉబ్బరంగా ఉండటం వంటి సమస్యలకు ఇవి కారణం కావచ్చు.
కొంతమంది మహిళల్లో ఎలాంటి లక్షణాలూ కనిపించకుండా సాధారణ పరీక్షల్లోనే ఇవి బయటపడతాయి.
ఫైబ్రాయిడ్స్ ఉన్న ప్రతి మహిళకూ శస్త్రచికిత్స అవసరం ఉండదు. వాటి పరిమాణం, స్థానం, లక్షణాల తీవ్రత, మహిళ వయసు, భవిష్యత్తులో పిల్లలు కావాలనే కోరిక ఆధారంగా చికిత్సను నిర్ణయిస్తారు.
ముఖ్యంగా, గర్భాశయంలో ఫైబ్రాయిడ్ ఉందంటే అది క్యాన్సర్ అని కాదు.

ఫైబ్రాయిడ్స్ అంటే ఏమిటి?
గర్భాశయ కండర కణజాలం నుంచి ఏర్పడే, సాధారణంగా క్యాన్సర్ కాని గడ్డలను గర్భాశయ ఫైబ్రాయిడ్స్ లేదా లియోమయోమాస్ (Leiomyomas) అంటారు. ఇవి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలో ఏర్పడవచ్చు.
కొన్ని చిన్నగా ఉండి ఎలాంటి ఇబ్బందీ కలిగించకపోవచ్చు. మరికొన్ని పెద్దవిగా పెరిగి గర్భాశయ ఆకృతిని మార్చవచ్చు.
ఫైబ్రాయిడ్స్ సాధారణంగా పునరుత్పత్తి వయస్సులో ఉన్న మహిళల్లో ఎక్కువగా కనిపిస్తాయి. రుతుక్రమం ఆగిపోయిన తర్వాత హార్మోన్ల ప్రభావం తగ్గడంతో చాలావరకు ఫైబ్రాయిడ్స్ పరిమాణం తగ్గవచ్చు.
అయితే మెనోపాజ్ తర్వాత కొత్తగా గడ్డ కనిపించినా లేదా ఇప్పటికే ఉన్న గడ్డ పెరుగుతున్నట్లు అనిపించినా వైద్య పరీక్ష చేయించుకోవాలి.
ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో 50 ఏళ్ల వయసు వచ్చేసరికి సుమారు 70–80 శాతం మందికి ఫైబ్రాయిడ్స్ ఏర్పడే అవకాశం ఉందని కొన్ని అధ్యయనాలు అంచనా వేస్తున్నాయి. ప్రతి పదిమంది మహిళల్లో 2 - 4 మంది మహిళల్లో ఈ ఫైబ్రాయిడ్స్ ఉండే అవకాశం ఉంది. అయితే, వీరిలో అందరికీ లక్షణాలు కనిపించవు.
సాధారణంగా 30–40 ఏళ్ల మధ్య ఫైబ్రాయిడ్స్ ఎక్కువగా బయటపడుతుంటాయి. చిన్న వయసులోనూ ఇవి ఏర్పడవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
ఫైబ్రాయిడ్స్ ఎందుకు ఏర్పడతాయి?
ఫైబ్రాయిడ్స్ ఏర్పడటానికి అనేక కారణాలు ఉన్నాయి. జన్యుపరమైన అంశాలు, హార్మోన్లు, వయసు, జీవన శైలి సంబంధిత అంశాలు కలిసి ప్రభావం చూపవచ్చు.
ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్లు
ఈ రెండు హార్మోన్లు గర్భాశయ కణజాల పెరుగుదలలో పాత్ర పోషిస్తాయి. వీటి ప్రభావంతో ఫైబ్రాయిడ్స్ పెరిగే అవకాశం ఉంటుంది.
కుటుంబ చరిత్ర
తల్లి, అక్కాచెల్లెళ్లు లేదా ఇతర దగ్గరి కుటుంబ సభ్యులకు ఫైబ్రాయిడ్స్ ఉంటే కూడా ఇవి ఏర్పడే అవకాశం పెరుగుతుంది.
వయస్సు
ముఖ్యంగా పునరుత్పత్తి వయసులో ఫైబ్రాయిడ్స్ ఎక్కువగా కనిపిస్తాయి. మెనోపాజ్ తర్వాత సాధారణంగా వాటి పెరుగుదల మందగించవచ్చు.
అధిక బరువు, జీవనశైలి
అధిక బరువు, శారీరక శ్రమ తక్కువగా ఉండటం వంటి అంశాలకు, ఫైబ్రాయిడ్స్ ఏర్పడటానికి సంబంధం ఉన్నట్లు కొన్ని అధ్యయనాల్లో తేలింది. అయితే ఇవి ఫైబ్రాయిడ్‌కు ప్రత్యక్ష కారణమని చెప్పలేం.
జన్యుపరమైన మార్పులు
గర్భాశయ కండర కణాల్లో కొన్ని జన్యుపరమైన మార్పులు జరగడం వల్ల ఫైబ్రాయిడ్స్ ఏర్పడవచ్చు.
ఫైబ్రాయిడ్స్ ఏర్పడ్డాయంటే ఆ మహిళలు ఏదో తప్పు చేసినట్లు భావించకూడదు. ఇవి అంటువ్యాధి కావు. లైంగిక సంబంధాల వల్ల ఏర్పడవు.
ఫైబ్రాయిడ్స్‌లో ఎన్ని రకాలు?
గర్భాశయంలో ఏ ప్రాంతంలో ఫైబ్రాయిడ్ ఏర్పడిందనే దాన్నిబట్టి వాటి లక్షణాలు, చికిత్స మారతాయి.
సబ్‌మ్యూకోసల్ ఫైబ్రాయిడ్స్
గర్భాశయం లోపలి పొర కింద ఏర్పడతాయి. చిన్న పరిమాణంలో ఉన్నా నెలసరిలో అధిక రక్తస్రావం, గర్భధారణ సమస్యలకు కారణం కావచ్చు.
ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్
గర్భాశయ కండర గోడలో ఏర్పడతాయి. సాధారణంగా కనిపించే రకాల్లో ఇవి ఒకటి. పరిమాణం పెరిగితే రుతుస్రావ సమస్యలు, పొత్తి కడుపులో ఒత్తిడి కలిగించవచ్చు.
సబ్సీరొసల్ ఫైబ్రాయిడ్స్
ఇవి గర్భాశయం వెలుపలి వైపు పెరుగుతాయి. ఇవి పెద్దవైతే మూత్రాశయం, పేగులపై ఒత్తిడి కలిగించవచ్చు.
పెడంక్యులేటెడ్ ఫైబ్రాయిడ్స్
ఇవి ఒక సన్నని కణజాలపు కాడపై వేలాడుతున్నట్లు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో కాడ మెలితిరగడం వల్ల అకస్మాత్తుగా తీవ్రమైన నొప్పి రావచ్చు.
ఫైబ్రాయిడ్స్ లక్షణాలు ఏమిటి?
ఫైబ్రాయిడ్ ఉన్న ప్రతి మహిళలోనూ లక్షణాలు కనిపించవు. గడ్డ పరిమాణం, గర్భాశయంలో దాని స్థానం ఆధారంగా లక్షణాలు మారతాయి.
- పీరియడ్స్ సమయంలో అధిక రక్తస్రావం
- సాధారణం కంటే ఎక్కువ రోజులు రక్తస్రావం కొనసాగడం
- నెలసరి సమయంలో తీవ్రమైన కడుపునొప్పి, తిమ్మిర్లు
- నెలసరి మధ్యలో రక్తస్రావం
- పొత్తి కడుపు కింది భాగంలో బరువుగా అనిపించడం లేదా ఉబ్బరంగా కనిపించడం
- నడుము నొప్పి, కటి ప్రాంతంలో ఒత్తిడి
- తరచూ మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడం
- యూరినరీ ఇన్ఫెక్షన్స్
- పెద్ద ఫైబ్రాయిడ్స్ వల్ల మూత్ర విసర్జనలో ఇబ్బంది లేదా మలబద్ధకం
- లైంగిక కలయిక సమయంలో నొప్పి
- రక్తహీనత కారణంగా నీరసం, అలసట, తల తిరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
నెలసరి సమయంలో అధిక రక్తస్రావం అవుతున్నప్పటికీ చాలామంది మహిళలు దానిని సాధారణ సమస్యగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ తరచుగా ప్యాడ్లు మార్చాల్సి రావడం, పెద్ద రక్తపు గడ్డలు పడటం, రక్తస్రావం వల్ల రోజువారీ పనులు చేయలేకపోవడం వంటి లక్షణాలు ఉంటే వైద్యుడిని సంప్రదించి, పరీక్షలు చేయించుకోవాలి.

ఫొటో సోర్స్, Getty Images
ఫైబ్రాయిడ్స్ వల్ల వచ్చే సమస్యలు
రక్తహీనత
అధిక రక్తస్రావం వల్ల శరీరంలో ఐరన్ నిల్వలు తగ్గి రక్తహీనత ఏర్పడవచ్చు. దీనివల్ల అలసట, నీరసం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. తీవ్రమైన సందర్భాల్లో రక్తమార్పిడి అవసరమయ్యే అవకాశం ఉంది.
సంతానలేమి
అన్ని ఫైబ్రాయిడ్స్ వల్ల సంతానలేమి రాదు. అయితే, గర్భాశయ లోపలి కుహరాన్ని మార్చే ఫైబ్రాయిడ్స్ గర్భం దాల్చడాన్ని లేదా గర్భం నిలవడాన్ని ప్రభావితం చేయవచ్చు. ఇతర కారణాలనూ పరిశీలించిన తర్వాతే సంతానలేమి సమస్యకు ఫైబ్రాయిడ్ కారణమా కాదా అనేది నిర్ణయించాలి.
గర్భధారణ సమస్యలు
కొన్ని ఫైబ్రాయిడ్స్ గర్భస్రావం, శిశువు తలకిందులుగా కాకుండా ఇతర స్థితిలో ఉండటం, ముందస్తు ప్రసవం లేదా సిజేరియన్ అవసరం పెరగడం వంటివి జరగొచ్చు. అయితే, ఫైబ్రాయిడ్స్ ఉన్న చాలామంది మహిళలు ఆరోగ్యకరమైన గర్భధారణ, ప్రసవాన్ని పూర్తి చేస్తారు.
మూత్రాశయం, పేగులపై ఒత్తిడి
పెద్ద ఫైబ్రాయిడ్స్ మూత్రాశయంపై ఒత్తిడి కలిగించి తరచూ మూత్రవిసర్జనకు కారణమవుతాయి. పేగులపై ఒత్తిడి వల్ల మలబద్ధకం రావచ్చు.
తీవ్రమైన నొప్పి
కొన్ని సందర్భాల్లో ఫైబ్రాయిడ్‌లో రక్తప్రసరణ మార్పులు లేదా దాని కాడ మెలితిరగడం వల్ల తీవ్రమైన నొప్పి రావచ్చు. ఆకస్మికంగా తీవ్రమైన కడుపునొప్పి, జ్వరం లేదా వాంతులు ఉంటే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి.
మానసిక, సామాజిక ప్రభావం
అధిక రక్తస్రావం, నొప్పి, గర్భధారణపై ఆందోళన కారణంగా కొందరు మహిళల్లో నిద్రలేమి, ఆందోళన, పనితీరు తగ్గడం వంటి సమస్యలు ఎదురవుతాయి.
ఫైబ్రాయిడ్స్ క్యాన్సర్‌గా మారతాయా?
సాధారణ గర్భాశయ ఫైబ్రాయిడ్స్ అనేవి క్యాన్సర్ కాని గడ్డలు. ఇవి సాధారణంగా క్యాన్సర్‌గా మారవు.
గర్భాశయంలో ఏర్పడే లియోమయోసార్కోమా (Leiomyosarcoma) అనే అరుదైన క్యాన్సర్ అనేది వేరే వ్యాధి. ఇది ఫైబ్రాయిడ్స్ నుంచి ఏర్పడదు.
వేగంగా పెరుగుతున్న గడ్డ ఉన్నంత మాత్రాన క్యాన్సర్ అని నిర్ధరించలేం. అయితే, మెనోపాజ్ తర్వాత రక్తస్రావం లేదా గడ్డ పెరుగుదల కనిపిస్తే తప్పనిసరిగా పరీక్ష చేయించుకోవాలి.
ఫైబ్రాయిడ్స్‌ను ఎలా గుర్తిస్తారు?
ఫైబ్రాయిడ్స్ నిర్ధరణకు వైద్యులు మహిళకు ఉన్న లక్షణాలు, నెలసరి చరిత్ర, కుటుంబ చరిత్రను తెలుసుకుంటారు. అవసరాన్నిబట్టి కొన్ని రకాల పరీక్షలు సూచిస్తారు.
అల్ట్రాసౌండ్ స్కాన్
ఫైబ్రాయిడ్ పరిమాణం, సంఖ్య, గర్భాశయంలో దాని స్థానం తెలుసుకోవడానికి దీన్ని ప్రధానంగా ఉపయోగిస్తారు. పొత్తి కడుపుపై నుంచి లేదా యోని మార్గం ద్వారా ఈ పరీక్ష చేయవచ్చు.
రక్త పరీక్షలు
అధిక రక్తస్రావం ఉన్నప్పుడు హిమోగ్లోబిన్, అవసరమైతే ఐరన్ నిల్వలను పరీక్షిస్తారు.
ఎంఆర్ఐ స్కాన్
పెద్ద గడ్డలు, క్లిష్టమైన పరిస్థితులు లేదా ప్రత్యేక చికిత్స చేయాల్సిన సందర్భాల్లో ఉపయోగపడుతుంది.
హిస్టెరోస్కోపీ
గర్భాశయం లోపలి కుహరాన్ని ప్రత్యక్షంగా పరిశీలించడానికి ఉపయోగిస్తారు. లోపలి భాగంలో ఉన్న కొన్ని ఫైబ్రాయిడ్స్‌ను తొలగించడానికి కూడా ఈ విధానం ఉపయోగపడుతుంది.
ప్రతి మహిళకూ అన్ని పరీక్షలూ అవసరం ఉండవు. లక్షణాలు, స్కాన్ ఫలితాలను బట్టి ఏవి అవసరమో వైద్యులు నిర్ణయిస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
ఫైబ్రాయిడ్స్‌కు చికిత్స ఎలా చేస్తారు?
ఫైబ్రాయిడ్ ఉందని తెలిసిన వెంటనే ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. లక్షణాలు లేని చిన్న ఫైబ్రాయిడ్స్‌కు క్రమానుగత పర్యవేక్షణ సరిపోవచ్చు. లక్షణాలు, గడ్డ స్థానం, పరిమాణం, వయసు, భవిష్యత్తులో పిల్లలు కావాలనే కోరికను బట్టి చికిత్సను ఎంపిక చేస్తారు.
1. మందులతో చికిత్స
అధిక రక్తస్రావాన్ని తగ్గించే మందులు నెలసరి సమయంలో రక్తస్రావాన్ని తగ్గించవచ్చు. కొన్ని నొప్పి నివారణ మందులు నెలసరి నొప్పిని తగ్గిస్తాయి.
కొన్ని హార్మోన్ల మందులు లేదా ప్రొజెస్టిరాన్‌ను విడుదల చేసే గర్భాశయ అంతర్గత పరికరం (హార్మోనల్ ఐయూడీ - intra uterine device) అధిక రక్తస్రావాన్ని తగ్గించడంలో ఉపయోగపడవచ్చు. గర్భాశయ కుహరం ఆకృతిని మార్చే ఫైబ్రాయిడ్స్ ఉన్నవారిలో ఈ పరికరం అందరికీ అనుకూలం కాకపోవచ్చు.
కొన్ని ప్రత్యేక హార్మోన్ల మందులు ఫైబ్రాయిడ్ పరిమాణాన్ని తాత్కాలికంగా తగ్గించవచ్చు. వీటిని కొన్ని ప్రత్యేక సందర్భాల్లో, ముఖ్యంగా శస్త్రచికిత్సకు ముందు, వైద్య పర్యవేక్షణలో ఉపయోగిస్తారు. దుష్ప్రభావాలు ఉండే అవకాశం ఉన్నందున స్వయంగా వీటిని వాడకూడదు.
మందులతో ఈ లక్షణాలు నియంత్రణలోకి రావచ్చు. అయితే, అన్ని మందులూ ఫైబ్రాయిడ్‌ను పూర్తిగా తొలగించవు.
2. మయోమెక్టమీ (Myomectomy)
ఈ శస్త్రచికిత్సలో గర్భాశయాన్ని తొలగించకుండా ఫైబ్రాయిడ్స్‌ను మాత్రమే తొలగిస్తారు. భవిష్యత్తులో పిల్లలు కావాలనుకునే మహిళలకు, తగిన పరిస్థితుల్లో, ఇది ముఖ్యమైన చికిత్సా విధానం.
గర్భాశయం లోపలికి పెరిగిన కొన్ని ఫైబ్రాయిడ్స్‌ను హిస్టెరోస్కోపీ ద్వారా తొలగించవచ్చు. కొన్ని గడ్డలను లాపరోస్కోపీ ద్వారా తొలగించవచ్చు.
పెద్దవి లేదా అనేక గడ్డలు ఉన్నప్పుడు పొత్తికడుపు ద్వారా శస్త్రచికిత్స అవసరం కావచ్చు.
ఈ చికిత్స తర్వాత కూడా కొత్త ఫైబ్రాయిడ్స్ ఏర్పడే అవకాశం ఉంటుంది. గర్భాశయంపై చేసిన శస్త్రచికిత్స ఆధారంగా భవిష్యత్తులో ప్రెగ్నెన్సీ, ప్రసవ విధానంపై ప్రత్యేక సూచనలు అవసరం కావచ్చు.
3. హిస్టరెక్టమీ (Hysterectomy)
ఈ శస్త్రచికిత్సలో గర్భాశయాన్ని తొలగిస్తారు. తీవ్రమైన లక్షణాలు ఉన్నప్పుడు, ఇతర చికిత్సలు ఫలించనప్పుడు లేదా తగిన ఇతర మార్గాలు అందుబాటులో లేనప్పుడు దీనిని పరిగణించవచ్చు.
గర్భాశయాన్ని తొలగించిన తర్వాత గర్భం దాల్చడం సాధ్యం కాదు. అందువల్ల భవిష్యత్తులో పిల్లలు కావాలనే కోరిక, ఇతర చికిత్సల ప్రయోజనాలు, ప్రమాదాలను పూర్తిగా చర్చించిన తర్వాతే దీనిపై నిర్ణయం తీసుకోవాలి. గర్భాశయాన్ని తొలగించేటపుడు అండాశయాలనూ తప్పనిసరిగా తొలగించాల్సిన అవసరం లేదు.
4. యుటెరైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్ (UAE)
ఈ విధానంలో గర్భాశయానికి, ఫైబ్రాయిడ్‌కు రక్తాన్ని సరఫరా చేసే కొన్ని రక్తనాళాలను ప్రత్యేక పద్ధతిలో మూసివేస్తారు. దీంతో ఫైబ్రాయిడ్ క్రమంగా చిన్నదవుతుంది. దీని వలన కొందరు మహిళల్లో రక్తస్రావం, నొప్పి వంటి లక్షణాలు తగ్గుతాయి.
అయితే, భవిష్యత్తులో ప్రెగ్నెన్సీ కావాలనుకునే మహిళల్లో దీని ప్రభావాలు, ప్రమాదాలను ప్రత్యేకంగా చర్చించాలి. ఇది అందరికీ సరిపోయే చికిత్స కాదు.
5. ఇతర ఆధునిక చికిత్సలు
రేడియోఫ్రీక్వెన్సీ అబ్లేషన్ (Radiofrequency Ablation) వంటి విధానాల్లో వేడి శక్తిని ఉపయోగించి ఫైబ్రాయిడ్ కణజాలాన్ని దెబ్బతీస్తారు.
ఫైబ్రాయిడ్స్ ఉంటే గర్భం దాల్చవచ్చా?
ఫైబ్రాయిడ్స్ ఉన్న చాలామంది మహిళలు సహజంగానే గర్భం దాల్చి ఆరోగ్యకరమైన పిల్లలకు జన్మనిస్తారు. కాబట్టి ఫైబ్రాయిడ్ ఉందని నిరాశ చెందాల్సిన అవసరం లేదు.
అయితే, గర్భాశయ లోపలి కుహరాన్ని మార్చే ఫైబ్రాయిడ్స్... గర్భం దాల్చడాన్ని ప్రభావితం చేయవచ్చు. గర్భం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు సంతానలేమికి సంబంధించిన ఇతర కారణాలనూ పరిశీలించాలి. అవసరమైతే గైనకాలజిస్ట్, సంతాన సాఫల్య నిపుణులు కలిసి చికిత్సను నిర్ణయిస్తారు.
గర్భధారణకు ముందు ఫైబ్రాయిడ్ తొలగించాలా వద్దా అనే నిర్ణయం కేవలం దాని పరిమాణం ఆధారంగా తీసుకోరు. ఫైబ్రాయిడ్స్ ఉన్న స్థానం, లక్షణాలు, గత ప్రెగ్నెన్సీ చరిత్ర, సంతానలేమి వంటి వివరాలు కూడా ముఖ్యమే.
ఎప్పుడు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి?
- గంటలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ప్యాడ్లు పూర్తిగా తడిసిపోయేంత రక్తస్రావం వరుసగా కొనసాగడం, ముఖ్యంగా తల తిరగడం లేదా నీరసం
- ఆకస్మికంగా తీవ్రమైన కడుపునొప్పి
- అధిక రక్తస్రావంతో పాటు మూర్ఛ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా తీవ్రమైన బలహీనత
- గర్భధారణ సమయంలో కడుపునొప్పి లేదా రక్తస్రావం
- మెనోపాజ్ తర్వాత యోని నుంచి రక్తస్రావం
ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.
ఫైబ్రాయిడ్స్ నివారణ సాధ్యమేనా?
ఫైబ్రాయిడ్స్ ఏర్పడకుండా పూర్తిగా నివారించే నిరూపితమైన పద్ధతి ప్రస్తుతం లేదు. అయినప్పటికీ, ఆరోగ్యకరమైన బరువును మేనేజ్ చేయడం, సమతుల ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా శారీరక శ్రమ చేయడం ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
అధిక రక్తస్రావం ఉంటే ఐరన్ లోపం ఉందో లేదో పరీక్షించుకోవాలి. వైద్యుల సలహా లేకుండా హార్మోన్ల మందులు లేదా ఇంటి చిట్కాలపై ఆధారపడకూడదు.
గర్భాశయ ఫైబ్రాయిడ్స్ సాధారణమైనవే అయినప్పటికీ, వాటి వల్ల వచ్చే లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు. ప్రతి ఫైబ్రాయిడ్కీ శస్త్రచికిత్స అవసరం లేదు. అదే సమయంలో అధిక రక్తస్రావం, రక్తహీనత, తీవ్రమైన నొప్పి లేదా సంతాన సమస్యలు ఉంటే చికిత్సను వాయిదా వేయకూడదు.
ఆధునిక వైద్య విధానాలతో అనేక చికిత్సా మార్గాలు అందుబాటులో ఉన్నాయి. సరైన సమయంలో గైనకాలజిస్ట్‌ను సంప్రదించి, వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా చికిత్సను ఎంచుకోవడం ఉత్తమం.
(గమనిక: రచయిత ఓ డాక్టర్. వైద్యపరమైన విధానాలు, చికిత్సలపై అవగాహన కల్పించడమే ఈ ఆర్టికల్ ఉద్దేశం. ఆరోగ్యపరమైన ఏ నిర్ణయమైనా డాక్టర్‌ను సంప్రదించి మాత్రమే తీసుకోగలరు)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























