చీర ధరించి 1600 మీటర్ల పరుగు పందాన్ని 9 నిమిషాల్లో పూర్తి చేసిన కవిత..

ఫొటో సోర్స్, Mohammad Sartaj Alam
- రచయిత, మొహమ్మద్ సర్తాజ్ ఆలమ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
ఇటీవల సోషల్ మీడియాలో ఓ వీడియో అందరి దృష్టిని ఆకర్షించింది.
చీర కట్టుకుని, చెప్పులు లేకుండా పరుగెత్తిన ఓ గ్రామీణ మహిళ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తొలిచూపులో ఈ వీడియో ఏదో సినిమా సన్నివేశంలా కనిపిస్తుంది. ఝార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లాలో సిదో-కాన్హు మైదానంలో పరుగెత్తిన కవితా మహతో అనే మహిళది ఆ వీడియో.
హోంగార్డు నియామకాల కోసం నిర్వహించిన 1600 మీటర్ల పరుగు ఫ్రీ ట్రయల్‌కు సంబంధించిన వీడియో ఇది. ఈ వీడియో చూసిన తర్వాత కవితా మహతోపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె ఒక గృహిణి. భర్త మరణించారు.
మోడర్న్ స్పోర్ట్స్ షూస్, ట్రాక్‌సూట్, ప్రొఫెషనల్ శిక్షణ పరికరాలు ఏవీ లేకుండానే కవితా దేవి చీర కట్టుకుని, చెప్పులు లేకుండా 1600 మీటర్ల పరుగును పూర్తి చేశారు.


ఫొటో సోర్స్, Mohammad Sartaj Alam
మొదటిసారి పరుగుపందెంలో పాల్గొన్న కవిత
ఝార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లాలో 284 హోంగార్డు పోస్టుల భర్తీ ప్రక్రియను అక్టోబర్ 24 నుంచి నవంబర్ 5 మధ్య నిర్వహించేందుకు నిర్ణయించారు.
నిబంధనల ప్రకారం, ఈ పోస్టుల్లో 50 శాతం మహిళలకు రిజర్వ్ చేశారు.
అంతేకాకుండా, భర్త మరణించిన మహిళలకు, విడాకులు తీసుకున్న మహిళలకు అదనంగా ఐదు శాతం రిజర్వేషన్ ఉంది. ఈ నియామక ప్రక్రియలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొనే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో, ప్రధాన నియామక ప్రక్రియకు ముందు అభ్యర్థుల సన్నద్ధతను పరీక్షించడంతోపాటు, వారికి ప్రాక్టీస్ చేసే అవకాశం కల్పించేందుకు రామ్‌గఢ్‌లోని స్థానిక మైదానంలో 1600 మీటర్ల ట్రయల్ పరుగు నిర్వహించారు.
నిబంధనల ప్రకారం, మహిళా అభ్యర్థులు 1600 మీటర్ల దూరాన్ని పూర్తి చేసేందుకు 10 నిమిషాల సమయాన్ని నిర్ణయించారు.
అక్టోబర్ 4న నిర్వహించిన ఈ ట్రయల్‌లో పాల్గొనేందుకు కవితా దేవి కూడా వచ్చారు.
సోసో గ్రామానికి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న మైదానంలోకి వచ్చి పరుగెత్తడం కవితా మహతో జీవితంలో ఇదే తొలిసారి.
ప్రొఫెషనల్ రన్నర్‌లా కాకుండా, సాధారణ గ్రామీణ గృహిణిలా చీర కట్టుకుని, చెప్పులు లేకుండానే ఆమె పరుగెత్తడం ప్రారంభించారు.
ఈ పరుగును ఆమె కేవలం తొమ్మిది నిమిషాల్లోనే పూర్తి చేశారు.
ట్రయల్‌ను నిర్వహించిన కోచ్ అంకిత్ అగర్వాల్ ఆమె ప్రదర్శన గురించి మాట్లాడారు.
"కలలను సాకారం చేసుకోవడానికి వనరుల కొరత అడ్డంకేమీ కాదని కవిత నిరూపించారు" అని ఆయన అన్నారు.
పరుగెత్తుతున్నప్పుడు నిర్ణీత సమయంలో 1600 మీటర్ల దూరాన్ని పూర్తి చేయగలనా లేదా అనే ఆలోచన తన మనసులో మెదులుతూ ఉందని కవిత బీబీసీ న్యూస్‌కి చెప్పారు.
"అయితే ముందుకు వెళ్తున్న కొద్దీ నా చుట్టూ కొందరు మహిళలు వెనుకబడిపోయారు. దీంతో నాకు ధైర్యం పెరిగింది. మరింత గట్టిగా ప్రయత్నించా. విజయం సాధించా" అని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, Mohammad Sartaj Alam
పరుగెత్తేందుకు ప్రోత్సహించిన అత్త, ఆడపడుచు
మైదానంలో కవిత అడుగులు ఎంత వేగంగా కదిలాయో, ఆమె జీవిత ప్రయాణం అంతే పోరాటాలతో నిండింది. ఐదేళ్లపాటు అనారోగ్యంతో బాధపడిన ఆమె భర్త 2023లో మరణించారు.
భర్త మరణానికి ఐదేళ్ల ముందు ఆయనకు కాలేయ సంబంధిత సమస్యలు మొదలయ్యాయని కవిత వివరించారు. అయితే చికిత్సను నిర్లక్ష్యం చేయడంతో ఆరోగ్యం క్రమంగా క్షీణించిందని చెప్పారు. ఆయన గుజరాత్‌లోని ఓ ఫ్యాక్టరీలో సూపర్‌వైజర్‌గా పనిచేసేవారు.
కవితకు ప్రస్తుతం 31 ఏళ్లు. 12వ తరగతి వరకు చదువుకున్నారు.
భర్త మరణించిన తర్వాత కుటుంబ బాధ్యతలను ఆమె బావ చూసుకునేవారు. అయితే ఆయన కూడా దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడడంతో 2025లో మరణించారు.
కవితకు 13 ఏళ్ల కుమార్తె, 11 ఏళ్ల కుమారుడు ఉన్నారు. వీరితోపాటు ఆమె వృద్ధ అత్తమామలు సోసో గ్రామంలో నివసిస్తున్నారు.
కవిత ఆడపడుచు సరిత మాత్రం రామ్‌గఢ్‌లోని తన పుట్టింట్లో ఉంటూ కూలి పనులు చేస్తున్నారు.
అక్కడే ఆమెకు హోంగార్డు ఉద్యోగాల గురించి తెలిసింది. దీంతో పరుగు పందెం కోసం సిద్ధమవడం ప్రారంభించారు. తన ఆడపడుచు కవితను కూడా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
అత్త, మామ, ఆడపడుచు ప్రోత్సాహంతో కవితా దేవి ఆన్‌లైన్‌లో హోంగార్డు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారు.
"గ్రామస్థులు నాకు నివాస, కుల ధ్రువీకరణ పత్రాలు చేయించారు. దీంతో నాకు ప్రోత్సాహం లభించింది. ఫిజికల్ పరీక్షకు సిద్ధమయ్యేందుకు తెల్లవారుజామున నాలుగు గంటలకు గ్రామం బయట పరుగెత్తడం ప్రారంభించాను" అని కవిత చెప్పారు.

ఫొటో సోర్స్, Mohammad Sartaj Alam
భర్త మరణం తర్వాత కుటుంబ పోషణ కోసం పోరాటం
"మాకు ఉన్న ఏకైక ఆస్తి ఈ రెండు గదుల ఇల్లు. పెళ్లికి ముందు గుజరాత్‌లో సంపాదించిన డబ్బుతో నా ఇద్దరు కొడుకులు ఈ ఇంటిని నిర్మించారు" అని కవిత అత్త ఫుల్కో దేవి చెప్పారు.
"ఆమె కుమారులు కష్టపడి సంపాదించిన పొదుపు మొత్తమంతా దీర్ఘకాలిక అనారోగ్యానికి చికిత్స చేయించడంలోనే ఖర్చయిపోయిందని" అని ఫుల్కో దేవి పొరుగింట్లో ఉండే సచిన్ కుమార్ అన్నారు.
"ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబ ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉంది. గతంలో ఈ కుటుంబం బాగానే ఉండేది. ఇప్పుడు అప్పుల భారం కూడా పెరిగింది" అని ఆయన చెప్పారు.
వితంతు పింఛను, వృద్ధాప్య పింఛనుపై ఆధారపడుతున్న ఈ కుటుంబాన్ని పోషించే బాధ్యత ఇప్పుడు కవితపైనే ఉంది.
"కుటుంబాన్ని పోషించేందుకు ఆవు పాలు అమ్మడంతోపాటు, మా గ్రామంలోని వరి, మొక్కజొన్న, వేరుశనగ పొలాల్లో కూలి పనులు చేస్తాం" అని కవిత చెప్పారు.
"వేసవిలో ఇటుక బట్టీల్లో కూడా పని దొరుకుతుంది" అని ఆమె తెలిపారు.
కవిత అత్త ఫుల్కో దేవి, "మాకు పెద్దగా భూమి లేదు. దానిపై ఆధారపడి జీవించలేం. మా వృద్ధాప్యంలో కోడలు కవితే మాకు ఏకైక ఆధారం" అని చెప్పారు.
"నా ఇద్దరు కోడళ్లూ వితంతువులే. వారిద్దరికీ హోంగార్డు ఉద్యోగాలు వస్తే, మనవళ్లు, మనవరాళ్లకు మెరుగైన భవిష్యత్తు కల్పించడంతోపాటు మా వృద్ధాప్యాన్ని కూడా ప్రశాంతంగా గడపగలుగుతాం" అని ఫుల్కో దేవి అన్నారు.
"కుటుంబంలో పెళ్లి జరిగినా, ఎవరైనా చనిపోయినా లేదా ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్లాల్సి వచ్చినా, కుటుంబం తరఫున నేనే వెళ్లాల్సి ఉంటుంది" అని కవిత చెప్పారు.

ఫొటో సోర్స్, Mohammad Sartaj Alam
ఉద్యోగం కోసం గ్రామంలోనే పరుగుపందెం సాధన
ప్రధాన పరుగుపందానికి ముందు ట్రయల్స్ నిర్వహించిన కోచ్ అంకిత్ అగర్వాల్ ఇప్పుడు కవితకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. ఇతర మహిళా అభ్యర్థులకు కూడా ఆయన ఈ సాయం అందిస్తున్నారు.
ట్రయల్ పరుగులోనే కవితలోని ప్రతిభను ఆయన గుర్తించారు.
అయితే, ఈ శిక్షణ కోసం మైదానానికి చేరుకోవడం కూడా కవితకు సులభం కాదు. ప్రతిరోజూ తెల్లవారుజామునే నిద్రలేచి, ఖాళీ కడుపుతో దాదాపు 16 కిలోమీటర్లు ప్రయాణించి రామ్‌గఢ్ మైదానానికి చేరుకుంటానని ఆమె చెప్పారు.
అక్కడ ఇతర మహిళా అభ్యర్థులతో కలిసి ఉదయం పది గంటల వరకు సాధన చేసి, ఆ తర్వాత తిరిగి సోసో గ్రామానికి వెళ్తారు.
ట్రయల్ పరుగు జరిగిన రోజు కూడా తాను ఖాళీ కడుపుతోనే మైదానంలో పరుగెత్తానని కవిత తెలిపారు.
"1600 మీటర్ల పరుగును పూర్తి చేయగలుగుతానని నేను అనుకోలేదు. కానీ దేవుడి దయవల్ల అది సాధ్యమైంది. వీడియో వైరల్ అయిన తర్వాత నాకు ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు ఓ కోచ్ ముందుకొచ్చారు" అని ఆమె చెప్పారు.
కవిత పరుగెత్తిన వీడియో వైరల్ అయిన తర్వాత, కోచ్ ఆమెకు ట్రాక్‌సూట్, పరుగెత్తేందుకు బూట్లు కూడా ఇచ్చారు.
అయితే, తన పరుగు వీడియో వైరల్ కావడంతో వచ్చిన ప్రచారం కవితకు కొంత ఇబ్బందిగా కూడా అనిపిస్తోంది. భవిష్యత్తులో తాను విఫలమైతే ప్రజలు ఏమనుకుంటారోనని ఆమె ఆందోళన చెందుతున్నారు.
"వీడియో వైరల్ అయిన తర్వాత మాకు చాలా వింతగా అనిపిస్తోంది. అక్టోబర్ 25న జరిగే పరుగుపందెంలో నేను విజయం సాధించకపోతే, మా గ్రామస్థులు నన్ను చూసి నవ్వుతారని అనుకుంటున్నాం.అది తలచుకుంటేనే భయమేస్తోంది" అని కవిత అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























