వియత్నాం : భారత పర్యటకుల బోటు బోల్తా, 15 మంది మృతి

వియత్నాంలో బోటు ప్రమాదం, భారత పర్యటకులు మృతి

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, బోటు ప్రమాదంలో బాధితులను రక్షించడానికి అధికారులు జవాన్లను రంగంలోకి దించారు.
ప్రచురణ
చదివే సమయం: 3 నిమిషాలు

వియత్నాంలోని ఫూ క్వాక్ ద్వీపం సమీపంలో భారత పర్యటకుల బృందంతో వెళ్తున్న ఒక స్పీడ్‌బోట్ బోల్తా పడటంతో 15 మంది మరణించారు. మృతుల్లో 13 మంది పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు.

వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం ఈ ప్రమాదాన్ని ధృవీకరించింది

అధికారుల ప్రాథమిక సమాచారం ప్రకారం, 32 మంది పర్యటకులు, కొందరు సిబ్బందితో వెళ్తున్న ఆ స్పీడ్‌బోట్ శనివారం (జూలై 11) మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో అదుపుతప్పింది.

'తువోయ్ త్రే' వార్తాసంస్థ కథనం ప్రకారం, ప్రమాద స్థలం నుంచి 23 మందిని ఒడ్డుకు చేర్చారు, ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తున్నారు. ఒడ్డుకు చేర్చిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఏజీ 26751 రిజిస్ట్రేషన్ నంబర్ గల ఈ స్పీడ్‌బోట్ 'మిన్ హుయ్ ఫూ క్వాక్ ట్రేడింగ్ అండ్ టూరిజం కంపెనీ లిమిటెడ్'కు చెందినది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
వియత్నాంలో బోటు ప్రమాదం, భారత పర్యటకులు మృతి

ఫొటో సోర్స్, AFP via Getty Images

ప్రమాదం ఎలా జరిగింది?

హోన్ మే రుట్ న్గోయ్ నుంచి దాదాపు 400 మీటర్లు ముందుకు వెళ్లిన తర్వాత స్పీడ్‌బోట్‌లో అకస్మాత్తుగా సాంకేతిక లోపం తలెత్తి బోల్తా పడింది. దీంతో ప్రయాణికులు, సిబ్బంది అందరూ సముద్రంలో పడిపోయారు.

ఒక వీడియోలో ప్రమాద స్థలంలో బలమైన గాలులు వీస్తూ, భారీ అలలు ఎగసిపడుతుండటం కనిపించింది. సహాయక సిబ్బంది నీటిలో ఉన్నవారికి లైఫ్‌జాకెట్లను విసురుతుండగా, జెట్ స్కీల సహాయంతో బాధితులను ఒడ్డుకు చేరుస్తుండటం కనిపించింది.

సరిహద్దు రక్షణ దళం సహాయక చర్యల కోసం రెండు బోట్లు, 35 మంది జవాన్లను రంగంలోకి దించింది. ఈ ఆపరేషన్‌లో నేవీ, కోస్ట్‌గార్డ్, ఇతర సంబంధిత విభాగాలు కలిసి పనిచేశాయి.

వియత్నాంలో బోటు ప్రమాదం, భారత పర్యటకులు మృతి

ఫొటో సోర్స్, Video Grab

వియత్నాంలో బోటు ప్రమాదం, భారత పర్యటకులు మృతి

ఫొటో సోర్స్, @AmbHanoi

ఫొటో క్యాప్షన్, భారత రాయబార కార్యాలయం 32 మంది భారత పర్యటకుల జాబితా విడుదల చేసింది.

భారత రాయబార కార్యాలయం ఏం చెప్పింది?

సహజ సౌందర్యానికి ప్రసిద్ధి చెందిన 'హోన్ మే రుట్' ద్వీపం వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఫూ క్వాక్‌లోని అత్యుత్తమ కోరల్ రీఫ్ డైవింగ్ ప్రదేశాలలో ఇది ఒకటి. ఈ ప్రాంతానికి చేరుకోవడానికి పర్యటకులు సాధారణంగా పడవలను ఉపయోగిస్తారు, ఇందుకు సుమారు 20 నుంచి 40 నిమిషాల సమయం పడుతుంది.

వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం (ఎంబసీ) 'ఎక్స్' వేదికగా స్పందిస్తూ, "అధికారిక వర్గాల సమాచారం ప్రకారం, కొన్ని గంటల కిందట వియత్నాంలోని ఫూ క్వాక్ ద్వీపం సమీపంలో బోల్తా పడిన పడవలో 32 మంది భారత పర్యటకులు ఉన్నారు" అని పేర్కొంది.

"ప్రమాదంలో జరిగిన ప్రాణనష్టం, ఇతర వివరాలను సేకరిస్తున్నాం. కచ్చితమైన సమాచారం అందిన వెంటనే మరిన్ని వివరాలను పంచుకుంటాం" అని తెలిపింది.

పడవలో ప్రయాణించిన ఆ 32 మంది భారత పర్యటకుల జాబితాను కూడా రాయబార కార్యాలయం విడుదల చేసింది.

"ప్రమాదానికి గురైన కుటుంబాలకు సమాచారం, సహాయం అందించడం కోసం హో చి మిన్ సిటీలోని భారత రాయబార కార్యాలయం ఒక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది.

కింది నంబర్ల ద్వారా వారిని సంప్రదించవచ్చు: +84 36 281 7930, +84 91 552 37 14, +84 33 452 0414. అలాగే హనోయిలో కూడా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటయింది.

సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి

వియత్నాంలో బోటు ప్రమాదంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

సీఎంఓ ఎక్స్ పోస్టులో "ప్రమాద వివరాలను తెలుసుకోవడంతో పాటు సహాయక చర్యలను ముమ్మరం చేయడంలో విదేశీ వ్యవహారాల శాఖతో పాటు వియత్నాంలోని భారత రాయబార కార్యాలయ అధికారులతో సంప్రదింపులు జరిపి అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.

ఈ ప్రమాదంలో తెలుగువారు ఉన్నారని ప్రాథమిక సమాచారం అందడంతో పూర్తి సమాచారం తీసుకోవాలని, గాయపడిన వారికి అవసరమైన వైద్యం అందించడానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. బాధితులకు ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి తెలిపారు" అని రాసింది.

ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ ప్రమాదానికి సంబంధించి బాధిత కుటుంబాలు 9885371189 7997959754 9989654807 7997959779 నెంబర్లలో సంప్రదించవచ్చని తెలిపింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)