టైగర్ రిజర్వ్‌లో ‘కనిపించిన’ జంట కుండల్లో ఏముంది? బంగారం, వజ్రాలా? ఆదిమ మానవుల అస్థిపంజరాలా?

అడవిలో తవ్వకాల్లో బయటపడినట్లుగా చెబుతున్న కుండలు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, అడవిలో తవ్వకాల్లో బయటపడినట్లుగా చెబుతున్న కుండలు
    • రచయిత, గరికిపాటి ఉమాకాంత్‌
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ
  • చదివే సమయం: 4 నిమిషాలు

ఆంధ్రప్రదేశ్‌‌లోని మార్కాపురం జిల్లా గిద్దలూరు టైగర్‌ రిజర్వ్‌లో అటవీశాఖ అధికారులే స్వయంగా గుప్తనిధుల తవ్వకాలు చేపట్టారన్న ఆరోపణలు వచ్చాయి.

ఈ తవ్వకాలలో బంగారం, ఇతర నిధులు దొరికాయంటూ స్థానికంగా ప్రచారమైంది.

ఈ ఆరోపణలపై విచారణ చేస్తున్నామని ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్‌ రాజు, గిద్దలూరు అటవీశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ నిశాకుమారి బీబీసీతో చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఏం ప్రచారం జరుగుతుందంటే...

నల్లమల అటవీ ప్రాంతంలోని గిద్దలూరు టైగర్‌ ప్రాజెక్ట్ డివిజన్, తురిమెళ్ల అటవీక్షేత్ర పరిధిలోని ఆరవీటికోట సెక్షన్‌లో తవ్వకాలు జరిగినట్లు సోషల్‌మీడియాలో వీడియోలు వైరల్‌ అయ్యాయి.

అరవీటికోట సెక్షన్‌, యరగ్రుంట్ల క్షేత్రీయం భూముల్లోని 'బీగినపల్లి కుంట' పరిసరాల్లో వందల ఏళ్ల నాటి గుప్త నిధులు ఉన్నట్లు చాలాకాలంగా ప్రచారం సాగుతోంది.

ఈ నేపథ్యంలో ఏప్రిల్‌ నెలలో మార్కాపురం జిల్లా గిద్దలూరు టైగర్‌ ప్రాజెక్టు తురిమెళ్ళ ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్, వెలగలపాయ ఫారెస్ట్‌ బీట్‌ అధికారి, ట్రైబల్‌ వాచర్లతో కలిసి గుప్తనిధుల తవ్వకాలు జరిపారని వార్తలు వచ్చాయి.

ఏకంగా జేసీబీనే తెప్పించి తవ్వకాలు చేపట్టారని కథనాలు వెలువడ్డాయి.

తవ్వకాల్లో ఓ రెండు పెద్ద మట్టి కుండలు బయటపడగా.. అందులో వజ్రాలు, బంగారం ఉన్నాయని ప్రచారమైంది.

దొరికిన బంగారం, వజ్రాలను తొలుత హైదరాబాద్‌లో అమ్మేందుకు ప్రయత్నించారనీ, అది విఫలం కావడంతో బెంగళూరులో అటవీశాఖ అధికారులు అమ్ముకున్నారన్న ప్రచారం కూడా సాగింది.

తవ్వకాలు జరిపారని ఆరోపణలు ఎదుర్కొంటున్న అటవీ అధికారులు, సిబ్బందితో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నించినప్పటికీ వారు అందుబాటులోకి రాలేదు.

ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎఫ్‌ఆర్‌వోను సంప్రదించేందుకు బీబీసీ ప్రయత్నించగా, ఆ అధికారి ఫోన్‌లో అందుబాటులోకి రాలేదు. అలాగే ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ కూడా అందుబాటులోకి రాలేదు.

అయితే, ఈ వ్యవహారంపై బీబీసీ అటవీ శాఖ ఉన్నతాధికారులు, పోలీస్ శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడింది.

విచారిస్తున్నాం: ఎస్పీ

ఈ ప్రచారంపై విచారణ చేస్తున్నామని బీబీసీతో ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్‌ రాజు చెప్పారు.

విచారణ పూర్తయితే కానీ, అసలు ఏం జరిగిందన్నది తేలదు అని ఆయన అన్నారు.

తవ్వకాల్లో బయటపడిన కుండలు

ఫొటో సోర్స్, UGC

రెండు కుండలు కనిపించాయని అటవీ అధికారులు చెప్పారు: డీఎస్పీ

ఈ ఘటనపై పోలీసుశాఖ పరంగా విచారణ చేపట్టిన మార్కాపురం డీఎస్పీ నాగరాజు బీబీసీతో మాట్లాడారు.

''ఎండాకాలం జంతువులకు నీళ్లు పెట్టేందుకు అడవిలో కందకం తవ్వే క్రమంలో రెండు కుండలు కనిపించాయని అటవీ శాఖ అధికారులు మాకు చెప్పారు. వాటిని తాము అక్కడే పూడ్చిపెట్టేసినట్లు తెలిపారు. అయితే సోషల్‌ మీడియాలో ఆ కుండల్లో వజ్రాలు, బంగారం ఉన్నాయనేది వైరల్‌ అయింది. మా పోలీసులు వెళ్లి పరిశీలించి వచ్చారు. అప్పటికే అక్కడ పూడ్చివేశారు కాబట్టి విచారణలో మేం పురావస్తుశాఖ అధికారుల సహకారం తీసుకుంటున్నాం. ఎవరైతే పూడ్చారో, వారితోనే తవ్వకాలు జరిపించి పక్కాగా విచారణ చేస్తాం'' అని డీఎస్పీ వివరించారు.

విచారణ, ప్రాథమిక దశలోనే ఉన్నందున ఎవరిపైనా ఇంకా కేసులు పెట్టలేదని డీఎస్పీ నాగరాజు చెప్పారు.

ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్‌ రాజు

ఫొటో సోర్స్, UCG

ఫొటో క్యాప్షన్, ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్‌ రాజు

ఆ ప్రచారం తప్పు, కానీ విచారణ జరుపుతున్నాం: అటవీశాఖ

'అటవీశాఖ అధికారులు తవ్వినప్పుడు కుండలు దొరికాయి. అందులో బంగారం, వజ్రాలు దొరికాయనే ప్రచారం తప్పు. అసలేం జరిగిందనే దానిపై విచారణ జరుగుతోంది. ఒకవేళ తప్పు జరిగినట్లు తేలితే కచ్చితంగా చర్యలు తీసుకుంటాం' అని అటవీశాఖ గిద్దలూరు డిప్యూటీ డైరెక్టర్‌ నిశాకుమారి తెలిపారు.

విచారణ తర్వాతే వాస్తవాలు: పురావస్తు శాఖ

ఈ అంశం గురించి బీబీసీతో పురావస్తుశాఖ డైరెక్టర్‌ పి.సురేష్‌ మాట్లాడారు.

'విచారణ కోసం గురువారం మా బృందం ఆ ప్రాంతానికి వెళ్లింది. విచారణ పూర్తయితే అసలు వాస్తవాలు బయటికొస్తాయి. అయితే వీడియోల్లో వైరల్‌ అయిన సమాధులు, అక్కడి కుండలు చూస్తే... అవి ఆదిమ మానవుల కాలం నాటి సమాధులు. అప్పటికి బంగారం, వజ్రాలు వినియోగంలో లేవు. వీడియోల్లో చూసిన దాని గురించి మాత్రమే నేను ఇప్పుడు మాట్లాడుతున్నా. పూర్తి వాస్తవాలు విచారణ తర్వాతే తెలుస్తాయి' అని సురేష్‌ అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)