కావ్యా మారన్, అనిరుధ్ పెళ్లితో బంధువులు కానున్న రజినీ,స్టాలిన్

సన్ గ్రూప్‌కు చెందిన కావ్యా మారన్, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ పెళ్లి చేసుకుంటున్నారు
ఫొటో క్యాప్షన్, సన్ గ్రూప్‌కు చెందిన కావ్యా మారన్, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ పెళ్లి చేసుకుంటున్నారు
ప్రచురణ
చదివే సమయం: 4 నిమిషాలు

సన్ గ్రూప్‌కు చెందిన కావ్యా మారన్, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ వివాహం ఓ రెండు ప్రసిద్ధ కుటుంబాలను కూడా బంధువులుగా మార్చనుంది.

ఈ వివాహం మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ , సూపర్ స్టార్ రజినీకాంత్ కుటుంబాలను కలపనుంది.

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని తమ కుమార్తె వివాహానికి రావాల్సిందిగా సన్ గ్రూప్ ఛైర్మన్ కళానిధి మారన్, ఆయన భార్య కావేరీ మారన్ ఇద్దరూ ఆయనను కలిసి ఆహ్వాన పత్రికను అందించారు. దీన్ని తెలంగాణ సీఎం కార్యాలయం కూడా నిర్ధరించింది.

మారన్ దంపతులు వ్యక్తిగతంగా ప్రధాని నరేంద్ర మోదీని, తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్‌ను కలిసి వివాహానికి ఆహ్వానించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
రజినీకాంత్, స్టాలిన్, కావ్య మారన్, అనిరుధ్

స్టాలిన్‌కు కావ్య ఏమవుతారు?

సన్‌ టీవీ నెట్‌వర్క్ మేనేజింగ్ డైరెక్టర్స్‌లో కావ్యా కళానిధి మారన్ ఒకరు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ప్రసిద్ధ జట్లలో ఒకటైన సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టుకు కావ్య సహ యజమాని.

కళానిధి మారన్, కావేరీ దంపతుల కుమార్తె అయిన కావ్య 2016లో సన్‌ టీవీ నెట్‌వర్క్‌లో చేరారు. 2019లో ఆమె మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.

మాజీ కేంద్ర మంత్రి, దివంగత నేత మురసోలీ మారన్ కుమారుడే కళానిధి మారన్.

మురసోలీ మారన్ తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి సోదరి కుమారుడు.

అలా కళానిధి మారన్, ఎంకే స్టాలిన్ బంధువులు అవుతారు.

ఈ లెక్కన కళానిధి కుమార్తె కావ్య స్టాలిన్‌కు మనవరాలు అవుతారు.

రజినీకాంత్, స్టాలిన్, కావ్య మారన్, అనిరుధ్

అనిరుధ్, రజినీ సంబంధం ఏంటి?

తమిళంతోతోపాటు తెలుగులోనూ సంగీత ప్రతిభతో ఆకట్టుకున్న దర్శకుల్లో అనిరుధ్ ఒకరు. 2012లో విడుదలైన '3' సినిమాతో సంగీత దర్శకుడిగా ఆయన కెరీర్‌ ప్రారంభమైంది. ఆ సినిమాలో ఆయన కంపోజ్ చేసిన 'వై దిస్ కొలవెరి డి' పాట ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

ఆ తర్వాత అనేక సినిమాలకు అనిరుధ్ సంగీత దర్శకత్వం వహించారు.

గత వారం విడుదలైన జైలర్ 2 సహా జైలర్ 1, విక్రమ్, లియో, ప్యారడైజ్, టాక్సిక్ సినిమాలకు సంగీతం అందించారు.

రజినీకాంత్, స్టాలిన్, కావ్య మారన్, అనిరుధ్
ఫొటో క్యాప్షన్, రజినీకాంత్‌కు అనిరుధ్ మేనల్లుడు అవుతారు

అనిరుధ్ తండ్రి రవి రాఘవేంద్ర కూడా సినిమా నటుడే. ఆయన రజినీకాంత్ భార్య లతా రజినీకాంత్‌కు సోదరుడు.

అంటే రజినీకాంత్‌కు అనిరుధ్ వరుసకు మేనల్లుడు అవుతారు.

రజినీకాంత్‌కు అనిరుధ్ బంధువు మాత్రమే కాదు, ఆయన నటించిన చాలా సినిమాలకు సంగీతం కూడా అందించారు. ఇద్దరూ కలిసి పని చేశారు.

ఈ మధ్య కాలంలో రజినీ చేసిన పేటా, దర్బార్, జైలర్ 1, వేట్టయన్, జైలర్ 2 సినిమాలకు అనిరుధ్ సంగీతం అందించారు.

రజినీకాంత్, స్టాలిన్, కావ్య మారన్, అనిరుధ్
ఫొటో క్యాప్షన్, కావ్యామారన్, అనిరుధ్ వివాహంతో రజినీకాంత్, స్టాలిన్ బంధువులు కాబోతున్నారు

బంధువులు కానున్న స్టాలిన్, రజినీ

కావ్యా మారన్, అనిరుధ్ వివాహంతో పలుకుబడి కలిగిన రెండు కుటుంబాలు దగ్గర బంధువులు కాబోతున్నాయి.

ఒకవైపు కావ్య, కరుణానిధి-మురసోలీ మారన్‌ కుటుంబసభ్యురాలు కాగా , మరోవైపు రజినీకాంత్ కుటుంబానికి అనిరుధ్ మేనల్లుడు అవుతాడు.

ఇలా స్టాలిన్, రజినీకాంత్ కుటుంబాలు కూడా దగ్గరి బంధువులు కాబోతున్నాయి.

రజినీకాంత్, స్టాలిన్, కావ్య మారన్, అనిరుధ్
ఫొటో క్యాప్షన్, స్టాలిన్‌కు కావ్యా మారన్ వరుసకు మనవరాలు అవుతారు.

సన్ టీవీ గ్రూప్ ఆస్తులు ఎంతో తెలుసా?

భారత్‌లోని అతి పెద్ద మీడియా సంస్థల్లో సన్‌ టీవీ నెట్‌వర్క్ ఒకటి. ఈ సంస్థ టీవీ, రేడియో, డిజిటల్ స్ట్రీమింగ్, ప్రింట్ మీడియా, క్రీడా రంగాల్లో పెట్టుబడులు కలిగి ఉంది.

ఆ సంస్థ అధికారిక సమాచారం ప్రకారం ఏడు భాషల్లో 37 టీవీ ఛానల్స్ ఉన్నాయి. 69 ఎఫ్ఎం రేడియో స్టేషన్లు, 140 మిలియన్ ఇళ్లకు చేరువయ్యే నెట్‌వర్క్ కలిగి ఉంది. సన్‌నెక్ట్స్ ఓటీటీ ప్లాట్‌ఫామ్, సన్‌రైజర్స్ హైదరాబాద్ క్రికెట్ టీమ్‌ను కూడా కలిగి ఉంది.

సన్ నెట్‌వర్క్ మొత్తం విలువ 25, 219.45 కోట్లు(అక్టోబర్ 19 నాటికి).

ఈ నెట్‌వర్క్ మొత్తం ఆదాయం రూ. 4,543.96 కోట్లుగా, పన్నుల తర్వాత నికర లాభం రూ. 1,654.46 కోట్లుగా నమోదైనట్టు 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సంస్థ సమర్పించిన ఆడిట్ నివేదిక చెబుతోంది.

ఈ లెక్కలు ఆ కంపెనీ ఏ స్థాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తుందో తెలియజేస్తున్నాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)