విమానం గాల్లో ఉండగా ఊడిన కిటికీ నుంచి కిందకు పడిపోతున్న ప్రయాణికుడిని కాపాడిన తోటి ప్రయాణికులు

ఫొటో సోర్స్, NurPhoto /Getty Images
- రచయిత, జారోస్లావ్ లుకీవ్ , థియో లెగెట్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
- ప్రచురణ
- చదివే సమయం: 4 నిమిషాలు
గాల్లో ప్రయాణిస్తున్న ర్యాన్‌ఎయిర్ విమానం కిటికీ ఊడిపోవడంతో, ఆ కిటికీ పక్కనే కూర్చున్న ప్రయాణికుడు బయటకు పడిపోయే ప్రమాదం నుంచి తోటి ప్రయాణికులు కాపాడారు.
విమానం గాల్లోకి ఎగిరిన 10 నిమిషాలకే హఠాత్తుగా 9,000 అడుగుల ఎత్తు నుంచి కిందకు దిగిపోయినట్టు ఫ్లైట్ ట్రాకింగ్ డేటా చెబుతోంది. ఆ సమయంలో 'ఏదో పేలుడు జరిగినట్టు' శబ్దం వినిపించిందని ప్రయాణికులు స్థానిక మీడియాతో చెప్పారు.
61 ఏళ్ల సెర్బియా ప్రయాణికుడికి రాపిడి వల్ల గాయాలయ్యాయని, చికిత్స పొందుతున్నారని గ్రీస్‌లోని ఓ ఆస్పత్రి అధికారి మిచాలిస్ గియానాకోస్ తెలిపారు.
"ఆయన బయటకు పడిపోకుండా, ఆయన భార్య సుమారు ఐదు నిమిషాల పాటు ఆయన కాళ్లను గట్టిగా పట్టుకున్నారు" అని తెలిపారు.

అసలేం జరిగింది?
గ్రీస్‌లోని థెస్సలోనికి నగరం నుంచి జర్మనీలోని మెమ్మింగెన్‌కు శుక్రవారం ఉదయం బయలుదేరిన ఈ విమానం గాల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఒక ప్రయాణికుడి పక్కనున్న కిటికీ ఊడిపోవడంతో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే వెనక్కి తిరిగివచ్చినట్టు ర్యాన్ఏయిర్ ఒక ప్రకటనలో తెలిపింది.
"విమానం సాధారణంగానే ల్యాండ్ అయింది, ప్రయాణికులు టెర్మినల్‌కు చేరుకున్నారు. థెస్సలోనికిలో ఒక ప్రయాణికుడు వైద్య సహాయం కోరగా, గ్రౌండ్ సిబ్బంది సేవలు అందించారు" అని ఐరిష్ బడ్జెట్ ఎయిర్‌లైన్ పేర్కొంది.
కొన్నిగంటల తర్వాత ప్రయాణికులను మెమ్మింగెన్‌కు పంపడానికి ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేసినట్లు కూడా తెలిపింది.
ఆ ప్రయాణికుడు తల నుంచి భుజాల వరకు కిటికీ నుంచి బయటకు తలకిందులుగా వేలాడారని, ఇతర ప్రయాణికులు ఆయన్ను లోపలికి లాగారని తోటి ప్రయాణికులు స్థానిక మీడియాకు చెప్పారు. విమానం ఇంజిన్ ముక్కలు తగలడం వల్లే కిటికీ పగిలిపోయిందని విమానంలో ఉన్నవారు చెప్పారు. అయితే, ర్యాన్ఏయిర్ దీనిపై ఇంకా స్పందించలేదు.

ఫొటో సోర్స్, Star channel
'తల నుంచి భుజాలవరకు కిటికీ బయట వేలాడాయి’
"విమానంలో వాయుపీడనం ఒక్కసారిగా తగ్గిపోయినట్టు వెంటనే అర్థమైంది. ప్రయాణికుల అరుపులు వినిపించాయి. ఎవరో ప్రమాదవశాత్తూ అత్యవసర తలుపు తెరిచారనుకున్నాను" అని తోటి ప్రయాణికురాలు క్రిస్టినా రేడియో థెస్సలోనికితో చెప్పారు.
"ఆక్సిజన్ మాస్కులు కిందకు పడ్డాయి, ఘాటైన వాసన వచ్చింది. ఒక ప్రయాణికుడి తల, భుజాలు కిటికీ బయటకు వెళ్లిపోయాయి. అదృష్టవశాత్తూ ఆయన సీట్ బెల్ట్ తీయలేదు" అన్నారు.
మరో ప్రయాణికురాలు సోఫియా రేడియో థెస్సలోనికితో మాట్లాడుతూ: "ఆక్సిజన్ మాస్కులు కిందకు పడినప్పుడు ఏం జరగబోతుందో అర్థం కాలేదు. మేం క్షేమంగా తిరిగి వెళ్తామా లేదో కూడా తెలియలేదు. మేం విమానం వెనుక భాగంలో కూర్చున్నాం, ఏదో ఒక రకమైన పేలుడు జరిగిందని అర్థమైంది" అన్నారు.
"విమానం కిందకు పడిపోతోందనుకున్నాం. వాయుపీడనం తీవ్రంగా పడిపోయింది. ఊపిరి తీసుకోలేకపోతున్నట్లు అనిపించింది. గాయపడిన వ్యక్తికి రక్తస్రావం జరిగింది, ఆక్సిజన్ లేకపోవడం, షాక్ వల్ల ఆయన చాలాసార్లు స్పృహ కోల్పోయారు" అని సోఫియా వివరించారు.
"బాధితుడు తీవ్ర దిగ్భ్రాంతిలో ఉన్నప్పటికీ, స్పృహలోనే ఉన్నారు" అని పాన్‌హెలెనిక్ పబ్లిక్ హాస్పిటల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు మిచాలిస్ గియానాకోస్ తెలిపారు.

ఫొటో సోర్స్, Star channel
సీట్ బెల్ట్ కాపాడిందా?
సుమారు 18 ఏళ్ల నాటిదిగా భావిస్తున్న ఈ విమానాన్ని, ర్యాన్ఏయిర్ అనుబంధ సంస్థ అయిన 'మాల్టా ఎయిర్' నడుపుతోంది.
"ప్రస్తుతం ఈ ఘటనపై హెలెనిక్ ఎయిర్ అండ్ రైల్ సేఫ్టీ ఇన్వెస్టిగేషన్ అథారిటీ విచారణ జరుపుతోంది" అని థెస్సలోనికి విమానాశ్రయ ఆపరేటర్ 'ఫ్రాపోర్ట్ గ్రీస్' తెలిపింది.
"సంబంధిత విభాగాలకు పూర్తిగా సహకరిస్తున్నాం. నిర్దేశిత అత్యవసర సహాయక చర్యలను అమలు చేశాం" అని తెలిపింది.
ఈ ఘటన గురించి తెలుసని, విచారణాధికారులకు అవసరమైన సహాయాన్ని అందిస్తామని ఐరిష్ ఏవియేషన్ అథారిటీ అంతకుముందు బీబీసీకి తెలిపింది.
సీట్ బెల్ట్ పెట్టుకోకపోయి ఉంటే ఈ ప్రమాదం 'ఇంకా తీవ్రంగా ఉండేదని' రిటైర్డ్ ఎయిర్‌లైన్ పైలట్ క్రిస్ బ్రాడీ బీబీసీతో చెప్పారు.
"మేం బెల్ట్ సైన్ ఆఫ్ చేసినప్పటికీ, ప్రయాణికులు ముందస్తు జాగ్రత్తగా సీట్ బెల్ట్‌లు పెట్టుకునే ఉండాలని కెప్టెన్‌లుగా ఎప్పుడూ చెబుతుంటాం. ఇలాంటి ఊహించని సంఘటనలు లేదా గాల్లో వచ్చే కుదుపులను తట్టుకోవడానికే అలా చెబుతాం. కాబట్టి ప్రయాణంలో సీట్ బెల్ట్ పెట్టుకుని ఉండటం మంచి అలవాటు" అన్నారు.
గతంలో 2018లో, అమెరికాలో జరిగిన ఒక సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ ప్రమాదంలో దెబ్బతిన్న ఇంజిన్ ముక్కలు తగిలి కిటికీ పగిలిపోయింది. ఆ సమయంలో ఒక మహిళా ప్రయాణికురాలు కిటికీలోంచి సగం శరీరం బయటకు వేలాడటంతో ప్రాణాలు కోల్పోయారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























