అమెరికా స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడం ఎలా, నిబంధనలు ఏమిటి?

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టాలని భావించేవారు, దీనికి మార్గం ఏంటా అని ఆలోచిస్తుంటారు. అయితే ఇందుకోసం ప్రాథమికంగా చట్టపరమైన విషయాలు తెలుసుకోవాలి.
భారత పౌరులు ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు పెట్టడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) అనుమతిస్తుంది. ఈ పెట్టుబడులను ఫారిన్ ఎక్సేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఫెమా), లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) కింద నియంత్రిస్తారు.
ఎల్‌ఆర్‌ఎస్ కింద ఏ భారతీయ పౌరుడైనా ఒక ఆర్థిక సంవత్సరంలో 2 లక్షల 50వేల డాలర్ల వరకు విదేశాలకు పంపొచ్చు. ఇందులో విదేశీ షేర్లలో పెట్టుబడి కూడా ఉంటుంది. అయితే ఈ మొత్తాన్ని ఆర్‌బీఐ నియమ నిబంధనల ప్రకారం మాత్రమే పంపించాలి.

నిబంధనలు ఏంటి?
విదేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఆర్‌బీఐ కొన్ని నియమాలను రూపొందించింది.
ఇవి రెండు రకాలు.
1. ఓవర్సీస్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ (ఓడీఐ)
2. ఓవర్సీస్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్.
ఓవర్సీస్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ (ఓడీఐ): లిస్టింగ్ కాని విదేశీ కంపెనీల్లో ఈక్విటీ లేదా షేర్లను కొనడాన్ని ఓవర్సీస్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అంటారు. ఒక పెట్టుబడిదారుడుకి విదేశీ లిస్టెడ్ కంపెనీలో 10 శాతానికి మించి ఎక్కువ వాటా ఉన్నా కూడా ఓడీఐ కిందకే వస్తుంది.
ఓవర్సీస్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్ (ఓపీఐ):
ఓడీఐ పరిధిలోకి రాని ఈక్విటీ పెట్టుబడులు ఈ విభాగంలోకి వస్తాయి. ఉదాహరణకు లిస్టెడ్ విదేశీ కంపెనీల్లో 10 శాతం కంటే తక్కువ వాటాను కొనుగోలు చేయడం లేదా నియంత్రిత అంతర్జాతీయ నిధులలో పెట్టుబడి పెట్టడం ఇందులో చేరతాయి.

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా కంపెనీల షేర్లను కొనగలమా?
టెస్లా లేదా యాపిల్ వంటి అమెరికా కంపెనీల షేర్లను నేరుగా కొనగలమా?
ఓవర్సీస్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్ నిబంధనల ప్రకారం విదేశీ ట్రేడింగ్ అకౌంట్ తెరిచి టెస్లా, యాపిల్, లేదా మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీల షేర్లలో నేరుగా పెట్టుబడి పెట్టవచ్చు. అయితే దీనికి కొన్ని షరతులు ఉన్నాయి.
ఏదైనా విదేశీ కంపెనీలో మన వాటా సాధారణంగా 10 శాతం కంటే తక్కువగా ఉండాలి రెండో షరతు ఏంటంటే పెట్టుబడిదారుడు కంపెనీని నియంత్రించకూడదు. అలాగే పెట్టుబడి కోసం ఎల్ఆర్ఎస్ కింద చట్టబద్ధమైన బ్యాంకింగ్ మార్గాలను ఉపయోగించాలి.
భారత్ నుంచి విదేశీ మార్కెట్లలో పెట్టుబడి పెట్టడానికి వివిధ మార్గాలు ఉన్నాయి. మీ సౌలభ్యాన్ని, పెట్టుబడి మొత్తం, అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయా మార్గాలను ఎంచుకోవాలి.

ఫొటో సోర్స్, Getty Images
అంతర్జాతీయ బ్రోకర్ ద్వారా పెట్టుబడి
అంతర్జాతీయ బ్రోకర్ల ద్వారా పెట్టుబడి పెట్టడమనేది ప్రస్తుతం అత్యంత ప్రజాదరణ పొందిన పద్ధతి. దీన్ని చేయడానికి ఈ క్రింది దశలను అనుసరించాల్సి ఉంటుంది.
అమెరికా స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టే అవకాశం కల్పించే ప్లాట్‌ఫామ్‌లో అకౌంట్ తెరవాలి. ఎల్‌ఆర్‌ఎస్ కింద విదేశాలకు డబ్బు బదిలీ చేసి రూపాయలను డాలర్లుగా మార్చుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులను సులభతరం చేయడానికి అనేక భారతీయ ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్‌లు విదేశీ బ్రోకర్లతో భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఈ ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్‌లు అకౌంట్ ఓపెన్ చేయడం, నిధుల బదిలీ, నిబంధనల పాటింపు ప్రక్రియను సులభతరం చేశాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి, సంక్లిష్టమైన ప్రక్రియను నివారించాలనుకునే పెట్టుబడిదారులకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది.
భారతీయులు విదేశీ కంపెనీ భారతీయ శాఖలో లేదా విదేశీ కంపెనీకి వాటా ఉన్న భారతీయ కంపెనీలో పనిచేస్తుంటే ఆ విదేశీ కంపెనీల ఎంప్లాయ్ స్టాక్ ఆప్షన్ ప్లాన్‌లలో (ఈఎస్ఓపీ) పెట్టుబడి పెట్టవచ్చు. వీటిని భిన్నంగా పరిగణిస్తారు. ఆర్‌బీఐ పరిమితులు ఉన్న రంగాల్లో కూడా వీటిని అనుమతించవచ్చు. 10శాతం పరిమితికి వీటికి వర్తించదు.

ఫొటో సోర్స్, Getty Images
‘నిపుణుల సలహా తీసుకోవాలి’
విదేశాల్లో పెట్టుబడి పెట్టే ముందు పన్నుల వ్యవస్థను అర్థం చేసుకోవడం కూడా ముఖ్యం.
ఈక్విటీ అంటే షేర్ల నుంచి వచ్చే లాభాలు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కిందకు వస్తాయి. డివిడెండ్లు, వడ్డీపై 'ఇతర వనరుల నుంచి వచ్చే ఆదాయం' పన్నువిభాగంలోకి వస్తాయి . విదేశీ ఆస్తులన్నింటినీ ఆదాయపు పన్ను రిటర్న్స్‌లో చూపించడం తప్పనిసరి. ఈ నియమాలు పాటించకపోతే జరిమానాలు ఉంటాయి.
గ్లోబల్ స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టాలనే నిర్ణయం ఆర్థిక లక్ష్యాలపై ఆధారపడి ఉంటుంది. అయితే పెట్టుబడులకు సంబంధించిన ఏ నిర్ణయమైనా తీసుకునే ముందు పెట్టుబడి నిపుణుల సలహా తీసుకోవడం ఎప్పుడూ మంచిది.
మంచి లాభాలు పొందేందుకు, పెట్టుబడుల్లో వైవిధ్యం కోసం, పెట్టుబడులకు సంబంధించిన ప్రమాదాలను సరిగ్గా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)


























