‘స్మైలింగ్ డిప్రెషన్’: మీ చిరునవ్వు వెనుక డిప్రెషన్ కూడా ఉండొచ్చు, ఒకసారి చెక్ చేసుకోండి

స్మైలింగ్ డిప్రెషన్‌ను అధికారికంగా ఓ వ్యాధిగా గుర్తించకపోయినా, గడిచిన ఐదేళ్లలో ఈ పదం గురించి వెదకడం 50 శాతానికి పైగా పెరిగింది.
ఫొటో క్యాప్షన్, స్మైలింగ్ డిప్రెషన్‌ను అధికారికంగా ఓ వ్యాధిగా గుర్తించకపోయినా, గడిచిన ఐదేళ్లలో ఈ పదం గురించి వెదకడం 50 శాతానికి పైగా పెరిగింది.
    • రచయిత, ఇసాబెల్ షా
    • హోదా, గ్లోబల్ హెల్త్
  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

ఎవరైనా డిప్రెషన్‌లో ఉన్నారనగానే.. వారు మంచం దిగలేకపోతుంటారని, బాగా ఏడుస్తుంటారని, స్నేహితులకు దూరంగా ఉంటూ, రోజంతా గడపడానికే శక్తి లేకుండా ఉంటుంటారని మనసులో ఓ ఊహాచిత్రం వస్తుంటుంది.

కానీ, అదే వ్యక్తి డిన్నర్లో జోకులు వేస్తూ, చురుకైన సామాజిక జీవితాన్ని గడుపుతూ, ఉద్యోగంలో రాణిస్తుండటాన్ని మీరు ఊహించలేరు.

కానీ ‘స్మైలింగ్ డిప్రెషన్’ ఉన్నవారు సరిగ్గా ఇలాగే ఉంటారు. లోపల బాధపడుతూ పైకి గంభీరంగా, ధైర్యంగా కనిపిస్తుంటారు.

కొన్నిసార్లు ఇలాంటి మోసానికి గురయ్యేది స్నేహితుడో, భాగస్వామో, సహచరుడో కాదు... స్వయంగా మిమ్మల్నే మీరు మోసం చేసుకోవచ్చు.

"స్మైలింగ్ డిప్రెషన్"అధికారికంగా గుర్తించిన వ్యాధి కాదు. కానీ, గత ఐదేళ్లలో ఈ పదం కోసం సెర్చ్ చేయడం 50 శాతం పెరిగింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

'స్మైలింగ్ డిప్రెషన్' అంటే?

"బయటికి సంతోషంగా కనిపిస్తూ, లోపల కుంగిపోతూ, నిరాశగా ఉండటమే స్మైలింగ్ డిప్రెషన్" అని యూకేలోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ మానసిక ఆరోగ్య పరిశోధకురాలు డాక్టర్ ఒలివియా రెమెస్ చెప్పారు.

మనమందరం ఎప్పుడో ఒకప్పుడు నిరాశకు గురవుతుంటాం. కానీ, ప్రపంచవ్యాప్తంగా 32.2 కోట్ల మందిలో ఈ భావాలు డిప్రెషన్‌గా మారుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చెప్పింది.

నిరంతరం బాధగా ఉండటం, ఆసక్తి లేదా ఆనందం కోల్పోవడం వంటి లక్షణాలు వారాల తరబడి లేదా నెలల తరబడి కొనసాగి.. పని, సంబంధాలు, నిద్ర, దైనందిన జీవితాన్ని ప్రభావితం చేసినప్పుడు దీన్ని డిప్రెషన్‌గా పరిగణిస్తారు.

కానీ, డిప్రెషన్ ఎప్పుడూ మనం ఊహించినట్లే ఉండదు. వాస్తవానికి, డిప్రెషన్‌తో బాధపడుతున్న వారిలో దాదాపు 40 శాతం మంది "అసహజ" రూపాన్ని అనుభవిస్తారని, వారి లక్షణాలు సాధారణ ధోరణులకు భిన్నంగా ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఉదాహరణకు, ఇలా డిప్రెషన్‌తో బాధపడేవారు సాధారణం కంటే ఎక్కువగా నిద్రపోవచ్చు లేదా తినవచ్చు. అలాగే ఏదైనా మంచి లేదా ఉత్సాహకరమైన విషయం జరిగినప్పుడు వారి మూడ్ తాత్కాలికంగా మెరుగుపడవచ్చు.

ఇతరులతో కలిసిపోవడానికి ఒక వ్యక్తి తన నిర్దిష్ట లక్షణాలను లేదా భావోద్వేగాలను దాచిపెట్టడాన్ని "క్యామోఫ్లాజింగ్" లేదా "మాస్కింగ్" అంటారు. డిప్రెషన్‌తో బాధపడుతున్న వ్యక్తులు తాము సాధారణంగానే ఉన్నామని చెప్పడానికి ఇలాంటి పద్ధతులు పాటిస్తారని చెప్పడానికి ఆధారాలు ఉన్నాయి.

స్మైలింగ్ డిప్రెషన్
ఫొటో క్యాప్షన్, ప్రపంచవ్యాప్తంగా 32.2 కోట్ల మందికి డిప్రెషన్ ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా.

డిప్రెషన్‌ను ఎందుకు దాచిపెడతారు?

కొంతమంది తమ నిరాశనిస్పృహలను ‘చిరునవ్వు’ వెనుక దాచిపెడుతున్నామనే విషయం కూడా గ్రహించలేరు.దీంతో తమకు డిప్రెషన్ ఉందని వారు తెలుసుకోలేరు.

"అవి బిజీగా, ఒత్తిడితో కూడిన జీవితాన్ని గడపడం వల్ల వచ్చే లక్షణాలే అని వారు భావించవచ్చు" అని రెమెస్ చెప్పారు.

మరికొందరు తాము ఇబ్బంది పడుతున్నామని గ్రహించినప్పటికీ, ఇతరులు దాన్ని గమనించకుండా జాగ్రత్త పడతారు. ఇది ముఖ్యంగా పరిపూర్ణతను కోరుకునే వారిలో అత్యంత బాధ్యతాయుతంగా ఉండే వారిలో సర్వసాధారణం.

"వారికి వారిపైనే ఎక్కువ అంచనాలు ఉంటాయి. తాము ఇబ్బంది పడుతున్నామని తమకు తాము గానీ, ఇతరులకు గానీ ఒప్పుకోవడానికి ఇష్టపడకపోవచ్చు" అని ఆమె పేర్కొన్నారు.

కొంతమంది స్టిగ్మా పేరుతో భయపడతారు లేదా ఇతరులపై భారం పడుతుందని ఆందోళన చెందుతారు.

తమను తప్పుగా అంచనా వేస్తారనే భయం లేదా పనిలో, సంబంధాలలో ప్రతికూల పరిణామాలు ఎదురవుతాయనే ఆందోళన ఇతరులలో ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

సాంస్కృతిక లేదా కుటుంబపరమైన అంచనాలు కూడా డిప్రెషన్‌తో బాధపడే కొంతమందిని తమ భావాలను బహిరంగంగా వ్యక్తం చేయకుండా అడ్డుపడతాయి.

ప్రమాదాలేంటి?

మానసికంగా మీరు నిరాశనిస్పృహలతో కుంచించుకుపోతూ ఇతరుల ముందు అన్నీ బానే ఉన్నట్టు నటించడం చాలా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు.

"డిప్రెషన్ మనలను సామాజికంగా ఒంటరిని చేస్తుంది. అందుకే మనసు సరిగ్గా లేకపోవడం నుంచి బయటపడటానికి ఉత్తమమైన మార్గాలలో ఇతరులతో తరచూ కనెక్ట్ కావడం ఒకటి" అని యూకేలోని ఎక్సెటర్ విశ్వవిద్యాలయ క్లినికల్ సైకాలజిస్ట్ ప్రొఫెసర్ బార్నీ డన్ చెప్పారు.

"ఈసంకేతాలను పట్టించుకోకపోతే, అవి తీవ్రమైన దీర్ఘకాలిక సమస్యలుగా మారిపోయే అవకాశం ఉంది. " అని రెమెస్ హెచ్చరించారు.

స్మైలింగ్ డిప్రెషన్
ఫొటో క్యాప్షన్, తిరస్కరణ లేదా విమర్శల పట్ల ఎక్కువ సున్నితంగా ఉండటం డిప్రెషన్‌కు ఒక సంకేతం కావచ్చు.

7 డిప్రెషన్ లక్షణాలు

మీ జీవితంలో అంతా సాఫీగా ఉందని భావిస్తున్నప్పుడు కొన్ని మార్పులను గమనించడం కష్టం కావచ్చు.

1. ఆస్వాదించడం మానేస్తారు

స్నేహితులను కలవడం, జిమ్‌కు వెళ్లడం లేదా మీకు ఇష్టమైన టీవీ షో చూడటం వంటి లాంటి సాధారణ విషయాలు కూడా మీకు భారంగా తోస్తుంటే మీ మనసులోకి మీరు మరింతగా తొంగిచూడటం అవసరం.

‘‘బిజీగా ఉండే జీవనశైలి, లేదా పని ఒత్తిడి కారణంగా రోజూవారీ పనుల పట్ల ఆసక్తి లేదా ఆనందం తగ్గిపోయిందని చెప్పడం సులభం’’ అని రెమెస్ అంటారు.

2. కాళ్లు చేతులు భారంగా అనిపించడం

ఏదో బరువు మోస్తున్నట్టు అనిపిస్తూ శరీర కదలిలకను కష్టసాధ్యం చేసే లక్షణాన్ని ‘లీడెన్ పెరాలిసిస్’ అని పిలుస్తారు. బహుశా ఇది ఓ ప్రత్యేకమైన డిప్రెషన్ అయి ఉండొచ్చు. ఇది సాధారణ డిప్రెషన్ లక్షణాలకు భిన్నంగా అనిపిస్తుంటుంది.

3. తరచూ ప్రణాళికల రద్దు

మీరు కొన్నిసార్లు ఇతరుల ముందు చాలా ఉత్సాహంగా కనిపిస్తారు. కానీ, మీ మానసిక స్థితి బాగోలేనప్పుడు, మీ భావాలను దాచలేం అని భావించినప్పుడు అప్పటి వరకు చేసుకున్న ప్రణాళికలను రద్దు చేసుకుంటారు.

4. ఎక్కువ నిద్రపోతున్నా, అలసటగానే భావిస్తారు

మీరు అన్ని సాధారణ కార్యకలాపాలను యథావిధిగా చేస్తూనే ఉండవచ్చు. కానీ మీ శక్తి హరించుకుపోతున్నట్టు అనిపించడం పెరుగుతుంది.

"ముఖ్యంగా సాయంత్రాలు మరింత కష్టంగా ఉండవచ్చు" అని రెమెస్ చెప్పారు.

"ఎందుకంటే ఈ పరిస్థితితో బాధపడుతున్న వ్యక్తులు రోజు ముగిసే సమయం వచ్చేసరికి మరింత నీరసంగా మారొచ్చు. వారికి సాధారణం కంటే ఎక్కువ నిద్ర అవసరం కావచ్చు’’ అన్నారు.

5. విమర్శలకు బలహీనమవుతారు

మీ బాస్ చేసే చిన్న కామెంట్, లేదా ఓ స్నేహితుడు చెప్పిన పని చేయకపోవడం మిమ్మల్ని చాలా ఎక్కువగా బాధిస్తుంది.

విమర్శలు లేదా తిరస్కరణ పట్ల పెరిగిన ఈ బలహీనత (దీనిని ఏడీహెచ్‌డీ ఉన్నవారు కూడా అనుభవించవచ్చు) ఏటిపికల్ డిప్రెషన్ లక్షణమని రెమెస్ చెప్పారు.

6. సరదా, సాయం రెండూ ఉంటాయి

డిప్రెషన్‌తో బాధపడుతున్న వ్యక్తి ఎప్పుడూ అందరికీ దూరంగా ఒంటరిగా ఉండాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు వారు దీనికి పూర్తి భిన్నంగా ప్రవర్తించవచ్చు. ఉదాహరణకు, పార్టీల్లో అందరినీ నవ్విస్తూ ఉత్సాహంగా ఉండటం, తమ పనిలో పూర్తిగా మునిగిపోవడం లేదా ఇతరులకు సహాయం చేయడానికి తమ దారి మార్చుకుని మరీ వెళ్లడం లాంటివి చేస్తుంటారు.

7. మీ ‘లోపలిమాట ప్రతికూలం’

మీరు బయటికి ఆత్మవిశ్వాసంతో కనిపించవచ్చు. కానీ, లోపల మాత్రం మిమ్మల్ని మీరే చాలా విమర్శించుకుంటుంటారు.

స్వీయ-సందేహం, ఎందుకు పనికిరామనే భావన, శూన్యతగా అనిపించడం వంటివి హెచ్చరిక సంకేతాలు కావచ్చు.

ఏది సాయపడొచ్చు?

"చిరునవ్వు వెనుక దాగున్న డిప్రెషన్ " అనే పదంపై ఏకాభిప్రాయంతో పాటు విభేదాలు కూడా ఉన్నాయి. ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యను గుర్తించడానికి దానికి ఒక పేరు పెట్టడానికి ఈ పదం సహాయపడినప్పటికీ, ఇది ఒక సంక్లిష్టమైన అనుభవాన్ని "చాలా సులభతరమైనదిగా" మార్చే ప్రమాదం ఉందని రేమెస్ పేర్కొన్నారు.

ఆమె మాట్లాడుతూ "'నవ్వు' అనే పదం మనకు ఉల్లాసాన్ని, సంతోషాన్ని గుర్తుకు తెస్తుంది. కానీ ఈ పరిస్థితి ముఖ్య లక్షణం నిరాశ, శూన్యత పనికిరానివారం అనే భావన" అని అన్నారు.

ఇలాంటి స్థితి నుంచి బయటపడటానికి మీకు నమ్మకమైన వ్యక్తులతో మీ భావాలను పంచుకోవడం వంటి చిన్న విషయాలతో ప్రారంభించాలని డన్ సూచించారు.

ఆయన మాట్లాడుతూ, "ఇలా చేయడం వల్ల ఇతరులతో సంబంధాలు మరింత బలపడతాయని, ఒకరికొకరు అనుబంధం ఏర్పడుతుందని ఈ భావనలతో తాము ఒంటరిగా పోరాడటం లేదనే విషయాన్ని గ్రహించి ప్రజలు తరచుగా ఆశ్చర్యపోతుంటారు" అని అన్నారు.

ఒకవేళ మీరు ఈ సమస్యతో బాధపడుతుంటే, వైద్యుడిని సంప్రదించాలని ఆయన సలహా ఇచ్చారు. "టాక్ థెరపీ, యాంటిడిప్రెసెంట్ మందుల వాడకం, సోషల్ థెరపీ అన్నీ కూడా సమర్థవంతమైన పద్ధతులని చెప్పడానికి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి" అని పేర్కొన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)