మనం మాట్లాడుకోవడం తగ్గిస్తున్నామా? దారి తెలియకపోతే అడగడం కూడా మానేశామా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఎడిటోరియల్ స్టాఫ్
- హోదా, బీబీసీ న్యూస్ ముండో
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
మీరు గుర్తించి ఉండకపోవచ్చు. కానీ, గణాంకాలు దీన్ని రుజువు చేస్తున్నాయి. ఏటా ప్రజలు మాట్లాడటం తగ్గించేస్తున్నారు. కనీసం "పాశ్చాత్య, వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రాధాన్యతనిచ్చే" సంస్కృతులలోనైనా ఇది జరుగుతోందని 'పర్స్పెక్టివ్స్ ఆన్ సైకలాజికల్ సైన్స్' అనే జర్నల్‌లో ప్రచురితమైన ఒక పరిశోధనా అధ్యయనం తెలిపింది. ఈ అధ్యయాన్ని నిపుణులు ధృవీకరించారు.
సుమారు 2వేలమంది వివిధ వయసులవారు ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. వీరిలో అమెరికా, మెక్సికో, ఆస్ట్రేలియా, కొన్ని యూరప్ దేశాలకు చెందినవారు ఉన్నారు. ఒక రోజులో వీరు ఎంత తరచుగా మాట్లాడుకుంటున్నారో ఈ అధ్యయన రచయితలు విశ్లేషించారు.
15 ఏళ్ల కాలంలో సేకరించిన సమాచారాన్ని పరిశీలించిన తర్వాత, పదాల వినియోగం తగ్గిపోతున్నట్లు ఒక స్పష్టమైన ధోరణి వారికి కనిపించింది.
ప్రజలు తమ రోజువారీ సంభాషణల్లో 300కు పైగా పదాలను వాడటం మానేస్తున్నారు.
మొత్తంమీద ఇది సంవత్సరానికి దాదాపు 110,000 పదాలకు సమానమని సూచిస్తోంది. ఇదో చిన్న నవలకు సమానం.

ప్రజలు మాట్లాడుకోవడం మానేయడానికి కారణమేమిటనే విషయం కనిపెట్టడానికి ఈ అధ్యయనం చేయలేదని శాస్త్రవేత్తలు వలేరియా ఫైఫర్, మథియాస్ మెహ్ల్ శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే కొన్ని దశాబ్దాలుగా మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్, సోషల్ మీడియా వాడకం వేగంగా విస్తరించడం వల్ల ప్రజలు తక్కువగా మాట్లాడుకోవడానికి కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు.
కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత.. చాలామంది ప్రజలు తప్పనిసరి పరిస్థితిలో సామాజికంగా ఒంటరితనంలోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత టెలీవర్కింగ్, కాంటాక్ట్‌లెస్ టెక్నాలజీలు విపరీతంగా పెరిగిపోయాయి.
అయితే ఈ అధ్యయనంలో పాల్గొన్న 2 వేల మందికి పైగా వ్యక్తుల నుంచి వచ్చిన ఫలితాలకు భిన్నంగా ''సమిష్టివాద'' సంస్కృతులు కూడా ఉన్నాయని మెహ్ల్ అంగీకరించారు.
అనేక దేశాలను వేధిస్తున్న "ఒంటరితనమనే మహమ్మారి"పై పోరాడటానికి, ఈ ధోరణిని తిప్పికొట్టడానికి, మన ఇరుగుపొరుగు వారిలాంటి "పరిచయం లేని వ్యక్తులతో" కూడా ధైర్యంగా మాట్లాడితే సరిపోతుందని మెహ్ల్ అభిప్రాయపడ్డారు.
ఈ శాస్త్రవేత్త తన పరిశోధన గురించి బీబీసీ ప్రత్యేక ప్రతినిధి క్యాటీ కేతో చర్చించారు.

ప్రజలు ఏటా తక్కువగా మాట్లాడుకుంటున్నారని ఎలా మీరు గుర్తించగలిగారు?
2007లో దైనందిన జీవితంలో పదాల వినియోగం విషయంలో స్త్రీ పురుషుల మధ్య పెద్దగా తేడాలు లేవని తెలిపే ఒక అధ్యయనాన్ని మేం ప్రచురించాం. (అందులో పురుషులు, స్త్రీలు దాదాపు సమాన సంఖ్యలో పదాలను వినియోగించినట్టు తేలింది).
అయితే, మేం అధ్యయనం చేసిన శాంపుల్ సైజు చాలా పరిమితంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమైంది.
ఆ తర్వాత 17 ఏళ్లకు సుమారు నాలుగు రెట్లు పెద్దగా అంటే... 2 వేల మందికి పైగా వ్యక్తులతో తిరిగి ఈ అధ్యయనం నిర్వహించాం.
''నా దగ్గర ఫలితాలు ఉన్నాయి. ఇందులో దాదాపు 12,000 పదాలే ఉన్నాయి'' అని డాక్టర్ ఫైఫర్ పేర్కొన్నారు.
"ఇది పొరైపాటు అయి ఉండాలి లేదంటే ఇది అసాధ్యమైనా కావొచ్చు. అప్పట్లో మేం కనుగొన్నది దాదాపు 16,000 కాబట్టి, ఇక్కడ కూడా దాదాపు అంతే ఉండాలి" అని సమాధానమిచ్చారు.
అయితే, ఈ గణాంకాలను పరిశీలించగా, అవి మొదటి నుంచీ సరిగ్గా ఉన్నాయని తేలింది.
దీంతో, దాదాపు 17 సంవత్సరాల కాలంలో సుమారు 4,000 పదాలు కన్పించకుండా పోయాయని తెలుసుకుని మేం చాలా ఆశ్చర్యపోయాం.
మొబైల్ ఫోన్లు మనం మాట్లాడుకునే విధానాన్ని మార్చేశాయని, మనం మాటలు తగ్గించి, బొటనవేలు (థంబ్ సింబల్) రూపంలో ఎక్కువ సందేశాలు పంపుతున్నామని నేను మొదట ఊహించా. మీరు కూడా ఇదే గమనించారా?
అధ్యయనంలో ఈ విషయాన్ని మేం నేరుగా కనుగొనలేదు. కానీ, మనం మాట్లాడే పదాలను చాలా వరకు లిఖితపూర్వక పదాలతో భర్తీ చేసినట్లు నేను దృఢంగా నమ్ముతున్నాను.
వాస్తవానికి.. మనం ఈమెయిళ్లు, టెక్స్ట్ మెసేజ్‌లు, సోషల్ మీడియాలో విపరీతంగా రాస్తుండటం వల్ల, మన మొత్తం పదాల వినియోగం గతంలో కంటే పెరిగినా నేను ఆశ్చర్యపోను.
అయితే అత్యంత ఆసక్తికరమైన, ముఖ్యమైన విషయం ఏమిటంటే, డిజిటల్ డివైజ్‌ల కారణంగా మనం ఈ మాటలను కోల్పోతున్నట్లయితే, డిజిటల్ నేటివ్‌లు (పుట్టినప్పటి నుంచీ డిజిటల్ టెక్నాలజీతో పెరిగినవారు) అయిన యువత ఇంకా ఎక్కువ మాటలను కోల్పోయి ఉంటారా అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది.
మేం దీన్ని పరిశీలించగలిగాం. మా శాంపుల్‌ను రెండుగా విభజించాం. ఒక గ్రూప్‌లో 25 ఏళ్ల లోపు వారున్నారు. మరో గ్రూప్‌లో 25 ఏళ్లు పైబడిన వారున్నారు.
అలాగే, ముందుగా అనుకున్నట్లుగానే, తక్కువ వయస్సు గల వారిలో డిజిటల్ డివైజ్‌ల వల్ల ఏర్పడుతున్న నష్టం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించాం.
సగటున, ఇది రోజుకు 338 పదాలకు సమానం. 25 ఏళ్ల లోపు వయస్సు ఉన్న అతి పిన్న వయస్కులు 451 పదాలను కోల్పోయారు. వయస్సులో పెద్దవారు 314 పదాలను కోల్పోయారు.
ఈ డివైజ్‌ల కారణంగా మనం పదజాలాన్ని కోల్పోతున్నామని ఇది సూచిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
మనం కోల్పోతున్న నిర్దిష్ట పదాల గురించి, ఇకపై మనం మాట్లాడలేమని భావిస్తున్న సంభాషణల రకాల గురించి మీకు మరింత తెలుసా?
మనం కోల్పోయినవి ప్రధానంగా మనం గతంలో జరిపే ఆ చిన్నపాటి, అనధికారిక సంభాషణలే అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది.
ఎందుకంటే, సామాజిక జీవన విధానం ఎంతగా మారిపోయిందంటే.. శాస్త్రవేత్తలు "వీక్ టైస్" అని పిలిచే వ్యక్తులతో కాసేపు మాట్లాడే అవకాశాలు ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయాయి.
ఇక్కడ ‘‘వీక్ టైస్’’ అంటే.. సన్నిహిత స్నేహితులు, కుటుంబ సభ్యులు కాకుండా.. మామూలు పరిచయస్తులు, సహోద్యోగులు లేదా స్నేహపూర్వకంగా పలకరించే అపరిచితులు అన్నమాట.
వీరు మనకు అక్కడక్కడా ఎదురయ్యే వ్యక్తులు. మన జీవితాల్లో వీరికి పెద్దగా కీలక పాత్ర ఉండకపోవచ్చు. ఒకప్పుడు వీరితో మనకు ఏదో ఒక పరిచయం లేదా సంబంధం ఉండి ఉంటుంది.
నిజమే, ఇప్పుడు ఉదయం పూట నా కుక్కను నడిపించడానికి బయటకు వెళ్ళినప్పుడు, సాధారణంగా వార్తలు వినడానికి హెడ్ఫోన్లు పెట్టుకుంటాను. దీంతో, నా పొరుగింటివారిని పలకరించను. అలాగే, సూపర్ మార్కెట్‌కు వెళ్లి బిల్లు కట్టే క్యూలో నిలబడినప్పుడు పాడ్‌కాస్ట్ వింటూ ఉంటాను. అందుకే, క్యాషియర్‌తో కూడా మాట్లాడను. మీరు చెబుతున్న అనధికారిక సంభాషణ లేదా పరస్పర పలకరింపు ఇలాంటిదేనా?
నేను సరిగ్గా అదే అనుకున్నాను. ఇప్పుడు మీరు ఏదైనా రెస్టారెంట్‌కు వెళ్లాక, బిల్లు చెల్లించాలంటే, మీ మొబైల్ ఫోన్‌ను రసీదు దగ్గర ఉంచి, బార్కోడ్ స్కాన్ చేసి, ఫోన్ ద్వారా చెల్లింపు చేస్తారు. ఇక మీరు వెయిటర్‌తో మాట్లాడాల్సిన అవసరం ఉండదు.
ఏదైనా దారి తెలియకపోతే రోడ్డుపై కనిపించే వ్యక్తిని దారి అడగడమే లేదు. మొబైల్ ఫోన్లో జీపీఎస్ చూసుకుంటూ సాగిపోతున్నారు. మనం కోల్పోతున్న సంభాషణలు ఇవేననుకుంటున్నా.

ఫొటో సోర్స్, Getty Images
మీ డేటా 2019లో ముగిసింది. అంటే సరిగ్గా కరోనా మహమ్మారికి ముందు, రిమోట్ వర్క్‌కు బదిలీ అవ్వడానికి ముందు. మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి ఏం జరిగిందో మీకేమైనా ఐడియా ఉందా? ఈ ట్రెండ్ పెరిగిందా లేదా తగ్గిందా? సంభాషణలు ఎలా మార్పు చెందాయి?
ప్రస్తుతం అధ్యయనాలు జరుగుతున్నాయి. కొన్నేళ్లలో వాటిని మేం విశ్లేషించగలం. మా వద్ద నేరుగా డేటా లేదు. కానీ, ఈ ట్రెండ్ రివర్స్ అయిందని నమ్మడానికి ఎలాంటి కారణం కూడా లేదు. ఎందుకంటే, మహమ్మారి వల్ల కలిగిన అనుభవం.. తీవ్రమైన ఒంటరితనానికి దారితీసింది.
సామాజిక దూరాన్ని పాటించాల్సిన అవసరం ఉన్నందున, ఆ సమయంలో మనం అనుకోకుండా లేదా సహజంగా జరిగే సంభాషణలకు దూరమయ్యాం.
మహమ్మారి ముగిసిన తర్వాత, చాలా మందిలో ఒక రకమైన సామాజిక స్తబ్దత కనిపించింది. అంటే, ఇతరులతో కలవడం కష్టంగా అనిపించడం, స్నేహితులను ఇంటికి పిలవడం లేదా బయటకు వెళ్లడం వంటివి సంక్లిష్టంగా మారడం వంటివి చోటుచేసుకున్నాయి.
మహమ్మారి వల్ల కలిగిన ఆ స్తబ్దత నుంచి కొంతవరకు కోలుకుని ఉండవచ్చు. కానీ, ఈ ధోరణిని పూర్తిగా మార్చడంలో మనం నిజంగా విజయం సాధించామంటే మాత్రం నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఈ ట్రెండ్‌ను ఎలా రివర్స్ చేయగలమో మీ వద్ద ఏదైనా ఐడియా ఉందా?
నా దగ్గర ఎలాంటి అద్భుతమైన పరిష్కారం లేదు. కానీ, ఈ ఇద్దరు శాస్త్రవేత్తలు గిలియన్ శాండ్స్ట్రామ్, నికోలస్ ఎప్లీతో మాట్లాడాను. వారు 'వన్ అపాన్ ఏ స్ట్రేంజర్', ' ఏ లిటిల్ మోర్ సోషల్' అనే పుస్తకాలను రాశారు. వాటిని నేను చదివాను. మనం పదాలను కోల్పోతున్నామన్న మా సొంత పరిశీలన నుంచి ప్రేరణ పొంది ఆ పుస్తకాలను చదివాను.
వాటిని క్లుప్తంగా ఇలా అర్థం చేసుకోవచ్చు. ధైర్యంగా ముందుకు సాగండి, ఇతరులతో మీ సంభాషణలను పెంచుకోండి. అందుకే నేను ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాను. "ఈ వ్యక్తితో ఇప్పుడే మాట్లాడగలనేమో" అని నాకు అనిపించిన ప్రతిసారీ, నేను వెంటనే ఆ పని చేస్తాను. అదే సులభం, అదే తేలిక.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























