ఖమేనీ అంత్యక్రియలు ఇంత ఆలస్యంగా ఎందుకు జరుగుతున్నాయి? ఆయన భౌతిక కాయాన్ని ఇరాక్‌ ఎందుకు తీసుకెళ్తున్నారు?

ఇరాన్, ఇరాక్, అమెరికా, యుద్ధం, అంత్యక్రియలు

ఫొటో సోర్స్, Anadolu via Getty Images

ప్రచురణ
చదివే సమయం: 7 నిమిషాలు

ఫిబ్రవరిలో అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో మరణించిన ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ, ఆయన కుటుంబ సభ్యులకు చివరి వీడ్కోలు కార్యక్రమాలు వారు మరణించిన దాదాపు నాలుగు నెలల తర్వాత శుక్రవారం(జూలై 3) ప్రారంభమయ్యాయి.

జూలై 3 నుంచి జూలై 9 వరకు జరిగే అంత్యక్రియల కార్యక్రమాల షెడ్యూల్‌ను జూన్ 13న ఇరాన్ ప్రకటించింది. ఇవాళ్టి(జూన్ 4) నివాళి కార్యక్రమానికి పలు దేశాల ప్రతినిధులు హాజరవుతారని భావిస్తున్నారు.

అలీ ఖమేనీ, ఆయన కుటుంబంలోని ముగ్గురు సభ్యులను ఇరాన్ జెండా కప్పి ఉంచిన శవపేటికలో 'గ్రాండ్ మొసల్లా'కు తీసుకువెళ్లారు.

తెహ్రాన్‌లోని ప్రధాన మత, సాంస్కృతిక కేంద్రమైన ఇమామ్ ఖొమేనీ మసీదులో తుది వీడ్కోలు కార్యక్రమాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. నల్లటి దుస్తులు ధరించిన ప్రజలు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. ఎర్రటి పువ్వులు, వేలాడదీసిన తెల్లటి సీతాకోకచిలుకల అలంకరణ మధ్య శవపేటికను ఉంచారని బీబీసీ ఉర్దూ తెలిపింది.

ఈ తుది వీడ్కోలు కార్యక్రమాన్ని ఇరాన్ కేవలం ఒక మతపరమైన ఆచారంగానే కాకుండా, యుద్ధం తర్వాత తన రాజకీయ, దౌత్యపరమైన శక్తిని ప్రదర్శించే ఒక ప్రధాన వేదికగా కూడా పరిగణిస్తోంది. ఇరాన్‌లో ప్రభుత్వం నిర్వహించే ఇలాంటి కార్యక్రమాలను పాలక వ్యవస్థకు ప్రజల మద్దతు ప్రదర్శనగా చూపిస్తారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

జాతీయ సెలవు దినంగా జూలై 6

జూలై 4, 5 తేదీలు తెహ్రాన్‌లో సెలవు కాగా, జూలై 6 జాతీయ సెలవు దినంగా ప్రకటించినట్టు నిర్వాహక కమిటీ అధిపతి, ఉపాధ్యక్షుడు మొహమ్మద్ రజా ఆరిఫ్ చెప్పారు.

ఈ కార్యక్రమాలకు కోటీ 20 లక్షల మంది నుంచి కోటీ 50 లక్షల మంది హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారని, అయితే ఈ సంఖ్య రెండు కోట్లకు కూడా చేరవచ్చని తెహ్రాన్‌లో కార్యక్రమాల భద్రతను పర్యవేక్షిస్తున్న ఐఆర్‌జీసీ సీనియర్ కమాండర్ బ్రిగేడియర్ జనరల్ హసన్ హసన్‌జాదే చెప్పారు.

పది వేల మందికి పైగా భద్రతా సిబ్బందిని మోహరించినట్టు, 10 సైనిక ఆసుపత్రులను సన్నద్ధంగా ఉంచినట్టు సైనిక ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ మొహమ్మద్ అకరామినియా తెలిపారు. అదనంగా లక్షన్నర మంది పోలీసులు అప్రమత్తంగా ఉంటారు. జూలై 6న తెహ్రాన్ గగనతలాన్ని, జూలై 9న మషద్ నగరం గగనతలాన్ని మూసివేస్తారు.

ఇరాన్, ఇరాక్, అమెరికా, యుద్ధం, అంత్యక్రియలు

ఫొటో సోర్స్, KHAMENEI.IR / AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, ఖమేనీకి ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ అధినేత నివాళులర్పించారు.

భౌతికకాయాన్ని ఇంతకాలం ఎలా భద్రపరిచారు?

అలీ ఖమేనీ, ఆయన కుటుంబ సభ్యుల భౌతిక కాయాలను ఇంతకాలం ఎలా భద్రపరిచారు, ఖననానికి ఇంత ఆలస్యం ఎందుకు జరిగింది అన్నది చర్చనీయాంశంగా మారింది. కానీ, దీనిపై ఇరాన్ స్పష్టమైన సమాచారం ఇవ్వలేదు.

భౌతికకాయాన్ని రసాయనాలతో భద్రపరచడాన్ని ఇస్లాంలో వ్యతిరేకిస్తారు కాబట్టి సాధారణంగా మరణించిన వెంటనే ఖననం చేస్తారని విశ్లేషకులు అంటున్నారు.

"చల్లని ఉష్టోగ్రతలో ఉండే కోల్డ్ స్టోరేజ్ పద్ధతి ఉపయోగించడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అంతేగానీ ఎంబామింగ్ పద్ధతిలో కాదు. ఎందుకంటే ఇస్లాంలో రసాయన ఎంబామింగ్‌పై నిషేధం ఉంది" అని కౌంటర్ టెర్రరిజం నిపుణులు, డాక్టర్ ఒమర్ మొహమ్మద్ చెప్పినట్టు ఫాక్స్ న్యూస్ డిజిటల్ తెలిపింది.

"షియా చట్టం ప్రకారం ప్రత్యేక సందర్భాల్లో ఖననాన్ని వాయిదా వేయడానికి, భౌతికకాయాన్ని చల్లని ప్రదేశంలో భద్రపరచడానికి అనుమతి ఉంటుంది. సుప్రీం లీడర్ విషయంలో మత పెద్దల నుంచి మినహాయింపులను సులభంగా పొందవచ్చు" అని ఆయన అన్నారు.

అమెరికా, ఇజ్రాయెల్ మధ్య జరిగిన 40 రోజుల యుద్ధం కారణంగానే తుది వీడ్కోలు కార్యక్రమాలు వాయిదా పడ్డాయని భావిస్తున్నారు.

అమెరికా, ఇరాన్ 60 రోజుల కాల్పుల విరమణ కోసం జూన్ 15న ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. అంతకు రెండు రోజుల ముందు ఖమేనీ అంత్యక్రియల షెడ్యూల్‌ను ఇరాన్ ప్రకటించింది.

ఇరాన్, ఇరాక్, అమెరికా, యుద్ధం, అంత్యక్రియలు

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, మొజ్తబా ఖమేనీ చాలా నెలల నుంచి బహిరంగంగా కనిపించడం లేదు.

మొజ్తబా ఖమేనీ హాజరుపై ఉత్కంఠ

అలీ ఖమేనీ తుది వీడ్కోలు కార్యక్రమాలకు మొజ్తాబా ఖమేనీ హాజరు కావడంపై ఇంకా స్పష్టత రాలేదు.

ఫిబ్రవరి 28న, అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అల్లుడు, మనవడు, ఓ కూతురు, మొజ్తబా ఖమేనీ భార్యతో సహా ఆయన కుటుంబ సభ్యులు పలువురు మరణించారు.

అలీ ఖమేనీ భార్య సోదరుడైన హసన్ ఖోజస్తా బఘీర్‌జాదే ఒక టీవీ కార్యక్రమంలో 'నాయకుడి రెండో కుమార్తె' కోసం ప్రార్థించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారని బీబీసీ ఉర్దూ తెలిపింది. దీంతో ఖమేనీ కుటుంబంలోని కొంతమంది సభ్యుల ఆరోగ్యంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి.

అలీ ఖమేనీకి నలుగురు కుమారులు, ఇద్దరు కూతుళ్లు. వారిలో ఒక కూతురు బుష్రా ఖమేనీ దాడి జరిగిన రోజే మరణించినట్టు సమాచారం.

దీంతో హసన్ ఖోజస్తా బఘీర్‌జాదే బహుశా ఖమేనీ మరో కూతురు హుదా ఖమేనీని ఉద్దేశించి మాట్లాడి ఉంటారని పరిశీలకులు భావిస్తున్నారు. ఎందుకంటే, ఆమె భర్త మిస్బా అల్-హుదా బాకిర్ కూడా అదే రోజు మరణించినట్టు తెలుస్తోంది.

మొజ్తబా ఖమేనీ ఆరోగ్యం గురించి కూడా పరస్పర విరుద్ధమైన రిపోర్టులు వచ్చాయి.

తండ్రి అంత్యక్రియల కార్యక్రమంలో మొజ్తబా ఖమేనీ పాల్గొనే విషయం 'కమిటీ అధికార పరిధిలోకి రాదు' అని ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శి అలీ అక్బర్ అన్నారు.

అలీ ఖమేనీ అంత్యక్రియల సందర్భంగా జరిగే జనాజా నమాజ్ ప్రార్థనలకు ఎవరు నాయకత్వం వహిస్తారనే విషయంలో ఇంకా స్పష్టత లేదు.

షియా మత సంప్రదాయంలో ముఖ్యంగా అత్యున్నత మత గురువుల మర్జాఈ-ఎ-తక్లీద్ విషయంలో అంత్యక్రియల ప్రార్థనకు నాయకత్వం వహించే వ్యక్తి ఎంపికకు మతపరమైన ప్రాముఖ్యత మాత్రమే కాకుండా రాజకీయ ప్రాముఖ్యత కూడా ఉంటుంది.

మొజ్తబా ఖమేనీ చాలా నెలల తర్వాత ప్రజల ముందుకొచ్చి అంత్యక్రియల ప్రార్థనకు నాయకత్వం వహిస్తే అది ప్రభావవంతమైన రాజకీయ పరిణామాలకు దారితీయవచ్చని కొంతమంది పరిశీలకులు భావిస్తున్నారు. అయితే, అలీ ఖమేనీ వీలునామా అధికారికంగా విడుదల కానందున ఈ సమయంలో కచ్చితంగా ఏమీ చెప్పలేమని నిపుణులు అంటున్నారు.

అలీ ఖమేనీ వీలునామా గురించి తనకు తెలియదని మషద్‌లో శుక్రవార ప్రార్థనల ఇమామ్ అయిన అహ్మద్ ఆలం అల్-హుదా గత నెలలో చెప్పారు.

ఇరాన్, ఇరాక్, అమెరికా, యుద్ధం, అంత్యక్రియలు

ఫొటో సోర్స్, Morteza Nikoubazl/NurPhoto via Getty Images

ఫొటో క్యాప్షన్, అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో అలీ ఖమేనీ మరణించారు.

ఏ రోజు, ఏం జరుగుతాయంటే...

జూలై 4-5 – తెహ్రాన్‌లో అంత్యక్రియల ప్రార్థనలు

తెహ్రాన్‌లోని గ్రాండ్ మొసల్లాలో రెండు రోజుల సంతాప కార్యక్రమం జరుగుతుంది. స్థానిక కాలమానం ప్రకారం, జూలై 4వ తేదీ ఉదయం 6 గంటలకు ప్రవేశ ద్వారాలు తెరుచుకుంటాయి. జూలై 5వ తేదీ రాత్రి 8 గంటలకు మూసివేస్తారు. ప్రధాన అంత్యక్రియల ప్రార్థన జూలై 5వ తేదీ ఉదయం జరుగుతుంది.

ఖమేనీతో పాటు, ఆయన కుమార్తె బుష్రా హుస్సేనీ ఖమేనీ, కోడలు జహ్రా హద్దాద్-ఆదిల్ (మొజ్తాబా ఖమేనీ భార్య), అల్లుడు మిస్బా అల్-హుదా బాకెరీ, మనవరాలు జహ్రా భౌతికకాయాలకు కూడా చివరిగా ప్రజలు నివాళులర్పిస్తారు.

జూలై 6 - తెహ్రాన్‌లో చివరి ప్రయాణం

స్థానిక కాలమానం ప్రకారం, ఉదయం 6 గంటలకు అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. ప్రజలు భారీగా తరలివచ్చే అవకాశం ఉండడంతో ఒకే రహదారిపై సరిపడినంత స్థలం ఉండదని, ఊరేగింపుకు రాజధాని నగరంలోని సుదీర్థ మార్గాన్ని ఎంపిక చేశారు. ఈ కార్యక్రమాన్ని సాయంత్రానికి పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు.

జూలై 7 - కుమ్‌కు చివరి ప్రయాణం

ఇరాన్‌లోని ప్రధాన మత నగరమైన కుమ్‌లో ఈ కార్యక్రమం స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 5 గంటలకు ప్రారంభమవుతుంది. జామ్‌కరన్ మసీదులో ఒక సీనియర్ మత గురువు ప్రార్థనలకు నాయకత్వం వహిస్తారు.

జూలై 8 – నజఫ్, కర్బలాకు చివరి ప్రయాణం

జూలై 7వ తేదీ సాయంత్రం ఖమేనీ పార్థివదేహం నజఫ్‌కు చేరుకుంటుందని ఇరాక్‌లోని ఇరాన్ సాంస్కృతిక ప్రతినిధి ఘోలమ్‌రెజా అబాజారి తెలిపారు. జూలై 8న నజఫ్‌లో స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 6 గంటలకు, కర్బలాలో సాయంత్రం 4 గంటలకు అంతిమయాత్ర జరుగుతుంది. ఆ తర్వాత భౌతికకాయాన్ని తిరిగి ఇరాన్‌కు తరలిస్తారు.

జూలై 9 - మషద్‌లో ఖననం

ఈశాన్య నగరమైన మషద్‌లో ఎనిమిదో షియా ఇమామ్ అయిన ఇమామ్ రజా సమాధి దగ్గర ఖమేనీ భౌతికకాయాన్ని ఖననం చేయనున్నారు.

ఇరాన్, ఇరాక్, అమెరికా, యుద్ధం, అంత్యక్రియలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అయతొల్లా అలీ ఖమేనీ(ఫైల్ ఫోటో)

భౌతికకాయాన్ని ఇరాక్‌కు ఎందుకు తీసుకెళ్తున్నారు?

మక్కా, మదీనా తర్వాత నజఫ్, కర్బలా షియా ముస్లింలకు అత్యంత పవిత్రమైన నగరాలుగా పరిగణిస్తారు.

నజఫ్‌లో మొదటి షియా ఇమామ్, ప్రవక్త ముహమ్మద్ బంధువు అయిన ఇమామ్ అలీ సమాధి ఉంది. కర్బలాలో ఇమామ్ హుస్సేన్ సమాధి ఉంది. కర్బలా యుద్ధంలో ఆయన అమరత్వం షియా ముస్లింల విశ్వాసానికి, మత సంప్రదాయానికి కేంద్రంగా పరిగణిస్తారు.

ఇరాక్ గిరిజన నాయకులు, మత పెద్దలు, మేధావులు, రాజకీయ ప్రముఖుల అభ్యర్థన మేరకు ఈ కార్యక్రమ ఏర్పాట్లు జరిగాయని ఇరాన్ అధికారులు చెబుతున్నారు.

జూన్ 28న బాగ్దాద్ పర్యటన సందర్భంగా విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ఈ కార్యక్రమాల నిర్వహణలో సహకరించినందుకు ఇరాక్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమాలు ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక, మతపరమైన సంబంధాల బలాన్ని ప్రతిబింబిస్తున్నాయని ఆయన అన్నారు. ఈ సన్నాహాలపై చర్చించేందుకు ఆయన నజఫ్, కర్బలా గవర్నర్లతో కూడా సమావేశమయ్యారు.

ఇరాన్, ఇరాక్, అమెరికా, యుద్ధం, అంత్యక్రియలు

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, అలీ ఖమేనీకి విదేశీ ప్రముఖులు నివాళులర్పించారు.

రాజకీయ ప్రాధాన్యత

ఈ వేడుకలను ఇరాన్ వెలుపల ఉన్న షియా ముస్లింలలో కూడా ఖమేనీ ప్రభావాన్ని తెలియజేయడానికి, షియా ఇస్లాం ప్రధాన కేంద్రాల్లో తెహ్రాన్ మతపరమైన, రాజకీయ ప్రాబల్యాన్ని ప్రపంచానికి చాటే ప్రయత్నంగా కూడా చూడొచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ కార్యక్రమాలను సమన్వయం చేయడానికి ఇరాన్ విదేశాంగ మంత్రి కొన్ని రోజుల క్రితం బాగ్దాద్‌ను సందర్శించారు. నజఫ్, కర్బలాలో ఈ కార్యక్రమాలను నిర్వహించడం షియాల్లో అలీ ఖమేనీకి ఉన్న స్థానం ఇరాన్ సరిహద్దులను దాటి విస్తరించిందన్నదానికి నిదర్శనమని, ఈ కార్యక్రమాలకు "ప్రతీకాత్మక ప్రాముఖ్యత" ఉందని అబ్బాస్ అరాఘ్చీ తెలిపారు.

ఈ కార్యక్రమాల నిర్వహణలో ఇరాక్ ప్రభుత్వం కూడా కీలకపాత్ర పోషిస్తోంది.

నజఫ్, కర్బలా గవర్నర్లు, ఇరాక్ రవాణా మంత్రిత్వ శాఖ, హోంశాఖ, విదేశాంగశాఖ, ప్రధాన మంత్రి కార్యాలయం కలిసి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించనున్నాయి.

తెహ్రాన్, ఖోమ్, నజఫ్, కర్బలాల్లో జరిగే కార్యక్రమాల అనంతరం తుది ఘట్టం మషద్‌లో జరుగుతుంది. ఎనిమిదో షియా ఇమామ్ రజా సమాధి ప్రాంగణంలో అలీ ఖమేనీని ఖననం చేస్తారు.

అంత్యక్రియల అనంతరం నలభై రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో మతపరమైన సమావేశాలు, ప్రార్థనలు మొదలైనవి నిర్వహిస్తామని, అలాగే వచ్చే ఏడాది వరకు కూడా కార్యక్రమాలు, సదస్సులు కొనసాగిస్తామని నిర్వాహకులు తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)