మగవాడి శరీరంలో గర్భాశయం ఎందుకుంది ? మెడికల్ సైన్స్‌లో అరుదైన ఓ కేసులో ఏం జరిగింది?

పురుషుడు, గర్భాశయం, ఫెలోపియన్ ట్యూబ్, వైద్య పరీక్షలు
ఫొటో క్యాప్షన్, ది ల్లీలో 26 ఏళ్ల యువకుడి శరీరంలో గర్భాశయం, ఫెలోపియన్ ట్యూబ్‌ ఉన్నట్లు గుర్తించారు. (ప్రతీకాత్మక చిత్రం)
    • రచయిత, సుమన్‌దీప్ కౌర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

పెళ్లై రెండేళ్లయినా పిల్లలు కలగకపోవడంతో దిల్లీకి చెందిన 26 యువకుడు డాక్టర్‌ను సంప్రదించారు. పరీక్షించిన వైద్యులు.. ఆయన శరీరంలో గర్భాశయం, ఫెలోపియన్ ట్యూబ్స్ ఉన్నట్లు గుర్తించి ఆశ్చర్యపోయారు.

అయితే, బాహ్యంగా ఆ వ్యక్తి శరీరం సాధారణ పురుషుడిలాగే ఉందని, పురుష లక్షణాలన్నీ ఆయనలో ఉన్నాయని చికిత్స చేసిన వైద్యులు తెలిపారు. ఈ పరిస్థితిని సూచించే ఎలాంటి స్పష్టమైన లక్షణాలు కూడా ఆయనలో కనిపించలేదని వారు వెల్లడించారు.

ఇన్‌ఫెర్టిలిటీ పరీక్షల సమయంలో ఆ యువకుడి శరీరంలో గర్భాశయం, ఫెలోపియన్ నాళాలు ఉన్నట్లు తేలిందని దిల్లీలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆ రోగికి చికిత్స అందించిన చీఫ్ యూరాలజిస్ట్ డాక్టర్ సుశీల్ ఖర్బందా చెప్పారు.

వైద్యుల ప్రకారం.. ఇది అత్యంత అరుదైన వైద్య పరిస్థితి. దీనిని 'పెర్సిస్టెంట్ ముల్లేరియన్ డక్ట్ సిండ్రోమ్' అని పిలుస్తారు.

ఇది పుట్టుకతోనే వచ్చే లోపం. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఇలాంటివి 300 కంటే తక్కువ కేసులు మాత్రమే నమోదయ్యాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

పీఎండీఎస్‌ సమస్య ఉన్న వ్యక్తిలో '46 XY' క్రోమోజోములు ఉంటాయి. వారి శరీరం సాధారణ పురుషుడిలాగే పెరుగుతుంది. కానీ గర్భాశయం, ఫెలోపియన్ ట్యూబ్‌ల వంటి ముల్లేరియన్ డక్ట్ నుండి అభివృద్ధి చెందే అవయవాలు మాత్రం శరీరంలోనే ఉండిపోతాయని 'నేచర్ రివ్యూస్ యూరాలజీ' అనే జర్నల్‌లో రాసిన ఓ రిపోర్ట్ చెబుతోంది.

2026 జనవరి నాటి 'గ్లోబల్ జర్నల్ ఆఫ్ సర్జరీ అండ్ కేస్ రిపోర్ట్స్' నివేదిక ప్రకారం తరచుగా మూత్ర విసర్జన కావడం, వీర్యంలో రక్తం పడటం వంటి సమస్యలతో బాధపడుతున్న ఒక 48 ఏళ్ల వ్యక్తికి సీటీ స్కాన్ చేయగా, ఆయనలో గర్భాశయం లాంటి నిర్మాణం కనిపించింది. సర్జరీ ద్వారా ప్రోస్టేట్ గ్రంథికి అతుక్కుని ఉన్న ఆ భాగాన్ని తొలగించారు.

పరీక్షల్లో అది గర్భాశయ కణజాలమేనని నిర్ధరణ అయింది. ఆయన శారీరక ఎదుగుదల కూడా సాధారణ పురుషుడిలాగే ఉంది.

2019లో వచ్చిన ఒక నివేదికలో ఏడాదిన్నర వయసున్న ఒక మగ బిడ్డ శరీరంలో గర్భాశయం, ఫెలోపియన్ నాళాలు, అండాశయాలు ఉన్నట్లు గుర్తించారు.

సాధారణ పురుష లక్షణాలు ఉన్న వ్యక్తిలో గర్భాశయం, ఫెలోపియన్ నాళాలు ఎలా ఉంటాయి? ఈ సమస్య ఎందుకు వస్తుంది? దీనిని ఎలా గుర్తిస్తారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి రోగికి చికిత్స చేసిన డాక్టర్ సుశీల్ ఖర్బందాతో బీబీసీ మాట్లాడింది.

పురుషుడు, గర్భాశయం, ఫెలోపియన్ ట్యూబ్, వైద్య పరీక్షలు
ఫొటో క్యాప్షన్, యూరాలజిస్ట్ డాక్టర్ సుశీల్ ఖర్బందా

ప్రశ్న: ఈ కేసులో ఏం గుర్తించారు? దీనిని వైద్య పరిభాషలో ఎలా వివరిస్తారు?

జవాబు: ఆ 26 ఏళ్ల యువకుడికి రెండేళ్ల కిందట పెళ్లయింది. అతను సాధారణ శృంగార జీవితాన్ని గడుపుతున్నాడు. పురుషులలో ఉండే సెకండరీ సెక్సువల్ లక్షణాలన్నీ అతనిలో ఉన్నాయి.

అయితే ఇన్‌ఫెర్టిలిటీ సమస్యకు సంబంధించి పరీక్షలు చేసినప్పుడు, అతని రెండు వృషణాలు సాధారణంగా ఉండాల్సిన స్థానంలో లేవని తేలింది.

హార్మోన్ పరీక్షల్లో టెస్టోస్టెరాన్, ఎఫ్‌ఎస్‌హెచ్, ఎల్‌హెచ్ స్థాయిలు సాధారణంగానే ఉన్నాయి. వృషణాలు కడుపులోనే ఉండిపోయే 'క్రిప్టార్కిడిజం' ఉన్న రోగులలో కూడా ఇలాంటి ఫలితాలే కనిపిస్తాయి.

కానీ, ఎంఆర్ఐ స్కాన్ చేసినప్పుడు ఒక వింతైన విషయం వెలుగుచూసింది. అతని శరీరంలో గర్భాశయం, ఫెలోపియన్ నాళాలు ఉన్నాయని అవి వృషణాలకు అనుసంధానమై ఉన్నట్లు స్కానింగ్‌లో తేలింది.

సాధారణంగా ఒక మహిళ శరీరంలో ఇవి ఎంతగా అభివృద్ధి చెందుతాయో, అతనిలోనూ అలాగే ఉన్నాయి.

ప్రశ్న: ఒక పురుషుడి శరీరంలో గర్భాశయం, ఫెలోపియన్ నాళాలు ఎలా ఉంటాయి? ఇది పుట్టుకతో వచ్చే సమస్యేనా?

జవాబు: అవును, ఇది పుట్టుకతో వచ్చే సమస్య. తల్లి గర్భంలో శిశువు పెరుగుతున్నప్పుడు, క్రోమోజోములు, హార్మోన్ల ప్రభావంతో లింగ నిర్ధరణ జరుగుతుంది.

సాధారణంగా పురుషులకు 46XY క్రోమోజోములు, స్త్రీలకు 46XX క్రోమోజోములు ఉంటాయి.

గర్భంలో శిశువు ఉన్న సమయంలో మగ శిశువుల శరీరం 'యాంటీ-ముల్లేరియన్ హార్మోన్'ను ఉత్పత్తి చేస్తుంది.

ఈ హార్మోన్.. మగవారి శరీరంలో అవసరం లేని స్త్రీ పునరుత్పత్తి అవయవాలు (గర్భాశయం వంటివి) పెరగకుండా అడ్డుకుంటుంది.

కానీ పీఎండీఎస్ సమస్య ఉన్నవారిలో ఈ హార్మోన్ లోపిస్తుంది లేదా దాని రిసెప్టర్లు సరిగ్గా పనిచేయవు.

దీనివల్ల మగపిల్లాడిగా ఎదుగుతున్నప్పటికీ, లోపల గర్భాశయం, ఫెలోపియన్ నాళాలు అలాగే ఉండిపోతాయి.

అయితే పురుషాంగం, ఇతర మగ శారీరక లక్షణాలు సాధారణంగానే అభివృద్ధి చెందుతాయి.

పురుషుడు, గర్భాశయం, ఫెలోపియన్ ట్యూబ్, వైద్య పరీక్షలు
ఫొటో క్యాప్షన్, శిశువు గర్భంలో ఉన్నప్పుడు, క్రోమోజోములు, హార్మోన్ల ప్రభావం వల్ల దాని లింగం నిర్ధారితమవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)

ప్రశ్న: ఈ రోగిలో వృషణాలతో పాటు అండాశయాలు కూడా ఉన్నాయా?

జవాబు: ఈ రోగిలో గర్భాశయం, ఫెలోపియన్ నాళాలు రెండు వైపులా ఉన్నాయి కానీ అండాశయాలు లేవు. అండాశయాలకు బదులుగా వృషణాలు మాత్రమే ఉన్నాయి. అంటే అతని శరీరంలో ఉన్న గోనాడ్స్ పురుషులకు సంబంధించినవే.

ప్రశ్న: ఈ సమస్యను ముందుగా స్కానింగ్ లేదా ఇతర వైద్య పరీక్షల్లో గుర్తించలేమా?

జవాబు: ఈ రోగి మా వద్దకు వచ్చినప్పుడు అతని రెండు వృషణాలు కడుపులోనే ఉండిపోయాయి.

అందువల్ల హార్మోన్ పరీక్షలతో పాటు వీర్య పరీక్ష కూడా చేశాము. అందులో వీర్యకణాల సంఖ్య సున్నా అని తేలింది.

ఆ తర్వాత చేసిన ఎంఆర్ఐ పరీక్షలో గర్భాశయం, ఫెలోపియన్ నాళాలు వాటికి అతుక్కుని ఉన్న వృషణాలు కనిపించాయి.

అనంతరం చేసిన క్రోమోజోమ్ విశ్లేషణలో '46XY' క్రోమోజోములు ఉన్నట్లు తేలింది. ఈ వ్యాధి నిర్ధరణకు ఎంఆర్ఐ, క్రోమోజోమ్ పరీక్షలే ముఖ్యమైనవి. 26 ఏళ్ల వరకు ఈ సమస్య తెలియకుండా ఉండాల్సిన అవసరం లేదు.

ముందే సరైన సమయంలో స్కాన్ చేసి ఉంటే దీనిని త్వరగానే గుర్తించి ఉండవచ్చు.

రోగి కూడా తన వృషణాలు సాధారణ స్థానంలో లేవనే విషయాన్ని ముందుగా గమనించలేదు.

పురుషుడు, గర్భాశయం, ఫెలోపియన్ ట్యూబ్, వైద్య పరీక్షలు
ఫొటో క్యాప్షన్, దిల్లీకి చెందిన ఓ యువకుడిలో గర్భాశయం ఫెలోపియన్ ట్యూబ్‌లు ఉన్నాయికానీ అండాశయాలు లేవు. ( ప్రతీకాత్మక చిత్రం)

ప్రశ్న: ఈ వ్యాధికి ఏవైనా ప్రత్యేక లక్షణాలు ఉంటాయా?

జవాబు: ఈ పరిస్థితి వల్ల నొప్పి, వాంతులు లేదా జ్వరం వంటి ప్రత్యేక లక్షణాలు ఏవీ ఉండవు. వృషణాలు వాటి సాధారణ స్థానంలో లేకపోవడమే దీనికి ఉన్న ఏకైక సంకేతం.

ప్రశ్న: దీనివల్ల రోగి ఎలాంటి మానసిక సవాళ్లను ఎదుర్కొన్నారు?

జవాబు: తన శరీరంలో స్త్రీ అవయవాలు ఉన్నాయనే విషయం అకస్మాత్తుగా తెలియడంతో ఆ 26 ఏళ్ల యువకుడు తీవ్ర ఆందోళన, మానసిక ఒత్తిడికి గురయ్యాడు.

భవిష్యత్తు ఏమవుతుందోనని భయపడ్డాడు. మేము అతనికి చాలా సమయం కౌన్సెలింగ్ ఇచ్చాము.

ఇది కేవలం ఒక అరుదైన వైద్య పరిస్థితి మాత్రమేనని, దీనివల్ల జీవితం ఏమీ మారిపోదని వివరించాము.

లోపల ఉన్న ఆ అవయవాలు క్యాన్సర్‌గా మారే ప్రమాదం ఉన్నందున వాటిని తొలగించాల్సి వచ్చింది. సర్జరీ తర్వాత అతను సాధారణ జీవితం గడపవచ్చు.

పురుషుడు, గర్భాశయం, ఫెలోపియన్ ట్యూబ్, వైద్య పరీక్షలు
ఫొటో క్యాప్షన్, ఆ పురుషుడిలో గర్భాశయం, ఫెలోపియన్ ట్యూబ్‌లు పూర్తిగా అభివృద్ధి చెందకపోవడంతో గర్భం దాల్చడం సాధ్యపడలేదు. ( ప్రతీకాత్మక చిత్రం)

ప్రశ్న: ఇలాంటి కేసుల్లో సర్జరీ లేదా చికిత్స కచ్చితంగా అవసరమా?

జవాబు: ఈ రోగి విషయంలో సర్జరీ తప్పనిసరైంది. ఎందుకంటే అతని శరీరంలో ఉన్న గర్భాశయం, ఫెలోపియన్ నాళాలు పూర్తిస్థాయిలో పనిచేసేవి కావు. వాటి వల్ల ఉపయోగం లేదు. పైగా సర్జరీ తర్వాత చేసిన బయాప్సీ పరీక్షలో, ఒక వృషణంలో క్యాన్సర్‌కు ముందు వచ్చే కణాల మార్పులు కనిపించాయి. అందువల్ల ఆ అవయవాలను తొలగించడం తప్పనిసరైంది.

ప్రశ్న: ఈ సర్జరీ వల్ల రోగి ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుంది? భవిష్యత్తు ఎలా ఉంటుంది?

జవాబు: ఆపరేషన్ జరిగిన ఏడు రోజులకే రోగి తిరిగి తన ఉద్యోగానికి వెళ్లాడు. వృషణాలను తొలగించినందున, అతని శరీరంలో సహజంగా టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తి కాదు. కాబట్టి, అతను ప్రతి మూడు నెలలకు ఒకసారి టెస్టోస్టెరాన్ ఇంజెక్షన్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఇది మినహా అతని లైంగిక లేదా సామాజిక జీవితంలో ఎలాంటి పెద్ద మార్పులు ఉండవు. మేము ఈ సర్జరీని లాపరోస్కోపీ ద్వారా చేయడం వల్ల పెద్ద కోతలు లేకుండా, త్వరగా కోలుకున్నాడు.

ప్రశ్న: ఇలాంటి విషయాలపై ప్రజల్లో ఎలాంటి అపోహలు ఉన్నాయి?

జవాబు: ఈ కేసు గురించి బయటకు తెలియగానే ఆ వ్యక్తి గర్భం దాల్చగలడా? అతనికి పీరియడ్స్ వస్తాయా? లేదా అతను బయటకు చూడటానికి స్త్రీలా కనిపిస్తాడా? వంటి ప్రశ్నలు చాలామందిలో తలెత్తుతున్నాయి. కానీ వీటిలో ఏదీ నిజం కాదు. అతనిలో గర్భాశయం ఉన్నప్పటికీ అది సరిగ్గా అభివృద్ధి చెందలేదు కాబట్టి గర్భం దాల్చడం అసాధ్యం. అలాగే అతని శరీరంలో స్త్రీలకు ఉండే హార్మోన్ల సమతుల్యత లేదు. బాహ్యంగా అతను పూర్తి పురుషుడే.

ప్రశ్న: ఈ కేసు ద్వారా వైద్య ప్రపంచానికి అందుతున్న ముఖ్యమైన సందేశం ఏమిటి?

జవాబు: శరీరంలో ఎలాంటి అసాధారణ మార్పులు కనిపించినా నిర్లక్ష్యం చేయకూడదని, సిగ్గుపడకూడదని ఈ కేసు మనకు నేర్పుతోంది. వెంటనే నిపుణులైన వైద్యులను సంప్రదించాలి. నవజాత శిశువులలో ఏవైనా శారీరక లోపాలు లేదా అవయవాలు లేకపోవడం గమనిస్తే.. వెంటనే వైద్య సలహా తీసుకోవాలి. ముందే గుర్తిస్తే ఇలాంటి సమస్యలను సులభంగా పరిష్కరించవచ్చు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)