డోనల్డ్ ట్రంప్ మరణాన్ని ఇరాన్ కోరుకుంటోందా? మొజ్తాబా ఖమేనీ సందేశం ఏం సూచిస్తోంది, ఇజ్రాయెల్ అమెరికాకు అందించిన నిఘా సమాచారం ఏమిటి

ట్రంప్, ఇరాన్, అమెరికా, హార్ముజ్, యుద్ధం, అంత్యక్రియలు

ఫొటో సోర్స్, AFP via Getty Images

ప్రచురణ
చదివే సమయం: 5 నిమిషాలు

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఇరాన్ ప్రభుత్వాన్ని హెచ్చరించిన కొన్ని గంటలకే ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ తన తండ్రి మరణానికి 'ప్రతీకారం తీర్చుకోవాలి' అని ఓ సందేశంలో పిలుపునిచ్చారు.

అమెరికా అధ్యక్షుడిని హత్య చేస్తామన్న బెదిరింపును నిజం చేస్తే ఇరాన్‌పై 'వేలాది క్షిపణులను' ప్రయోగిస్తామని ట్రంప్ అన్నారు.

ఆ తర్వాత ఇరాన్ దివంగత సుప్రీంలీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు హాజరైన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ మొజ్తాబా ఖమేనీ పేరుతో ఒక లిఖిత సందేశం విడుదల అయింది.

వారం రోజుల పాటు జరిగిన అంత్యక్రియల కార్యక్రమాలు ఈ నెల 9న మషద్‌లో అయతొల్లా ఖమేనీ ఖననంతో ముగిశాయి.

అంత్యక్రియల కార్యక్రమం ముగిసే వరకు అవగాహన ఒప్పందంపై చర్చలు నిలిచిపోయాయని ట్రంప్ ముందు ప్రకటించారు. అయితే ఆ కార్యక్రమం ముగియడానికి కేవలం రెండు రోజుల ముందు అమెరికా, ఇరాన్‌ల మధ్య భారీ కాల్పులు, క్షిపణి దాడులు జరిగాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ట్రంప్, ఇరాన్, అమెరికా, హార్ముజ్, యుద్ధం, అంత్యక్రియలు

ఫొటో సోర్స్, Tasnim

ఫొటో క్యాప్షన్,

మొజ్తాబా ఖమేనీ తన సందేశంలో ఏం చెప్పారు?

" మీ పవిత్ర రక్తానికి, ఈ రెండు యుద్ధాల్లో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులందరి రక్తానికి ఈ నేరస్థులు, హంతకుల నుంచి ప్రతీకారం తీర్చుకోవాలని మేం సంకల్పించాం. ఇది మా దేశ ప్రజల ఆకాంక్ష. దీనిని ఎలాంటి పరిస్థితుల్లోనైనా నెరవేరుస్తాం" అని మొజ్తాబా ఖమేనీ తన సందేశంలో తెలిపారు.

ఆ సందేశాన్ని సిద్ధం చేసిన రెండు రోజుల తర్వాత మీడియాకు విడుదల చేసినట్టు బీబీసీ పర్షియా కథనం పేర్కొంది.

ఆ సందేశంపై జూలై 8వ తేదీ ఉంది. ఆ రోజే అయతొల్లా ఖమేనీకి అంతిమ వీడ్కోలు కార్యక్రమం జరిగింది.

"ఈ నేరస్థుల పూర్తి జాబితా మా వద్ద ఉంది. తమ పడకలపై ప్రశాంతంగా మరణించాలనే కోరికను వారు తమతో పాటు సమాధిలోకి తీసుకువెళతారు. ఇది నాపైన గానీ, ఇతర అధికారులపైన గానీ ఆధారపడి లేదని వారు తెలుసుకోవాలి" అని మొజ్తాబా ఖమేనీ తాజా సందేశంలో ఉంది.

''మనం జీవించినా జీవించకపోయినా అది నెరవేరుతుంది. ప్రపంచంలో స్వేచ్ఛను ప్రేమించే ప్రజలు కూడా ఈ దైవిక కార్యంలో తమ వంతు పాత్రను అతి త్వరలో నెరవేరుస్తారు'' అని సందేశంలో పేర్కొన్నారు.

అయతొల్లా ఖమేనీ మరణం తర్వాత ఆయన వారసుడిగా బాధ్యతలు చేపట్టిన మొజ్తాబా ఖమేనీ ఇంతవరకూ బహిరంగంగా కనిపించలేదు.

ఆయన ఎలాంటి వీడియో లేదా ఆడియో సందేశాన్ని కూడా విడుదల చేయలేదు. ఇప్పటివరకు ఆయన పేరు మీద లిఖిత సందేశాలు మాత్రమే బయటకు వచ్చాయి.

తనపై ఎలాంటి చర్య తీసుకున్నా లేదా తనను హత్య చేయడానికి ప్రయత్నించినా ఇరాన్‌పై అమెరికా భారీ దాడి చేస్తుందని ట్రంప్ ఇరాన్ ప్రభుత్వాన్ని హెచ్చరించిన సమయంలోనే ఈ ప్రతీకార ప్రకటన వెలువడింది.

ట్రంప్, ఇరాన్, అమెరికా, హార్ముజ్, యుద్ధం, అంత్యక్రియలు

ఫొటో సోర్స్, AFP via Getty Images

'వెయ్యి క్షిపణులు సిద్ధంగా ఉన్నాయి'

"వెయ్యి క్షిపణులు సిద్ధంగా ఉన్నాయి. వాటి లక్ష్యం ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్. అమెరికా అధ్యక్షుణ్ని హత్య చేస్తామన్న ఇరాన్ ప్రభుత్వ బెదిరింపును అమలు చేస్తే తక్షణమే మరిన్ని వేల క్షిపణులను ప్రయోగిస్తాం" అని డోనల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ట్రూత్ సోషల్'లో రాశారు .

అవసరమైన ఆదేశాలు జారీ అయ్యాయని, ఇరాన్‌లోని అన్ని ప్రాంతాలను ఒక సంవత్సరం పాటు, అవసరమైతే ఇంకా ఎక్కువ కాలం పాటు "పూర్తిగా నాశనం చేయడానికి" అమెరికా సైన్యం సిద్ధంగా ఉందని కూడా ట్రంప్ రాశారు.

డోనల్డ్ ట్రంప్‌ను హత్య చేయడానికి ఇరాన్‌తో సంబంధం ఉన్న కొత్త కుట్ర గురించి ఇజ్రాయెల్ నిఘా సంస్థలు సమాచారం ఇచ్చాయనే వార్తలొచ్చిన సమయంలో ఈ హెచ్చరిక వెలువడింది.

అలాగే అలీ ఖమేనీ అంత్యక్రియలకు సంబంధించిన చిత్రాలు, నినాదాలు కూడా బయటకు వచ్చాయి.

అంత్యక్రియల కార్యక్రమాల్లో కొందరు వ్యక్తులు ప్లకార్డులు పట్టుకుని అమెరికా అధ్యక్షునికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమం జరుగుతున్న సమయంలో అధ్యక్షుని చిత్రపటాలపై రాళ్లు కూడా విసిరారు.

ట్రంప్‌ను హత్య చేయడానికి కుట్ర పన్నారన్న ఆరోపణలను ఇరాన్ అధికారులు గతంలో ఖండించారు.

అంతకుముందు శుక్రవారం(ఈ నెల 10) కాల్పుల విరమణ ముగిసిందని ట్రూత్ సోషల్‌లో ట్రంప్ ప్రకటించారు.

"చర్చలను కొనసాగించమని ఇరాన్ మమ్మల్ని కోరింది. మేం దీనికి అంగీకరించాం.

కానీ కాల్పుల విరమణ ఇప్పుడు ముగిసిందని అమెరికా వారికి ఎలాంటి సందేహం లేకుండా స్పష్టంగా చెప్పింది" అని ఆయన రాశారు.

ట్రంప్, ఇరాన్, అమెరికా, హార్ముజ్, యుద్ధం, అంత్యక్రియలు

ఫొటో సోర్స్, Tasnim

ఫొటో క్యాప్షన్, అయతొల్లా ఖమేనీ అంత్యక్రియల సమయంలో ట్రంప్‌కు వ్యతిరేకంగా కొందరు నినాదాలు చేశారు.

'హత్య ప్రణాళిక' గురించి తెలిపిన ఇజ్రాయెల్

డోనల్డ్ ట్రంప్‌ను హత్య చేయడానికి ఇరాన్ ఒక కొత్త ప్రణాళికను పరిశీలిస్తోందని సూచిస్తూ ఇజ్రాయెల్ అమెరికాకు సమాచారం అందించినట్టు వాల్ స్ట్రీట్ జర్నల్ ఇటీవల ఒక నివేదికను ప్రచురించింది.

నాటో నాయకుల సమావేశానికి హాజరయ్యేందుకు తుర్కియే వెళ్లిన సమయంలో కూడా తనకు వచ్చిన ప్రాణహాని బెదిరింపుల గురించి ట్రంప్ పలుమార్లు బహిరంగంగా ప్రస్తావించారు.

"వాళ్లు అమెరికా నాయకుడైన నన్ను తొలగించాలని చూస్తున్నారు... వారి వద్ద ఉన్న ప్రతి జాబితాలో నా పేరు ఉంది" అని ఆయన అన్నారు.

గత ఫిబ్రవరిలో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్‌ల మధ్య యుద్ధం ప్రారంభమైన మొదటి రోజే ఇరాన్ మాజీ సుప్రీంలీడర్ అయతోల్లా అలీ ఖమేనీ మరణించినప్పటి నుంచి ఇరాన్ రాజకీయాల్లో 'ప్రతీకారం', 'రాజీ' అనే అంశాలు ఇరాన్ రాజకీయాల్లో ప్రధాన చర్చగా మారాయి.

"ప్రతీకారం తీర్చుకోవడం జాతి హక్కు, దాన్ని నెరవేర్చడం అధికారుల కర్తవ్యం" అని ఎక్స్‌పీడియన్సీ డిసర్న్‌మెంట్ కౌన్సిల్ సభ్యుడు సయీద్ జలీలీ జూలై 9న మషద్‌లోని ఇమామ్ రెజా మందిరం వద్ద శుక్రవార ప్రార్థనలకు ముందు చేసిన ప్రసంగంలో అన్నారు.

గత బుధవారం(జూలై 8)తుర్కియేలో అమెరికా అధ్యక్షుని పర్యటనను ప్రస్తావిస్తూ 'ప్రతీకారం తీర్చుకునేంత సమీపంలో' డోనల్డ్ ట్రంప్ ఉన్నారని, అయితే పొరుగు దేశాలతో స్నేహం, సత్సంబంధాలను కాపాడాలన్న ఉద్దేశంతో ఇరాన్ ఆయనను లక్ష్యంగా చేసుకోలేదని ఇజ్జతుల్లా జర్గామీ పేర్కొన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)