‘‘చాలా బ్రహ్మోస్ క్షిపణులు వేశారు. ఇక యుద్ధం ఆపండి అని పాకిస్తాన్ కోరింది’’: ‘ఆపరేషన్ సిందూర్‌’పై రూపొందించిన డాక్యుమెంటరీలో భారత్ వాదన, దీనిపై పాకిస్తాన్ ఏమంది?

భారత్, పాకిస్తాన్, ఆపరేషన్ సిందూర్, పహల్గాం ఉగ్రదాడి, భారత సైన్యం

ఫొటో సోర్స్, Hindustan Times via Getty Images

ప్రచురణ
చదివే సమయం: 7 నిమిషాలు

భారత్- పాకిస్తాన్ మధ్య 2025 మేలో సైనిక ఘర్షణ జరిగింది. ఇది జరిగి 15 నెలలు దాటుతున్నా దీనిపై రెండు దేశాల అభిప్రాయాలు ఇప్పటికీ భిన్నంగా ఉన్నాయి.

'విజయం మాదే' అని రెండు దేశాలు ప్రకటించుకున్నాయి. యుద్ధంలో జరిగిన నష్టం విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి.

డిస్కవరీ చానెల్ ఇటీవలి డాక్యుమెంటరీ చిత్రం 'డీక్లాసిఫైడ్: ఆపరేషన్ సిందూర్' ఈ ఘర్షణను మరోసారి చర్చనీయాంశం చేసింది.

ఈ డాక్యుమెంటరీలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ ఇతర సీనియర్ సైనిక అధికారులు పాకిస్తాన్‌పై గెలిచినట్లు వాదించారు.

ఈ వాదనలను 'అసత్యమైన, వివాదాస్పదమైన, ప్రచార ఆధారితమైనవని' పాకిస్తాన్ ఆర్మీ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్‌మెంట్ తిరస్కరించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
భారత్, పాకిస్తాన్, ఆపరేషన్ సిందూర్, పహల్గాం ఉగ్రదాడి, భారత సైన్యం

ఫొటో సోర్స్, Discovery Channel India

డాక్యుమెంటరీలో ఏముంది?

పహల్గామ్‌లో పర్యటకులపై 2025 ఏప్రిల్ 22న దాడి జరిగింది. 2025 మే 6-7 తేదీల మధ్య రాత్రి పూట భారత సైన్యం పాకిస్తాన్‌తో పాటు పాక్ పాలిత కశ్మీర్‌పై క్షిపణులో దాడి చేసింది.

పహల్గామ్ ప్రాంతంలో 26 మంది పర్యాటకుల హత్యకు స్పందనగా తాము దాడులు చేసినట్లు భారత్ ప్రకటించింది.

పహల్గామ్ దాడులలో తమ ప్రమేయం ఉందన్న ఆరోపణలను పాకిస్తాన్ ఖండిస్తూ వస్తోంది.

భారత్ తన సైనిక చర్యకు 'ఆపరేషన్ సిందూర్' అనీ, పాకిస్తాన్ తన ప్రతీకార చర్యకు 'ఆపరేషన్ బున్యాన్ అల్ మార్సూస్' అని పేరు పెట్టాయి.

డిస్కవరీ చానల్ ఇండియా, డిస్కవరీ ప్లస్ 'డీక్లాసిఫైడ్: ఆపరేషన్ సిందూర్' డాక్యుమెంటరీ ట్రైలర్‌ను తమ యూట్యూబ్‌ చానళ్లలో అప్‌లోడ్ చేశాయి.

పూర్తి డాక్యుమెంటరీని ఈ మీడియా ప్లాట్‌ఫామ్‌ యాప్‌లలో చూడవచ్చని చెబుతున్నాయి.

అయితే అనేకమంది యూజర్లు ఎక్స్‌తోపాటు ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఈ డాక్యుమెంటరీని తమ ఖాతాల్లో అప్‌లోడ్ చేశారు.

భారత్, పాకిస్తాన్, ఆపరేషన్ సిందూర్, పహల్గాం ఉగ్రదాడి, భారత సైన్యం

ఫొటో సోర్స్, Discovery Channel India

ఈ డాక్యుమెంటరీ సైనిక అధికారులతో ఇంటర్వ్యూల సాయంతో ఆపరేషన్ ప్రారంభం నుంచి కాల్పుల విరమణ వరకు జరిగిన సంఘటనలను వివరిస్తోంది.

పాకిస్తానీ సైనిక, వైమానిక స్థావరాలు, కమాండ్ సెంటర్లపై తాము దాడి చేసి భారీ నష్టాన్ని కలిగించామని, పాకిస్తాన్ ప్రతీకార దాడులు లక్ష్యాన్ని చేరలేదని లేదా లక్ష్యాన్ని చేరడానికి ముందే ధ్వంసం చేశామని ఇండియన్ మిలటరీ అధికారులు ఈ డాక్యుమెంటరీలో చెప్పారు.

2025 మే 10 ఉదయానికల్లా కాల్పుల విరమణ జరగాలని పాక్ కోరుకుందని పాకిస్తాన్ సైన్యాధిపతి జనరల్ అసిమ్ మునీర్ అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోను సంప్రదించడంతో మార్కో రూబియో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో మాట్లాడారని ఈ డాక్యుమెంటరీ పేర్కొంది.

"భారత డీజీఎంతో మాట్లాడాలని పాక్ డీజీఎంఓని మార్కో రుబియో కోరారు. మీరు మాట్లాడటానికి ఆయనే సరైన వ్యక్తి అని సూచించారు" అని ఈ డాక్యుమెంటరీ చెబుతోంది.

పాకిస్తానీ డీజీఎంఓ తనను సంప్రదించి కాల్పులు విరమించాలని కోరినట్లు భారత మాజీ డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ డాక్యుమెంటరీ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

"మీరు మాపై చాలా బ్రహ్మోస్ క్షిపణులను ప్రయోగించారు. మీరిక దీన్ని ఆపాలి. మనం ఈ యుద్ధాన్ని ఎందుకు ఆపకూడదు?" అని పాక్ డీజీఎంఓ కోరినట్లు రాజీవ్ ఘాయ్ చెప్పారు.

భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలోని భాగంలో పాకిస్తాన్ "మమ్మల్ని పదేపదే అభ్యర్థించింది. ఇక చాలు. మీరు చాలా నష్టం కలిగించారు. కాల్పుల్ని విరమించండి అని అడిగారు. దానికి మేము అంగీకరించాం" అని పేర్కొన్నారు.

డాక్యుమెంటరీ చివరలో ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ డాక్యుమెంటరీని వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ కోసం స్పార్కిల్ వర్క్స్ ఫిల్మ్స్ నిర్మించింది.

భారత్, పాకిస్తాన్, ఆపరేషన్ సిందూర్, పహల్గాం ఉగ్రదాడి, భారత సైన్యం

ఫొటో సోర్స్, facebook.com/DiscoveryChannelIndiaOfficial

పాకిస్తాన్ సైన్యం ఏం చెబుతోంది?

డాక్యుమెంటరీలో భారత వాదనలు అవాస్తవమని పాక్ సైన్యానికి చెందిన ఇంటర్ సర్వీసెస్ కొట్టిపారేసింది.

"విఫలమైన పోరాటంలో ఓటమిని అంగీకరించడానికి బదులు భారతదేశం తనదైన వాదనతో చరిత్రను తిరగరాయాలనుకుంటోంది" అని పాక్ ఐఎస్‌పీఆర్ పేర్కొంది.

"చరిత్రను వక్రీకరించేందుకు ఇండియన్ క్రియేటర్స్ నాటకీయ, ఏకపక్ష, కల్పిత కథలను సృష్టించి ఒక డాక్యుమెంటరీగా ప్రదర్శించారు" అని పాక్ ఐఎస్‌పీఆర్ ఎక్స్‌లో ఒక పోస్ట్ పెట్టింది.

భారత్‌కు ఆమోదయోగ్యమైన సంఘటనల కోణాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నం జరిగిందని, డాక్యుమెంటరీలో వివిధ ప్రకటనల్లో వైరుధ్యాలున్నాయని పాక్ ఐఎస్‌పీఆర్ అంటోంది.

"పహల్గామ్ దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురిని 'ఆపరేషన్ సిందూర్' ప్రారంభించిన 82 రోజుల తర్వాత 2025 జూలై 28న గుర్తించి చంపేసినట్లు భారత్ చెప్పింది. అయినప్పటికీ, పహల్గామ్ ఘటనకు 'శిక్షగా' ఈ ఆపరేషన్‌ను ప్రారంభించారని డాక్యుమెంటరీ పేర్కొంటోంది" అని పాకిస్తాన్ సైన్యానికి చెందిన ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ తెలిపింది.

"పహల్గామ్ దాడికి పాల్పడిన 'ఆరోపిత నిందితులు' జూలై 28న హతమైతే, భారత్ చెబుతున్నట్లుగా 2025 మే 7న ఎవరిని శిక్షించారు?" అని పాక్ ఐఎస్‌పీఆర్ ఎక్స్‌లో పోస్ట్ చేసిన మెసేజ్‌లో ప్రశ్నించింది

ఈ మిషన్‌లో 'వంద శాతం విజయం' సాధించామన్న భారతదేశపు వాదనను పాకిస్తాన్ ఐఎస్‌పిఆర్ తిరస్కరించింది.

భారత దాడులకు ప్రతీకార చర్యగా పాక్ సైన్యం "కచ్చితత్వంతో కూడిన ఆయుధాలను ఉపయోగించి పాకిస్తానీ పౌరులను లక్ష్యంగా చేసుకున్న స్థావరాలతో సహా భారతదేశంలోని 26 సైనిక లక్ష్యాలపై దాడి చేసింది" అని ఐఎస్‌పీఆర్ వాదిస్తోంది.

ఈ డాక్యుమెంటరీ ద్వారా భారత్ "ఒక సైనిక తప్పిదాన్ని విజయంగా చిత్రీకరించడానికి ప్రయత్నించింది" అని పాక్ ఐఎస్‌పీఆర్ పేర్కొంది.

భారతదేశానికి వ్యతిరేకంగా "ఎలాంటి కల్పిత కథను సృష్టించాల్సిన అవసరం మాకు లేదు. దేశ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను, జాతీయ ప్రయోజనాలను కాపాడటానికి పాకిస్తాన్ సాయుధ దళాలు పూర్తిగా సిద్ధంగా ఉన్నాయి" అని ఐఎస్‌పీఆర్ పేర్కొంది.

పాకిస్తాన్ సైన్యం ఆరోపణలపై భారత్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

భారత్, పాకిస్తాన్, ఆపరేషన్ సిందూర్, పహల్గాం ఉగ్రదాడి, భారత సైన్యం

ఫొటో సోర్స్, AFP via Getty Images

2025 మే ఘర్షణకు సంబంధించి మనకు ఏం తెలుసు?

'డీక్లాసిఫైడ్: ఆపరేషన్ సిందూర్' డాక్యుమెంటరీలో మే 6 రాత్రి పాకిస్తాన్, పాక్ పాలిత కశ్మీర్‌పై దాడులు చేసినప్పుడు, పాకిస్తాన్ మొదట నియంత్రణ రేఖకు ఆవలి వైపు నుంచి ఎదురు దాడులు చేసిందని భారత అధికారులు చెప్పారు.

"15 నుంచి 20 నిమిషాల వ్యవధిలోనే ఇరువైపులా 40 నుంచి 50 విమానాలు గగనంలోకి ఎగిరాయి" అని భారత వైమానిక దళ మాజీ వైస్ చీఫ్ నర్మదేశ్వర్ తివారీ డాక్యుమెంటరీలో చెప్పారు.

"వారి విమానాల్లో ఏదీ సరిహద్దు ఇటువైపుకు రాకుండా లేదా వారి గగనతలంలో ఉంటూ మాపై బాంబులు వేయకుండా ఉండేలా మేము గగనతలంలో నిశితంగా గమనిస్తూ ఉన్నాము" అని సౌత్ వెస్ట్రన్ వైమానిక దళ కమాండర్-ఇన్-చీఫ్, ఎయిర్ మార్షల్ నాగేష్ కపూర్ చెప్పారు.

"మేం ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణులను ప్రయోగించాము. అవి కచ్చితంగా శత్రువుకు నష్టాన్ని కలిగించాయి" అని ఆయన తెలిపారు.

"సుమారు రెండు గంటల తర్వాత పాకిస్తాన్ విమానాలు వెనక్కి వెళ్లాలని నిర్ణయించుకున్నాయి" అని నర్మదేశ్వర్ తివారీ చెప్పారు.

డాక్యుమెంటరీలో నర్మదేశ్వర్, నాగేశ్ కపూర్ ఆ రాత్రి భారత విమానాలకు ఏదైనా నష్టం జరిగిందా అనే దాని గురించి ఏమీ చెప్పలేదు. అయితే మే 7న తాము ఆరు భారత విమానాలను కూల్చివేశామని పాకిస్తాన్ ప్రకటించింది.

"విమానాలను కూల్చివేశారా లేదా అనేది ముఖ్యం కాదు. వాటిని ఎందుకు కూల్చివేశారు అనేది ముఖ్యం" అని భారత సాయుధ దళాల చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ 2025 జూన్‌లో బ్లూమ్‌బెర్గ్ టీవీకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అన్నారు.

ఆ విమానాల శిథిలాలు భారత వైమానిక దళం ఉపయోగించే యుద్ధ విమానానికి చెందినవని పేర్కొన్న మూడు వీడియోలను 2025 మేలో బీబీసీ వెరిఫై ధృవీకరించింది.

డాక్యుమెంటరీలో ఈ వాదన కూడా ఉంది. కాల్పుల విరమణ తరువాత మే 9న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేసి, పాకిస్తాన్ రాబోయే కొద్ది గంటల్లో ఒక పెద్ద దాడిని ప్రారంభించవచ్చని చెప్పినట్లు భారత ప్రభుత్వం కూడా పేర్కొంది.

"అలాంటి దాడి ఏదైనా జరిగితే తగిన విధంగా ప్రతిస్పందిస్తామని ప్రధాని మోదీ తన సమాధానంలో స్పష్టం చేశారు" అని భారత ప్రభుత్వం చెప్పినట్లు డాక్యుమెంటరీలో పేర్కొన్నారు.

భారత్, పాకిస్తాన్, ఆపరేషన్ సిందూర్, పహల్గాం ఉగ్రదాడి, భారత సైన్యం

ఫొటో సోర్స్, Maxar/PlanetLabs

భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని తాను ఆపానని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ పలు సందర్భాల్లో ప్రకటించారు.

ట్రంప్ వ్యాఖ్యల తర్వాత కాల్పుల విరమణ వెనుక ఎవరున్నారు అని భారత్‌లోని ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నించాయి.

పార్లమెంట్ సమావేశంలో ప్రసంగిస్తూ కాంగ్రెస్ నాయకుడు గౌరవ్ గోగోయ్ "పాకిస్తాన్ నిజంగా లొంగిపోవడానికి సిద్ధంగా ఉంటే, మీరెందుకు ఆగారు, ఎందుకు తలవంచారు? ఎవరికి లొంగిపోయారు?" అని ప్రశ్నించారు.

పాకిస్తాన్‌పై జరిపిన ఆపరేషన్‌లో '100 మందికి పైగా ఉగ్రవాదులను' హతమార్చినట్లు, ఉగ్రవాద శిబిరాలు, పాకిస్తానీ వైమానిక స్థావరాలు, వాయు రక్షణ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు భారత్ ప్రకటించింది.

ఐదు పాకిస్తానీ యుద్ధ విమానాలను, ఒక పెద్ద విమానాన్ని కూల్చివేసినట్లు కూడా భారత్ ప్రకటించింది.

అయితే "ఒక్క పాకిస్తానీ విమానాన్ని కూడా లక్ష్యంగా చేసుకోలేదు లేదా ధ్వంసం చేయలేదు"అని చెబుతూ పాకిస్తాన్ రక్షణ మంత్రి ఈ వ్యాఖ్యలను ఖండించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)