సీజేపీ ఆందోళనలు: పోలీసులు విమానంలోకి వచ్చి అరెస్టు చేయవచ్చా?

ఫొటో సోర్స్, ANI
- రచయిత, చందన్ కుమార్ జజ్‌వాడే
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
విమానంలో ప్రయాణిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే, సహ కన్వీనర్ అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌లను పోలీసులు శనివారం దిల్లీ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు.
దీనిపై దీప్కే ఒక వీడియోను పోస్ట్ చేస్తూ, "ఈ దేశం ఏ దిశగా వెళ్తోందో మీరు చూడవచ్చు. మమ్మల్ని విమానాల్లో అదుపులోకి తీసుకున్నారు. ఇందిరా గాంధీ కూడా ఇలా ఎప్పుడూ చేయలేదు. ఇది నియంతృత్వం, కానీ మేం వారికి భయపడం" అని అన్నారు.
విమానంలో ఉన్న తనను అదుపులోకి తీసుకోవడానికి వచ్చిన పోలీసులతో అభిజిత్ దీప్కే "నేను మీకు భయపడను, మేం అరెస్టుకు సిద్ధంగా ఉన్నాం" అని చెప్పారు.
అభిజిత్, సౌరవ్, అశుతోష్‌లను అదుపులోకి తీసుకోవడానికి మహిళా పోలీసు అధికారులు ముందుకు వచ్చారు. మగ పోలీసు అధికారులను పంపాలని ఆ సమయంలో దీప్కే, ఆయన బృందం డిమాండ్ చేసింది.
దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ' కాక్రోచ్ జనతా పార్టీ' (సీజేపీ) తలపెట్టిన నిరసన సందర్భంగా పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు.

ఆదివారం నాడు, కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే, సహ కన్వీనర్ సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాను పోలీసులు విడుదల చేశారు.
"అభిజిత్ దీప్కే, అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌ను అక్టోబర్ 10న భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్)లోని సెక్షన్లు 126/170 కింద అదుపులోకి తీసుకున్నారు. అవసరమైన అన్ని చట్టపరమైన ప్రక్రియలను అనుసరించి, వారిని అక్టోబర్ 11 న దిల్లీ కంటోన్మెంట్‌లోని స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరుపరిచారు" అని దిల్లీ పోలీసులు ఎక్స్‌లో రాసిన ఒక పోస్ట్‌లో తెలిపారు.
ఒక సంవత్సరం పాటు శాంతిభద్రతలు, సత్ప్రవర్తన పాటిస్తాననే షరతుపై రూ. 50,000 పూచీకత్తు సమర్పించిన తర్వాత వారిని ఎస్ఈఎం కోర్టు విడుదల చేసింది.

ఫొటో సోర్స్, UGC
విమానం లోపల పోలీసులు ఎవరినైనా అదుపులోకి తీసుకోవచ్చా?
న్యూదిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానంలోనే అభిజిత్ దీప్కే, ఆయన సహచరులను దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పుడు, ఈ పోలీసు చర్యకు సంబంధించిన వీడియోను చాలామంది సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
'ది హిందూ' పత్రికలోని ఒక రిపోర్టు ప్రకారం ‘‘ ఏ పరిస్థితుల్లో విమానంలోకి పోలీసులను అనుమతించారు? ఈ విషయం గురించి సంబంధిత విమానయాన సంస్థలకు ఎందుకు తెలియజేయలేదు? అనే దానిపై బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ నుంచి ఎయిర్ ఇండియా వివరణ కోరింది"
పోలీసులు విమానంలోకి ప్రవేశించి ఎవరినైనా అదుపులోకి తీసుకోవచ్చా? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి మాజీ ఉన్నతాధికారులతో మాట్లాడాం.
"దేశంలోని చట్టాల ప్రకారం పోలీసులు లేదా దర్యాప్తు సంస్థలు దేశంలో ఎక్కడికైనా వెళ్లి చర్యలు తీసుకోవచ్చు. బీఎన్ఎస్ (భారతీయ న్యాయ సంహిత), బీఎన్ఎస్ఎస్ (భారతీయ నాగరిక్ సురక్షా సంహిత) బీఎస్ఏ (భారతీయ సాక్ష్య అధినియం) కింద వారికి ఆ అధికారాలు ఉన్నాయి" అని మాజీ ఐపీఎస్ అధికారి రాజేశ్ కుమార్ పాండే బీబీసీతో అన్నారు.
"మేం కార్లు, రైళ్లు లేదా ఇళ్లలో ఉన్న వారిని కూడా అదుపులోకి తీసుకుంటాం. విమానం భారత భూభాగంలో ఉన్నప్పుడు అందులో ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం కూడా అలాంటిదే" అని ఆయన అన్నారు.
"ఏవైనా అంతర్జాతీయ నిబంధనలు లేదా స్థానిక ఆదేశాలు ఉంటే అది వేరే విషయం. కానీ విషయం దేశ పరిధిలో ఉంటే, పోలీసులు ఎక్కడైనా చర్య తీసుకోవచ్చు. దీనిపై ఎలాంటి ఆంక్షలు లేవు" అని మాజీ ఐపీఎస్ అధికారి అరుణ్ కుమార్ తెలిపారు.
"ఒకవేళ నేరం జరగవచ్చని పోలీసులకు సమాచారం అందితే, పోలీసులు చూస్తూ కూర్చోలేరు. నేరాన్ని నివారించడానికి, నేరస్థుడిని పట్టుకోవడానికి లేదా భద్రతా కారణాల దృష్ట్యా చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటారు" అని అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Sonu Mehta/Hindustan Times via Getty Images
నియమాలు ఏం చెబుతున్నాయి?
దేశంలోని విమానాశ్రయాలు, విమానయాన సంస్థల్లో భద్రత కోసం కేంద్ర పౌర విమానయాన శాఖ 2023లో విమాన (భద్రత) నియమాలు-2023ను తీసుకొచ్చింది. ఏ సంస్థకు ఏ బాధ్యత ఉండాలో భారత విమాన చట్టం-2024 స్పష్టంగా నిర్ణయించింది.
విమాన భద్రతా నియమాల్లోని నియమం 22 ప్రకారం, చెల్లుబాటు అయ్యే ప్రవేశ పాస్‌లు ఉన్న విమాన ప్రయాణీకులకు, సందర్శకులకు (బోర్డింగ్ పాస్‌తో) లేదా బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ డైరెక్టర్ జనరల్ లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి రాతపూర్వక అనుమతి ఉన్న వ్యక్తులకు మాత్రమే విమానాశ్రయంలోకి ప్రవేశం అనుమతిస్తారు.
‘హిందుస్థాన్ టైమ్స్’ పత్రికతో మాట్లాడిన ఒక పోలీసు అధికారి, విమానాశ్రయ ప్రాంగణంలోకి ప్రవేశించడానికి శనివారం పోలీసు అధికారులకు ప్రత్యేక పాస్‌లు ఇచ్చారని చెప్పారు.
"టేకాఫ్‌కు ముందు తలుపులు మూసినప్పటి నుంచి, విమానాన్ని పార్క్ చేసిన తర్వాత తలుపులు తెరిచే వరకు ఆ విమానం ఫ్లైయింగ్ కండీషన్‌లో ఉన్నట్టే భావిస్తారు. ఈ సమయంలో, కెప్టెన్ మాటే తుది నిర్ణయం" అని ఒక ఎయిర్‌లైన్ అధికారి హిందుస్థాన్ టైమ్స్‌కు తెలిపారు.
పరిస్థితులు తీవ్రంగా ఉన్నప్పుడు, తలుపులు తెరిచిన తర్వాత ఏ భద్రతా సంస్థ అయినా విమానంలోకి ప్రవేశించవచ్చని ఆయన చెప్పారు.
అభిజిత్ దీప్కే అరెస్టు సందర్భంగా లేవనెత్తుతున్న మరో అంశం ఏంటంటే, ఒక విమానయాన సంస్థ నుంచి విమానంలోని ప్రయాణికుల జాబితాను పోలీసులు అడగవచ్చా లేదా అనేది.
"అవసరమైనప్పుడు దర్యాప్తు సంస్థ అటువంటి సమాచారాన్ని అడగవచ్చు. మేం చాలా కేసుల్లో ఇలా చేశాం. అది రైలైనా, విమానమైనా, వేలాది కేసుల్లో పోలీసులు రైలు లోపల లేదా విమానాశ్రయంలో అరెస్టులు చేశారు" అని అరుణ్ కుమార్ చెప్పారు.
"దీని కోసం ఎవరిపైనా ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిన అవసరం లేదు. ప్రమాద నివారణ చర్యలలో భాగంగా పోలీసులు అలాంటి సమాచారాన్ని అడగవచ్చు" అని ఆయన అంటున్నారు.

ఫొటో సోర్స్, UGC
మహిళా పోలీసులు పురుషులను నిర్బంధించవచ్చా?
విమానంలో మహిళా పోలీసు సిబ్బంది ఉండటంపై అభిజిత్ దీప్కే కూడా ప్రశ్నించారు.
" క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లో పోలీసులను పురుషులు లేదా మహిళలు అని రాయలేదు. మహిళల గౌరవం, భద్రత, సౌకర్యం కోసం, రాష్ట్ర ప్రభుత్వాలు, మానవ హక్కుల సంస్థలు లేదా కోర్టు ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు అనేక సందర్భాల్లో మహిళా పోలీసు అధికారులను నియమిస్తుంటారు" అని రాజేశ్ పాండే గుర్తు చేస్తున్నారు.
పోలీసులు లేదా దర్యాప్తు సంస్థల చర్యలు సమాజ ప్రయోజనం కోసం, ఏదైనా అసాధారణ పరిస్థితిని ఎదుర్కోవడానికి లేదా నేరాలను నివారించడానికి ఉంటాయి. ఒక వరకట్నం మరణ కేసును మహిళా అధికారి దర్యాప్తు చేస్తుంటే, ఆమె నిందితుడైన పురుషుడిని అరెస్టు చేయరా?
"చట్టం ఈ విషయంలో పోలీసులను కేవలం పోలీసులుగా మాత్రమే పరిగణిస్తుంది - పురుషులుగానో, మహిళలుగానో చూడదు. ఒకవేళ ఇలా జరగడం మొదలైతే, దేశంలో మహిళల జనాభా సుమారు 50 శాతం ఉండగా, మహిళా పోలీసులు కేవలం 13% మాత్రమే ఉన్నప్పుడు, అప్పుడు పోలీసులు ఎలా పనిచేస్తారు?" అని మాజీ ఐపీఎస్ అధికారి అరుణ్ కుమార్ అన్నారు.
"ఏదైనా దర్యాప్తునకు సంబంధించి పురుష లేదా మహిళా పోలీసు అధికారి ఎవరినైనా అరెస్టు చేసి విచారించవచ్చు. మహిళల విషయంలో, రాత్రి సమయంలో ఏ మహిళా పోలీసు అధికారి అందుబాటులో లేకపోతే, అటువంటి చర్య ఏ పరిస్థితుల్లో తీసుకున్నారో పోలీసులు వివరించాల్సి ఉంటుంది" అని అరుణ్ కుమార్ వివరించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























