హవానా సిండ్రోమ్: అమెరికా గూఢచారులను వింత శబ్దాలతో విసిగిపోయేలా చేసిన ఈ వ్యాధి ఏమిటి? దీని వెనుక ఎవరున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, డియర్‌బైల్ జోర్డాన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 3 నిమిషాలు
అమెరికా గూఢచారులు, దౌత్యవేత్తలు, వారి కుటుంబసభ్యులు ఎదుర్కొన్న హవానా సిండ్రోమ్ అనే అంతుపట్టని నాడీ సంబంధిత రుగ్మత బాధితులకు అమెరికా ప్రభుత్వం దాదాపు 3 మిలియన్ డాలర్ల (రూ. 28.59కోట్లు) పరిహారం చెల్లించింది.
ఈ అనారోగ్య సమస్యకు సంబంధించి అమెరికా ప్రభుత్వ ఏజెన్సీల సిబ్బందికి చెల్లించిన తొలి పరిహారం ఇది. దాదాపు పదేళ్ల కిందట క్యూబా రాజధాని హవానాలో పనిచేసిన సీఐఏ అధికారులలో ఈ అంతుపట్టని రుగ్మతకు సంబంధించి తొలి నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
ఆ తర్వాత చైనా సహా ఇతర దేశాల్లో పనిచేస్తున్న అమెరికా సిబ్బంది కూడా 'అసాధారణ ఆరోగ్య ఘటనలు' ఎదుర్కొన్నట్లు వెల్లడించారు.
ఈ సమస్యతో బాధపడేవారు మంద్రస్థాయి ధ్వనులు, క్లిక్ మనే చప్పుడు, లోహాలు ఒరుసుకున్న ధ్వనులు వినిపించేవని చెప్పారు. మరికొందరు తలపై తీవ్రమైన ఒత్తిడి, మైకం, వికారం వంటి లక్షణాలు ఎదుర్కొన్నట్లు వివరించారు.
2021లో అమల్లోకి వచ్చిన 'హవానా యాక్ట్' కింద ఈ పరిహారం చెల్లించినట్లు అమెరికా రక్షణ శాఖ ప్రకటించింది. బాధిత సిబ్బంది సంక్షేమానికి ఎల్లప్పుడూ ప్రాధాన్యతనిస్తూనే ఉంటామని తెలిపింది.

ఏమిటీ హవానా సిండ్రోమ్?
అసలింతకీ ఏమిటీ హవానా సిండ్రోమ్? దీని వెనుక ఎవరున్నారు అనే అంశంపై ఎన్నో ఏళ్లుగా విస్తృత ఊహాగానాలు సాగుతున్నాయి.
కొంతమంది ఈ ఆరోగ్య సమస్యకు మైక్రోవేవ్‌లే కారణమని పేర్కొన్నారు. దీంతో ఏదైనా విదేశీ శక్తులు అమెరికా సిబ్బంది, వారి కుటుంబ సభ్యులపై ప్రత్యేక రకం సోనార్ లేదా ఇతర రహస్య ఆయుధాన్ని ప్రయోగించి ఉండొచ్చనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి.
"నా మెదడు దెబ్బతింది" అని మాజీ సీఐఏ అనలిస్ట్ ఎరికా స్టిత్ 2022లో సీబీఎస్ న్యూస్‌తో చెప్పారు.
"దేశానికి సేవ చేయడం వల్లే మాకు ఈ పరిస్థితి వచ్చింది. మమ్మల్ని చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది" అన్నారు.
అమెరికా సిబ్బందికి, వారి కుటుంబాలకు హాని కలిగించడానికి ఏదైనా విదేశీ శక్తి కొత్త తరహా ఆయుధాన్ని లేదా ప్రయోగ దశలో ఉన్న పరికరాన్ని ఉపయోగించి ఉండే అవకాశం 'చాలా తక్కువ' అని గత ఏడాది అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థలు, ప్రభుత్వ విభాగాలలో మెజార్టీ విభాగాలు అంచనా వేశాయి.
అయినప్పటికీ, అమెరికా నిఘా వ్యవస్థలోని కొంతమంది ఆ అవకాశాన్ని పూర్తిగా కొట్టిపారేయలేదు.
ఈ అంశంపై సంప్రదించిన ఏ నిఘా సంస్థా లేదా ప్రభుత్వ విభాగమూ అమెరికా సిబ్బంది, వారి కుటుంబాలు ఎదుర్కొన్న అనుభవాలను లేదా వారు అనుభవించిన బాధను ప్రశ్నించలేదని నేషనల్ ఇంటెలిజెన్స్ కౌన్సిల్ విడుదల చేసిన నివేదిక తెలిపింది.
అమెరికా సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు నిజంగానే కొన్నిసార్లు తీవ్రమైన నొప్పితో, మానసిక వేదన కలిగించే శారీరక లక్షణాలు, ఇంద్రియాలకు సంబంధించిన అసాధారణ అనుభూతులను ఎదుర్కొన్నారని, వాటినే వారు నిజాయితీగా 'అసాధారణ ఆరోగ్య ఘటనలు'గా నివేదించారని నిఘా వర్గాలు విశ్వసిస్తున్నట్లు నివేదిక పేర్కొంది.

మొదటిసారి ఎప్పుడు బయటపడింది?
హవానా సిండ్రోమ్ అనేది తొలిసారి 2016లో వెలుగులోకి వచ్చిన ఒక వింత నాడీ సంబంధిత ఆరోగ్య సమస్య. క్యూబాలోని అమెరికా దౌత్యవేత్తలు రాత్రి వేళల్లో వింత శబ్దాలు విన్నామని, అనారోగ్యానికి గురయ్యామని రిపోర్ట్ చేయడంతో ఈ విషయం ప్రపంచానికి తెలిసింది.
ఆ తర్వాత వాషింగ్టన్ నుంచి చైనా వరకు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో ఇలాంటి కేసులు నమోదయ్యాయి.
ఈ పరిణామాలు విదేశీ శక్తులు ఏదైనా రహస్య ధ్వని ఆయుధాన్ని ఉపయోగించి దాడి చేసి ఉండవచ్చనే అనుమానాలకు దారితీశాయి.
2017లో హవానాలోని అమెరికా ఎంబసీ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు తలతిరగడం, వికారం, ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలను ఎదుర్కొన్నారు. దీంతో అమెరికా ప్రభుత్వం అక్కడి సిబ్బందిలో సగానికి పైగా వెనక్కి పిలిపించింది.
కెనడా ప్రభుత్వం కూడా తమ ఎంబసీ సిబ్బందిలో ఇటువంటి లక్షణాలను గుర్తించడంతో 2019లో హవానాలోని తన సిబ్బంది సంఖ్యను గణనీయంగా తగ్గించింది.
ఈ హవానా సిండ్రోమ్ కేసులు పదేళ్ల కిందట వెలుగులోకి వచ్చినప్పటికీ, ఈ అనారోగ్య సమస్య ప్రచ్ఛన్న యుద్ధం కాలం ముందు నుంచే ఉందని కొందరు వాదిస్తున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























