అంకిత భండారీ హత్య కేసు: ఇండియా గేటు వద్ద తల్లిదండ్రుల ఆందోళన, అంకిత తండ్రి చేస్తున్న 5 డిమాండ్లు ఏమిటి?

అంకిత భండారీ తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్న దిల్లీ పోలీసులు
ఫొటో క్యాప్షన్, అంకిత భండారీ తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్న దిల్లీ పోలీసులు
ప్రచురణ
చదివే సమయం: 6 నిమిషాలు

దిల్లీలోని ఇండియా గేట్‌ వద్ద బుధవారం రాత్రంతా జరిగిన నిరసనల అనంతరం అంకిత భండారీ తల్లిదండ్రులతో పాటు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని కాంగ్రెస్‌ నాయకులు తెలిపారు.

వారిని కొంతసేపు నిర్బంధించిన తర్వాత గురువారం తెల్లవారుఝామున 5 గంటలకు విడుదల చేసినట్లు వార్తా సంస్థ పీటీఐ తెలిపింది.

అంకిత తల్లిదండ్రులను అదుపులోకి తీసుకోవడాన్ని కాంగ్రెస్ విమర్శించింది. ఇది నిస్సహాయులైన తల్లిదండ్రులపైన తీసుకున్నక్రూరమైన చర్యగా' అభివర్ణించింది.

తమ కుమార్తె హత్య కేసులో సీబీఐ దర్యాప్తు పూర్తయ్యే వరకు సిక్కిం గవర్నర్‌గా దుష్యంత్‌ కుమార్‌ గౌతమ్‌ నియమకాన్ని నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తూ అంకిత తల్లిదండ్రులు ఇండియా గేట్‌ సమీపంలో నిరసన తెలుపుతున్నారు.

ఉత్తరాఖండ్‌లోని ఓ రిసార్ట్‌లో పనిచేసిన అంకిత భండారీ 2022 సెప్టెంబర్‌లో హత్యకు గురయ్యారు. ఆమె ఉత్తరాఖండ్‌లోని పౌరీ గఢ్వాల్‌ జిల్లా గంగా–భోగ్‌పూర్‌ ప్రాంతంలోని వనంతర టూరిస్ట్‌ రిసార్ట్‌లో రిసెప్షనిస్టుగా పనిచేసేవారు.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఈ కేసులో తన పేరు రావడాన్ని నాటి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఉత్తరాఖండ్ ఇన్‌చార్జ్ దుష్యంత్ కుమార్ గౌతమ్ ఖండిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

డెహ్రాడూన్‌లోని దలన్ వాలా పోలీసుస్టేషన్ ఈ మేరకు ఆయన ఫిర్యాదు చేశారు. హరిద్వార్‌లోని జ్వాలాపూర్‌ మాజీ ఎమ్మెల్యే సురేశ్‌ రాథోడ్, నటి ఊర్మిళా సనావర్‌తో పాటు మరికొందరు గుర్తుతెలియని వ్యక్తులు తనకు వ్యతిరేకంగా పథకం ప్రకారం నేరపూరిత కుట్ర పన్నారని గౌతమ్‌ ఆ ఫిర్యాదులో ఆరోపించారు.

అక్టోబర్‌ 12న కేంద్ర ప్రభుత్వం దుష్యంత్‌ గౌతమ్‌ను సిక్కిం గవర్నర్‌గా నియమించింది.

సుప్రియా శ్రీనెతే
ఫొటో క్యాప్షన్, పోలీసులు బాధితులపై చర్యలు తీసుకోవడం ఏమిటని సుప్రియా శ్రీనెతే ప్రశ్నించారు

‘న్యాయానికి బదులు అన్యాయం చేస్తున్నారు’

అంకిత తల్లిదండ్రులను అదుపులోకి తీసుకోవడంపై కాంగ్రెస్‌ నాయకురాలు సుప్రియా శ్రీనతే తీవ్రంగా స్పందించారు.

"ఇదేం చర్య? నాలుగేళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్న నిస్సహాయ తల్లిదండ్రులపై ఇంత క్రూరంగా ప్రవర్తిస్తారా? వారికి న్యాయం చేయడానికి బదులుగా ప్రధాన నిందితుడినే గవర్నర్‌ను చేస్తున్నారు. ఆ తర్వాత తల్లిదండ్రులపైన కూడా క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. ఉదయం ఆరు గంటలు కాకముందే పిరికివాళ్లలా వచ్చి ఇక్కడి నుంచి అమ్మాయిలను తీసుకెళ్తున్నారు. దిల్లీ పోలీసుల ప్రవర్తన ఇదేనా?" అని ఆమె ప్రశ్నించారు.

దుష్యంత్‌ గౌతమ్‌ నియామకాన్ని రద్దు చేసే వరకు తమ నిరసన కొనసాగుతుందని అంకిత భండారీ తల్లి చెప్పారు.

"మా పోరాటం ఇక్కడితో ఆగదు, మేమిలాగే కూర్చుంటాం. ఒకవేళ మమ్మల్ని ఇక్కడ కూర్చోనివ్వకపోతే, మా సొంత ఇళ్లల్లోనే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతాం. ప్రభుత్వం దిగివచ్చి దుష్యంత్ నియామకాన్ని రద్దు చేయాల్సిందే. అలా చేయని పక్షంలో, దేశవ్యాప్తంగా ప్రజలంతా రోడ్లపైకి వచ్చి ఉద్యమిస్తారు. దీనివల్ల జరిగే పరిణామాలకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది'' అని ఆమె అన్నారు.

రాహుల్ గాంధీ
ఫొటో క్యాప్షన్, బాధితుల గొంతును ప్రభుత్వం అణిచివేస్తోందని రాహుల్ గాంధీ అన్నారు

ఆ తల్లి దండ్రులు చేసిన తప్పేంటి : రాహుల్

అంతకుముందు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ అంకితా భండారీ తల్లిదండ్రుల నిర్బంధాన్ని ఖండించారు. బాధితుల గొంతును ప్రభుత్వం అణిచివేస్తోందని, ప్రశ్నించేవారిని అదుపులోకి తీసుకుంటోందని రాహుల్ ఆరోపించారు.

"ఉదయం 4 గంటలు, ప్రపంచమంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో అంకితా భండారీ తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నారు. వారి చేసిన తప్పు ఏంటీ? వారు ఇండియా గేట్ వద్ద ఎలాంటి హాంగామా లేకుండా, బాధతో నిశ్శబ్ధంగా కూర్చొని, సీబీఐ విచారణ పూర్తి అయ్యే వరకు దుష్యంత్ గౌతమ్‌ను గవర్నర్‌గా నియమించొద్దని కోరారు" అని ఎక్స్‌లో రాహుల్ గాంధీ పోస్టు చేశారు.

"నేను, ప్రియాంక నిన్న వారిని కలిశాం. సీబీఐ దర్యాప్తు ఫలితాలు రాకముందే హడావుడిగా నియమాకాలు పూర్తి చేశారు. ప్రశ్నించిన తల్లిదండ్రులను చీకటిలో అదుపులోకి తీసుకున్నారు. బాధితుల గొంతును అణిచివేయడం, ప్రశ్నించే వారిని పక్కన పెట్టడం ఈ ప్రభుత్వానికి అలవాటుగా మారింది.

"న్యాయం కోసం జరుగుతున్న పోరాటాన్ని ఎవరూ అణచివేయలేరు, ఆపలేరు. అంకిత భండారీ కుటుంబానికి కుటుంబానికి కాంగ్రెస్ అండగా ఉంటుంది. వారికి న్యాయం జరిగే వరకు మద్దతు ఉంటుంది"

రాత్రంతా జరిగిన నిరసన తర్వాత, ఇండియా గేట్ వద్ద అంకితా భండారీ తల్లిదండ్రులతోపాటు పలువురిని దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొంత సమయం వారిని అదుపులోకి తీసుకున్న తర్వాత ఉదయం ఐదు గంటలకు విడుదల చేసినట్టు పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది

దుష్యంత్‌ గౌతమ్‌ను గవర్నర్‌గా నియమించాలన్న నిర్ణయంపై అంకిత తండ్రి వీరేంద్ర భండారీ తీవ్ర ఆవేదన, నిరాశ వ్యక్తం చేశారు.

కిందటేడాది అంకిత భండారీ హత్యకేసులో నిందితులకు శిక్ష పడిన తరువాత, అంకిత తండ్రి వీరేంద్ర భండారీ మీడియాతో మాట్లాడారు
ఫొటో క్యాప్షన్, కిందటేడాది అంకిత భండారీ హత్యకేసులో నిందితులకు శిక్ష పడిన తరువాత, అంకిత తండ్రి వీరేంద్ర భండారీ మీడియాతో మాట్లాడారు

అంకిత తండ్రి డిమాండ్లు

బీబీసీ న్యూస్‌ హిందీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అంకిత తండ్రి మాట్లాడుతూ, ఈ నిర్ణయం గురించి తెలిసిన తర్వాత తమ కుటుంబ సభ్యులెవరూ ఆ రాత్రంతా నిద్రపోలేదని, తీవ్ర మనోవేదనకు గురయ్యారని చెప్పారు.

బీబీసీ న్యూస్‌ హిందీ అసోసియేట్ జర్నలిస్ట్ ఆసిఫ్‌ అలీతో మాట్లాడిన సందర్భంగా అంకిత తండ్రి ఐదు ముఖ్యమైన డిమాండ్లు చేశారు.

1. అంకిత భండారీ కేసులో సీబీఐ దర్యాప్తు మొత్తాన్ని సుప్రీంకోర్టు ప్రస్తుత న్యాయమూర్తి లేదా పదవీ విరమణ చేసిన న్యాయమూర్తి ప్రత్యక్ష పర్యవేక్షణలో నిర్వహించాలి.

2. యమకేశ్వర్‌ ఎమ్మెల్యే రేణు బిష్త్‌ను విచారించాలి. ఘటన జరిగిన సమయంలో, అంటే సెప్టెంబర్‌ 22 నుంచి 23 మధ్య ఆమె ఫోన్‌ కాల్‌ వివరాలను పరిశీలించాలి. అలాగే వనంతర రిసార్ట్‌ను కూల్చివేయాలని ఎవరు ఆదేశించారో తేల్చాలి.

3. ఈ కేసులో ఊర్మిళా సనావర్‌, ఆమె భర్త వాంగ్మూలాలను అధికారికంగా నమోదు చేయాలి. సురేశ్‌ రాథోడ్‌కు నార్కో పరీక్ష నిర్వహించాలి.

4. 2022 సెప్టెంబర్‌ 18 నుంచి 24 మధ్య అజయ్‌ కుమార్‌, దుష్యంత్‌ కుమార్‌ గౌతమ్‌ల ఫోన్లు ఏయే ప్రాంతాల్లో ఉన్నాయో, ఆ సమయంలో వారి పూర్తి కాల్‌ వివరాలేమిటో దర్యాప్తు చేయాలి.

5. సెప్టెంబర్‌ 18, 19 తేదీల్లో నిందితుడు పుల్కిత్‌ ఆర్య ఫోన్‌ కాల్‌ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, ఆయన ఎవరెవరితో సంప్రదింపులు జరిపారో గుర్తించాలి.

ముగ్గురు దోషులకు జీవిత ఖైదు

అంకిత భండారీ హత్య కేసులో ప్రధాన నిందితులైన పుల్కిత్‌ ఆర్య, అంకిత్‌ గుప్తా, సౌరభ్‌ భాస్కర్‌లను 2025 మేలో కోర్టు దోషులుగా నిర్థరించింది.. ప్రస్తుతం వారు జీవిత ఖైదు అనుభవిస్తున్నారు.

అయితే ఈ కేసు దర్యాప్తులో పాల్గొన్న సీనియర్‌ పోలీసు అధికారి శేఖర్‌ సుయాల్‌, ఈ వ్యవహారంలో 'ఏ వీఐపీ పాత్రా లేదు' అని మరోసారి పేర్కొన్నారు.

అంకిత హత్య అనంతరం రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. అప్పట్లో పౌరీలో అదనపు పోలీసు సూపరింటెండెంట్‌గా పనిచేసిన సుయాల్‌ కూడా ఆ బృందంలో సభ్యుడిగా ఉన్నారు.

"2022 సెప్టెంబర్‌ 18 నుంచి 22 మధ్య రిసార్ట్‌లో బస చేసిన లేదా గదులు బుక్‌ చేసుకున్న ప్రతి వ్యక్తి గురించి క్షుణ్ణంగా దర్యాప్తు చేశాం. అయితే వారిలో ఎవరైనా నిజంగా 'వీఐపీ' అని చెప్పేందుకు ఎలాంటి నిర్దిష్ట సమాచారం లభించలేదు." అని 2026 జనవరిలో మీడియాతో మాట్లాడిన సుయాల్‌ చెప్పారు.

తనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి దుష్యంత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు
ఫొటో క్యాప్షన్, తనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి దుష్యంత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు

దుష్యంత్ ఖండన

అంకిత భండారీ హత్య కేసుపై నిరసనలు కొనసాగుతున్న సమయంలో, జనవరి 5న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఉత్తరాఖండ్‌ రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌ దుష్యంత్‌ కుమార్‌ గౌతమ్‌ తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

డెహ్రాడూన్‌లోని దలన్‌వాలా పోలీస్‌ స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదులో, హరిద్వార్‌లోని జ్వాలాపూర్‌ మాజీ ఎమ్మెల్యే సురేశ్‌ రాథోడ్, నటి ఊర్మిళా సనావర్‌తో పాటు మరికొందరు గుర్తుతెలియని వ్యక్తులు తనకు వ్యతిరేకంగా పథకం ప్రకారం నేరపూరిత కుట్ర పన్నారని ఆయన ఆరోపించారు.

తనకు వ్యతిరేకంగా అభ్యంతరకరమైన సమాచారాన్ని ప్రచారం చేయకుండా అడ్డుకోవాలని కూడా గౌతమ్‌ కోర్టులో పిటిషన్ వేశారు.

"ఇలాంటి సమాచారాన్ని తొలగించాలని సామాజిక మాధ్యమ వేదికలను ఆదేశించాలి. భవిష్యత్తులో కూడా ఇటువంటి ఆరోపణలు చేయకుండా శాశ్వత నిషేధం విధించాలి" అని ఆయన తన పిటిషన్‌లో కోరారు.

అంకిత భండారీ హత్య కేసుకు సంబంధించిన మొత్తం దర్యాప్తులో, ఛార్జిషీట్‌లో, కోర్టు విచారణల్లో ఎక్కడా తన పేరు ప్రస్తావనకు రాలేదని గౌతమ్‌ పేర్కొన్నారు.

తన ఎఫ్‌ఐఆర్‌లో కాంగ్రెస్‌ పార్టీపై కూడా ఆయన ఆరోపణలు చేశారు.

అంకిత భండారీ హత్య కేసులో దోషులను శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ ఉత్తరాఖండ్‌లో నిరసనలు జరిగాయి.

ఈ ఏడాది జనవరిలో ఈ అంశంపై రాష్ట్రంలో ఆందోళనలు కొనసాగుతున్న సమయంలో ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామీ కూడా స్పందించారు.

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ దర్యాప్తుపై కింది కోర్టు మాత్రమే కాకుండా హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా సంతృప్తి వ్యక్తం చేశాయని ఆయన అన్నారు.

దర్యాప్తు నిష్పక్షపాతంగా, పటిష్ఠంగా జరిగిందనడానికి ఇదే నిదర్శనమని ధామీ పేర్కొన్నారు

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)