హత్య చేసి తప్పించుకు తిరుగుతూ యాక్టర్‌గా మారిన లాయర్, 12 ఏళ్ల తర్వాత పోలీసులకు ఎలా చిక్కారంటే..

ఫొటో సోర్స్, Ahmedabad Crime Branch
- రచయిత, భార్గవ పరీఖ్
- హోదా, బీబీసీ గుజరాతీ
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
ఒక హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తూ పెరోల్‌పై బయటకు వచ్చి 12 ఏళ్ల క్రితం పరారైన నేరస్థుడిని ఎట్టకేలకు అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఇటీవలే పట్టుకున్నారు.
పోలీసుల కథనం ప్రకారం, శిక్ష నుంచి తప్పించుకొని తిరుగుతున్న వ్యక్తి పేరు హేమంత్ మోదీ. పరారీలో ఉన్న ఆయన సినిమాలు, టీవీ సీరియళ్లు, వెబ్ సిరీస్‌లలో నటించారని వారు వెల్లడించారు. అహ్మదాబాద్‌లో పక్కా ప్లాన్‌తో నిఘా వేసి ఆయన్ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
ఈ కేసు పూర్వాపరాలు తెలుసుకునేందుకు గుజరాత్ క్రైమ్ బ్రాంచ్ అధికారులతో పాటు హేమంత్ మోదీ గురించి బాగా తెలిసిన వ్యక్తులతో బీబీసీ మాట్లాడింది.
ఇంతకీ ఈ కేసు ఎలా వెలుగులోకి వచ్చింది? ఇన్నేళ్లుగా పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న మోదీ చివరకు ఎలా దొరికాడు?

అసలేం జరిగింది?
ఆయన్ను పట్టుకోవడానికి వెళ్లినప్పుడు ఏం జరిగిందో బీబీసీకి అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీస్ ఇన్స్పెక్టర్ పీఎం ధాకడ వివరించారు.
'ఆయన్ను పట్టుకోవడానికి వెళ్లినప్పుడు ఆయన నటన చూసి మేం ఆశ్చర్యపోయాం. ఆయన 'మోతీ బానీ నానీ వుహూ' అనే సీరియల్లో నటిస్తున్నారు. ఆయన హావభావాలు చూసి గుర్తుపట్టడం చాలా కష్టమైంది. కానీ, శిక్ష పడిన సమయంలో రికార్డు చేసిన శరీర గుర్తుల (పుట్టుమచ్చలు/గాయాలు) ఆధారంగా ఆయన్ను గుర్తించాం. తర్వాత గట్టిగా విచారించడంతో, 12 ఏళ్ల క్రితం పోలీసుల నుంచి తప్పించుకుని యాక్టర్‌గా మారిన హేమంత్ మోదీని తానేనని ఆయన అంగీకరించారు' అని చెప్పారు.

ఫొటో సోర్స్, Gujarat Police
ఈ కేసు వివరాల ప్రకారం, హేమంత్ మోదీ గతంలో అహ్మదాబాద్ నగరం నరోడాలోని సైజ్పూర్ బోఘాలో ఉన్న 'దాస్నీ చాలీ'లో నివసించేవారు. ఆ సమయంలో, 2005 జూన్ 12న పొరుగువారితో ఆయనకు గొడవ జరిగింది. తర్వాత తన సోదరుడు, స్నేహితులతో కలిసి పొరుగున నివసించే నరేంద్ర తామ్లే అలియాస్ నన్నో అనే వ్యక్తిని ఆయన హత్య చేశారు.
హేమంత్ మోదీ స్వయంగా అడ్వకేట్ కావడంతో, తనతో పాటు పట్టుబడిన మిగతా ఏడుగురు నిందితుల తరఫున కోర్టులో ఆయనే కేసు వాదించారు. మూడేళ్ల పాటు సాగిన విచారణ అనంతరం కోర్టు 2008లో హేమంత్ మోదీతో సహా 8 మందికి జీవిత ఖైదు విధించింది.
లాయర్ కావడంతో జైలు రూల్స్ బాగా తెలిసిన హేమంత్ తాను డిప్రెషన్‌తో బాధపడుతున్నానంటూ అప్పటి జైలర్ కేశవ్ కుమార్‌కు పలు పిటిషన్లు అందజేశారు. తర్వాత ఆయన్ను అహ్మదాబాద్‌లోని సబర్మతి జైలు నుంచి మెహసానా జైలుకు మార్చారు.
ఆరేళ్ల తర్వాత మెహసానా జైలులో ఉన్న హేమంత్, గుజరాత్ హైకోర్టు నుంచి 30 రోజుల పెరోల్ పొందారు. పెరోల్‌పై బయటకు వచ్చిన తర్వాత తిరిగి జైలుకు వెళ్లకుండా తప్పించుకొని తిరుగుతూ నటుడిగా మారారు.

ఫొటో సోర్స్, Bhargav Parikh
పోలీసులు ఏం చెబుతున్నారు?
పెరోల్ దొరికిన తర్వాత హేమంత్ గుజరాత్ నుంచి పారిపోయి కొన్ని రోజులు వేర్వేరు ప్రాంతాల్లో తలదాచుకున్నారని అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీస్ ఇన్స్పెక్టర్ పీఎం ధాకడ తెలిపారు. నటనపై ఉన్న ఆసక్తితో హేమంత్ మోదీ, ముంబయికి చేరుకున్నారని చెప్పారు.
"అక్కడ ఆయనకు సైడ్ రోల్స్, నాటకాల్లో అవకాశాలు లభించాయి. ఈ క్రమలోనే తన పేరును 'స్వప్నిల్ మోదీ'గా మార్చుకున్నారు. హెయిర్‌స్టైల్ కూడా పూర్తిగా మార్చేశారు. సినిమాలు, టీవీ సీరియళ్లు, వెబ్ సిరీస్‌లలో నటించడం ప్రారంభించారు. దక్షిణాది సినిమాలతో పాటు గుజరాతీ సినిమాల్లోనూ నటించారు. ఎవరూ గుర్తుపట్టకపోవడంతో ఆయన ధైర్యం మరింత పెరిగింది. అలా గుజరాతీ సినిమాల్లో సైడ్ రోల్స్ చేస్తూనే, సీరియల్స్‌లోనూ నటించడం మొదలుపెట్టారు. తిరిగి అహ్మదాబాద్ వచ్చిన తర్వాత కోట ప్రాంతంలో అద్దె ఇంట్లో ఉంటూ 'మోతీ బానీ నానీ వూహూ' సీరియల్లో నటిస్తున్నారు" అని ధాకడ వివరించారు.
అహ్మదాబాద్ వచ్చిన తర్వాత చుట్టుపక్కల వారికి తాను ముంబయిలో పెద్ద నటుడినని హేమంత్ గొప్పలు చెప్పుకునేవారని పోలీసులు వెల్లడించారు.
"అయితే, ఆ ప్రాంతానికి చెందిన ఒక సామాజిక కార్యకర్తకు హేమంత్ ప్రవర్తనపై అనుమానం వచ్చింది. ఎందుకంటే ఇంటి యజమానికి ఆధార్ కార్డ్ వంటి గుర్తింపు కార్డులు లేదా ఇతర పత్రాలను ఇవ్వడానికి హేమంత్ నిరాకరించారు. గతంలో పరారైన ఒక నేరస్థుడిలా హేమంత్ కనిపిస్తున్నాడంటూ అక్కడే ఉండే మరో లాయర్, సామాజిక కార్యకర్తతో చెప్పడంతో వారి అనుమానం బలపడింది. అలా ఈ వ్యవహారం పోలీసుల వరకు చేరింది" అని వారు తెలిపారు.
ఈ పక్కా సమాచారంతో హేమంత్పై పోలీసులు నిఘా పెట్టారు.
ఒకరోజు సీరియల్ షూటింగ్ పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వస్తుండగా ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఆయన నిజం ఒప్పుకున్నారు.
"స్క్రీన్‌పై తన అసలు పేరు కనిపిస్తే పోలీసులు పట్టుకుంటారనే భయంతోనే, చాలా ఆలోచించి సినిమాల కోసం పేరు మార్చుకున్నట్లు చెప్పారు" అని పోలీసులు తెలిపారు.

ఫొటో సోర్స్, Hemant Modi/FB
పరిచయస్థులు ఏమంటున్నారు?
గతంలో సైజ్పూర్ బోఘాలోని 'దాస్నీ చాలీ' ఏరియాలో నివాసమున్న మనీష్ పటేల్, బీబీసీతో ఫోన్లో మాట్లాడారు.
''హేమంత్ మోదీ గతంలో అందరికీ లీగల్ నోటీసులు పంపుతూ బెదిరించేవారు. తన భార్యకు విడాకులు ఇచ్చారు. ఆ హత్య జరిగిన తర్వాత నుంచి ఆయన కుటుంబంతో మేం మళ్లీ మాట్లాడలేదు' అని మనీష్ పటేల్ చెప్పారు.
అహ్మదాబాద్ కోటా ప్రాంతంలో హేమంత్ నివసించిన ఇంటి దగ్గరలోని సెలూన్లో పనిచేసే ఇక్బాల్‌తో కూడా బీబీసీ ఫోన్లో మాట్లాడింది.
''సెలూన్‌కు వచ్చేటప్పుడు ఫేస్ క్రీమ్స్, హెయిర్ జెల్స్ వంటి వస్తువులను ఆయనే వెంట తెచ్చుకునేవారు. తాను ముంబయిలో పెద్ద యాక్టర్‌నని ఎప్పుడూ చెప్పేవారు. తన కొత్త సినిమాకు సంబంధించిన పనుల కోసం కోటాలో ఉంటున్నట్లు చెప్పడంతో మేం ఆయన గురించి పెద్దగా ఆరా తీయలేదు" అని ఆయన వివరించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



























