ఇరుముడి మూవీ రివ్యూ: రవితేజకు హిట్ పడిందా?

రవితేజ, సినిమా, శివనిర్వాణ, ప్రియాభవానీశంకర్, అయ్యప్ప మాల

ఫొటో సోర్స్, raviteja_2628/INSTA

    • రచయిత, జీఆర్ మ‌హ‌ర్షి
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ
  • చదివే సమయం: 4 నిమిషాలు

ర‌వితేజ‌కి వ‌రుస‌గా ఆరు ప్లాప్‌లున్నాయి. మూడేళ్లుగా హిట్ లేదు. క‌థ‌ల ఎంపిక రొటీన్‌గా ఉంద‌నే విమ‌ర్శ వుంది. అందుకే ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ కాంబినేష‌న్‌లో ఈసారి బ‌లంగా వ‌చ్చాడు.

ఇరుముడి ట్ర‌యిల‌ర్ చూస్తే తండ్రీకూతుళ్ల ఎమోష‌న‌ల్ సినిమా అని అర్థ‌మ‌వుతుంది. మ‌రి అయ్య‌ప్ప మాల‌ధారిగా ర‌వితేజ మెప్పించాడా? ఒక తండ్రిగా ఆయ‌న న‌ట‌న ఎలా వుంది?

క‌థ ఏమంటే సీలేరు డ్యామ్ ద‌గ్గ‌ర చిన్న మారుమూల ప‌ల్లెటూరు. త్రినాథ్ (ర‌వితేజ‌) రెండు ఎక‌రాల అర‌టి రైతు. ట్రాలీ ఆటోలో ప‌ళ్ల గెల‌ల్ని ర‌వాణా చేస్తుంటాడు. భార్య కావేరి (ప్రియా భ‌వానీ శంక‌ర్‌), కూతురు మ‌ణికంఠ (న‌క్ష‌త్ర‌)తో చిన్న ఇంట్లో వుంటాడు.

త్రినాథ్‌కి తాగుడు వ్య‌స‌నం. ఆడ‌పిల్ల‌ల జోలికొస్తే ఎవ‌రినైనా తంతాడు. అంద‌రి ఆడ‌పిల్ల‌ల్లో త‌న కూతుర్ని చూసుకునే అరుదైన బ‌ల‌హీన‌త వుంది. అత‌న్ని తాగుడికి దూరంగా ఉంచ‌డానికి ఏటా కూతురు అయ్య‌ప్ప మాల వేయిస్తూ ఉంటుంది. మాల తీసేసిన త‌ర్వాత త్రినాథ్ తాగుడు మామూలే.

ఊళ్లో అంద‌రికీ ఇరుముడి క‌ట్టించేది. గురుస్వామి (సాయికుమార్‌) అంద‌రికీ ఆయ‌న పెద్ద దిక్కు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
రవితేజ, సినిమా, శివనిర్వాణ, ప్రియాభవానీశంకర్, అయ్యప్ప మాల

ఫొటో సోర్స్, raviteja_2628/INSTA

ఫొటో క్యాప్షన్, ఇరుముడి సినిమాకు శివ నిర్వాణ దర్శకుడు

తండ్రీకూతుళ్ల అనుబంధం తెరపై ఎలా ఉందంటే...

కూతురు న‌క్ష‌త్ర అంటే రవితేజ‌కి విప‌రీత‌మైన ప్రేమ‌. ఆమె ఐదో త‌ర‌గ‌తి పాస్ అయితే ఊళ్లో అంద‌రికీ భోజ‌నాలు పెట్టిస్తాడు. ఎక్క‌డ ఏం చూసినా ఇంటికొచ్చి త‌న‌కి చెప్పాల‌ని తండ్రి చెబితే కూతురు య‌ధాత‌థంగా పాటిస్తూ ఉంటుంది.

ఆడ‌పిల్ల‌ల జోలికి వ‌స్తే తాట తీసేవాడు ఒక‌డుంటాడ‌నే భ‌యం లేక‌పోతే మ‌న పిల్ల‌ల్ని పోకిరీల నుంచి కాపాడుకోలేమ‌నే న‌మ్మ‌కం ర‌వితేజ‌ది. అయితే ఆడ‌పిల్ల‌లకి భ‌య‌మే ర‌క్ష‌ణ‌, భ‌యంగా వుంటే జీవితం సులభం అవుతుంద‌నే ల‌క్ష‌ణం సాయికుమార్‌ది. వీళ్లిద్ద‌రి పిల్ల‌లు ఊరికి దూరంగా ఉన్న టౌన్లో హైస్కూల్ చ‌దువుతూ వుంటారు.

ఆ స్కూల్లో స్పెష‌ల్ క్లాస్ పేరుతో వేధించే లేడీ టీచ‌ర్ ఉంటుంది. దారిలో ఆడ‌పిల్లల్ని వేధించే రౌడీ గ్యాంగ్ ఉంటుంది. ఆల్రెడీ ర‌వితేజ చేతిలో త‌న్నులు తిన్న‌వాళ్లు చుట్టుప‌క్క‌ల గ్రామాల్లో ఉంటారు. వీళ్లంద‌రి వ‌ల్ల తండ్రీకూతుళ్ల‌కు వ‌చ్చిన ఆప‌ద ఏమిటి? తండ్రితో చూసింది చూసిన‌ట్టు చెప్పే న‌క్ష‌త్ర ఎలాంటి ప్ర‌మాదంలో ప‌డింది? ఇది మిగ‌తా క‌థ‌.

రవితేజ, సినిమా, శివనిర్వాణ, ప్రియాభవానీశంకర్, అయ్యప్ప మాల

ఫొటో సోర్స్, raviteja_2628/INSTA

ఫొటో క్యాప్షన్, రవితేజ భార్యగా ప్రియాభవానీ శంకర్, కూతురిగా నక్షత్ర నటించారు.

రవితేజ నటన ఎలా ఉందంటే...

ఇరుముడి ట్ర‌యల‌ర్‌, టీజ‌ర్ చూసిన వాళ్లంతా ఇదో తండ్రీకూతుళ్ల ఎమోష‌న‌ల్ డ్రామా అనే అనుకున్నారు. సినిమా ప్రారంభం కూడా అలాగే ఉంటుంది. అంద‌మైన ప‌ల్లెటూరు, తండ్రీకూతుళ్ల గారాబం, హీరో వ్య‌స‌నం , కోపం , అయ్య‌ప్ప భ‌క్తి ఇలా న‌డుస్తున్న సినిమా సెకెండాఫ్ వ‌చ్చే స‌రికి క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా మారుతుంది. ఊహించ‌ని ట్విస్టులు వ‌స్తూ ఉంటాయి. ఇది డైజెస్ట్ కావ‌డానికి ప్రేక్ష‌కుడికి కొంచెం టైమ్ ప‌డుతుంది.

ఆడ‌పిల్ల‌ల‌పై జ‌రిగే దౌర్జ‌న్యాలు, ఎవ‌రికీ చెప్పుకోలేని అన్యాయ‌మైన స్థితి, కూతురికి జ‌రిగిన అన్యాయం తెలిసినా ఏమీ చేయ‌లేని నిస్స‌హాయ‌త‌, నార్మ‌ల్‌గా క‌నిపించే సైకో క్యారెక్ట‌ర్స్‌, ఇలా సెకెండాఫ్‌లో చాలా కొత్త విష‌యాలు వ‌స్తూ వుంటాయి. ఫైన‌ల్‌గా హీరో ఏం చేశాడ‌నేది క్లైమాక్స్‌.

నిజానికి ఇలాంటి క‌థ‌లు మ‌రీ కొత్త‌వేం కాదు. గ‌తంలో వ‌చ్చిన ఒక‌ట్రెండు సినిమాలు హిట్ అయ్యాయి కూడా. ప్ర‌త్యేకంగా చెప్పుకోవాల్సింది ఏమంటే ర‌వితేజ న‌ట‌న‌. ఒక ఆడ‌పిల్ల తండ్రిగా జీవించేశాడు. రొటీన్ వెట‌కార‌పు పంచ్‌లు , హీరోయిన్‌తో డ్యూయెట్లు ఏమీ ఉండ‌వు. కొత్త ర‌వితేజ క‌నిపిస్తాడు. క్లైమాక్స్‌లో కంట‌త‌డి పెట్టిస్తాడు. ప్రియా భ‌వానీ శంక‌ర్ న‌ట‌న సెకెండాఫ్‌లో అద్భుతం. న‌క్ష‌త్ర‌, సాయికుమార్ కూడా అంతే బాగా న‌టించారు.

raviteja irumudi movie

ఫొటో సోర్స్, raviteja/facebook.com

సెకండాఫ్‌లో సినిమా ఎలా ఉందంటే...

ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ ఫ‌స్టాఫ్ స్లోగా న‌డిపించాడు. సెకెండాఫ్‌లో వేగం పెరిగింది. కొన్ని సీన్స్ రిపీటెడ్‌గా అనిపిస్తాయి. సెకెండాఫ్ వ‌చ్చేస‌రికి క‌థ ఎటు పోతూఉందో ప్రేక్ష‌కుడు ఊహించేస్తాడు. రైటింగ్ ఇంకొంచెం బ‌లంగా ఉండాల్సింది. కొన్ని డైలాగ్‌లు చాలా బావున్నాయి.

జీవీ ప్ర‌కాశ్ సంగీతం, విష్ణు శ‌ర్మ కెమెరా, ప్రొడ‌క్ష‌న్ వ్యాల్యూస్ అన్నీ స‌మంగా కుదిరాయి. సీలేరు డ్యామ్ లోకేష‌న్స్ అందంగా వున్నాయి.

ప్లస్ పాయింట్స్

1.ర‌వితేజ‌, న‌క్ష‌త్ర న‌ట‌న‌

2.రెండు పాటలు

3.కెమెరా

మైన‌స్ పాయింట్:

1.ఫ‌స్టాఫ్ స్లో నెరేష‌న్‌

2.ఇది వ‌ర‌కే చూసిన క‌థ‌

ఫైన‌ల్‌గా ర‌వితేజ న‌ట‌న కోసం , సెకెండాఫ్‌లో వ‌చ్చే ట్విస్టుల కోసం చూడొచ్చు. ఇరుముడిలో చిక్కుముడులు చాలా వున్నాయి.

(అభిపాయాలు సమీక్షకుడి వ్యక్తిగతం)

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)