‘కాపలా కీలు’: మీ అనారోగ్యాన్ని ముందే చెప్పే మణికట్టు గురించి 7 ముఖ్యమైన విషయాలు

మణికట్టు ఆరోగ్యం
ఫొటో క్యాప్షన్, మణికట్టు ఆరోగ్యంపై చిన్న వయసునుంచే శ్రద్ధ వహించాలని నిపుణులు చెబుతున్నారు
    • రచయిత, డేవిడ్ కాక్స్
  • ప్రచురణ
  • చదివే సమయం: 7 నిమిషాలు

ఆధునిక జీవనశైలి మన మణికట్టును దెబ్బతీస్తోంది. దీని నివారణకు మనమంతా ఏదో ఒకటి చేయాలి. చిన్న వయసు నుంచే జాగ్రత్త పడటం ఇందుకు సాయపడుతుంది.

ఈ సమస్య నాకో చిన్న నొప్పితో మొదలైంది. కేవలం ఒకే ఒక్క వేసవి కాలంలో అది ఎంత తీవ్రరూపం దాల్చిందంటే టెన్నిస్ రాకెట్‌తో బంతిని కొట్టినా, లేదా కనీసం ఒక తలుపు తీయడానికి ప్రయత్నించినా నా ఎడమ చేతిలో తీవ్రమైన నొప్పి పుట్టి, చేయి జివ్వుమనేది.

అప్పటికి నా వయసు 18 ఏళ్లు. నా జీవితంలో పోటీ తత్వంతో టెన్నిస్ ఆడటం ఓ ముఖ్యమైన భాగం. కానీ, ఆ సమయంలో నాకు గాయమైంది. ఇన్నేళ్లయినా అది నన్ను వెంటాడుతూనే ఉంది. ఇప్పుడు, దాదాపు రెండు దశాబ్దాల తర్వాత, ఆ పాత గాయం వల్ల నా మణికట్టుకు కీళ్లవాతం (ఆర్థరైటిస్) వచ్చే ప్రమాదం పెరిగింది. మధ్య వయస్సులో లేదా ఆపై వయస్సు వారిలో ఇలాంటి సమస్యలు రావడం సాధారణమే.

మన మణికట్టుకు అద్భుతమైన అనుకూలత ఉంది. ప్రపంచ రికార్డు అయిన 2,422 కిలోల (5,339 పౌండ్ల) భారీ బరువును ఎత్తేంత బలం, రాకెట్ స్పోర్ట్స్‌లో ఊహించని దిశల్లో వచ్చే బంతులను తిప్పికొట్టేంత వెసులుబాటు, అలాగే చిత్రలేఖనం లాంటి పనులను సునాయాసంగా చేయగలిగే చక్కటి నియంత్రణ దీని సొంతం.

కీబోర్డ్‌పై టైప్ చేయడం నుంచి కాఫీ కప్పు పట్టుకోవడం వరకు, మన నిత్య జీవితంలో మణికట్టు పాత్ర ఎంతో కీలకమైంది. అలాగే ఇది చాలా త్వరగా దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది. అందుకే మనం అనుకున్నదానికంటే చాలా ముందుగానే దీని ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. భవిష్యత్తులో కూడా మన మణికట్టు ఎలాంటి నొప్పులు లేకుండా ఆరోగ్యంగా ఉండేలా ఎలా కాపాడుకోవాలో తెలుసుకుందాం

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

1. సున్నితం, సమతుల్యం

మణికట్టును మనం ఒక కీలుపైనే ఉందనుకుంటాం. కానీ నిజానికిది అనేక చిన్న కీళ్లతో కూడిన సంక్లిష్ట నిర్మాణం. ఇవి కార్పల్ బోన్స్‌గా అందరికీ తెలిసిన 8 చిన్న ఎముకలు, ముంజేయిలోని రెండు పొడవైన ఎముకలు, అరచేతిలోని ఐదు మెటాకార్పల్ ఎముకల మూల భాగాలను కలిగి ఉంటాయి.

‘‘మణికట్టులోని ప్రతి లిగమెంట్, దానిని ముంజేయి ఎముకలకు అనుసంధానించే ప్రతి ఎముక ఎంతో సున్నితంగా, సమతుల్యంగా ఉంటుంది’’ అని సౌత్ ఫ్లోరిడా యూనివర్శిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆండ్రూ అబాడీర్ తెలిపారు. "ఆ సమతుల్యత దెబ్బతిన్నప్పుడే మణికట్టులో కీళ్లవాతం అభివృద్ధి చెందడం ప్రారంభమవుతుంది" అని చెప్పారు.

గాయాలు,పెరుగుతున్న వయో ప్రభావాలు కలిసి ఈ సున్నిత సమతుల్యతను దెబ్బతీయచ్చు

మణికట్టు ఆరోగ్యం, జాగ్రత్తలు
ఫొటో క్యాప్షన్, కీబోర్డ్‌పై టైప్ చేయడం నుంచి కాఫీ కప్పు పట్టుకోవడం వరకు, మన నిత్య జీవితంలో మణికట్టు పాత్ర ఎంతో కీలకమైంది.

2. మణికట్టు ముందే చెబుతుంది

మణికట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ద్వారా కీళ్లవాతాన్ని దూరం పెట్టొచ్చు. కీళ్లవాతంలో అనేక రకాలు ఉన్నాయి. సాధారణంగా మణికట్టులో రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్ లేదా పోస్ట్ ట్రమాటిక్ ఆర్థరైటిస్‌ కనిపించవచ్చు. మణికట్టులోని చిన్న ఎముకల మధ్య ఉండే మృదులాస్థి దెబ్బతిన్నప్పుడు, లేదా ఎముకలు తమ సహజ అమరికను కోల్పోయినప్పుడు ఈ మూడింటిలో చివరి రెండు రకాల కీళ్లవాతాలు సోకుతాయి.

మణికట్టులోని ఎముకలు,లిగమెంట్‌కు గతంలో తగిలిన గాయాల దీర్ఘకాలిక ప్రభావాలు, అలాగే చేతులతో పదేపదే చేసే పనుల వల్ల కొనసాగే వాపుకూడా ఈ సమస్యలకు కారణమవుతాయి.

చేతిని పదే పదే మెలితిప్పడం, లేదా జారిపడినప్పుడు నిలదొక్కుకోవడానికి చేతిని ఆలంబనగా చేసుకోవడం వల్ల మణికట్టు చాలా తేలికగా గాయపడుతుందని లుండ్ విశ్వవిద్యాలయంలో గాయాల పాలైన మణికట్టు పూర్వస్థితిని పునరుద్ధరించే పరిశోధన చేస్తున్నసారా లార్సన్స్‌ చెప్పారు. " చిన్న వయసులో గాయాలు అవుతుంటాయి. అప్పుడు ఎలాంటి ఇబ్బంది అనిపించకపోవచ్చు. కానీ 20 ఏళ్ల తర్వాత సమస్య మొదలవుతుంది. ఇది చాలా మందిలో గమనించాను" అని ఆమె వివరించారు.

అమెరికాలో ప్రతి ఏడుగురిలో ఒకరు మణికట్టు కీళ్లవాతంతో బాధపడుతున్నారు. ఇది ప్రారంభంలో తీవ్రంగా అనిపించదు. కానీ రానురాను బట్టలు వేసుకోవడానికి, తినడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు. ఇది మానసిక ఒత్తిడికి దారి తీయవచ్చు.

మణికట్టును "కాపలా కీలు"గా అబాడీర్ అభివర్ణిస్తున్నారు. అంటే శరీరంలోని మిగతా భాగాల్లో ఆరోగ్యం క్షీణిస్తున్న సంకేతాలు మణికట్టు ద్వారా తెలుస్తాయని ఆయన చెబుతున్నారు. రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో బాధపడే రోగుల్లో సగం మందికి శరీరంలోని ఇతర కీళ్లకు వ్యాధి వ్యాపించక ముందే కొన్ని సంకేతాలు మణికట్టులో కనిపిస్తాయి .మన మెదుడులోని మోటార్ కార్టెక్స్‌లో ఉండే హోముంక్యులస్ అనే మ్యాపింగ్ ప్రాంతమే మన చేతులు, మణికట్టు, వేళ్లను అత్యధికంగా నియంత్రిస్తుంది. అందుకే గ్రిప్‌స్ట్రెంత్ మెదడు ఆరోగ్యాన్ని, ప్రజ్ఞా పాటవాన్ని ప్రభావితం చేస్తుంది.

మణికట్టు బలంగా ఉండి , మంచి పటుత్వ బలం కలిగిన వారు 60 ఏళ్లు వచ్చిన తర్వాత కూడా ఆరోగ్యంగా ఉంటారు. అలాంటి వారు తరచూ తూలిపడటం, ఎముకలు విరిగిపోవడం, ఆస్టియోపోరోసిస్‌ వంటి సమస్యలకు గురికారు. వృద్ధాప్యంలో కూడా వారు తమ పనులను తామే చేసుకోగలరు.

మణికట్టు ఆరోగ్యం
ఫొటో క్యాప్షన్, మణికట్టు బలంగా ఉండి , మంచి పటుత్వ బలం కలిగిన వారు 60 ఏళ్లు వచ్చిన తర్వాత కూడా ఆరోగ్యంగా ఉంటారు.

3. మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవడం ఎలా?

ఆహారంలో కొన్ని మార్పులు చేస్తే ఆస్టియోపోరోసిస్‌కు దూరంగా ఉండవచ్చంటూ న్యూయార్క్‌లోని మౌంట్ సినాయ్‌లోని ఇకాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో ఆర్దోపెడిక్ సర్జన్ జెహాన్ కిమ్ కొన్ని సూచనలు చేశారు.

ఎక్కువ కాల్షియం ఉన్న ఆహారం, మినరల్స్, చిన్న ముల్లుగల చేపలు, డెయిరీ ఉత్పత్తులను తీసుకోవడం ద్వారా ఈ సమస్యను నిరోధించవచ్చని చెప్పారు.

శరీరంలో అదనపు కొవ్వు మణికట్టు కీలుకు సంబంధించిన సహజ సమతుల్యతను దెబ్బ తీస్తుందని, ఈ అదనపు కొవ్వు పేరుకుపోకుండా చూసుకోవాలని తెలిపారు.

ఇంట్లో కొన్ని సులభమైన వర్కౌట్స్‌ చేసుకుంటే మణికట్టు ఆరోగ్యం బాగుండటమే కాకుండా, సమస్యలు కూడా తగ్గించుకోవచ్చని లార్సన్ చెబుతున్నారు.

4. భుజ కండరాల బలాన్ని పెంచుకోండి

భుజాల కండరాలను డెల్టాయిడ్స్ అంటారు. మణికట్టుతో వీటికి సంబంధం లేనట్టుగా అనిపించవచ్చు. కానీ మీ చేతి కండరాలను బలోపేతం చేసుకోవడం వల్ల మణికట్టుకు ప్రయోజనం చేకూరుతుందంటారు లార్సన్ . భుజం నుంచి మణికట్టు వరకు అన్నీ ఒక గొలుసులా పని చేస్తాయి.

"ఏదైనా పని చేయాలి అంటే మీరు కేవలం ఒక మణికట్టునే కాకుండా మొత్తం చేతిని ఉపయోగిస్తారు. " అని లార్సన్ పేర్కొన్నారు. "మీ భుజాలు బలహీనంగా ఉంటే దాని ప్రభావం మణికట్టుపై పడుతుంది. అందుకే మీరు భుజ కండరాల బలాన్ని పెంచుకుంటే, మీ మణికట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు"

భుజ కండరాలను బలోపేతం చేయడానికి చేతిని ఒకవైపు చాచి నిటారుగా నిలబడాలి. ఆ సమయంలో మీ చేయిని నిటారుగానైనా, కాస్త వాలుగానైనా ఉంచండి. మెల్లిగా మీ చేయిని పైకప్పు వైపు తీసుకురావాలి, తర్వాత మెల్లిగా కిందికి దించాలి. ఇలా పది సెట్‌లు చేయాలి.

మణికట్టు
ఫొటో క్యాప్షన్, పట్టు బలోపేతం (గ్రిప్ స్ట్రెంతనింగ్) చేసే వ్యాయామాలు మీ మణికట్టు పనితీరును మెరుగుపరుస్తాయి.

5.మణికట్టు పట్టు బిగించండి

పట్టు బలోపేతం (గ్రిప్ స్ట్రెంతనింగ్) చేసే వ్యాయామాలు మీ మణికట్టు పనితీరును మెరుగుపరుస్తాయి. దీని కోసం ఫ్లెక్సర్స్, ఎక్స్‌టెన్సర్స్ అని పిలిచే మోచేతి కండరాలకు కండిషనింగ్ చేయాలి. ఇప్పటకే మణికట్టు సమస్యలతో బాధపడే వారికి కూడా ఈ వ్యాయామాలు చాలా ఉపయోగపడుతున్నాయని చాలా పరిశోధనలు చెప్పాయి. "మీ మోచేతి కండరాలన్నీ మీ మణికట్టుకు ఇరువైపులా పుల్లీ సిస్టమ్‌లా అనుసంధానించి ఉంటాయి" అని అబాడీర్ తెలిపారు.

దీని కోసం మీరు హ్యాండ్ థెరపీ బాల్ లేదా థెరప్యూటిక్ పుట్టీ లేదా, టెన్నిస్ బాల్‌నైనా వాడుకోవచ్చు .

ముందుగా బాల్ కానీ, పుట్టీ కానీ మీ అరచేతిలోకి తీసుకొని పది సెకన్లు గట్టిగా ఒత్తి పట్టుకోవాలి. తర్వాత పట్టు వదిలి ఐదు సెకన్ల పాటు వేళ్లకు విశ్రాంతి ఇవ్వాలి. తర్వాత మళ్లీ పది సెకన్లు ఒత్తూ పట్టుకోవాలి. మళ్లీ ఐదు సెకన్లు విశ్రాంతి ఇవ్వాలి. ఇలా పది సెట్స్ రెండు చేతులతో చేయాలి.

6. మణికట్టు - భారం వద్దు

కిమ్ ప్రకారం, మణికట్టుపై ఒత్తిడి తగ్గించే మరో వ్యాయామం ఏమిటంటే.. నెమ్మదిగా మణికట్టుపై బరువు పెంచుతూ మడవాలి, చాచాలి.

దీని వల్ల కూడా మణికట్టులోని ఎముకలు బలోపేతం అవుతాయి. దీర్ఘకాలంలో వచ్చే అనారోగ్యాలకు దూరంగా ఉండవచ్చు. ఆస్టియోపీనియా అని పిలిచే ఒక రకమైన ఆస్టియో పోరోసిస్ లాంటి రోగాల బారిన పడకుండా జాగ్రత్తపడవచ్చు. " వాటిపై భారం పడినప్పుడు బలపడతాయి. మరింత శక్తిమంతగా పునర్నిర్మాణం చెందుతాయి. ఎముకల వ్యవస్థకు కూడా కొత్త శక్తిని ఇస్తాయి. అని అబాడీర్ చెప్పారు.

దీనికి ముందు మీ మోచేతిని టేబుల్‌పై ఉంచండి. తర్వాత టేబుల్ అంచు నుంచి మీ చేతిని వేలాడదీయండి. చేతిలో ఒకటిన్నర నుంచి మూడు కేజీల బరువును పెట్టండి. అనంతరం మీ మణికట్టుతోనే ఆ బరువు మీ వైపు తీసుకురావాలి. మళ్లీ కిందికి వదలాలి.

మీ వద్ద ఆ స్థాయిలో బరువైన వస్తువులు లేకపోతే సాగే రబ్బర్‌ బ్యాండ్‌ను ఈ వ్యాయామానికి ఉపయోగించుకోవచ్చని లార్సన్ సలహా ఇస్తున్నారు. బ్యాండ్‌ను ఒక చివర టేబుల్ కాలి కింద పెట్టి మరో చివరను చేతితో పట్టుకొని వ్యాయామం చేయవచ్చు. ఇలా చేస్తున్నప్పుడు బరువు ఎత్తుతున్న అనుభవం మీకు కలుగుతుంది.

ఇలా మణికట్టును మడవడం, వదలడం పది సెట్స్ చేయాలి. " మీరు టైపింగ్, రైటింగ్ ఎక్కువ చేస్తున్నట్టు అయితే ఈ వ్యాయామం మీ మణికట్టు కీళ్లకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది," అని కిమ్ అన్నారు.

మణికట్టు ఆరోగ్యం
ఫొటో క్యాప్షన్, శరీరంలో అదనపు కొవ్వు మణికట్టు కీలుకు సంబంధించిన సహజ సమతుల్యతను దెబ్బ తీస్తుందని,

7. సుపినేషన్, ప్రొనేషన్ కదలికలు

చివరిగా సుపినేషన్, ప్రోనేషన్ వ్యాయామాలు కూడా ఉన్నాయి. ఇవి మణికట్టుతోపాటు మొత్తం వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి. ఫ్లెక్సన్-ఎక్స్‌టెన్షన్ మాదిరిగానే వీటిని కూడా టేబుల్‌పై బరువులు లేదా రెసిస్టెన్స్ బ్యాండ్ సహాయంతో చేయవచ్చు.

మీ బొటనవేలు పైకి ఉండేలా టేబుల్‌పై మీ చేయిని ఉంచండి. తర్వాత మీ అరచేయి టేబుల్‌కు ఆనుకునేలా మణికట్టును తిప్పండి. తర్వాత సాధారణ స్థితికి తీసుకురండి. మళ్లీ అరచేయి పైకి కనిపించేలా మణికట్టును వ్యతిరేక దిశగా తిప్పండి. ఇలా పది సెట్స్ చేయండి.

ల్యాప్‌టాప్, ఫోన్‌తోనే ఎక్కువ కాలం గడుపుతున్నందున మన చేయి ఎక్కువ సమయం ఒకే పొజిషన్‌లో ఉంటోందని, దీనినే ప్రోనేటెడ్ వరల్డ్‌గా అబాడీర్ వర్ణించారు.

మణికట్టు ఆరోగ్యాన్ని మనం తేలిగ్గా తీసుకుంటాం. అయితే ఏదైనా మనం కోల్పోయినప్పుడే దాని విలువను తెలుసు కోగలుగుతామని,నా మణికట్టు చాలా కాలంగా పని చేయడం మానేసినప్పుడు గుర్తించాను.

(ఈ కథనం కేవలం అవగాహన కోసమే. వైద్యుల సలహాలకు ప్రత్యామ్నాయంగా భావించరాదు)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)