గ్రీస్: 15 ఏళ్లలోపు చిన్నారుల సోషల్ మీడియా వినియోగంపై నిషేధం దిశగా మరోదేశం

గ్రీస్, ఆస్ట్రేలియా, సోషల్ మీడియా, పిల్లలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 15 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా ఉపయోగించకుండా చర్యలు తీసుకోవాలని గ్రీస్ భావిస్తోంది.
చదివే సమయం: 4 నిమిషాలు

పదహారేళ్లలోపు పిల్లల సోషల్ మీడియా వినియోగంపై ఆస్ట్రేలియా నిషేధం విధించడంతో ప్రపంచవ్యాప్తంగా దీనిపై చర్చ జరుగుతోంది. తాజాగా గ్రీస్ కూడా ఆస్ట్రేలియా బాటలో పయనించేందుకు సిద్ధమైంది.

పదిహేనేళ్లలోపు వయసున్న పిల్లలు సోషల్ మీడియా ఉపయోగించడంపై నిషేధం విధించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు గ్రీస్ ప్రకటించింది.

ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల విషయంలో పిల్లలకు పరిమితులు విధించబోతున్న మరో యూరపియన్ దేశం ఇది.

యువతలో పెరుగుతున్న యాంగ్జైటీ, నిద్ర సమస్యలతో పాటు బానిసలుగా మారేలా రూపొందిస్తున్న సోషల్ మీడియా డిజైన్‌ నుంచి దూరం చేయడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు గ్రీస్ ప్రధాని కిరియాకోస్ మిట్సొటాకిస్ చెప్పారు.

ఈ నిబంధన వచ్చే ఏడాది జనవరి నుంచి అమల్లోకి వస్తుందని ఆయన అన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
గ్రీస్, ఆస్ట్రేలియా, సోషల్ మీడియా, పిల్లలు

ఫొటో సోర్స్, Hollie Adams / Reuters

‘పూర్తిగా నిషేధించడం సాధ్యం కాదు’

టిక్‌టాక్, యూట్యూబ్, స్నాప్ చాట్, ఇతర ప్రధాన సైట్లన్నీ 16 ఏళ్లలోపు వయసున్న పిల్లల అకౌంట్లు తొలగించాలని లేదంటే భారీ జరిమానాలు విధిస్తామని గత డిసెంబరులో ఆస్ట్రేలియా హెచ్చరించింది. ఈ దిశగా చర్యలు తీసుకున్న తొలి దేశం ఆస్ట్రేలియా. ఫ్రాన్స్, ఆస్ట్రియా, స్పెయిన్ వంటి దేశాలు కూడా అలాంటి నియంత్రణలు అమలు చేస్తున్నాయి.

16 ఏళ్ల లోపు పిల్లల సోషల్ మీడియా వినియోగంపై నిషేధం విధించాలా లేదా అనేదానిపై యూకే ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. ఐర్లాండ్, డెన్మార్క్ కూడా ఇలాంటి చర్యలను పరిగణనలోకి తీసుకుంటున్నాయి.

పూర్తిగా నిషేధించడం వల్ల ప్రయోజనం ఉండబోదని, దీన్ని అమలు చేయడం కష్టమని సోషల్ మీడియా కంపెనీలు వాదిస్తున్నాయి. కొందరు టీనేజర్లను ఒంటరితనంలోకి నెట్టివేసే అవకాశముందని అంటున్నాయి. ఆస్ట్రేలియా చట్టాన్ని రెడ్డిట్ కోర్టులో సవాల్ చేసింది.

''పోలికలు, కామెంట్లు, ఎప్పుడూ ఆన్‌లైన్‌లో కనిపించాలనే ఒత్తిడి వల్ల నిస్పృహ చెందినట్టు అనిపిస్తోందని చాలా మంది యువత చెప్పారు'' అని టిక్‌టాక్‌లో పోస్టు చేసిన వీడియో మెసేజ్‌లో మిట్సొటాకిస్ చెప్పారు.

గ్రీస్, ఆస్ట్రేలియా, సోషల్ మీడియా, పిల్లలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఎక్కువ సేపు వాటికోసం సమయం కేటాయించాలని అనిపించేలా సోషల్ మీడియా యాప్‌లుంటాయని ఆరోపణలొస్తున్నాయి.

‘‘ఎక్కువసేపు స్క్రీన్ మీద ఉండేలా చేయడమే లక్ష్యం’’

తమ పిల్లలు సరిగ్గా నిద్రపోవడం లేదని చెబుతున్న తల్లితండ్రులతో తాను మాట్లాడానని, తమ పిల్లలు ఉద్వేగ భరితంగా ఉంటున్నారని, ఎప్పుడూ ఫోన్‌లతోనే గడుపుతున్నారని వాళ్లు చెప్పారని మిట్సొటాకిస్ తెలిపారు.

అమలు చేయాలనుకున్న ఈ నిబంధన కష్టమైనదైనప్పటికీ అవసరమైనదని ఆయన అన్నారు. యువతను టెక్నాలజీకి దూరం చేయడం ప్రభుత్వం ఉద్దేశం కాదని చెప్పారు. టెక్నాలజీ స్ఫూర్తి కలిగిస్తుందని, విజ్ఞానాన్ని, సృజనాత్మకతను పెంచుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

''అయితే మన దృష్టి స్క్రీన్ మీద వీలైనంత ఎక్కువసేపు ఉంచడమే లక్ష్యంగా రూపొందించిన కొన్ని అప్లికేషన్ల డిజైన్లు మన స్వేచ్ఛను దూరం చేస్తున్నాయి. దీనికి ఎక్కడోచోట అడ్డుకట్ట వేయాలి'' అని ఆయన అన్నారు.

యూరప్ వ్యాప్తంగా చర్యలు తీసుకోవాలని మిట్సొటాకిస్ చెప్పారు. మైనర్ల రక్షణ కోసం యూరప్ అంతటా ఒకే విధానం అమలు చేయాలని యూరోపియన్ యూనియన్ అధ్యక్షురాలు ఉర్సులా వన్ డెర్ లెయన్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.

15 ఏళ్లలోపు వారికి అన్ని ప్లాట్‌ఫామ్‌లలో వయసు నిర్ధరణ తప్పనిసరి చేయడం, యూరప్ వ్యాప్తంగా ఆ వయసులోపు వారికి సోషల్ మీడియా నిషేధం, ప్రతి ఆరునెలలకోసారి యూజర్ల వయసు పరిశీలన వంటి ప్రతిపాదనలన్నీ ఇందులో ఉన్నాయి.

గ్రీస్, ఆస్ట్రేలియా, సోషల్ మీడియా, పిల్లలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సోషల్ మీడియా యాప్‌లను పిల్లల మానసిక ఆరోగ్యంతో ముడిపెట్టి చూడకూడదని మెటా అంటోంది.

'మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం'

పిల్లల సోషల్ మీడియా ఉపయోగంపై ఇటీవల తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఇది మానసిక ఆరోగ్యానికి హాని కలిగిస్తోందనడానికి ఆధారాలు పెరుగుతున్నాయి.

అమెరికాలో విచారణ జరిగిన ఓ కేసులో ఒక మహిళ బాల్యంలో సోషల్ మీడియా వ్యసనానికి సంబంధించి జరిగిన విచారణలో మెటా, యూట్యూబ్ బాధ్యత వహించాల్సి ఉంటుందని తేలింది.

ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి వాటన్నింటికీ యజమాని అయిన మెటా, యూట్యూబ్ పేరెంట్ కంపెనీ గూగుల్ అలవాటుపడిపోయే సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లను ఉద్దేశపూర్వకంగా రూపొందించాయని, అవి ఆమె మానసిక ఆరోగ్యానికి హాని కలిగించాయని న్యాయమూర్తులు చెప్పారు.

ఈ తీర్పుపై విభేదించిన మెటా, గూగుల్ అప్పీలుకు విజ్ఞప్తి చేశాయి.

టీనేజర్ల మానసిక ఆరోగ్యంలో అనేక సంక్లిష్ట అంశాలున్నాయని, దాన్ని ఒక యాప్‌తో ముడిపెట్టలేమని మెటా తెలిపింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)