58 మంది పిల్లలున్న ఓ తండ్రి కథ.. ‘రాత్రి పడుకునే ముందు అందరూ ఉన్నారో లేదో లెక్కపెడతాను’

మహమ్మద్ సాదిక్
ఫొటో క్యాప్షన్, తన పిల్లలతో మహమ్మద్ సాదిక్
    • రచయిత, తోర్‌పేకయీ గర్ని
    • హోదా, బీబీసీ న్యూస్
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

అఫ్గానిస్తాన్‌లో పెద్ద కుటుంబాలు, చాలామంది పిల్లలున్న జంటలు సర్వసాధారణం. కానీ, ఉరుజ్గాన్ ప్రావిన్స్‌లోని మహమ్మద్ సాదిక్ కుటుంబం ఆ దేశంలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటి కావొచ్చు.

మహమ్మద్ సాదిక్‌కు నలుగురు భార్యలు. నలుగురి భార్యలతో ఆయనకు 58 మంది పిల్లలు కలిగారు.

ఆయన చిన్న కొడుకు కొన్ని వారాల కిందటే పుట్టాడు. ఇంత పెద్ద కుటుంబాన్ని పోషించడం సాదిక్‌కు అతిపెద్ద సవాలుగా మారింది.

ప్రతిరోజూ పిల్లలకు తిండి, నీళ్లు అందించడానికే తన ప్రయత్నాలన్నీ అని ఆయన అన్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా, కుటుంబంలోని చిన్న పిల్లలు కూడా కష్టాలను ఎదుర్కొంటున్నారని తెలిపారు.

ఈ కుటుంబంలో ఆయన నలుగురు భార్యలు గర్భధారణ, పిల్లల్ని కనడం, వారి పెంపకంలో ఏళ్లుగా నిమగ్నమై ఉన్నారు.

తన నలుగురు భార్యలు పెళ్లి సమయంలో చాలా చిన్న వారని, పెళ్లి నాటికి వారి వయసు 13 నుంచి 16 ఏళ్ల మధ్య ఉండేదని మహమ్మద్ సాదిక్ తెలిపారు.

మహమ్మద్ సాదిక్ నవ్వుతూ.. కొన్నిసార్లు తన పిల్లలందరి పేర్లు కూడా గుర్తుండవని అన్నారు.

అందరూ ఇంట్లోనే ఉన్నారో లేదో తెలుసుకునేందుకు, రాత్రి పడుకునే ముందు వారిని లెక్కపెడతానని చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఇంట్లో పండగ వాతావరణం

చిన్న పిల్లలు తన చుట్టూ చేరినప్పుడు, ఇంట్లో ఏదో పెళ్లి వేడుక జరుగుతున్నట్లుగా అరుపులతో, నవ్వులతో, సందడితో నిండిపోతుందని మహమ్మద్ సాదిక్ అన్నారు.

అయితే, ఈయన కుటుంబ జీవితం సంతోషాలతో పాటు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో సాగుతోంది. ఒక్కోసారి కొందరు పిల్లలు ఆకలితోనే నిద్రపోవాల్సిన పరిస్థితి.

ఆ కుటుంబం రోజుకు రెండు పూటలు మాత్రమే అంటే.. ఉదయం, సాయంత్రమే వండుకుంటుంది. ఆ ఇంట్లోని ఇద్దరు మహిళలు వంట బాధ్యతలను చూసుకుంటారు.

57 ఏళ్ల మహమ్మద్ సాదిక్ కార్ల షోరూంలో పనిచేస్తారు.

తన కూతుళ్లలో ఒకరి పెళ్లికి సంబంధించిన ఆసక్తికరమైన కథనాన్ని చెబుతూ.. ''మౌల్వీ సాహిబ్ నా కూతురు పెళ్లి చేస్తూ, ఆమె పేరు అడిగారు. నాకు వెంటనే గుర్తు రాలేదు.. పొరపాటున నా మరో కూతురు పేరు చెప్పాను. అప్పుడు మౌల్వీ సాహిబ్ నవ్వి, 'మీరు ఇంటికి వెళ్లి తప్పుడు పేరు చెప్పారో లేదో మళ్లీ చూసుకోండి' అని అన్నారు.

మహమ్మద్ సాదిక్ ఇల్లు
ఫొటో క్యాప్షన్, మహమ్మద్ సాదిక్ ఇంట్లో చాలా గదులు ఉన్నాయి. కానీ, వాటిలో దేనికీ తలుపులు లేవు, తలుపు బదులుగా తెరలు ఉన్నాయి.

నాకు పేరు కూడా గుర్తులేదు

చాలామంది పిల్లలు ఉండటం వల్ల తరచూ ప్రతి ఒక్కరి పేర్లు గుర్తుంచుకోవడం కష్టమని మహమ్మద్ సాదిక్ వివరించారు. అయితే, చాలావరకు ‘బేటా’(కొడుకు) అని పిలుస్తానని తెలిపారు.

మహమ్మద్ సాదిక్ ఒక సంఘటనను గుర్తు తెచ్చుకుంటూ.. ''ఒకరోజు రాత్రి మేమందరం డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాం. పిల్లల్ని నేను లెక్కపెట్టడం మొదలుపెట్టాను, ఒకరు కనిపించలేదు. కనిపించకుండాపోయిన బిడ్డ అమ్మాయా? అబ్బాయా? కూడా నాకు తెలియదు. అప్పుడు, వారి తల్లులను అడిగాను. వారిలో ఒకరు తన బిడ్డను వాళ్ళ అమ్మమ్మ ఇంటికి పంపించానని, అతను ఆ రాత్రి అక్కడే ఉంటాడని చెప్పారు'' అని తెలిపారు.

మహమ్మద్ సాదిక్ తనకు 20 ఏళ్లున్నప్పుడు, మొదటి పెళ్లి చేసుకున్నారు. చిన్న వయసు అమ్మాయిలను పెళ్లి చేసుకోవడానికి గల కారణాల గురించి బీబీసీ అడిగినప్పుడు, ప్రతి పెళ్లి కోసం తాను చాలా సంవత్సరాల పాటు 'తువియానా' (వధువు కుటుంబానికి ఇచ్చే డబ్బు) కూడబెట్టుకోవాల్సి వచ్చిందని ఆయన చెప్పారు.

ఇంత పెద్ద కుటుంబాన్ని, పిల్లలను పెంచే బాధ్యత గురించి అడిగినప్పుడు, తన భార్యలకు చాలా చిన్న వయసులోనే పెళ్లి జరిగిందని ఆయన చెప్పారు. వారు బాల్యం, కౌమర దశలోనే.. పెళ్లి, గర్భం, ప్రసవం, పిల్లల పెంపకం వంటి పెద్ద బాధ్యతలను స్వీకరించారని, అవి వారి జీవితంలో శాశ్వత భాగమైపోయాయని ఆయన తెలిపారు.

మహమ్మద్ సాదిక్, ఆయన భార్యలు తమ జీవితంలో మరో పెద్ద విషాదాన్ని ఎదుర్కొన్నారు. గడిచిన కొన్నేళ్లుగా వారు 14 మంది పిల్లలను కోల్పోయారు. ఇది ఏ తల్లిదండ్రులకైనా తీరని దుఖాన్ని కలిగిస్తుంది.

మహమ్మద్ సాదిక్ ఇంట్లో వంటగది
ఫొటో క్యాప్షన్, మహమ్మద్ సాదిక్ ఇంట్లో వంటగది. వంటగది చివరలో నీలిరంగు దుస్తులు ధరించిన ఒక మహిళ కూర్చుని ఉన్నారు.

ఆర్థిక పరిస్థితి

చిన్న వయసులోనే పెళ్లి, గర్భం దాల్చడం వల్ల తల్లికి, పుట్టబోయే బిడ్డకు ఆరోగ్య ప్రమాదాలు పెరుగుతాయని నిపుణులు చెప్పారు. పదేపదే గర్భం దాల్చడం కూడా.. మహిళలకు మరిన్ని ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు.

గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో నాణ్యమైన వైద్య సౌకర్యాలు పరిమితంగా ఉండటంతో.. గర్భధారణ, ప్రసవ సమయంలో మహిళల మరణాల రేటు ఎక్కువగా ఉండే దేశాలలో అఫ్గానిస్తాన్ ఒకటి.

మరోవైపు పేదరికం కూడా ఈ కుటుంబ జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. శీతాకాలంలో.. ఈ కుటుంబ సభ్యులు తమ గదుల్లోనే కలిసి భోజనం చేస్తారు. వేసవిలో ఇంటి బయట కూర్చుని తింటారు.

వారికి నిత్యావసర సదుపాయాలు కూడా చాలా పరిమితంగా ఉన్నాయి. ఎక్కడైతే స్నానం చేస్తారో, అక్కడే దుస్తులు ఉతకడం, అంట్లు కడగడం చేస్తుంటారు. అదే ప్రాంతాన్ని టాయిలెట్‌గా కూడా వాడుతున్నారు.

పెరుగుతున్న కుటుంబ ఖర్చులను భరించేందుకు, మహమ్మద్ సాదిక్ మాత్రమే కాకుండా, తన పిల్లల్లో చాలామంది పనిచేస్తున్నారు.

వారిలో కొందరు ఫ్యూయల్‌గా ఉపయోగించేందుకు కాగితం, ప్లాస్టిక్, ఇతర పునర్వినియోగ పదార్థాలను సేకరిస్తారు, ఆ తర్వాత ఇంటి ఖర్చుల కోసం వాటిని అమ్ముతున్నారు.

ఇన్ని కష్టాలు ఉన్నప్పటికీ, ఈ కుటుంబం తమ రోజువారీ అవసరాలను తీర్చుకోవడానికి కష్టపడుతూనే ఉంది. మహమ్మద్ సాదిక్ కుటుంబానికి ఆహారం, ఆశ్రయం, పిల్లలను పోషించడం ప్రతిరోజూ ఒక కొత్త సవాలుగా మారుతోంది.

మహమ్మద్ సాదిక్ కోరుకుంటుందేంటి?

శీతాకాలంలో ఆ చల్లటి వాతావరణంలో కొన్నిసార్లు ఆరు నుంచి ఏడుగురు పిల్లలు ఒకే పలుచటి దుప్పటి కింద నిద్రపోవాల్సి వస్తుంది. ఒక సాధారణ పరుపు తప్ప.. పడుకునేందుకు వారి కుటుంబం వద్ద పెద్దగా ఎలాంటి సౌకర్యాలు లేవు. వారి ఇంట్లో గదులకు కిటికీలు కానీ, గట్టి తలుపులు కానీ లేవు. కేవలం ప్రవేశ ద్వారంలో కర్టెన్లు మాత్రమే వేసి ఉన్నాయి.

ఫ్యూయల్ కోసం.. వారి కుటుంబం చాలా వరకు కాగితాన్ని, అందుబాటులో ఉన్న ఇతర వస్తువులను కాల్చుతుంది. ఇన్ని కష్టాలు ఉన్నప్పటికీ, తను చదువుకునేందుకు వీలుపడలేదన్న కారణంతో.. మహమ్మద్ సాదిక్ తన పిల్లల్ని స్కూల్‌కు పంపేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.

అయితే, ఆయన పరిమిత ఆదాయం పిల్లల చదువుకునే ఖర్చులను భరించడాన్ని ఇబ్బందికరంగా మారుస్తోంది.

మహమ్మద్ సాదిక్ ఒక కార్ల షోరూమ్‌లో పనిచేస్తారు. ఒక కారు అమ్మితే ఆయనకు కేవలం 1,000 అఫ్గానీల కమీషన్ మాత్రమే వస్తుందని ఆయన చెప్పారు.

అయితే, ఇంత పెద్ద కుటుంబం అవసరాలు వారి ఉమ్మడి ఆదాయాన్ని మించి ఉన్నాయి. దీంతో, మహమ్మద్ సాదిక్ తన పిల్లల ప్రాథమిక అవసరాలను తీర్చాలని ప్రభుత్వానికి, సహాయ సంస్థలకు, ఆర్థికంగా స్తోమత ఉన్న వ్యక్తులకు సహాయం చేయాలని కోరుతున్నారు.

తను కోరుకునేందేంటని అడిగినప్పుడు.. తన జీవితంలో రెండే ఆశలు ఉన్నాయని మహమ్మద్ సాదిక్ అన్నారు.

''నా తొలి కోరిక.. నా పిల్లలను చదివించాలి. ఇక రెండోది.. వారు అసలు ఆకలితో నిద్రపోకూడదు. వారి కడుపులు నిండాలి'' అంతేనని మహమ్మద్ సాదిక్ చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)