ఇరాన్‌కు చెందిన ఇద్దరు మహిళలు విశాఖకు ఎందుకొచ్చారు.. యుద్ధం నేపథ్యంలో కలెక్టర్‌ను కలిసి సహాయం ఎందుకు కోరారు?

విశాఖపట్నంలో ఇరాన్ విద్యార్థినులు
ఫొటో క్యాప్షన్, విశాఖపట్నంలో ఇరాన్ విద్యార్థినులు
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం
  • చదివే సమయం: 5 నిమిషాలు

"పది రోజులుగా ఇరాన్ లోని మా కుటుంబాల నుంచి ఫోన్ లేదు, వారు ఏమయ్యారో తెలియడం లేదు. ప్రాణాలతో ఉన్నారో లేదోనని భయంగా ఉంది" అని విశాఖలో డి. ఫార్మసీ చదువుతున్న ఇరాన్‌కు చెందిన ఇద్దరు విద్యార్థినులు బీబీసీతో చెప్పారు. వీరిద్దరూ అక్కాచెళ్లెళ్లు. ఇద్దరూ వివాహితలు.

ఇరాన్‌ యుద్ధం విశాఖపట్నంలో చదువుకుంటున్న ఈ ఇద్దరు విద్యార్థినుల జీవితాలను ప్రభావితం చేస్తోంది. స్వదేశంలో పరిస్థితులు క్షణక్షణం మారుతుండటంతో, అక్కడున్న కుటుంబ సభ్యుల యోగక్షేమాల గురించి వారు ఆందోళన చెందుతున్నారు.

పది రోజుల ముందు వరకు కుటుంబసభ్యులు తమతో మాట్లాడారని...కానీ ఆ తర్వాత వారి నుంచి ఎలాంటి సమాచారం లేదని చెప్పారు.

కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతినడం, నిలిచిపోవడంతో తమ వారితో కనీసం మాట్లాడే అవకాశం కూడా లేక ఆ విద్యార్థినులు మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్టు కనిపించారు.

తమను వీలైనంత త్వరగా సురక్షితంగా ఇరాన్‌కు పంపేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇరాన్‌కు చెందిన జీనాబ్ మహ్మదీ, సోల్మాజ్ మహ్మదీ అనే ఇద్దరు విశాఖపట్టణం జిల్లా అధికారులను ఆశ్రయించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఇరాన్, విద్యార్థినిలు, ఆర్థిక సాయం, యుద్ధం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, విద్యార్థినులు(ప్రతీకాత్మక చిత్రం)

'ఇరాన్ నుంచి డబ్బులు రావడంలేదు, విశాఖలో ఇంటి అద్దె కట్టలేకపోతున్నాం'

సాయం చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్‌ను ఆ ఇద్దరు మహిళలు కోరిన తర్వాత విశాఖలో ఇద్దరు ఇరాన్ విద్యార్థినులు ఉన్నవిషయం వెలుగులోకి వచ్చింది.

విషయం తెలుసుకున్న బీబీసీ వారిద్దరూ చదువుతున్న కళాశాలకు వెళ్లింది. అక్కడ వారితో బీబీసీ మాట్లాడింది.

సోల్మాజ్ మహ్మదీ , జీనాబ్ మహ్మదీ అనే ఇద్దరు మహిళలు.. వారి ముగ్గురు పిల్లలతో కలిసి విశాఖలో ఉంటున్నారు. పిల్లలతో కలిసి బుధవారం విశాఖ కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు.

వారిద్దరూ అల్వాల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్ లో డి. ఫార్మసీ పూర్తి చేసి...ఇంటర్న్‌షిప్ చేస్తున్నారు. ఇరాన్, అమెరికాల మధ్య నెలకొన్న అంతర్జాతీయ ఉద్రికత్తల నేపధ్యంలో పది రోజులుగా సమాచార వ్యవస్థలు దెబ్బతినడంతో కుటుంబ సభ్యులతో సంబంధాలు తెగిపోయాయని, వారితో మాట్లాడే అవకాశం లేకుండాపోయిందని చెప్పారు.

"మేం ఇంటర్న్‌షిప్ పూర్తి చేస్తున్నాం. 2018 నుంచి ఇక్కడే ఉండి డి.ఫార్మసీ కంప్లీట్ చేశాం. తర్వాత ఇరాన్ వెళ్లాం. మళ్లీ ఇప్పుడు ఇంటర్న్‌షిప్ చేస్తున్నాం. దీని కోసం గతేడాది మేలో వచ్చాం. ఈ జూన్ మొదటివారంతో ఇది పూర్తవుతుంది.

అనుకోని పరిస్థితుల కారణంగా ఇరాన్‌లోని మా కుటుంబ సభ్యులతో మాకు కాంటాక్ట్ పోయింది. వారి సమాచారం తెలుసుకునేందుకు చేసిన ప్రయత్నాలేవి ఫలించలేదు. అలాగే ఇరాన్‌లో ఉద్రిక్త పరిస్థితులు కారణంగా అక్కడ నుంచి వారు పంపించే డబ్బులు కూడా రావడం లేదు" అని జీనాబ్ మహ్మదీ బీబీసీతో చెప్పారు.

"ఇక్కడ మా రోజువారి ఖర్చులు, పిల్లల స్కూల్ ఫీజులు, ఇంటి అద్దె ఏమీ చెల్లించలేకపోతున్నాం. మేమింకా దాదాపు రెండు నెలలు ఇక్కడే ఉండాలి. ఈ పరిస్థితుల్లో మాకు ఆర్థిక సహాయం చేయడంతో పాటు మమ్మల్ని ఇరాన్ పంపించేందుకు సాయమందించాలని కోరుతూ జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) ఎం. విశ్వేశ్వరనాయుడికి ఒక వినతి పత్రం అందించాం" అని గురువారం ఉదయం బీబీసీతో మాట్లాడిన సోల్మాజ్ మహ్మదీ చెప్పారు.

ఇరాన్, విద్యార్థినిలు, ఆర్థిక సాయం, యుద్ధం
ఫొటో క్యాప్షన్, విశాఖ కలెక్టర్ కార్యాలయం

'మాకు బంధువులు, స్నేహితులు లేరు'

ఇరాన్ నుంచి వస్తున్న వార్తలు, కుటుంబ సభ్యుల సమాచారం లేకపోవడంతో తీవ్ర ఆందోళనలో ఉన్నామని ఆమె చెప్పారు. చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నామన్నారు.

ఇరాన్‌లోని తమ కుటుంబాల పరిస్థితి తెలియకపోవడంతో ఈ క్లిష్ట సమయంలో ఇక్కడ ఉండటం కష్టంగా ఉందన్నారు. తమను వీలైనంత త్వరగా తిరిగి ఇరాన్‌కు పంపేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఇచ్చిన వినతిపత్రంలో వేడుకున్నారు.

ఇండియాలో మాకు సహాయం చేసేందుకు బంధువులు, స్నేహితులు లేరు. అందుకే అధికారులను సంప్రదించామని సోల్మాజ్ మహ్మదీ బీబీసీతో చెప్పారు.

రెండు నెలల కాలానికి మాకు భారత ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం కావాలని కోరుతున్నామన్నారు.

ఆ తర్వాతేం జరిగింది?

ఇరాన్ యువతులు ఆర్థిక సహాయం కోసం జిల్లా అధికారులకు వినతిపత్రం ఇచ్చారనే విషయం బయటకు రావడంతో...అనేక మంది స్పందించారు. తాము వారికి సహాయం చేస్తామంటూ ముందుకు వచ్చారు.

జిల్లా అధికారులు కూడా ఇరాన్ యువతులు అద్దెకు ఉంటున్న ఇంటి యాజమానితో, వారి పిల్లలు చదువుతున్న స్కూళ్ల యాజమాన్యంతో మాట్లాడారు. దాంతో వారు అద్దె, ఫీజుల విషయంలో సానుకూలంగా స్పందించి...వీలును బట్టి చెల్లిస్తే సరిపోతుందని అన్నారని డీఆర్వో విశ్వేశ్వరనాయుడు బీబీసీకి తెలిపారు.

"ఇరాన్ మహిళలు, వారి పిల్లలు ఇక్కడ ఉండేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశాం. వారికి ఆర్థిక సహాయం చేసేందుకు కొందరు దాతలు ముందుకు వచ్చారు.

దాంతో పాటు ప్రభుత్వం తరపున కూడా సాయమందిస్తున్నాం. ఇరాన్ లో పరిస్థితులు చక్కబడి...వారు అక్కడికి క్షేమంగా వెళ్లేవరకు బాధ్యత వహిస్తాం" అని డీఆర్వో బీబీసీకి చెప్పారు.

ఇరాన్, విద్యార్థినిలు, ఆర్థిక సాయం, యుద్ధం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, విద్యార్థినులు(ప్రతీకాత్మక చిత్రం)

ఇండియా ఫార్మసీ సర్టిఫికేట్‌‌లకు ఇరాన్‌లో విలువెక్కువ: జీనాబ్ మహ్మదీ

"ప్రస్తుతం అంతర్జాతీయ ఉద్రిక్తతల కారణంగా ఇరాన్‌లో సమస్యలు ఏర్పడ్డాయి. నా భర్త ఇరాన్‌లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారు. మా నాన్న అక్కడే ఫార్మసీ నడుపుతున్నారు. అందుకే నేను ఇక్కడ ఫార్మసీ కోర్సు చేస్తున్నాను. ఈ కోర్సు పూర్తయితే ఇరాన్‌లో మంచి ఉద్యోగం వస్తుంది.

ఇరాన్‌లో ఇండియా ఫార్మసీ కోర్సుకి, సర్టిఫికెట్‌కి విలువ ఎక్కువ. ఇప్పుడు కోర్సు చివరి దశకు వచ్చాం. కానీ...యుద్ధం కారణంగా మాకు కష్టాలు వచ్చాయి. భారత ప్రభుత్వం సహాయం చేస్తే మేం మా కోర్సుని పూర్తి చేసి మా దేశానికి చేరుకుంటాం" అని జీనాబ్ మహ్మదీ బీబీసీతో మాట్లాడుతూ చెప్పుకొచ్చారు.

ఇరాన్, విద్యార్థినిలు, ఆర్థిక సాయం, యుద్ధం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, విద్యార్థినులు(ప్రతీకాత్మక చిత్రం)

కాలేజ్ ఫీజులు చెల్లించాలని ఒత్తిడి లేదు: యాజమాన్యం

ఇరాన్ మహిళలు చదువుతున్న కళాశాలకు బీబీసీ వెళ్లి అక్కడి యాజమాన్యంతో మాట్లాడింది.

"ఇరాన్ విద్యార్థినులు కళాశాలకు కట్టాల్సిన ఫీజులపై ఎలాంటి ఒత్తిడి లేదని, వీలుని బట్టి కట్టాలని చెప్పాం.

ప్రస్తుతం వారు తమ కుటుంబ సభ్యుల ఆచూకీ కోసం ఆందోళన చెందుతున్నారు. ఇరాన్‌లోని వారి కుటుంబ సభ్యుల ఆచూకీ తెలుసుకోవడమే ప్రధానమైన పని. ఆ తర్వాత వారు కళాశాలకు చెల్లించాల్సిన ఫీజుల కోసం ఆలోచించవచ్చు" అని కళాశాల యాజమాన్యం తెలిపింది.

ఇరాన్, విద్యార్థినిలు, ఆర్థిక సాయం, యుద్ధం
ఫొటో క్యాప్షన్, విశాఖపట్నం

ఇరాన్ విద్యార్థినుల‌కు ఆర్థిక సాయం..

గురువారం మధ్యాహ్నం కలెక్టరు కార్యాలయానికి రావాలంటూ జిల్లా అధికారుల నుంచి ఇరాన్ యువతులకు సమాచారం వచ్చింది.

బీబీసీ బృందం కూడా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లింది.

తమ ప‌రిస్థితుల‌ను వివ‌రిస్తూ ఆర్థిక సాయం కోరిన ఇరాన్ విద్యార్థినులకు జిల్లా క‌లెక్ట‌ర్ ఎం. అభిషిక్త్ కిశోర్ సంజీవని నిధి నుంచి 50 వేల రూపాయలు, కనకమహాలక్ష్మీ ఆలయం నుంచి 50 వేలరూపాయలు కలిపి మొత్తం లక్షరూపాయల ఆర్థిక సాయం అందించారు.

జిల్లా యంత్రాంగం అందించిన ఈ సహాయం తమకు ఊరటనిచ్చిందని, కుటుంబ సభ్యుల సమాచారం తెలిసి పరిస్థితులు సాధారణ స్థితికి వస్తే కోర్సు పూర్తి చేసి తిరిగి ఇరాన్ వెళ్తామని జీనాబ్, సోల్మాజ్ చెప్పారు

దాతలు, కొందరు ప్రైవేటు సంస్థలు కూడా వీరికి సహాయం చేసేందుకు ముందుకు వచ్చారని, అది కూడా వారికి అందేలా చేస్తామని డీఆర్వో ఎం. విశ్వేశ్వరనాయుడు బీబీసీతో చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)