తెలంగాణలో కాలేజీ అడ్మిషన్లలో 2 శాతం స్పోర్ట్స్ కోటా.. ‘బీబీసీ తెలుగు’ చర్చాకార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ క్రీడా సలహాదారు జితేందర్ రెడ్డి వెల్లడి

రూపా ఝా, జితేందర్ రెడ్డి
ప్రచురణ
చదివే సమయం: 8 నిమిషాలు

తెలంగాణలో స్కూల్ స్థాయిలో క్రీడలకు ప్రోత్సాహమిచ్చేందుకు, టెన్త్, 12వ తరగతి తర్వాత కాలేజీ అడ్మిషన్ల విషయంలో స్పోర్ట్స్ కోటాలో రెండు శాతం కేటాయించనున్నట్లు క్రీడల వ్యవహారాలపై తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, తెలంగాణ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు, దిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి వెల్లడించారు.

2036లో భారత్‌లో ఒలింపిక్స్ ఆతిధ్యం ఇవ్వడానికి చేస్తున్న ప్రయత్నాల్లో తెలంగాణను కూడా భాగస్వామిని చెయ్యాలన్న ఆలోచనతో ముందుకెళ్తున్నామని ఆయన తెలిపారు.

భారత క్రీడారంగంలో పెరుగుతున్న మహిళా భాగస్వామ్యంపై జులై 10న హైదరాబాద్‌లోని సెయింట్ జోసెఫ్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్‌లో బీబీసీ న్యూస్ తెలుగు, కలెక్టివ్ న్యూస్‌రూం సంయుక్తంగా ఓ చర్చను నిర్వహించాయి.

బీబీసీ న్యూస్ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ నిర్వహించిన ఈ చర్చలో జితేందర్ రెడ్డితో పాటు ప్రపంచ పారా బ్యాడ్మింటన్ ఛాంపియన్ మానసి జోషి, స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అథ్లెటిక్స్ కోచ్ మృదుల కోరాడ, బాడీ బిల్డర్, ఫిట్నెస్ ట్రైనర్ కిరణ్ డెంబ్లా పాల్గొన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
Rupa Jha
ఫొటో క్యాప్షన్, భారత క్రీడారంగంలో హైదరాబాద్‌, తెలంగాణకు ప్రత్యేక స్థానం ఉందని రూపా ఝా చెప్పారు.

భారత క్రీడారంగంలో తెలంగాణకు ప్రత్యేక స్థానం: కలెక్టివ్ న్యూస్ రూమ్ సీఈఓ రూపా ఝా

ఈ చర్చ ప్రారంభానికి ముందు కలెక్టివ్ న్యూస్‌‌రూమ్ సీఈఓ, ఎడిటర్ ఇన్ చీఫ్ రూపా ఝా మాట్లాడుతూ బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమెన్ ఆఫ్ ది ఇయర్‌ను ప్రారంభించడం వెనక ఉద్దేశాన్ని, మహిళా క్రీడల పట్ల బీబీసీ, కలెక్టివ్ న్యూస్‌‌రూమ్‌ల నిబద్ధతను మరోసారి ప్రస్తావించారు.

"భారత్‌లో మహిళా క్రీడాకారులను స్పాట్‌లైట్ లోకి తీసుకురావాలన్న పూర్తి నిబద్ధత, సంకల్పంతో బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఆరేళ్ల క్రితం తీసుకొచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా మహిళా క్రీడాకారుల కోసం బీబీసీ నిర్వహిస్తున్న ఏకైక అవార్డు కార్యక్రమం ఇది.

భారత్‌లో మహిళల గురించి మాట్లాడాల్సి వస్తే, వారు ఎలా హింసకు గురవుతున్నారో చర్చించేవాళ్లం. కానీ ఇప్పుడు భారతీయ మహిళలు క్రీడారంగంలో చాలా విజయాలు సాధిస్తున్నారు.

భారత క్రీడారంగంలో హైదరాబాద్‌కు, తెలంగాణకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రభుత్వాలు సరైన సౌకర్యాలను, క్రీడా వాతావరణాన్ని ఏర్పాటు చేసినప్పుడు దాని ఫలితాలు ఎలా ఉంటాయో చూపించింది.

ఆరేళ్ల కిందట మేం బీబీసీ స్పోర్ట్స్ వుమెన్ ఆఫ్ ది అవార్డ్ ప్రారంభించినప్పుడు ఒకటే ప్రశ్న వేసుకున్నాం. భారత్‌లో అమ్మాయిల్ని ఆటలు ఆడకుండా ఏది ఆపుతోంది అని. కానీ అప్పుడు అమ్మాయిలకు దూరంగా కనిపించిన క్రీడా అవకాశాలు ఇప్పుడు వారికి చేరువయ్యాయి" అన్నారు.

ఖుష్బూ సంధు
ఫొటో క్యాప్షన్, క్రీడల్లో మహిళల భాగస్వామ్యం గడిచిన కొన్నేళ్లలో గణనీయంగా వృద్ధి చెందుతోందని అధ్యయనంలో వెల్లడైంది.

14 రాష్ట్రాల్లో బీబీసీ అధ్యయనం

భారత క్రీడారంగంలో మహిళల భాగస్వామ్యం గడిచిన కొన్నేళ్లలో గణనీయంగా వృద్ధి చెందుతోందని బీబీసీ, కలెక్టివ్ న్యూస్ న్యూస్‌‌రూమ్ సంయుక్తంగా 14 రాష్ట్రాల్లో నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది.

ఈ సర్వే వివరాలను ఐస్వోటీ ప్రాజెక్ట్ లీడ్, బీబీసీ న్యూస్ పంజాబీ ఎడిటర్ ఖుష్బూ సంధు వెల్లడించారు.

"2020 నుంచి క్రికెట్ ఆడే భారతీయ మహిళల సంఖ్య రెట్టింపయ్యింది. అంతే కాదు.. దేశంలో క్రీడలు ఆడే ప్రతి పది మంది మహిళల్లో ఒకరు క్రికెట్ ఆడుతున్నారు. తెలంగాణ, ఏపీల్లో క్రికెట్ ఆడే మహిళల శాతం 8 నుంచి 16 శాతానికి రెట్టింపయ్యింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్యాడ్మింటన్ ఆడే మహిళల నిష్పత్తి 2020 నుంచి జనాభాలో 3 నుంచి 9 మూడు రెట్లు పెరిగింది అని ఈ అధ్యయనంలో తేలింది" అని ఆమె తెలిపారు.

బీబీసీ
ఫొటో క్యాప్షన్, ఒలింపిక్ ఈవెంట్లలో కొన్నిహైదరాబాద్‌లో నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని జితేందర్ రెడ్డి చెప్పారు.

క్రీడారంగంలో మహిళలకు మద్దతు: జితేందర్ రెడ్డి

అనంతరం నిర్వహించిన చర్చలో క్రీడల్లో మహిళల అవకాశాలు, సవాళ్లు, సమస్యలు, పరిష్కారాలు, ప్రభుత్వం తీసుకుంటున్న, తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

"తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు పెద్ద పీట వేస్తోంది. రాష్ట్రంలో ఉన్న 119 నియోజకవర్గాల్లో ఇండోర్ స్డేడియంల నిర్మాణం చేపడుతున్నాం. 2028 నాటికి ఇవన్నీ పూర్తి చేసి, ఖేలో ఇండియా గేమ్స్ తెలంగాణలో నిర్వహిస్తాం.

యూనివర్సిటీ స్థాయిలో క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నాం. క్రీడారంగంలో మహిళలకు కల్పించే సదుపాయాల్లో కానీ, వారి భద్రత విషయంలో కానీ తెలంగాణ ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో ఉంది.

2036లో భారత్‌లో ఒలింపిక్స్ ఆతిధ్యం ఇవ్వడానికి చేస్తున్న ప్రయత్నాల్లో తెలంగాణను కూడా భాగస్వామిని చెయ్యాలన్న ఆలోచనతో ముందుకెళ్తున్నాం. 2036లో అహ్మదాబాద్‌లో ఒలింపిక్ ఈవెంట్లు నిర్వహించేందుకు అనుమతులు వస్తే, ఆ ఈవెంట్లలో కొన్ని హైదరాబాద్‌లో నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం" అని జితేందర్ రెడ్డి తెలిపారు.

క్రీడల్లో మహిళలకు అదే అడ్డంకి: మానసి జోషి

పాఠశాల స్థాయి నుంచే క్రీడలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటోంది అని జీఎస్ రామ్మోహన్ ప్రశ్నించగా... స్కూల్ స్థాయిలో క్రీడలకు ప్రోత్సాహమిచ్చేందుకు, 10, 12వ తరగతి తర్వాత కాలేజీ అడ్మిషన్ల విషయంలో స్పోర్ట్స్ కోటాలో రెండు శాతం సీట్లను కేటాయిస్తామని జితేందర్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో క్రీడా రంగంలో మహిళలకు ప్రాధాన్యమిస్తున్నామని, భవిష్యత్తులో క్రీడా రంగంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉండబోతోందని అన్నారు.

మహిళలు క్రీడల్లో రాణించడానికి భద్రత, సౌకర్యాలు వంటివి పెద్ద అవరోధంగా ఉండేవని, కానీ ఇప్పుడు క్రీడా రంగంలో మౌలిక సదుపాయాలు మెరుగుపడ్డాయని పారా బ్యాడ్మింటన్ చాంపియన్ మానసి జోషి అభిప్రాయపడ్డారు.

నేను హైదరాబాద్‌లో ట్రైనింగ్ తీసుకోకపోతే ఈ స్థాయి క్రీడాకారిణి అయి ఉండేదాన్ని కాదు. అమ్మాయిలు క్రీడల్లోకి రాకపోవడానికి ఆర్థిక పరిస్థితులు కూడా అవరోధంగా ఉన్నాయి, అలాటి వారి కోసం ఆధునిక సౌకర్యాలు కల్పించాలి.

మహిళ క్రీడల విషయంలో మీడియా, ప్రభుత్వాల ఆలోచనా ధోరణి మారాలి" అని సూచించారు.

భారత క్రీడారంగంలో పెరుగుతున్న మహిళా భాగస్వామ్యంపై జులై 10న హైదరాబాద్‌లోని సెయింట్ జోసెఫ్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్‌లో బీబీసీ న్యూస్ తెలుసు, కలెక్టివ్ న్యూస్‌‌రూమ్ సంయుక్తంగా ఓ చర్చను నిర్వహించాయి.
ఫొటో క్యాప్షన్, శారీరక దారుఢ్యం కోసం ఆటలు ఆడాలని క్రీడాకారిణిలు సూచించారు.

"అప్పట్లో టాయిలెట్లు కూడా ఉండేవి కావు"

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అథ్లెటిక్స్ కోచ్, 2011 ఏషియన్ గేమ్స్ సిల్వర్ మెడలిస్ట్ మృదుల కోరాడ మాట్లాడుతూ ఒకప్పుడు రాష్ట్రంలో మహిళా క్రీడాకారులకు పెద్దగా సౌకర్యాలుండేవి కాదన్నారు. పదిహేనేళ్ల క్రితం తాను జింఖానా గ్రౌండ్‌లో ప్రాక్టీస్ చేసేటప్పుడు అక్కడ టాయిలెట్లు కూడా ఉండేవి కావన్నారు. మహిళా క్రీడాకారులు ప్రాక్టీస్ కోసం దుస్తులు మార్చుకోడానికి కూడా సౌకర్యాలు ఉండేవి కాదన్నారు. కానీ ఇప్పుడు సౌకర్యాలు మెరుగుపడ్డాయన్నారు.

క్రీడల్లో క్వాలిటీ పెరగాలంటే.. క్రీడాకారుల క్వాంటిటీ (సంఖ్య) కూడా పెరగాలన్నారు. క్రీడలు కేవలం పతకాల కోసమే కాకుండా, శారీరక దారుఢ్యం కోసం కూడా అన్నట్లుగా ప్రతి ఒక్కరూ భావించాలన్నారు.

కిరణ్ డెంబ్లా

"ఐయామ్ ది బెస్ట్ అనుకోవాలి"

బాడీ బిల్డర్ అండ్ ఫిట్నెస్ ట్రైనర్ కిరణ్ డెంబ్లా మాట్లాడుతూ... క్రీడల్లో మహిళలు రాణించడానికి ముందు కుటుంబ బాధ్యతలు, తల్లిగా ఉండే బాధ్యతలతో పాటు, సామాజిక ఇబ్బందులు కూడా అవరోధంగా ఉంటాయన్నారు. వాటిని అధిగమించాలని, ముఖ్యంగా బాడీ బిల్డింగ్ లాంటి క్రీడల్లో మహిళలు రాణించాలంటే.. చాలా ఇబ్బందులంటాయని, మహిళలకు సిక్స్ ప్యాక్ వంటివి బాగుండవన్న వ్యతిరేకతలు ఎక్కువగా వస్తాయని, వాటిని అధిగమించాలన్నారు. అన్నింటికన్నా ముందుగా 'ఐ యామ్ ద బెస్ట్' అన్న స్ఫూర్తితో ప్రతి నిత్యం ముందుకెళ్లాలన్నారు.

bbc survey

బీబీసీ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైన విషయాలివీ...

భారత్‌లోని 14 రాష్ట్రాలలో నిర్వహించిన ఓ కొత్త అధ్యయనంలో 2020 నుంచి క్రికెట్‌ ఆడే భారతీయ మహిళల సంఖ్య రెట్టింపైంది. దేశంలో క్రీడలు ఆడుతున్న 10 మంది మహిళల్లో ఒకరు క్రికెట్ ఆడుతున్నారు.

బీబీసీ,కలెక్టివ్ న్యూస్‌‌రూమ్ చేయించిన ఈ అధ్యయనంలో ప్రతి ఇద్దరిలో ఒకరు (51శాతం) గత ఆరునెలల్లో మహిళలకు సంబంధించిన క్రీడా వార్తలను, ప్రసారాలను చూశారు. ఇది పురుషుల క్రీడా వార్తా ప్రసారాలు చూసేవారితో (63శాతం) పోల్చితే మరీ తక్కువేం కాదు.

మహిళల క్రీడల్లో భాగస్వామ్యం, వాటిని వీక్షించే వారిలో యువతుల(15-24 ఏళ్లు)ది కీలక భూమిక.

ప్రతి నలుగురు యువతుల్లో ఒకరు (26శాతం) క్రీడలను కెరీర్ ఆప్షన్‌గా చూస్తున్నట్టు చెప్పారు. 2020లో ఇది 16 శాతంగా ఉంది.

భారతీయ క్రీడాకారిణులు గణనీయ విజయాలు సాధించిన సమయంలో ఈ అధ్యయనం వచ్చింది. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో షూటర్ మను బాకర్ చారిత్రక డబుల్ మెడల్‌ను గెలుచుకుంది. పారాలింపిక్స్‌లో పారా స్పోర్ట్స్ ఉమెన్ 10 బహుమతులు గెలుచుకున్నారు. 2025లో సొంతగడ్డపై జరిగిన వన్డే వరల్డ్ కప్‌ను మహిళల క్రికెట్ జట్టు గెలుచుకుంది. ఇవన్నీ గడిచిన కొన్ని సంవత్సరాలుగా పతాక శీర్షికలుగా నిలిచాయి.

ఈ విజయాల కథలు ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మహిళల క్రీడలను ప్రత్యక్ష ప్రసారంలో చూస్తామని అధ్యయనంలో పాల్గొన్నవారిలో 43శాతం చెప్పారు. పురుషుల క్రీడల విషయంలో ఇది 54శాతంగా ఉంది. ఆటలను ప్రత్యక్షంగా మైదానంలో చూసేవారి విషయంలో ఈ తేడా ఇంకా తక్కువగా ఉంది. మహిళల క్రీడలను స్డేడియంలో చూశామని 29శాతం చెప్పగా పురుషుల క్రీడలను స్టేడియంలో చూశామని 37శాతం మంది చెప్పారు.

ఈ విజయాలను స్ఫూర్తిగా తీసుకుని ఎక్కువమంది మహిళలు క్రికెట్, బ్యాడ్మింటన్ ఆడుతున్నారు.

భాగస్వామ్యం రీత్యా చూసినప్పడు మహిళలు, పురుషులు ఇద్దరూ క్రికెట్‌ను ఎక్కువగా ఎంచుకుంటున్నారని అధ్యయనంలో తేలింది. కిందటి అధ్యయనంతో పోలిస్తే ప్రస్తుతం మహిళలు పెద్ద ఎత్తున క్రికెట్ ఆడుతుండటంతో ఈ ఆటలో స్త్రీ,పురుష అంతరం తగ్గిపోయింది. 2020లో క్రికెట్ ఆడే మహిళలతో పోలిస్తే పురుషుల సంఖ్య ఐదురెట్లు ఎక్కువగా ఉంది. 2026 నాటికి ఈ తేడా మూడు రెట్ల వరకు తగ్గింది.

bbc survey

బ్యాడ్మింటన్‌కు మహిళల్లో పెరుగుతున్న ఆదరణ

క్రికెట్‌తో పాటు మహిళల్లో బ్యాడ్మింటన్‌కు ప్రాచుర్యం పెరిగింది. 2020లో 4 శాతం మహిళలు బ్యాడ్మింటన్ ఆడితే ఇప్పుడు వారి సంఖ్య 6 శాతానికి పెరిగింది.

దక్షిణ భారతంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తర భారతంలో పంజాబ్‌లో బ్యాడ్మింటన్ ఆడే మహిళల సంఖ్య పెరిగింది. ముఖ్యంగా ప్రసిద్ధ భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణులైన పీవీ సింధు, సైనా నెహ్వాల్, తన్వీ శర్మ ఈ ప్రాంతాలకు చెందినవారే.

ప్రజలు మహిళా క్రీడాకారిణులను కూడా తమలాంటివారిగానే భావించడంతో, క్రీడల్లో మహిళల భాగస్వామ్యం పెరగడం, వారి ఆటలను చూసే వారి సంఖ్య పెరగడంలో కీలకపాత్ర పోషిస్తోంది.

క్రీడా కార్యక్రమాలనుు చూడటానికి ఓ కారణం ''ఓ క్రీడాకారిణికి మద్దతివ్వడానికి'' అని సర్వేలో పాల్గొన్న మూడోవంతుమంది (33శాతం) చెప్పారు. 2020లో ఈ కారణం 21శాతంగా మాత్రమే ఉంది. ఓ ఆటగాడికి మద్దతుగా క్రీడాకార్యక్రమాలు చూస్తామని చెప్పే వారి సంఖ్య 17 శాతం మాత్రమే ఉంది.

ప్రత్యేకించి ఈ ఏడాది 'ఏ భారతీయ క్రీడాకారిణిని ఎక్కువమంది ప్రజలు ఇష్టపడుతున్నారు' అనే ప్రశ్నకు ప్రతి ఇద్దరి మహిళల్లో ఒకరు(51శాతం) సమాధానం చెప్పగలిగారు. 2020లో ఇదే ప్రశ్నకు సమాధానం ఇచ్చిన వారి సంఖ్యతో పోలిస్తే ఇప్పుడు 7 శాతం ఎక్కువ.

bbc survey

భద్రత విషయంలో మహిళల ఆందోళన

తాము ఏ ఆటనూ ఆడకపోవడానికి భద్రతాపరమైన ఆందోళనలే కారణమని సర్వేలో పాల్గొన్న 13 శాతం మంది మహిళలు చెప్పారు. సర్వే చేసిన రాష్ట్రాలతో కలిపి చూసినప్పుడు 3 కోట్ల27లక్షల మంది మహిళలు ఈ కారణంతో క్రీడల్లో పాల్గొనడంలేదని ఈ అధ్యయనం గుర్తించింది. గడచిన దశాబ్దంలో మహిళలపై లింగ ఆధారిత హింస పెరిగిందని వెల్లడైన రాష్ట్రాల్లో ఇది మరింత పెద్ద సమస్యగా ఉందని అధ్యయనం సూచించింది.

క్రీడల్లో మహిళల భాగస్వామ్యం, క్రీడలు చూసే మహిళల సంఖ్య పెరగడంతో పాటు మహిళల క్రీడలపై పత్రికూల భావాలు, మూసధోరణులు 2020లో నిర్వహించిన అధ్యయనంతో పోలిస్తే మరింత బలపడ్డాయని ఈ అధ్యయనంలో తేలింది.

పురుషుల క్రీడలతో పోలిస్తే మహిళల క్రీడలు అంత వినోదం కలిగించవని సర్వేలో పాల్గొన్న ప్రతి పదిమందిలో నలుగురు (43శాతం) చెప్పారు. 2020లో ఈ అభిప్రాయం 38శాతంగా ఉంది. మహిళాక్రీడాకారిణులు తగినంత ఆడతనంగా అనిపించరని చెప్పినవారి సంఖ్య 37 శాతం నుంచి 43శాతానికి పెరిగింది.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ అభిప్రాయాలు కేవలం మగవారికే పరిమితం కాలేదు. క్రీడాకారిణులు అందంగా కనిపించాలని దాదాపు ప్రతి ఇద్దరిలో ఒకరు(46శాతం) భావించారని, మగవారికన్నా మహిళలు ఎక్కువమంది ఈ అభిప్రాయాన్ని సమర్థించినట్టు అధ్యయనం గుర్తించింది.

క్రీడలు, మహిళలు, తెలంగాణ

'సమయం లేక ఆటలు వదిలేస్తున్నారు'

అటు పురుషులకు, ఇటు మహిళలకు ఆటలను వదిలేయడానికి అతిపెద్ద కారణం సమయం చిక్కకపోవడమే. క్రికెట్ ఆడేవారి సంఖ్య పెరిగినప్పటికీ మొత్తంగా ఆటలు ఆడే భారతీయుల సంఖ్య కొద్దిగా మాత్రమే పెరిగిందని అధ్యయనం గుర్తించింది. అన్ని క్రీడలను కలిపి చూసినప్పుడు భారతీయులు క్రీడల్లో పాల్గొనడం పెద్దగా పెరగలేదని అధ్యయనం తెలిపింది.

సమయం లేకపోవడం చాలామంది క్రమంగా ఆటల అలవాటును వదిలేస్తున్నారని అధ్యయన కర్తలు ఆందోళన వ్యక్తంచేశారు.

సర్వేలో పాల్గొన్నవారిలో తమ చిన్నప్పుడు ఆటలు ఆడామని 74శాతం చెప్పారు. 2020లో ఈ సంఖ్య 69శాతం మాత్రమే ఉంది. అయితే పిల్లలుగా ఉన్నప్పుడు ఆటలు ఆడామని చెప్పినవారిలో సగంమంది మాత్రమే పెద్దయ్యాక కూడా ఆటలు కొనసాగించామని చెప్పారు.

ఆటలు ఆడకపోవడానికి కారణమేమిటని అడిగితే సర్వేలో పాల్గొన్నవారిలో (65శాతం) సమయం లేకపోవడం వల్లే ఆటలు ఆడడం లేదని చెప్పారు. పనికి, వ్యక్తిగత జీవితానికి మధ్య సమతుల్యత తక్కువగా ఉండడమనే ఆందోళనకర ధోరణిని ప్రతిబింబిస్తోందని అధ్యయనం గుర్తించింది.

పని-వ్యక్తిగత జీవిత సమతుల్యత మెరుగుపడితే ఎక్కువగా ప్రయోజనం కలుగుతుందని అధ్యయనం తెలిపింది. ముఖ్యంగా మహిళలకు ఎందుకంటే '' మహిళలు ఉద్యోగాలతోపాటు ఇంటి పనులు, కుటుంబ సంరక్షణా బాధ్యతలను ఎక్కువగా భుజాన మోస్తుంటారు'' అని పేర్కొంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)