నెయ్మర్ రిటైర్మెంట్.. నార్వే చేతిలో బ్రెజిల్ ఓటమి తరువాత ప్రకటన

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మందీప్ సంఘేరా
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 2 నిమిషాలు
2026 ప్రపంచకప్‌లో నార్వే చేతిలో బ్రెజిల్ ఓటమి పాలైన అనంతరం బ్రెజిల్ తరఫున తన అంతర్జాతీయ కెరీర్ ముగిసిందని స్టార్ ఫుట్‌బాలర్ నెయ్మర్ భావోద్వేగంతో ప్రకటించాడు.
మెట్‌లైఫ్ స్టేడియంలో నార్వేతో జరిగిన మ్యాచ్‌లో బ్రెజిల్ 2-0తో వెనుకంజలో ఉన్న 67వ నిమిషంలో 34 ఏళ్ల నెయ్మర్ సబ్‌స్టిట్యూట్ ఆటగాడిగా బరిలోకి దిగాడు.
అయితే బ్రెజిల్ జట్టును ఓటమి నుంచి కాపాడలేకపోయాడు.
ఈ మ్యాచ్‌లో అదనపు సమయంలో నెయ్మర్ పెనాల్టీ కిక్ ద్వారా ఒక గోల్ సాధించాడు. అయితే అది పెద్ద తేడాను తేలేకపోయింది.


ఫొటో సోర్స్, Getty Images
"నేను ప్రయత్నించాను. ఎంతగానో ప్రయత్నించాను. ఇక ముగింపు. ఇక్కడే నా ప్రస్థానాన్ని ప్రారంభించాను. ఇక్కడే ముగిస్తున్నాను" అని మ్యాచ్ అనంతరం టీవీ గ్లోబోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నెయ్మర్ అన్నాడు.
2010 ఆగస్టులో ఇదే స్టేడియంలో అమెరికాతో ఫ్రెండ్లీ మ్యాచ్‌లో గోల్ సాధించిన నెయ్మర్ బ్రెజిల్ తరఫున అరంగేట్రం చేశాడు.
ఆ మ్యాచ్‌లో బ్రెజిల్ 2-0తో విజయం సాధించింది.
బ్రెజిల్ తరఫున నెయ్మర్ ఇప్పటివరకు 80 గోల్స్ చేసి ఆ దేశ చరిత్రలోనే అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడిగా నిలిచాడు.
అలాగే బ్రెజిల్ తరఫున 130 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో 142 మ్యాచ్‌లతో అగ్రస్థానంలో ఉన్న క్యాఫూ తర్వాత రెండో స్థానంలో ఉన్నాడు.
గాయాల కారణంగా 2023 తర్వాత బ్రెజిల్ తరఫున నెయ్మర్ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అయితే 2026 ప్రపంచకప్ కోసం అతడిని మళ్లీ జట్టులోకి ఎంపిక చేశారు.
ఈ టోర్నీలో స్కాట్లాండ్పై బ్రెజిల్ 3-0తో గెలిచిన చివరి గ్రూప్ మ్యాచ్‌లో నెయ్మర్ చివరి నిమిషాల్లో సబ్‌స్టిట్యూట్ ఆటగాడిగా బరిలోకి దిగాడు.
అనంతరం నార్వేతో జరిగిన మ్యాచ్‌లో మాత్రమే మరోసారి ఆడే అవకాశం లభించింది.
ఇది నెయ్మర్కు నాలుగో ప్రపంచకప్. అంతకుముందు ఆయన 2014, 2018, 2022 ప్రపంచకప్ టోర్నీల్లోనూ బ్రెజిల్‌కు ప్రాతినిధ్యం వహించాడు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)






























