ఆహారం తినగానే ‘షుగర్ లెవెల్స్’ పెరగడం ప్రమాదకరమా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మెలిస్సా హోగెన్‌బూమ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
రక్తంలో చక్కెర స్థాయులు ఒక్కసారిగా పెరుగుతున్నాయని ఆందోళన చెందడం ప్రస్తుతం ఓ ట్రెండ్‌గా మారింది. అయితే, ఆహారం తీసుకున్న తర్వాత ఇలా జరగడం సాధారణ శారీరక ప్రక్రియే. కాబట్టి ఈ విషయంలో ఎప్పుడు ఆందోళన చెందాలో, ఎప్పుడు చెందకూడదో తెలుసుకుందాం.
గత కొన్నేళ్లలో ఆశ్చర్యకరమైన రెండు పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆరోగ్యంగా ఉన్నవారు సైతం రోజంతా తమ రక్తంలో చక్కెర స్థాయులను పరీక్షించుకునేందుకు వీలుగా ఉండే పరికరాలను ధరించడం మొదలుపెట్టారు. మరికొందరు తెల్ల రొట్టె, పాస్తా వంటి ప్రాసెస్డ్ కార్బోహైడ్రేట్లను పూర్తిగా తమ ఆహారం నుంచి తొలగిస్తున్నారు.
రక్తంలో చక్కెర స్థాయులు ఒక్కసారిగా పెరగకుండా చూసుకోవాలని, వాటిని నిరంతరం పరీక్షించుకోవాలని రచయితలు, పాడ్‌కాస్ట్ నిర్వాహకులు, ఆరోగ్యంపై సలహాలిచ్చే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ప్రచారం చేస్తున్నారు.
వారి వాదన ప్రకారం, రక్తప్రవాహంలో గ్లూకోజ్ గణనీయంగా పెరగడం ప్రమాదకరం. మెటబాలిజం(జీవక్రియ) సంబంధిత వ్యాధులు లేని ఆరోగ్యవంతులు సైతం రక్తంలో చక్కెర స్థాయులు పెరగనిస్తే హార్మోన్ల అసమతుల్యత, మొటిమలు, మానసిక స్థితిలో మార్పులు వంటి సమస్యలు ఎదురవుతాయని వారు చెబుతున్నారు.
అయితే, నిపుణులు ఇప్పుడు ఈ వాదనలను ప్రశ్నిస్తున్నారు. చక్కెర స్థాయుల గురించి ఎప్పుడు ఆందోళన చెందాలి? కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే భోజనం తీసుకున్నంత మాత్రాన దీర్ఘకాలికంగా ఆరోగ్యానికి హాని కలుగుతుందా?

రక్తంలో చక్కెర స్థాయులు ఎందుకు పెరుగుతాయి?
ప్రాసెస్డ్ చక్కెర, పండ్లు, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకుని జీర్ణం చేసుకున్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయులు సహజంగానే పెరుగుతాయి.
కార్బోహైడ్రేట్లు, చక్కెర జీర్ణక్రియలో భాగంగా గ్లూకోజ్‌గా విడిపోతాయి. ఈ గ్లూకోజ్ రక్తప్రవాహంలోకి చేరడంతో రక్తంలో చక్కెర స్థాయులు తాత్కాలికంగా పెరుగుతాయి. అప్పుడు క్లోమగ్రంథి ఇన్సులిన్ అనే హార్మోన్‌ను విడుదల చేస్తుంది. ఈ హార్మోన్ రక్తంలోని గ్లూకోజ్‌ను శరీర కణాల్లోకి చేరేలా చేస్తుంది. తద్వారా కణాలకు శక్తి అందుతుంది.
ఆహారం మాత్రమే రక్తంలో గ్లూకోజ్ స్థాయులను పెంచదు. అధిక తీవ్రతతో వ్యాయామం చేస్తున్నప్పుడు అడ్రినలిన్ వంటి హార్మోన్లు కాలేయానికి సంకేతాలిస్తాయి. దీంతో కాలేయం మరింత గ్లూకోజ్‌ను రక్తంలోకి విడుదల చేస్తుంది. ఇది కండరాలకు అదనపు శక్తిని అందిస్తుంది. ఫలితంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయులు తాత్కాలికంగా పెరగవచ్చని అమెరికాలోని కనెక్టికట్ రాష్ట్రం, యేల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన పిల్లల హార్మోన్ల వ్యాధుల నిపుణురాలు జెన్నిఫర్ షెర్ చెబుతున్నారు.
మధుమేహం ఉన్నవారి శరీరంలో తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోవచ్చు. లేదా ఇన్సులిన్ సక్రమంగా పనిచేయకపోవచ్చు. ఈ పరిస్థితిని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. దీంతో ఆహారం తీసుకున్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయులు ప్రమాదకరంగా పెరిగే అవకాశం ఉంటుంది. అలాంటి వారు ఆహారం, వ్యాయామంపై ప్రత్యేక శ్రద్ధ చూపడంతో పాటు రక్తంలో చక్కెర స్థాయులను పర్యవేక్షించుకోవాలి. కొందరికి ఇన్సులిన్ లేదా మెట్ఫార్మిన్ వంటి మందులు కూడా అవసరమవుతాయి.

ఫొటో సోర్స్, Getty Images
గ్లూకోజ్ స్థాయులు పెరగడం సాధారణమే
ఆరోగ్యవంతుల్లో భోజనం తర్వాత రక్తంలో గ్లూకోజ్ స్థాయులు పెరగడం సాధారణ శారీరక ప్రతిస్పందన. ప్రతి గ్లూకోజ్ పెరుగుదల హానికరమేనని భావించడం అతిపెద్ద అపోహ అని బ్రిటన్‌లోని యూనివర్సిటీ కాలేజ్ లండన్‌కు చెందిన పోషకాహార శాస్త్రం, డైటెటిక్స్ అసోసియేట్ ప్రొఫెసర్ అడ్రియన్ బ్రౌన్ అంటున్నారు.
ఇటీవల నేను ఆరు వారాలపాటు అదనపు చక్కెర కలిసిన ఆహారాన్ని పూర్తిగా మానేసి ప్రయోగం చేశాను. అప్పటి నుంచి తీపి పదార్థాలు తిన్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయులు పెరుగుతాయనే విషయంపై మరింత శ్రద్ధ పెట్టాను.
సాధారణంగా భోజనం చేసిన గంట తర్వాత రక్తంలో చక్కెర స్థాయులు గరిష్ఠ స్థాయికి చేరుకుంటాయి. ఆ తర్వాత రెండు గంటల్లో సాధారణ స్థాయికి తిరిగి వస్తాయి.
జీవక్రియ సక్రమంగా పనిచేస్తున్న వ్యక్తిలో గ్లూకోజ్ స్థాయులు కొద్దిసేపు మాత్రమే పెరిగితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బ్రౌన్ చెబుతున్నారు.
అయితే, రక్తంలో గ్లూకోజ్ స్థాయులు ఊహించిన దానికంటే ఎక్కువసేపు పెరిగితే శరీరం గ్లూకోజ్‌ను సాధారణ రీతిలో నియంత్రించడం లేదనడానికి అది సంకేతం కావచ్చని షెర్ అంటున్నారు.
ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్ సూచన కావచ్చు. రక్తంలో చక్కెర స్థాయులు దీర్ఘకాలం అధికంగా ఉండటం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏర్పడే అవకాశం ఉంది. చివరకు ఇది ప్రీడయాబెటిస్, టైప్ 2 మధుమేహానికి దారితీయవచ్చు.
కొందరు మధుమేహ రోగుల్లో రక్తంలో గ్లూకోజ్ స్థాయులు నిరంతరం అధికంగా ఉండటం వల్ల నరాలు, కళ్లకు నష్టం కలగడంతో పాటు గుండె జబ్బులు, పక్షవాతం వంటి సమస్యలు తలెత్తవచ్చు
అయితే, రక్తంలో గ్లూకోజ్ అధికంగా ఉండటం నేరుగా ఇన్సులిన్ రెసిస్టెన్స్‌కు దారితీస్తుందని చెప్పేందుకు తగిన ఆధారాలు లేవని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ ఆహారం తీసుకున్నప్పుడు, అదనపు కేలరీలు కొవ్వుగా మారుతాయని బ్రిటన్‌లోని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన డైటీషియన్, సీనియర్ పరిశోధకురాలు నికోలా గెస్ వివరిస్తున్నారు.
ఇలా బరువు పెరగడం టైప్ 2 మధుమేహానికి ఒక ప్రమాద కారకమని ఆమె చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
నిరంతర గ్లూకోజ్ పర్యవేక్షణ పరికరాల వినియోగం
మధుమేహం ఉన్నవారు ఇప్పటికే క్రమం తప్పకుండా రక్తంలో చక్కెర స్థాయులను పరీక్షించుకుంటున్నారు. ఇందుకోసం రోజంతా గ్లూకోజ్ స్థాయులను కొలిచే కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటర్లు (సీజీఎంలు) అనే పరికరాలను కొందరు ఉపయోగిస్తున్నారు.
ఇప్పుడు మధుమేహం లేని ఆరోగ్యవంతులు కూడా ఈ పరికరాలు ఉపయోగిస్తున్నారు. అయితే, మధుమేహం లేనివారికి ఇవి అవసరం లేదని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మధుమేహం లేని వ్యక్తులపై నిర్వహించిన ఒక అధ్యయనంలో, వారి రక్తంలో చక్కెర స్థాయులు 96 శాతం సమయం ఆరోగ్యకరమైన పరిధిలోనే ఉన్నట్లు తేలింది.
ఈ పరికరాలు ఆహారపు అలవాట్లలో హానికరమైన మార్పులకు ప్రేరేపించడంతో పాటు ఆరోగ్యంపై తప్పుడు అభిప్రాయాలను కలిగించవచ్చని మరికొందరు హెచ్చరిస్తున్నారు. పైగా,ఇవి రక్తంలో చక్కెర స్థాయులను వాస్తవాని కంటే ఎక్కువగా చూపించే అవకాశం ఉంది.
సీజీఎంలు మధుమేహం లేని వ్యక్తుల ఆరోగ్య ఫలితాలను మెరుగుపరుస్తాయని నిరూపించే స్థిరమైన, నాణ్యమైన ఆధారాలు లేవని బ్రౌన్, ఆయన సహచరులు ఇటీవల నిర్వహించిన సమీక్షలో పేర్కొన్నారు.
అయితే, టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదం ఉన్నవారికి ఈ పరికరాలు ఉపయోగపడే అవకాశం ఉందని షెర్ చెబుతున్నారు.
రక్తంలో గ్లూకోజ్ స్థాయులను పర్యవేక్షించే పరికరాలు భవిష్యత్తులో మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్నవారిని గుర్తించడంలో సహాయపడవచ్చని ప్రాథమిక పరిశోధనలు సూచిస్తున్నాయి.
అయితే, ఈ వర్గానికి అవి నిజంగా ప్రయోజనకరమో లేదో నిర్ధరించడానికి మరిన్ని ఆధారాలు అవసరం.
ఆరోగ్యవంతుల్లో భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయులు పెరగడం సాధారణమే అయినప్పటికీ, వాటిని స్థిరంగా ఉంచేందుకు కొన్ని పద్ధతులు ఉపయోగపడతాయి. ఉదాహరణకు, భోజనం తర్వాత రక్తంలో గ్లూకోజ్ స్థాయులు వేగంగా తగ్గితే ఆకలి పెరిగి, మొత్తం మీద ఎక్కువ ఆహారం తీసుకునే అవకాశం ఉంటుంది.
రక్తంలో చక్కెర స్థాయులపై వివిధ రకాల ఆహారాలు వేర్వేరు ప్రభావాలు చూపుతాయి. తృణధాన్యాలు, ప్రోటీన్లు అధికంగా ఉండే పదార్థాలు రక్తంలో చక్కెర స్థాయులను స్థిరంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇవి ఎక్కువసేపు కడుపు నిండిన భావనను కలిగిస్తాయి. తెల్ల రొట్టె, తెల్ల బియ్యం వంటి సాధారణ కార్బోహైడ్రేట్లు మాత్రం రక్తప్రవాహంలోకి వేగంగా చేరుతాయి.
ఆహారాన్ని తీసుకునే క్రమం కూడా ప్రభావం చూపుతుంది. కార్బోహైడ్రేట్లు తీసుకునే ముందు ప్రోటీన్లు, కూరగాయలు తినడం వల్ల భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయులు పెరిగే తీవ్రత తగ్గుతుందని కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి.
ప్రోటీన్లు, పీచుపదార్థాలు అధికంగా ఉండే వృక్షాధార ఆహారాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు కలిగిన సమీకృత భోజనం తీసుకోవడం మరో మార్గం. ఇది జీర్ణక్రియను నెమ్మదింపజేసి, శరీరానికి స్థిరంగా శక్తి అందేలా చేస్తుంది. ఆరోగ్యకరమైన బరువును కొనసాగించడంలోనూ సహాయపడుతుంది.
అయితే, ప్రతి ఒక్కరి శరీరం ఆహారానికి ఒకే విధంగా స్పందించదు. నిద్ర, ఒత్తిడి, శారీరక చురుకుదనం, తీసుకునే ఆహారం వంటి అంశాలను బట్టి ఒకే వ్యక్తిలోనూ రక్తంలో చక్కెర స్థాయుల ప్రతిస్పందన మారవచ్చని బ్రౌన్ చెబుతున్నారు.
కొన్ని ఆహార నియమాలు సూచించినట్లుగా కార్బోహైడ్రేట్లను పూర్తిగా మానేయడం ప్రతికూల ఫలితాలను ఇవ్వవచ్చని గెస్ హెచ్చరిస్తున్నారు.
కొంతకాలం కార్బోహైడ్రేట్లను పరిమితం చేసిన తర్వాత వాటిని అధికంగా తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయులు సాధారణం కంటే ఎక్కువగా పెరగవచ్చు.
అంతేకాకుండా, ఆహారంలో కార్బోహైడ్రేట్లు కీలక భాగం. కొన్ని ఆహార వర్గాలను పరిమితం చేయడం వల్ల ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాలను కూడా అనవసరంగా దూరం చేసుకునే ప్రమాదం ఉందని గెస్ ఇటీవల నిర్వహించిన సమీక్షలో పేర్కొన్నారు.
గ్లూకోజ్ స్థాయులను నిరంతరం పర్యవేక్షించడం వల్ల కలిగే ప్రయోజనాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉన్నప్పటికీ, మనలో చాలామంది ఇప్పటికే అవసరానికి మించి అదనపు చక్కెరను తీసుకుంటున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. దాన్ని తగ్గించుకోవడంపై దృష్టి పెట్టడం మాత్రం మన చేతుల్లోనే ఉంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























