కొలీగ్ తినాల్సిన కూరలో నత్తలను చంపే విషం కలిపినట్టు మహిళపై ఆరోపణలు, కేసు నమోదు..

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, టిఫానీ టర్న్‌బుల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 2 నిమిషాలు
ఆస్ట్రేలియాలో ఒక మహిళ తన సహోద్యోగి కూరలో నత్తలను చంపే విషం (స్నెయిల్ పాయిజన్) కలిపారనే ఆరోపణలపై కేసు నమోదయింది.
ఆ సహోద్యోగి కూడా మహిళే. ఆమె ఫిబ్రవరిలో తన సహోద్యోగుల కోసం ఒక వంటకం తయారు చేశారని పశ్చిమ ఆస్ట్రేలియా రాష్ట్ర పోలీసులు తెలిపారు.
ఉదయం టీ సమయంలో అందరూ కలిసి ఆ వంటకం రుచిచూశారు.
అయితే, బాధిత మహిళ మధ్యాహ్న భోజన సమయంలో మిగిలిన ఆహారాన్ని తినడానికి తిరిగి వచ్చినప్పుడు అందులో ఆకుపచ్చ రంగు గింజలు కొన్ని మెరుస్తూ కనిపించాయి.
వాటిని రుచి చూసిన తర్వాత నాలుక మొద్దుబారినట్టు ఆమెకు అనిపించింది. ఆమె వయసు 58ఏళ్లు.

నిందితురాలికి బాధిత మహిళతో గతంలో రిలేషన్షిప్ ఉందని పోలీసులు తెలిపారు.
నెలల తరబడి సాగిన దర్యాప్తు అనంతరం నిందితురాలిపై మరో వ్యక్తి ప్రాణాలు, ఆరోగ్యం, భద్రతను ప్రమాదంలోకి నెట్టారన్న ఆరోపణలపై కేసు నమోదు చేశారు. నవంబర్ 5న ఆమె కోర్టులో హాజరుకావాలి.
కూరను ఉంచిన స్టాఫ్‌రూమ్‌కు తిరిగి వచ్చేముందు నిందితురాలు రసాయనాలను నిల్వచేసే షెడ్‌కు వెళ్లినట్టు పోలీసులు తమ అభియోగంలో పేర్కొన్నారు.
ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళ వయసు 43ఏళ్లు. పోలీసులు ఆమె పేరు వెల్లడించలేదు.
కూరను రుచి చూసిన తర్వాత బాధిత మహిళ ఆ భోజనాన్ని డిటెక్టివ్లకు అప్పగించారు. దాన్ని పరీక్షించగా అందులో నత్తలను చంపే విషపు గుళికలు ఉన్నట్టు గుర్తించారు. ఈ విషపు గుళికల్లో మెటాల్డిహైడ్ అనే విషపూరిత పదార్థం ఉంటుంది.
ఆ విషం తీవ్రమైన గాయాలకు లేదా మరణానికి కూడా కారణమవుతుందని పోలీస్ కమిషనర్ కోల్ బ్లాంచ్ విలేకరులతో చెప్పారు.
"కూరను రుచి చూసిన మహిళకు అందులో ఏదో తేడా ఉందని వెంటనే అనుమానం రావడం మంచి విషయం. ఆమె అలా గుర్తించకపోతే ప్రమాదం జరిగి ఉండేది'' అని పోలీస్ కమిషనర్ కోల్ బ్లాంచ్ చెప్పినట్టు సెవెన్ నెట్వర్క్ తెలిపింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



























