రూ. 3 వేల కోట్లు లంచం తీసుకున్న అధికారికి మరణశిక్ష

ఫొటో సోర్స్, CCTV
- రచయిత, కెల్లీ ఎన్గ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 3 నిమిషాలు
సుమారు 30 ఏళ్ల కాలంలో 220 కోట్ల యువాన్లకు పైగా (సుమారు రూ. 3,074 కోట్లు) లంచాలు తీసుకున్నారన్న ఆరోపణలపై విచారణ జరిపిన తూర్పు చైనాలోని ఒక న్యాయస్థానం నాంజింగ్ మాజీ నగర అధికారికి మరణశిక్ష విధించింది.
1993 నుంచి 2023 వరకు నాంజింగ్ నగరంలో వివిధ పదవుల్లో పనిచేసిన యాంగ్ యూలిన్.. అవినీతి, అధికార దుర్వినియోగం, మనీలాండరింగ్ ఆరోపణల్లో దోషిగా తేలారు. ఇటీవలి కాలంలో అత్యంత భారీ స్థాయిలో అక్రమ ఆస్తులు కూడబెట్టిన కేసులలో ఇది ఒకటిగా నిలిచింది.
69 ఏళ్ల యాంగ్ తన అధికార హోదాలను ఉపయోగించుకుని ఇతరులకు ఇంజనీరింగ్ కాంట్రాక్టులు, భూ బదిలీలు, ఆర్థిక సహాయాలు అందేలా చేశారని, ఇందుకు బదులుగా డబ్బు, విలువైన వస్తువులను లంచంగా తీసుకున్నారని ప్రభుత్వ మీడియా తెలిపింది.
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ చేపట్టిన అవినీతి నిరోధక చర్యల్లో భాగంగానే యాంగ్ అవినీతిపై దర్యాప్తు జరిగింది.
ఈ అవినీతి నిరోధక దాడులు సైనిక విభాగాలు, ఉన్నత స్థాయి బ్యాంకింగ్ రంగాలతో పాటు ఇతర రంగాలలోని అవినీతిని కూడా బయటపెట్టాయి.

తన కెరీర్‌లో ఎక్కువ భాగం నాంజింగ్ నగర ఆర్థిక, సాంకేతిక అభివృద్ధి విభాగాలలోనే పనిచేసిన యాంగ్.. "అత్యంత తీవ్రమైన" నేరాలకు పాల్పడ్డారని చాంగ్జౌ నగర కోర్టు సోమవారం పేర్కొంది.
ఆయన చర్యలు "దేశ ప్రయోజనాలకు, ప్రజలకు ఊహించని రీతిలో భారీ నష్టాన్ని కలిగించాయని" కోర్టు వ్యాఖ్యానించింది..
అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అవినీతి నిర్మూలన పేరిట అనేక దాడులు చేయించారు.
అయితే, తన రాజకీయ ప్రత్యర్థులను ఏరివేయడానికే ఆయన ఈ దాడులను ఒక ఆయుధంగా వాడుకుంటున్నారని విమర్శకులు ఆరోపిస్తున్నారు.
గతంలోనూ మరణశిక్షలు..
ఆర్థిక నేరాలకు చైనాలో మరణశిక్షలు విధించడం చాలా అరుదు. అయినప్పటికీ, లంచాల మొత్తం 100 కోట్ల యువాన్ల కంటే ఎక్కువ ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఇలాంటి కఠిన శిక్షలు విధిస్తుంటారు.
ఇంతకుముందు, 10 ఏళ్ల కాలంలో 180 కోట్ల యువాన్ల మేర లంచాలు తీసుకున్నందుకు గానూ మాజీ ఆర్థిక చీఫ్ లై జియామిన్‌కు 2021లో మరణశిక్షను అమలు చేశారు.
అలాగే, 300 కోట్ల యువాన్ల కంటే ఎక్కువ మొత్తంలో నిధుల దుర్వినియోగం, లంచాలు తీసుకున్న నేరానికి గానూ ఇన్నర్ మంగోలియా మాజీ అధికారి లి జియాన్‌పింగ్‌కు 2024లో మరణశిక్ష అమలు చేశారు.
మరికొన్ని కేసులలో న్యాయస్థానాలు జైలు శిక్షలు లేదా తాత్కాలికంగా నిలిపివేసిన మరణశిక్షలను (సస్పెండెడ్ డెత్ సెంటెన్స్) విధించాయి. ఈ రకమైన మరణశిక్షలు నిర్ణీత కాలం తర్వాత జీవిత ఖైదుగా మారుతాయి.
దోషులుగా తేలిన వ్యక్తులు ఇతర నేరస్థుల గురించిన సమాచారాన్ని అధికారులకు అందించిన కొన్ని కేసులలో కోర్టులు శిక్షల కాలాన్ని తగ్గించాయి.
యాంగ్ కూడా అధికారులకు ఇటువంటి సమాచారాన్ని అందించి సహాయం చేసినప్పటికీ.. ఆయన చేసిన నేరాలు 'అత్యంత తీవ్రమైనవి' కావడంతో, శిక్ష తగ్గింపునకు ఆ సహాయం సరిపోదని చాంగ్జౌ కోర్టు పేర్కొంది.
ప్రభుత్వ మీడియా తెలిపిన వివరాల ప్రకారం, యాంగ్ తన నేరాన్ని అంగీకరించడమే కాకుండా "తన చివరి ప్రకటనలో పశ్చాత్తాపం వ్యక్తం చేశారు".
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























