అందరినీ వద్దని బెదిరించిన ట్రంప్.. తాను మాత్రం రష్యా నుంచి డీజిల్ కొనే ఒప్పందం ఎందుకు చేసుకున్నారు?

ట్రంప్, జెలియెన్‌స్కీ, పుతిన్, చమురు, దిగుమతి
ఫొటో క్యాప్షన్, రష్యా దగ్గర ఆయిల్ కొనవద్దని ఒకప్పుడు ట్రంప్ ప్రపంచ దేశాలను హెచ్చరించారు.
    • రచయిత, మేడ్‌లైన్ హాల్పర్ట్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

ఇరాన్ యుద్ధం ప్రపంచ ఇంధన ధరలపై తీవ్ర ప్రభావం చూపుతున్న సమయంలో.. రష్యా నుంచి డీజిల్‌ను దిగుమతి చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రణాళికలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అమెరికాకు, ప్రపంచ మార్కెట్‌కు తక్షణమే 3,00,000 టన్నుల డీజిల్‌ను విడుదల చేయడానికి, ఆ తర్వాత మరికొన్ని షిప్‌మెంట్లను చేపట్టడానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అంగీకరించారని ట్రంప్ శుక్రవారం ప్రకటించారు.

కొన్ని వారాల కిందటే రష్యా చమురు, గ్యాస్ కొనుగోలు చేసే దేశాలపై సరికొత్త ఆంక్షలు, సుంకాలు విధించే చట్టంపై ట్రంప్ సంతకం చేశారు. ఈ చట్టంపై సంతకం చేసిన తర్వాత.. ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ ఒప్పందం అమెరికా చట్టాలను ఉల్లంఘిస్తుందని భావిస్తున్న కొంతమంది రిపబ్లికన్‌లు, డెమొక్రటిక్ చట్టసభ్యులు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు.

తొలి విడతగా 3 లక్షల టన్నుల డీజిల్‌ను విడుదల చేసి, ఆ తర్వాత.. నవంబర్‌లో 5 లక్షల టన్నులు, ఆ తర్వాత 10 లక్షల టన్నులను రష్యా సరఫరా చేస్తుందని ట్రంప్ పేర్కొన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ట్రంప్, జెలియెన్‌స్కీ, పుతిన్
ఫొటో క్యాప్షన్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో చమురు సరఫరా ఒప్పందం చేసుకున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్, తీవ్ర అసహనం వ్యక్తం చేసిన జెలియెన్‌స్కీ

‘పుతిన్‌కు బహుమతి లాంటిది’

దీని తర్వాత మరో 30 లక్షల టన్నుల డీజిల్ స్వల్ప వ్యవధిలోనే అందించనుంది. అయితే, ఇది ఆ దేశపు రిఫైనరీల పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది.

రష్యా-యుక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో భాగంగా యుక్రెయిన్ ఈ రిఫైనరీలపై దాడి చేసింది.

"అమెరికా ప్రజలకు, ముఖ్యంగా రైతులు, పశుపోషకులకు, ట్రక్ డ్రైవర్లకు ఇంధనం, ఇతర వస్తువులు తక్కువ ధరలకే అందుబాటులో ఉండేలా చేయడం నా లక్ష్యం" అని ట్రంప్ తన ట్రూత్‌ సోషల్‌లో పోస్టు చేశారు.

రష్యా ఉప ప్రధానమంత్రి అలెగ్జాండర్ నోవాక్ ఈ గణాంకాలను ఆ దేశ ప్రభుత్వ వార్తా సంస్థ టాస్‌కు ధృవీకరించారు.

భవిష్యత్తులో ఎగుమతుల పరిమాణం నెలకు 30 లక్షల టన్నులకు చేరుకోవచ్చని అలెగ్జాండర్ నోవాక్ అన్నారు.

యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీ ఈ ఒప్పందాన్ని పుతిన్‌కు ఇచ్చిన ఒక 'బహుమతి' అంటూ విమర్శించారు.

ఇది "ముగించాల్సిన యుద్ధంలో పెట్టుబడి పెట్టడం" లాంటిదని అన్నారు.

ఒప్పందంలో భాగంగా ఏప్రిల్ 7 వరకు రష్యా డీజిల్ ఎగుమతులపై ఆంక్షలను అమెరికా ట్రెజరీ నిలిపివేస్తున్నట్లు అర్థం చేసుకోవచ్చు. కానీ, అమెరికన్ బ్యాంకులలోని ఇతర రష్యన్ ఆస్తులు మాత్రం ఇంకా స్తంభింపజేసే ఉంటాయి.

నలుగురు రిపబ్లికన్లు, ముగ్గురు డెమొక్రట్లతో కూడిన ఏడుగురు సెనేటర్ల బృందం ఈ ఒప్పందం అమెరికా చట్టాలను ఉల్లంఘించిందని పేర్కొంటూ, ట్రంప్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆదివారం కోరారు.

"యుక్రెయిన్ పౌరుల ప్రాణాలను తీస్తున్న సమయంలో, పుతిన్‌కు అమెరికా ఆర్థిక ఊతాన్ని అందించకూడదు" అని ఈ చట్టసభ సభ్యులు పేర్కొన్నారు.

డీజిల్
ఫొటో క్యాప్షన్, ఫిబ్రవరి చివరిలో ఇరాన్‌తో అమెరికా-ఇజ్రాయెల్‌లు యుద్ధం ప్రారంభించినప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగాయి.

యుక్రెయిన్‌పై పుతిన్ సాగిస్తున్న క్రూరమైన యుద్ధానికి అమెరికా డాలర్ల రూపంలో నిధులు సమకూర్చకుండా నిరోధించేందుకు, 2022లో రష్యా ఇంధన దిగుమతులను కాంగ్రెస్ నిషేధించిందని వారు తెలిపారు.

ఈ ప్రకటనపై రిపబ్లికన్లు సుసాన్ కాలిన్స్, లీసా ముర్కోవ్స్కీ, థామ్ టిల్లిస్, జాన్ కర్టిస్, అలాగే డెమొక్రాట్లకు చెందిన జీన్ షాహీన్, రిచర్డ్ బ్లూమెంతల్, రాన్ వైడెన్‌లు సంతకం చేశారు.

అయితే, ప్రతి ఒక్క చట్టసభ్యుడు ఈ ఒప్పందాన్ని వ్యతిరేకించడం లేదు. అన్ని పెట్రోలియం ఉత్పత్తులపై ఉన్న ఆంక్షలను అమెరికా ఎత్తి వేయాలని ట్రంప్‌తో పలు అంశాలపై వాదించిన రిపబ్లికన్ సభ్యుడు థామస్ మాస్సీ కోరారు.

ధరలను తగ్గించడానికి అమెరికాకు అందుబాటులో ఉన్న ప్రస్తుత చట్టపరమైన మార్గాల ద్వారానే ఈ ఒప్పందం పనిచేస్తుందని, అలా జరగదని కాంగ్రెస్‌లో ఎవరైనా అంటే అది తప్పని ఫాక్స్ న్యూస్‌తో ట్రంప్ ఆర్థిక శాఖ కార్యదర్శి స్కాట్ బెసెంట్ చెప్పారు.

ఫిబ్రవరి చివరిలో ఇరాన్‌తో అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించినప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగాయి. ఈ యుద్ధంతో.. పెట్రోల్, డీజిల్‌లో కీలక పదార్థమైన క్రూడాయిల్ సరఫరాల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది.

వచ్చే నెలలో జరగనున్న మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో.. పెరుగుతున్న ధరలు అమెరికన్లకు ఒక కీలక సమస్యగా మారాయి. ఈ ఎన్నికలే కాంగ్రెస్‌పై ట్రంప్ రిపబ్లికన్ పార్టీ తన పట్టును నిలుపుకుంటుందా లేదా అన్నది నిర్ణయిస్తాయి.

ఆర్థిక వ్యవస్థ విషయంలో, ఇరాన్ యుద్ధం విషయంలో ఆయన వ్యవహరించిన తీరును మెజారిటీ అమెరికన్లు ఆమోదించడం లేదని ప్రజాభిప్రాయ సేకరణలు వెల్లడిస్తున్నాయి.

దీంతో, తన పార్టీ ఎదుర్కొంటున్న రాజకీయ ఇబ్బందులను తగ్గించుకునే మార్గాల కోసం ఆయన ప్రయత్నిస్తున్నారు.

వ్యవసాయ యంత్రాలను ఉపయోగించడానికి, తమ ఉత్పత్తులను మార్కెట్‌కు తరలించడానికి డీజిల్‌పై అధికంగా ఆధారపడే అమెరికాలోని వ్యవసాయాధారిత రాష్ట్రాలు, ఈ యుద్ధం వల్ల తీవ్ర ప్రభావాన్ని ఎదుర్కొంటున్నాయి.

అమెరికాలో సగటు డీజిల్ ధర గ్యాలన్‌కు ప్రస్తుతం 6.28 డాలర్లు (రూ.600) పలుకుతుందని ఏఏఏ డేటాలో తెలిసింది. సెప్టెంబర్ చివరిలో ఇది రికార్డు స్థాయిలో గరిష్ఠంగా 6.53 డాలర్లకు (రూ.624గా) చేరుకుంది.

రష్యా చమురు శుద్ధి కర్మాగారం
ఫొటో క్యాప్షన్, ఆగస్టు 6న రష్యాలోని స్లావ్‌నెఫ్ట్-యానోస్ చమురు శుద్ధి కర్మాగారం ఉన్న ప్రదేశం నుంచి ఆకాశంలోకి ఇలా భారీ పొగ వస్తూ కనిపించింది.

అంతర్జాతీయ నేతల నుంచీ విమర్శలు

అంత భారీ మొత్తంలో డీజిల్‌ను సరఫరా చేసే సామర్థ్యం రష్యాకు ఉందా, రష్యా సరఫరాలతో అమెరికా వినియోగదారులకు ధరల విషయంలో ఎంతవరకు ఉపశమనం లభిస్తుందనే విషయాలపై విశ్లేషకులు సందేహం వ్యక్తం చేశారు.

అమెరికా రోజుకు సుమారు 36 లక్షల బ్యారెళ్ల డీజిల్‌ను వినియోగిస్తుంది. రష్యా వాగ్దానం చేసినట్లు ఈ నెలలో 3 లక్షల టన్నులను సరఫరా చేసినప్పటికీ, అది అమెరికా రోజువారీ వినియోగానికి అంత ఎక్కువగా సరిపోదు.

రష్యాతో కుదుర్చుకున్న డీజిల్ ఒప్పందం విషయంలో ట్రంప్ కేవలం సొంత దేశంలో మాత్రమే విమర్శలు ఎదుర్కోవడం లేదు.

అంతర్జాతీయ నేతల నుంచి కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. వారిలో కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ, యూకే డిఫెన్స్ సెక్రటరీ వెస్ స్ట్రీటింగ్ వంటి వారున్నారు.

యుద్ధాన్ని ముగించేందుకు రష్యాపై ఒత్తిడి పెంచడంపై అమెరికా, యుక్రెయిన్, ఇతర మిత్రదేశాలు దృష్టి సారించాలని వెస్ స్ట్రీటింగ్ అన్నారు.

అదే సమయంలో, రష్యా, యుక్రెయిన్ దేశాలు 'ఇంధన కాల్పుల విరమణ'కు వచ్చాయని ట్రంప్ ఆదివారం ప్రకటించారు. కానీ మరిన్ని వివరాలు వెల్లడించలేదు. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీ దీన్ని స్వాగతించారు. కానీ, మాస్కో నుంచి ఇంకెలాంటి స్పందన రాలేదు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)