నాకు ఎప్‌స్టీన్‌తో ఎలాంటి సంబంధాలు లేవు: మెలానియా ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, బెర్న్‌డ్ డెబ్సుమాన్ జూనియర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- చదివే సమయం: 5 నిమిషాలు
జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో ఎలాంటి సంబంధాలు లేవని అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ అన్నారు. ఇలాంటి ఆరోపణలకు ‘ఇవాళే ముగింపు పలకాలి’ అన్నారామె.
ఎప్‌స్టీన్ సెక్స్ ట్రాఫికింగ్ బాధితుల కోసం కాంగ్రెస్ విచారణ జరపాలంటూ ఆమె అనూహ్యంగా డిమాండ్ చేశారు.
తనను ట్రంప్‌కు ఎప్‌స్టీన్ పరిచయం చేశారన్న ప్రచారాన్ని ఆమె ఖండించారు.
తన గౌరవాన్ని తగ్గించేందుకు చేసిన చెడ్డ ప్రయత్నాలని ఆరోపించారు.
మెలానియా ఇప్పుడు ఈ ప్రకటన ఎందుకు చేశారనేదానిపై స్పష్టత లేదు.


ఫొటో సోర్స్, Getty Images
‘అది మర్యాదపూర్వక ఈ మెయిల్ మాత్రమే’
ఎప్‌స్టీన్‌పై మెలానియా ప్రకటన చేస్తారని ఆమె కార్యాలయం నుంచి ముందస్తుగా ఎలాంటి సంకేతం రాలేదు. వైట్ హౌస్ దీని గురించి ప్రస్తావించలేదు.
తాను ఎప్‌స్టీన్ బాధితురాలిని కాదని మెలానియా అన్నారు. 2000వ సంవత్సరంలో ఆయనతో కేవలం పరిచయం ఉందని తెలిపారు.
''బాధితులపై ఎప్‌స్టీన్ చర్యల గురించి నాకేమీ తెలియదు. నేనెప్పుడూ ఇందులోభాగం కాలేదు. నాకెలాంటి సంబంధం లేదు'' అని మెలానియా చెప్పారు.
ఎప్‌స్టీన్ సహచరి గిలేన్ మ్యాక్స్‌వెల్ తనకు తెలుసన్న ఆరోపణలనూ ఆమె ఖండించారు.
2002లో తనకు, మ్యాక్స్‌వెల్‌కు మధ్య జరిగిన ఈ మెయిల్ ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో విడుదల కావడంపై ఆమె స్పందించారు. అది సాధారణ, మర్యాదపూర్వక ప్రతిస్పందన మాత్రమేననన్నారు.
ఆ మెయిల్ ''జి'' అనే వ్యక్తికి బహుశా గిలేన్‌కు చేసినది కావొచ్చు. ‘జేఈ’(జెఫ్రీ ఎప్‌స్టీన్) గురించి న్యూయార్క్ మ్యాగజీన్‌లో వచ్చిన కథనాన్ని ప్రశంసిస్తూ ఒక ఫోటో గురించి చెప్పారు. పామ్ బీచ్‌కు వెళ్లడానికి తాను ఎంతగానో ఎదురుచూస్తున్నానని రాశారు.
''మీరు మళ్లీ న్యూయార్క్ వచ్చినప్పుడు కాల్ చేయండి. హావ్ ఏ గ్రేట్ టైమ్. లవ్, మెలానియా'' అని రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
‘బాధితులందరికీ అవకాశం కల్పించాలి’
ఎప్‌స్టీన్ చాలా మంచి వ్యక్తి అని, ఆయనతో ఉండడం సరదాగా అనిపిస్తుందని డోనల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కూడా న్యూయార్క్ మ్యాగజీన్ ఆర్టికల్‌లో ఉన్నాయి.
''ఆయనకు కూడా నాలాగే అందమైన మహిళలంటే ఇష్టం. వారిలో చాలామంది చిన్నవాళ్లు'' అని ట్రంప్ అన్నట్టు ఆ కథనంలో ఉంది. ''జెఫ్రీ తన జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు'' అని ట్రంప్ చెప్పారు.
బాధితులకు ప్రమాణపూర్వకంగా కాంగ్రెస్ ముందు నిజం చెప్పే అవకాశం ఇవ్వాలని మెలానియా ట్రంప్ చట్టసభ సభ్యులును కోరారు.
''ప్రతి మహిళా తాను కోరుకుంటే తన కథను అందరికీ చెప్పే అవకాశం తప్పనిసరిగా కల్పించాలి. కాంగ్రెస్ రికార్డుల్లో వారి ప్రకటనలను చేర్చాలి. అప్పుడు మాత్రమే మనకు నిజం తెలుస్తుంది'' అని ఆమె అన్నారు.
ఎప్‌స్టీన్‌తో తమ సంబంధాలపై వివరాలు బయటకు రావడంతో ఇటీవలి నెలల్లో అనేకమంది రాజీనామాలు చేయాల్సివచ్చింది.
నేరాన్ని నిరూపించడానికి ఇది సరిపోదని, నిజాన్ని బయటకు తీయడానికి మనం పారదర్శకంగా పనిచేయాలని ఆమె చెప్పారు.
రిపోర్టర్ల ప్రశ్నలకు ఆమె సమాధానం ఇవ్వలేదు.

ఫొటో సోర్స్, US Department of Justice
‘‘బాధితులు ఇప్పటికే చెప్పాల్సింది చెప్పేశారు’’
''బహిరంగంగా విచారణ జరపాలన్న మెలానియా ట్రంప్ డిమాండ్‌తో మేం అంగీకరిస్తున్నాం'' అని మెలానియా ట్రంప్ మాట్లాడిన తర్వాత ప్రచురితమైన ప్రకటనలో కాలిఫోర్నియా రిప్రజెంటేటివ్ రాబర్ట్ గ్రేసియా అన్నారు. హౌస్ ఓవర్ సైట్ కమిటీలో ఆయన శక్తిమంతమైన డెమెక్రాట్.
ప్రథమ మహిళ విజ్ఞప్తికి స్పందించాలని, తక్షణమే బహిరంగ విచారణకు షెడ్యూల్ ఏర్పాటుచేయాలని కమిటీ చైర్మన్, రిపబ్లికన్ ప్రతినిధి జేమ్స్ కోమర్‌ను ఆయన డిమాండ్ చేశారు.
ముందుకు వచ్చి తమకు జరిగినది వెల్లడించడం ద్వారా, సాక్ష్యం ఇవ్వడం ద్వారా తామిప్పటికే అసాధారణ ధైర్యం ప్రదర్శించామని ఎప్‌స్టీన్‌పై ఆరోపణలు చేసిన వర్జీనియా గియుఫ్రీ, స్కై అండ్ అమండా రాబర్ట్స్, ఇతర బాధితుల కుటుంబ సభ్యులు తెలిపారు.
''ఇప్పుడు మరింతగా చెప్పమని వాళ్లను అడగడం న్యాయం కాదని, బాధ్యత తప్పించుకోవడమని'' వారు ఓ ప్రకటనలో తెలిపారు. తన భర్త అధికార యంత్రాంగంలో ఉన్నవారితో సహా నిందితులను తన అధికారంతో రక్షిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఎప్‌స్టీన్‌కు సంబంధించి విచారణ ఫైల్స్ అన్నింటినీ ఇప్పటికీ విడుదల చేయలేదు.
బాధితులు తాము చేయాల్సింది చేశారని, ఇప్పుడు అధికారంలో ఉన్నవారు స్పందించాల్సిన సమయమని తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
మెలానియా ప్రకటన తర్వాత ఎప్‌స్టీన్ ఫైల్స్‌పై మళ్లీ చర్చ
ఎప్‌స్టీన్‌కు, ప్రథమ మహిళకు ఉన్న సంబంధాలపై వచ్చిన సమాచారం ఇప్పటికే చట్టపరమైన వివాదాలకు దారితీసింది.
డోనల్డ్ ట్రంప్, ఆయన భార్య మెలానియా.. ఎప్‌స్టీన్ ద్వారా ఒకరినొకరు కలుసుకున్నారని ధ్రువీకరించని ఆరోపణలతోఉన్న పేరాలను ఓ బుక్ నుంచి తీసేస్తున్నామని 2025 అక్టోబరులో యూకేకు చెందిన ప్రచురణ సంస్థ తెలిపింది.
మెలానియా ట్రంప్ రచయిత మైఖేల్ వోల్ఫ్‌తో కూడా న్యాయపరమైన వివాదంలో ఉన్నారు. ఆయన తన పుస్తకం ఫైర్ అండ్ ఫ్యూరీలో మెలానియా ట్రంప్‌కు ఎప్‌స్టీన్‌తో సంబంధాలున్న ఓ మోడలింగ్ ఏజెంట్ ద్వారా పరిచయమయ్యారని రాశారు.
పరువు నష్టం కేసు వేస్తానని మెలానియా బెదిరించడంతో ఆయన కౌంటర్ దాఖలు చేశారు.
ఈ తప్పుడు, ఆధారంలేని ఆరోపణలను నేను, మా న్యాయవాదులు ఎదుర్కొన్నామని ఆమె చెప్పారు. ''ఇకపైనా ఎలాంటి సందేహాలు లేకుండా నా ప్రతిష్టను కాపాడుకుంటాను'' అని ఆమె చెప్పారు.
ప్రథమ మహిళ ఇలాంటి ప్రకటన చేయడం చాలా అరుదు. ట్రంప్ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమె చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే ప్రజల ముందుకొచ్చారు.
ఎప్‌స్టీన్ కేసు దర్యాప్తు, ఫైల్స్ విడుదలపై ప్రథమ మహిళ ప్రకటన మరింత చర్చకు దారితీసే అవకాశముంది.
ఎప్‌స్టీన్ తనకు తెలుసుని గతంలోడోనల్ట్ ట్రంప్ అంగీకరించినప్పటికీ తర్వాత తన పామ్ బీచ్ లోని మార్-ఎ-లాగోక్లబ్ నుంచి ఆయన్ను బయటకు పంపానని తెలిపారు.
ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో అధ్యక్షుడి పేరు అనేకసార్లు వచ్చింది. కానీ తప్పుచేసినట్టు ఎలాంటి ఆధారాలు లేవు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

































