పెట్రోల్, డీజిల్ ధరల పెంపు: ఇందులో ఏయే పన్నులు దాగి ఉంటాయి, రాష్ట్రానికో తీరుగా ఎందుకుంటుంది?

పెట్రోలు , డీజిల్

ఫొటో సోర్స్, Sonu Mehta/Hindustan Times via Getty Images

పెట్రోల్, డీజిల్ రేట్లు దేశంలో మరోసారి పెరిగాయి. లీటర్ పెట్రోల్‌పై రూ.2.61పైసలు, లీటర్ డీజిల్‌పై రూ.2.71పైసలు పెరిగాయని న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ తెలిపింది.

ఈ నెలలో పెట్రోల్ ధరలు పెరగడం ఇది నాలుగోసారి.

మే 15న పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం లీటరుకు 3 రూపాయల చొప్పున పెంచింది. గత నాలుగేళ్లలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం అదే తొలిసారని న్యూస్ ఏజెన్సీ పీటీఐ తెలిపింది.

గతవారం రెండుసార్లు ధరలు పెరిగాయి. మే 19న లీటరు పెట్రోల్‌, డీజిల్‌పై 90పైసలు చొప్పున పెరిగాయి. మే 23న లీటరు పెట్రోల్‌ 87పైసలు, లీటరు డీజిల్‌ 91పైసలు చొప్పున పెరిగాయి.

సోమవారంనాడు మరోమారు ధరలు పెరిగాయి. ఇరాన్ యుద్ధం ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగాయి. దీంతో ఆయిల్ కంపెనీలు ధరలను పెంచుతున్నాయని, ఐదు అసెంబ్లీల ఎన్నికల సమయంలో భారత్‌లో ధరలు పెంచలేదని పీటీఐ తెలిపింది.

ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధర‌ల్లో ఏయే పన్నులు దాగి ఉంటాయి? వాటిలో కేంద్రం, రాష్ట్రాల వాటా ఎంతెంత? జీఎస్టీ పరిధిలోకి పెట్రో ఉత్పత్తులను ఎందుకు తీసుకురావడం లేదు? వంటి విషయాలు తెలుసుకుందాం.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఏ రోజుకా రోజు ధరల నిర్ణయం

భారత్‌లో పెట్రోల్, డీజిల్ రేట్లు ఏ రోజుకారోజు నిర్ణయిస్తారు.

అంతర్జాతీయ మార్కెట్‌, దేశీయంగా ఖర్చలకు అనుగుణంగా ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీ) పెట్రోల్, డీజిల్ రీటైల్ ధరలను రోజూ నిర్ణయిస్తుంటాయి. దీనికి అనుగుణంగా మార్కెట్ ధరలు ఉంటాయి.

వినియోగదారుల నుంచి వసూలు చేసే పెట్రోల్, డీజిల్‌ రేట్లలో కొంత మొత్తం డీలర్ కమిషన్ ఉంటుంది. లీటరు పెట్రోల్‌పై 4 రూపాయలు, లీటరు డీజిల్‌పై 2.5 రూపాయల కమిషన్ లభిస్తుందని విశాఖ అక్కయ్యపాలెం ఐఓసీఎల్ పెట్రోల్ బంక్ డీలర్ నాగేశ్వరరావు చెప్పారు.

పెట్రోల్ త్వరగా ఆవిరైపోతుందని, అందుకే దానిపై కమిషన్ డీజిల్‌తో పోలిస్తే ఎక్కువ ఉంటుందని ఆయన తెలిపారు.

పెట్రోల్‌పై లభించే కమిషన్‌ నాలుగు రూపాయల్లో దాదాపు రూపాయి విలువైన పెట్రోల్ ఆవిరవుతుందని, పెట్టుబడి, శ్రమ, ఉద్యోగుల జీతభత్యాలన్నింటికీ మిగిలిన మూడు రూపాయలే ఆధారమని ఆయన తెలిపారు.

పెట్రో ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కస్టమ్స్, ఎక్సైజ్ పన్నులు విధిస్తోంది.

లీటర్ పెట్రోల్‌పై కేంద్రం బేసిక్ కస్టమ్స్ డ్యూటీ 2.50శాతం, అదనపు కస్టమ్స్ డ్యూటీ (సీవీడీ) రూ.6.90, అడిషనల్ కస్టమ్స్ డ్యూటీ రూ.5.00 విధిస్తోంది.

ఇక లీటర్ పెట్రోల్‌పై బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ రూ.1.40, స్పెషల్ అదనపు ఎక్సైజ్ డ్యూటీ 3 రూపాయలు, అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ సెస్ రూ.2.50, రోడ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెస్ రూ.5.00 విధిస్తోంది.

లీటర్ డీజిల్‌పై కేంద్రం బేసిక్ కస్టమ్స్ డ్యూటీ 2.50శాతం, అదనపు కస్టమ్స్ డ్యూటీ (సీవీడీ) రూ.5.80, అడిషనల్ కస్టమ్స్ డ్యూటీ రూ.2.00 విధిస్తోంది.

అలాగే లీటర్ డీజిల్‌పై బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ రూ.1.80, అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ సెస్ రూ.4.00, రోడ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెస్ రూ.2.00 విధిస్తోంది.

వీటితో పాటు మొత్తం కస్టమ్స్ సుంకాలపై 10 శాతం సోషల్ వెల్ఫేర్ సర్ చార్జ్ కూడా విధిస్తుంది.

అయిత, కేంద్ర ప్రభుత్వం మార్చి 27న పెట్రోల్, డీజిల్‌పై పది రూపాయల వంతున అదనపు ప్రత్యేక ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. కాకపోతే దీని ఫలితం వినియోగదారులకు అందదు. కేవలం నష్టాలు భరిస్తున్న ఇంధన కంపెనీలకు ఊరట కలిగించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం తెలిపింది.

పెట్రోల్, డీజిల్, ధరల పెంపు, ముడి చమురు, యుద్ధం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పెట్రోల్, డీజిల్ ధరలను ఏరోజుకారోజు నిర్ణయిస్తారు.

నియంత్రణ ఎత్తివేత

కేంద్ర ప్రభుత్వ సమాచారం ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశంలో 42,586 మెట్రిక్ టన్నుల పెట్రోల్, 94,704 మెట్రిక్ టన్నుల డీజిల్ వినియోగించారు.

అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు పెరిగినప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుకుని, ధరలు తగ్గినప్పుడు తగ్గించుకునేలా 2012లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ధరలపై నియంత్రణ ఎత్తివేసింది.

అప్పట్నుంచి అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలకు అనుగుణంగా ఇండియాలో ధరలు నిర్ణయిస్తున్నారు.

క్రూడాయిల్ ధరలు పెరిగినప్పుడు తదనుగుణంగా ధరలు పెంచుతున్న ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, ప్రభుత్వాలు.. ధరలు తగ్గినప్పుడు మాత్రం తగ్గించకుండా వినియోగదారులపై భారం కొనసాగిస్తున్నాయి.

పెట్రోల్, డీజిల్ ధరలు

ఫొటో సోర్స్, Getty Images

రాష్ట్రాలు జీఎస్టీకి అంగీకరించడం లేదా?

దేశంలో అనేక ఉత్పత్తులపై కేంద్రం జీఎస్టీ (వస్తు, సేవల పన్ను) విధిస్తోంది. కానీ ఇది పెట్రోల్, డీజిల్, నేచురల్ గ్యాస్‌కు వర్తించడం లేదు. వీటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడంపై ఇంకా జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకోలేదు. పెట్రోల్, డీజిల్ కారణంగా రాష్ట్ర ప్రభుత్వాలకు నేరుగా ఆదాయం వస్తోంది. అదే జీఎస్టీ అమల్లోకి వస్తే కేంద్రానికి ఆదాయం వెళుతుంది. అక్కడి నుంచి రాష్ట్రాలకు పంచాల్సి ఉంటుంది.

పెట్రోల్, డీజిల్‌పై ఎక్కువ ఆదాయం వస్తుండటంతో.. జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చే విషయాన్ని రాష్ట్రాలు ఎప్పటికప్పుడు వ్యతిరేకిస్తున్నాయి.

సీజీఎస్టీ చట్టం సెక్షన్ 9 ప్రకారం కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన తేదీ నుంచి పెట్రోల్, డీజిల్, నేచురల్ గ్యాస్‌పై జీఎస్టీ వర్తిస్తుందని చట్టంలో ఉంది.

కానీ, రాష్ట్రాలు అంగీకరించకపోవడంతో నోటిఫై చేసేందుకు కేంద్రం ముందడుగు వేయడం లేదు. గతంలో 28 శాతం పన్ను విధించి పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని భావించినా.. ఆ ప్రతిపాదన ముందుకు కదల్లేదు.

పెట్రోల్, డీజిల్, ధరల పెంపు, ముడి చమురు, యుద్ధం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పెట్రో ఉత్పత్తులపై కేంద్రం, రాష్ట్రాలు వేర్వేరు పన్నులు విధిస్తున్నాయి.

పెట్రోల్‌పై రాష్ట్రాలు విధించే పన్నులేమిటి?

పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం విధించే పన్నులతో పాటు రాష్ట్రాలు విధించే పన్నులు కూడా ఉన్నాయి. కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ పరిధిలోని పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలసిస్ సెల్ (పీపీఏసీ) ప్రకారం లీటర్ పెట్రోల్‌పై 31శాతం వ్యాట్ (వాల్యూ యాడెడ్ ట్యాక్స్) వసూలు చేస్తోంది ఆంధ్రప్రదేశ్.

ఇది కాకుండా అదనపు వ్యాట్ పేరుతో నాలుగు రూపాయలు వసూలు చేస్తోంది. రోడ్ డెవలప్‌మెంట్ సెస్, దానిపై విధించే వ్యాట్ కింద రూపాయి తీసుకుంటోంది.

డీజిల్‌పై 22.25శాతం వ్యాట్, రూ.4 అదనపు వ్యాట్, రూపాయిని రోడ్ డెవలప్ మెంట్ సెస్, దానిపై విధించే వ్యాట్ కింద తీసుకుంటోంది.

తెలంగాణ కూడా లీటరు పెట్రోల్‌పై 35.20శాతం వ్యాట్, లీటరు డీజిల్ పై 27శాతం వ్యాట్ వసూలు చేస్తోంది.

ఏపీ, తెలంగాణలో వసూలు చేస్తున్న వ్యాట్, సెస్‌లు ఇతర రాష్ట్రాల అన్నింటి కంటే ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఈ రెండు రాష్ట్రాల్లో కేంద్ర, రాష్ట్ర పన్నులు, సెస్‌లు కలుపుకొంటే, పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉంటాయి.

మే 15న పెరిగిన రూ.3 , గతవారం పెరిగిన పెరిగిన 90పైసలు, 87పైసలు మే 25న పెరిగిన రూ.2.61తో కలిపి హైదరాబాద్‌లో ప్రస్తుతం లీటరు పెట్రోల్ ధర రూ.115.69 ఉంది. తాజాగా పెరిగిన ధరతో కలిపి లీటర్ డీజిల్ ధర రూ.103.82పైసలకు చేరింది.

విజయవాడలో లీటరు పెట్రోల్ ధర రూ.117.25, లీటరు డీజిల్ ధర రూ.104.96కి చేరింది.

దేశ రాజధాని దిల్లీలో లీటర్ పెట్రోల్ రేటు రూ.102.12, లీటర్ డీజిల్ ధర రూ.95.20పైసలకు చేరింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)