'ఇరుముడి'పై మరో వివాదం: సినిమాలో ఉపాధ్యాయ వృత్తిని తక్కువ చేసి చూపించారా? ఉపాధ్యాయ సంఘాల అభ్యంతరం ఏమిటి?

ఇరుముడి సినిమా వివాదం, ఉపాధ్యాయుల అభ్యంతరం

ఫొటో సోర్స్, raviteja_2628/INSTA

రవితేజ నటించిన 'ఇరుముడి' సినిమా చుట్టూ వివాదం రాజుకుంది. ఈ సినిమాలో కొన్ని సీన్లు ఉపాధ్యాయులను కించపరిచేలా ఉన్నాయంటూ ఆంధ్ర ప్రదేశ్‌లోని కొందరు ఉపాధ్యాయులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఈ సినిమాలో చూపించిన కొన్ని సీన్లు తొలగించాలంటూ ఆంధ్ర ప్రదేశ్ ఉపాధ్యాయ సమాఖ్య (ఏపీటీఎఫ్) డిమాండ్ చేసింది.

''కొన్ని సీన్లు ఉపాధ్యాయులను.. ప్రత్యేకించి ఆంధ్ర ప్రదేశ్‌లోని విద్యా వ్యవస్థను కించపరిచేలా ఉన్నాయి'' అని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షురాలు మంజుల బీబీసీతో చెప్పారు.

ఈ వివాదంపై ఇరుముడి చిత్ర దర్శకుడు శివ నిర్వాణ స్పందించారు.

''ఉపాధ్యాయులను గానీ, విద్యా వ్యవస్థను తక్కువ చేయాలని లేదా కించపరచాలనే ఉద్దేశం మాకు ఏ మాత్రం లేదు'' అని ఆయన బీబీసీతో చెప్పారు.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఇరుముడి సినిమా వివాదం, ఉపాధ్యాయుల అభ్యంతరం

ఫొటో సోర్స్, raviteja_2628/INSTA

ఆగస్టు 21న థియేటర్లలోకి వచ్చిన 'ఇరుముడి'

మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మాణంలో రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఇరుముడి సినిమా తెరకెక్కింది. ఆగస్టు 21న థియేటర్లలోకి వచ్చింది.

'బ్లాక్ బస్టర్ ప్రెస్‌ మీట్' పేరుతో ఆగస్టు 24న సక్సెస్ మీట్ నిర్వహించింది చిత్ర యూనిట్.

తెలుగు రాష్ట్రాల్లో అయ్యప్ప మాల వేసుకునే వారు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. దీంతో సినిమా విడుదలైనప్పట్నుంచి సోషల్ మీడియాలో ఈ సినిమాపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.

ఇదే సమయంలో మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఇరుముడి సినిమాను ప్రస్తావిస్తూ అయ్యప్ప మాల వేషధారణలో ఉన్న ఫొటోను 'ఆరెంజ్ ఆర్మీ ఫరెవర్' అకౌంట్ నుంచి డేవిడ్ వార్నర్ అకౌంట్‌తో కొలాబ్ చేసి షేర్ చేశారు.

సినిమా విడుదలకు ముందు.. ప్రీరిలీజ్ ఈవెంట్లో హీరో రవితేజ చేసిన వ్యాఖ్యలపై అప్పట్లో సోషల్ మీడియాలో వివాదం చెలరేగింది. సినిమాలో నటించిన బాల నటి నక్షత్రను ఉద్దేశించి రవితేజ చేసిన కొన్ని వ్యాఖ్యలపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే సినిమా బృందం దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు.

ఇప్పుడు తాజాగా ఈ సినిమాలో కొన్ని సీన్ల విషయంలో మరో వివాదం మొదలైంది.

ఇదే విషయంపై ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఫౌండర్, వ్యక్తిత్వ వికాస నిపుణుడు గంపా నాగేశ్వర్ ఫేస్ బుక్ లో స్పందించారు.

''ప్రభుత్వ ఉపాధ్యాయుల గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్న సన్నివేశాలను వెంటనే పునఃసమీక్షించి, అవసరమైన చోట తొలగించాలని లేదా తగిన విధంగా సవరించాలని మేం డిమాండ్ చేస్తున్నాం'' అన్నారు.

ఏంటీ తాజా వివాదం?

సినిమాలో ఏపీలోని సీలేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలి పాత్ర ఒకటి ఉంటుంది. ఆ పాత్ర తప్పుడు పనులు చేస్తున్నట్లు సినిమాలో చూపించారు.

ఈ విషయంలోనే ఉపాధ్యాయులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

''సీలేరులో ఉన్న వాస్తవ పాఠశాల పేరును సినిమాలో చూపించారు. ఇప్పుడు ఏపీలో ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులు వేసుకుంటున్న వాస్తవ యూనిఫాం చూపించారు. ఉపాధ్యాయురాలు తప్పుడు పనులు చేస్తున్నట్లుగా చూపించారు. దీనివల్ల మా విద్యా వ్యవస్థ గురించి తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంది'' అని ఏపీటీఎఫ్ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసింది.

''టీచర్ పాత్ర చిత్రీకరణను చాలా క్రూరంగా చూపించారు. స్కేలుతో కొట్టడం, సాయంత్రం వరకు నిలబెట్టడం.. వంటివి చూపించారు. చదువుకోకపోతే కొందరు టీచర్లు కొడతారమో గానీ అంత క్రూరంగా వ్యవహరించరు కదా?'' అని మంజుల బీబీసీతో అన్నారు.

అయితే, ఈ వాదనపై ఇరుముడి సినీ దర్శకుడు శివ నిర్వాణ స్పందించారు.

''నేను ఎమ్మెస్సీ, బీఈడీ చేసి ఉపాధ్యాయుడిగా పనిచేశాను. మంచి సినిమాలు తీయాలనే ఉద్దేశంతో సినీ రంగంలోకి వచ్చాను. సినిమాలో ఉపాధ్యాయ వృత్తిని ఉన్నతంగా చూపించాలనే ప్రయత్నించాం. ఒక ఉపాధ్యాయురాలు తప్పుడు పనులు చేస్తున్నట్లుగా చూపించామని అంటున్నారు. అదే సినిమాలో ప్రాథమిక పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుడిని ఎంతో ఉన్నతంగా చూపించాం'' అని శివ నిర్వాణ బీబీసీతో చెప్పారు.

ఈ విషయంపై సీలేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నాగభూషణంతో బీబీసీ మాట్లాడింది.

''చిత్ర బృందం గతంలో మా పాఠశాలకు వచ్చింది. ఇక్కడి పరిసరాలను పరిశీలించి వెళ్లింది. అయితే, పాఠశాల పేరును సినిమాలో చూపించారే గానీ సినిమా చిత్రీకరణ ఈ పాఠశాలలో చేయలేదు'' అని చెప్పారు.

తాజా వివాదంపై ఇంతకుమించి ఎక్కువ మాట్లాడదలచుకోలేదని నాగభూషణం బీబీసీతో చెప్పారు.

ఇరుముడి సినిమా వివాదం, ఉపాధ్యాయుల అభ్యంతరం

ఫొటో సోర్స్, MythriMovieMakers

ఫొటో క్యాప్షన్, శివ నిర్వాణ

''ఉపాధ్యాయుల గౌరవం పెంచేలా చూపించాం''

ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలు అంటేనే ఎక్కడో చిన్నచూపు ఉందని, సినిమాలో పాత్రలు పెట్టేప్పుడు కొంత సామాజిక దృక్పథం కలిగి ఉండాలని చెప్పారు మంజుల.

''ఉపాధ్యాయులందరూ అలాంటి వారే అని సినిమాలో చూపించి ఉండకపోవచ్చు. కానీ పిల్లల యూనిఫాం వాడకుండా, ఆ పాఠశాల పేరు వాడకుండా ఉంటే సరిపోయేది'' అని చెప్పారు.

ఏపీలోని ఉపాధ్యాయులకు చిత్ర బృందం క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు.

ఈ విషయంపైనా దర్శకుడు శివ నిర్వాణ బీబీసీతో మాట్లాడారు.

''ఒక వ్యవస్థలో మంచి విషయం గురించి చెప్పాలనుకున్నప్పుడు అదే వ్యవస్థలోని చెడు గురించి కూడా చెప్పాల్సి వస్తుంది. సినిమాలో ఒక టీచర్ చేస్తున్న తప్పులు గురించి చెప్పాము. అందరూ అలాంటి వారేనని చెప్పలేదు. ఒక వ్యవస్థలో చెడు మనస్తత్వం ఉన్న వ్యక్తులు ఉంటే వాళ్ల వల్ల ఎలా నష్టపోతామో చెబుతూ, విద్యార్థులు, తల్లిదండ్రులు ఎలా జాగ్రత్త పడాలనే దానిపై మాట్లాడాం. ఉపాధ్యాయ వ్యవస్థ గానీ, ఉపాధ్యాయులందరూ చెడ్డవాళ్లని గాని చూపించలేదు'' అన్నారు శివ నిర్వాణ.

ఉపాధ్యాయుల మనోభావాలను, విద్యావ్యవస్థను తక్కువ చేసి చూపించాలని ఏ కోశానా తాము అనుకోలేదని స్పష్టం చేశారు.

''సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది... తల్లి, తండ్రి తర్వాత సమాజంలో గురువుకే సమున్నత స్థానం ఉంటుంది అని. అలా ఉపాధ్యాయుల గౌరవాన్ని పెంచేలా సినిమాలో చూపించాం. పిల్లలు ధైర్యంగా ఉండాలని చెప్పే ప్రయత్నం చేశాం'' అని శివ నిర్వాణ అన్నారు.

సినిమా విషయంలో ఉపాధ్యాయులు లేవనెత్తుతున్న అభిప్రాయాలను గౌరవిస్తానని, కానీ తప్పుగా ఎక్కడా చూపించలేదని అన్నారు.

శివ నిర్వాణ గతంలో టక్ జగదీష్, నిన్నుకోరి, మజిలీ, ఖుషి వంటి సినిమాలు తీశారు.

గతంలో తాను తీసిన సినిమాలు తనను ప్రేక్షకుల ఇంట్లోకి తీసుకెళితే, ఇరుముడి సినిమా తనను ప్రేక్షకుల గుండెల్లోకి తీసుకెళ్లిందని ఇటీవల ఓ మీడియా సమావేశంలో చెప్పారు శివ నిర్వాణ.

''బాలికల విషయంలో జరుగుతున్న తప్పుడు విషయాలను చూపించాలనుకున్నాను. అది చూపిస్తే మంచి టీచర్ విలువ కూడా తెలుస్తుంది. ఆ మంచిని చూపించడానికే చెడును చూపించాల్సి వచ్చింది'' అని చెప్పారు.

ఇరుముడి సినిమా వివాదం, ఉపాధ్యాయుల అభ్యంతరం

ఫొటో సోర్స్, raviteja_2628/INSTA

''సినిమాను సినిమాగా చూడాలి అంతే తప్ప…''

ఉపాధ్యాయులను, ఉపాధ్యాయ వ్యవస్థను ప్రతికూల పాత్రలలో, జోకర్ పాత్రలలో, సమున్నతమైన పాత్రలలో చూపించడం తెలుగు సినిమాలలో ఎప్పట్నుంచో ఉంది.

గతంలో లెక్చరర్లను, ఉపాధ్యాయులను కామెడీ పాత్రలలో చూపించిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా 90వ దశకం తర్వాత ఈ తరహా పాత్రలు సినిమాల్లో ఎక్కువగా కనిపించేవి.

గతంలో వచ్చిన సుందరకాండ నుంచి మొదలుకుని.. ఎన్నో సినిమాలలో ఉపాధ్యాయులను కామెడీ పాత్రల్లో చూపించారు.

అలాగే సీనియర్ ఎన్టీఆర్ నటించిన బడిపంతులు మొదలుకుని ఈ మధ్యన వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా వరకు ఎన్నో సినిమాల్లో ఉపాధ్యాయుల ఔన్నత్యాన్ని చూపించారు.

ఈ వివాదంపై సినీ దర్శకుడు, విమర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ బీబీసీతో మాట్లాడారు. సినిమాను సినిమాగానే చూడాలని ఆయనన్నారు.

''ఇరుముడి సినిమా విషయానికి వస్తే దేశంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలు, వాటిలోని ఉపాధ్యాయులందరూ చెడ్డవాళ్లని ఎక్కడా చూపించలేదు. పాఠశాలల్లో మంచి వాళ్లున్నట్లుగానే తప్పుడు పనులు చేసేవారు కూడా కొందరు ఉంటారు. దీనికి సంబంధించి చాలా ఉదాహరణలు మనం చూస్తూనే ఉంటాం. అలాంటి ఒక టీచర్ గురించి సినిమాలో చెప్పారు'' అని ఆయనన్నారు.

''స్కూల్‌లో అందరూ చెడ్డవాళ్లనో, అందరూ టీచర్లూ అదే తరహాలో ఉంటారనో చెప్పి ఉంటే కచ్చితంగా ఖండించాల్సిందే. సినిమాలో ఒక క్యారక్టర్‌ను చూపించారు. సినిమాల్లో చూపించిన దాని కంటే విద్యావ్యవస్థలో ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటి విషయంలో ఉపాధ్యాయులు పోరాడాల్సిన అవసరం ఉంది'' అని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)