మూత్రనాళ ఇన్ఫెక్షన్‌: గర్భిణులు తీసుకోవాల్సిన 8 జాగ్రత్తలు

మూత్ర విసర్జన సమయంలో మంట, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌
ఫొటో క్యాప్షన్, మూత్రపిండాలు, మూత్రాశయం, మూత్రాన్ని తీసుకెళ్లే నాళాలు లేదా మూత్రనాళంలో సూక్ష్మజీవుల వల్ల ఇన్ఫెక్షన్‌ ఏర్పడటాన్ని యూటీఐ అంటారు.
    • రచయిత, డాక్టర్ హిమానీ, రేడియేషనల్ ఆంకాలజిస్ట్
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

మూత్ర విసర్జన సమయంలో మంట, తరచూ మూత్రం రావడం, పొత్తికడుపు దిగువ భాగంలో నొప్పి.. ఇలాంటి లక్షణాలున్నాయా? అయితే మీకు మూత్రనాళ ఇన్ఫెక్షన్‌ (యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌ – యూటీఐ) ఉండొచ్చు.

మహిళల్లో ఎక్కువగా కనిపించే ఈ సమస్య పురుషులు, పిల్లలు, వృద్ధుల్లోనూ రావచ్చు. సకాలంలో చికిత్స తీసుకుంటే నయమవుతుంది. అయితే నిర్లక్ష్యం చేస్తే మూత్రపిండాలకు వ్యాపించి తీవ్రమైన సమస్యలకు దారితీయవచ్చు.

మూత్రపిండాలు, మూత్రాశయం, మూత్రవాహికలు లేదా మూత్రనాళంలో సూక్ష్మజీవుల వల్ల ఇన్ఫెక్షన్‌ ఏర్పడటాన్ని యూటీఐ అంటారు.

సాధారణంగా పేగుల్లో ఉండే ఇ.కోలీ (Escherichia coli ) బ్యాక్టీరియా మూత్రనాళంలోకి ప్రవేశించడమే దీనికి ప్రధాన కారణం.

ఇన్ఫెక్షన్‌ మూత్రాశయంలో ఏర్పడితే దాన్ని సిస్టైటిస్‌ అని, మూత్రపిండాలకు వ్యాపిస్తే పైలోనెఫ్రైటిస్‌ అని అంటారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ప్రమాద కారకాలు

  • మూత్రాశయం పూర్తిగా ఖాళీ కాకపోవడం
  • మూత్రపిండాల్లో రాళ్లు లేదా మూత్ర ప్రవాహానికి అడ్డంకులు ఉండటం
  • మధుమేహం, కాథెటర్ వినియోగం
  • లైంగిక చర్యల సమయంలో బ్యాక్టీరియా మూత్రనాళంలోకి చేరడం
  • మెనోపాజ్‌ తర్వాత హార్మోన్ల మార్పులు

అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ)వైద్య సమీక్ష ప్రకారం, మహిళల్లో సుమారు 50–80 శాతం మందికి జీవితంలో కనీసం ఒక్కసారైనా యూటీఐ వచ్చే అవకాశం ఉంది.

మూత్ర విసర్జన సమయంలో మంట, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌
ఫొటో క్యాప్షన్, మూత్రం పూర్తిగా ఆగిపోతే అత్యవసర వైద్య సహాయం అవసరం.

మహిళలు, పురుషుల్లో భిన్నంగా ఉంటుందా?

మహిళల్లో మూత్రనాళం పొట్టిగా ఉండటం వల్ల బ్యాక్టీరియా మూత్రాశయానికి సులభంగా చేరుతుంది. గర్భధారణ, లైంగిక చర్యలు, మెనోపాజ్ తర్వాత ఈస్ట్రోజెన్ స్థాయులు తగ్గడం వల్ల కూడా యూటీఐ ప్రమాదం పెరగవచ్చు.

గర్భిణుల్లో కొందరికి లక్షణాలు లేకుండానే మూత్రంలో బ్యాక్టీరియా ఉండవచ్చు. చికిత్స చేయని ఇన్‌ఫెక్షన్ మూత్రపిండాలకు వ్యాపించడంతో పాటు, కొన్ని సందర్భాల్లో ముందస్తు ప్రసవం జరగడం లేదా తక్కువ బరువుతో శిశువులు జన్మించే ప్రమాదం ఉండొచ్చు. అందువల్ల వైద్యుల సూచన మేరకు యూరిన్ కల్చర్ పరీక్ష చేయించుకోవాలి. ఇన్ఫెక్షన్‌ నిర్ధరణ అయితే గర్భధారణకు అనువైన మందులను వైద్యుల సూచన మేరకు ఉపయోగించాలి.

ఒక మెటా అనాలిసిస్ అధ్యయనం ప్రకారం, భారత్‌లో సుమారు 13.5 శాతం మంది గర్భిణుల మూత్రంలో లక్షణాలు లేకుండానే బ్యాక్టీరియా ఉన్నట్లు అంచనా వేశారు.

పురుషుల్లో యూటీఐ తక్కువగా కనిపించినప్పటికీ, వయసు పెరిగేకొద్దీ ప్రోస్టేట్ గ్రంథి పెరగడం వల్ల మూత్రం పూర్తిగా బయటకు వెళ్లకపోవచ్చు. దీంతో యూటీఐ ప్రమాదం పెరుగుతుంది. రాళ్లు, మధుమేహం, ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్‌ కూడా యూటీఐ ప్రమాదాన్ని పెంచవచ్చు.

అందుకే పురుషులు మూత్ర విసర్జన సమయంలో మంట, మూత్రం సరిగా రాకపోవడం, జ్వరం లేదా మూత్రంలో రక్తం వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలి. మూత్రం పూర్తిగా ఆగిపోతే అత్యవసర వైద్య సహాయం అవసరం.

మూత్ర విసర్జన సమయంలో మంట, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌
ఫొటో క్యాప్షన్, మెటా అనాలిసిస్ స్టడీ ప్రకారం భారత్‌లో గర్భిణుల్లో లక్షణాలు లేకుండానే మూత్రంలో బ్యాక్టీరియా ఉండే పరిస్థితి సుమారు 13.5 శాతం అని అంచనా వేశారు.

యూటీఐ లక్షణాలు

యూటీఐ ముఖ్య లక్షణాలు ఇవీ...

  • మూత్ర విసర్జన సమయంలో మంట లేదా నొప్పి
  • తరచూ మూత్రం రావడం, కొద్దిగా మూత్రం వచ్చినా మళ్లీ విసర్జించాలనిపించడం
  • పొత్తికడుపు దిగువ భాగంలో నొప్పి
  • మూత్రం మబ్బుగా కనిపించడం లేదా మూత్రంలో రక్తం కనిపించడం

అయితే, మూత్రం నుంచి దుర్వాసన రావడం ఒక్కటే యూటీఐ ఉన్నట్లు నిర్ధరించదు.

మూత్ర విసర్జన సమయంలో మంట, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌
ఫొటో క్యాప్షన్, తీవ్రమైన నీరసం, గందరగోళం లేదా మూత్రం రాకపోవడం ఉంటే తక్షణ వైద్య సహాయం పొందాలి.

ప్రమాద సంకేతాలు

జ్వరం, చలితో వణుకు, నడుము పక్కన నొప్పి, వాంతులు ఉంటే మూత్రపిండాలకు ఇన్ఫెక్షన్‌ సోకిందేమోనని అనుమానించాలి. తీవ్రమైన నీరసం, అయోమయ స్థితి లేదా మూత్రం రాకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే తక్షణ వైద్య సహాయం పొందాలి.

సకాలంలో చికిత్స తీసుకోకపోతే యూటీఐ వల్ల కింది సమస్యలు ఏర్పడవచ్చు.

  • మూత్రపిండాల ఇన్‌ఫెక్షన్: జ్వరం, నడుము పక్కన నొప్పి, వాంతులు రావచ్చు
  • సెప్సిస్: తీవ్రమైన ఇన్ఫెక్షన్‌ శరీర అవయవాల పనితీరును దెబ్బతీసి ప్రాణాపాయ పరిస్థితికి దారితీయవచ్చు
  • ఆరు నెలల్లో రెండుసార్లు లేదా ఏడాదిలో మూడుసార్లు ఇన్ఫెక్షన్లు వస్తే దాన్ని పునరావృత యూటీఐగా పరిగణిస్తారు. రాళ్లు, మూత్ర ప్రవాహంలో అడ్డంకులు వంటి కారణాలను పరిశీలించాలి.
  • గర్భధారణ సమస్యలు: చికిత్స చేయని ఇన్ఫెక్షన్‌ గర్భిణుల్లో మూత్రపిండాల ఇన్ఫెక్షన్‌, కొన్ని ప్రతికూల గర్భధారణ ఫలితాల ప్రమాదాన్ని పెంచవచ్చు.

యూటీఐ వచ్చిన ప్రతి ఒక్కరికీ మూత్రపిండాలు దెబ్బతినవు. ప్రమాద తీవ్రత ప్రధానంగా తీవ్రమైన లేదా సంక్లిష్టమైన ఇన్ఫెక్షన్లలో ఎక్కువగా ఉంటుంది.

మూత్ర విసర్జన సమయంలో మంట, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌
ఫొటో క్యాప్షన్, మెడిసిన్, మోతాదు, వ్యవధి వంటివి రోగి పరిస్థితిపై ఆధారపడి ఉంటాయి.

యూటీఐ నిర్దరణ, చికిత్స

మూత్ర పరీక్ష (Urine routine / microscopy), అవసరాన్ని బట్టి యూరిన్ కల్చర్ పరీక్ష ద్వారా ద్వారా ఇన్ఫెక్షన్‌ను పరిశీలిస్తారు.

పురుషుల్లో యూటీఐ, మహిళల్లో గర్భధారణ, పునరావృత ఇన్ఫెక్షన్లు, మూత్రపిండాల ఇన్ఫెక్షన్‌ అనుమానం ఉన్నప్పుడు కల్చర్‌ పరీక్ష ఉపయోగకరం.

బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్‌ ఉన్నట్లు నిర్ధరణ అయితే వైద్యుడు తగిన యాంటీబయాటిక్‌ను సూచించవచ్చు. ఏ మందు వాడాలి, ఎంత మోతాదులో, ఎన్ని రోజులు తీసుకోవాలనేది రోగి పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది.

స్వయంగా యాంటీబయాటిక్స్ వాడటం లేదా మిగిలిపోయిన మందులను తిరిగి తీసుకోవడం వల్ల యాంటీబయాటిక్ నిరోధకత పెరుగుతుంది.

యూటీఐపై అపోహలు – వాస్తవాలు

అపోహ: యూటీఐ మహిళలకు మాత్రమే వస్తుంది

వాస్తవం: పురుషులు, పిల్లలు, వృద్ధులు కూడా దీని బారిన పడవచ్చు.

అపోహ: మూత్ర విసర్జన సమయంలో మంటగా ఉంటే యూటీఐ ఉన్నట్టే

వాస్తవం: ఇతర ఇన్ఫెక్షన్లు, మూత్రనాళ వాపు లేదా చికాకు వల్ల కూడా మంట రావచ్చు

అపోహ: నీళ్లు ఎక్కువగా తాగితే యూటీఐ పూర్తిగా నయమవుతుంది.

వాస్తవం: తగినంత నీరు తాగడం ఉపయోగకరమే కానీ, అవసరమైన వైద్య చికిత్సకు అది ప్రత్యామ్నాయం కాదు.

అపోహ: మూత్రం నుంచి దుర్వాసన వస్తే యాంటీబయాటిక్స్ వాడాలి.

వాస్తవం: దుర్వాసన ఒక్కటే ఇన్ఫెక్షన్‌కు ఆధారం కాదు. ఇతర లక్షణాలు లేకపోతే సాధారణంగా యాంటీబయాటిక్స్‌ అవసరం ఉండదు.

అపోహ: మూత్రంలో బ్యాక్టీరియా కనిపిస్తే అందరికీ చికిత్స అవసరం.

వాస్తవం: మూత్రంలో బ్యాక్టీరియా ఉన్నప్పటికీ లక్షణాలు లేని ప్రతి ఒక్కరికీ చికిత్స అవసరం లేదు. గర్భిణుల్లో మాత్రం పరీక్షించి చికిత్స చేయాలి.

మూత్ర విసర్జన సమయంలో మంట, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌
ఫొటో క్యాప్షన్, మూత్రనాళ ఇన్ఫెక్షన్‌ నివారించడానికి రోజంతా క్రమం తప్పకుండా నీరు తాగండి.

యూటీఐ రాకుండా పాటించాల్సిన జాగ్రత్తలు

మూత్రనాళ ఇన్ఫెక్షన్‌ను అన్ని సందర్భాల్లో పూర్తిగా నివారించడం సాధ్యం కాకపోయినా, కొన్ని అలవాట్లు దాని ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

1. తగినంత నీరు తాగండి

రోజంతా క్రమం తప్పకుండా నీరు తాగండి. దాహం వేసే వరకు వేచి ఉండకండి. అయితే గుండె లేదా మూత్రపిండాల వ్యాధుల కారణంగా ద్రవాల వినియోగంపై పరిమితులు ఉన్నవారు వైద్యుల సూచనలను పాటించాలి.

2. మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకోకండి

మూత్ర విసర్జన అవసరం అనిపించినప్పుడు వెంటనే వెళ్లండి. మూత్రాన్ని బలవంతంగా ఎక్కువసేపు ఆపుకోవడం అలవాటు చేసుకోకండి.

3. టాయిలెట్‌ పరిశుభ్రత పాటించండి

మహిళలు మూత్ర విసర్జన లేదా మల విసర్జన తర్వాత ముందు నుంచి వెనుక వైపునకు శుభ్రం చేసుకోవాలి. సువాసన కలిగిన స్ప్రేలు, యోని లోపలి భాగాన్ని శుభ్రం చేసే రసాయనాలు వంటి చికాకు కలిగించే ఉత్పత్తులను నివారించాలి.

4. లైంగిక చర్యల తర్వాత సాధారణ పరిశుభ్రత పాటించండి

అవసరమైతే మూత్ర విసర్జన చేయవచ్చు. ఇది కొందరికి ఉపయోగపడినా యూటీఐని పూర్తిగా నివారిస్తుందనడానికి నిర్ధరిత ఆధారాలు లేవు. పదేపదే ఇన్ఫెక్షన్‌ వస్తుంటే వైద్యుడిని సంప్రదించాలి.

5. మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోండి

రక్తంలో చక్కెర స్థాయులను వైద్యుల సూచన మేరకు పర్యవేక్షించండి. మందులు, ఆహారం, శారీరక శ్రమ విషయంలో వైద్యుల సూచనలను పాటించండి.

6. పునరావృత ఇన్ఫెక్షన్లను నిర్లక్ష్యం చేయకండి

ఆరు నెలల్లో రెండుసార్లు లేదా ఏడాదిలో మూడుసార్లు యూటీఐ వస్తే వైద్య పరీక్ష అవసరం. మహిళల్లో మెనోపాజ్ తర్వాత కొన్ని సందర్భాల్లో ఈస్ట్రోజెన్ చికిత్స వంటి నివారణ పద్ధతులు ఉపయోగపడవచ్చు. అలాంటి చికిత్స అవసరమా, లేదా అనేది వైద్యుడే నిర్ణయించాలి.

7. గర్భిణులు పరీక్షలను వాయిదా వేయకండి

గర్భధారణ సమయంలో వైద్యుల సూచన మేరకు మూత్ర కల్చర్‌ పరీక్ష చేయించుకోండి. మంట లేకపోయినా మూత్రంలో బ్యాక్టీరియా ఉండవచ్చు. స్వయంగా యాంటీబయాటిక్స్‌ వాడకండి.

8. కాథెటర్ సంరక్షణలో జాగ్రత్త వహించండి

మూత్రాన్ని బయటకు పంపేందుకు అమర్చిన ట్యూబ్ (కాథెటర్) ఉన్నవారు వైద్య సిబ్బంది సూచనల మేరకు దాన్ని సంరక్షించాలి. అవసరం లేని కాథెటర్ వినియోగాన్ని నివారించాలి. దాన్ని స్వయంగా తొలగించకూడదు.

యూటీఐ సాధారణంగా చికిత్సతో నయమయ్యే సమస్యే. అయితే నిర్లక్ష్యం, స్వీయచికిత్స, యాంటీబయాటిక్స్ దుర్వినియోగం సమస్యను తీవ్రతరం చేయవచ్చు. మూత్ర విసర్జనలో మంట లేదా తరచూ మూత్రం రావడం వంటి లక్షణాలు కొనసాగితే వైద్యుడిని సంప్రదించాలి. జ్వరం, చలితో వణుకు, నడుము పక్కన నొప్పి లేదా వాంతులు ఉంటే ఆలస్యం చేయకూడదు. సకాలంలో వ్యాధి నిర్ధరణ, సరైన చికిత్స ద్వారా తీవ్రమైన సమస్యలను నివారించవచ్చు.

(గమనిక: రచయిత వైద్యురాలు. వైద్యపరమైన విధానాలు, చికిత్సలపై అవగాహన కల్పించడమే ఈ ఆర్టికల్ ఉద్దేశం. ఆరోగ్యపరమైన ఏ నిర్ణయమైనా డాక్టర్‌ను సంప్రదించి మాత్రమే తీసుకోగలరు)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)