సింధు లోయ నాగరికత ఎలా అంతమైంది?

- రచయిత, డైసీ స్టీఫెన్స్
- హోదా, బీబీసీ న్యూస్
- చదివే సమయం: 6 నిమిషాలు
బహుళ అంతస్తుల ఇటుక ఇళ్లు, ఒకే వరుసలో ఉండే వీధులు, అద్భుతమైన మురుగునీటి పారుదల వ్యవస్థ, ఫ్లషింగ్ టాయిలెట్లు…
ఇవి ఆధునిక నగరాలకు చిహ్నాలుగా అనిపించవచ్చు. కానీ నిజానికి ఇవి వేలఏళ్లనాటి సింధు లోయ నాగరికత అవశేషాలు. ఇది ప్రాచీన ఈజిప్ట్ నాగరికత ఉన్న కాలంలోనే ఉనికిలో ఉండేదని చెబుతారు.
కానీ ప్రాచీన ఈజిప్ట్ నాగరికతకంటే సింధు లోయ నాగరికత గురించి మన దగ్గర చాలా తక్కువ సమాచారం ఉంది.
ఆ కాలంలో ప్రపంచంలో ఉన్న అనేక ఇతర సమాజాల కంటే సింధు లోయ నాగరికత ఉత్తమమైనదని, దాని జీవనశైలి, ఆధునికత ఇతర నాగరికతలకంటే దీన్ని ప్రత్యేకంగా నిలబెట్టాయని చాలామంది నిపుణుల అభిప్రాయం.
సింధు లోయ నాగరికత అభివృద్ధి కాలం క్రీ.పూ. 2600 నుంచి 1900 వరకు విస్తరించి ఉందని చెబుతారు.

క్రీస్తుపూర్వం నాలుగు వేల సంవత్సరాల కంటే ముందే ఈ నాగరికత ఉనికిలో ఉందని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం, యూనివర్సిటీ కాలేజ్ లండన్‌లలో లెక్చరర్ అయిన డాక్టర్ సంగరలింగం రమేష్ చెబుతున్నారు.
ప్రస్తుత పాకిస్తాన్, భారతదేశాలలోని సింధు నది చుట్టుపక్కల ప్రాంతమే దీని కేంద్రంగా ఉండేది. ఇందులో గ్రామీణ వ్యవసాయ వర్గాలతో పాటు 1,400కు పైగా పట్టణాలు, నగరాలు ఉండేవి. వీటిలో అతిపెద్దవి హరప్పా, మొహంజోదారో.
ప్రాచీన ఈజిప్ట్, ప్రాచీన మెసొపొటేమియా (ప్రస్తుత ఇరాక్) నాగరికతల కంటే సింధు లోయ నాగరికత చాలా పెద్దదని డాక్టర్ రమేష్ అన్నారు.
ఈ నాగరికతలో సుమారు పది లక్షల మంది ప్రజలు నివసించేవారు. అనేక కారణాల వల్ల సింధు లోయ నాగరికత అత్యంత అభివృద్ధి చెందినదిగా పరిగణించారు.

ఫొటో సోర్స్, DEA / W Buss via Getty Images
ఆధునిక పట్టణ ప్రణాళిక
డాక్టర్ రమేష్ చెబుతున్న ప్రకారం.. ఇటుకల నిర్మాణం మొదలైన తొలి నివాస ప్రాంతాలలో సింధు లోయ నాగరికత ఒకటి. ఇక్కడి ప్రజలు తమ ఇళ్లను నిర్మించుకోవడానికి ఒకే పరిమాణంలో ఉన్న ఇటుకలను ఉపయోగించారు.
ఇక్కడి నగరాలను ఒకేలాంటి వీధులతో, 90 డిగ్రీల కోణంలో నిర్మించారని ఆయన అన్నారు. అక్కడ బావులు, ఇళ్లలో మరుగుదొడ్లు, స్నానపు గదులతో కూడిన అద్భుతమైన మురుగునీటి పారుదల వ్యవస్థ కూడా ఉండేవి.
స్నానాల గది నిర్మాణ శైలి, మురుగునీటి వ్యవస్థను చూస్తే ఇక్కిడి ప్రజలకు మురికి నీటి వల్ల కలిగే వ్యాధుల గురించి అవగాహన ఉండేదని.. పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇచ్చారని స్పష్టమవుతోందని డాక్టర్ రమేష్ అంటున్నారు.
అలాగే పట్టణ జనాభా వ్యాప్తిని బట్టి, అక్కడ రవాణా సౌకర్యాలు కూడా బాగా అభివృద్ధి చెందాయని.. వీటి వల్ల వ్యాపారం సులభం అయ్యేదని చెప్పొచ్చని ఆయన అన్నారు.
"సింధు లోయ నాగరికత ప్రజలు ప్రాచీన మెసొపొటేమియాతో కలప, పూసలు, రాగి, బంగారం, పత్తి వంటి వ్యాపారం చేసేవారు" అని డాక్టర్ రమేష్ చెప్పారు.

ఫొటో సోర్స్, Leemage/Corbis via Getty Images
సామూహిక ప్రభుత్వం
పట్టణ ప్రాంతాల తరహాలో అద్భుతమైన పౌర ప్రభుత్వం ఉండేదని ఆ భవనాల అవశేషాల ద్వారా తెలుస్తోందని డాక్టర్ రమేష్ అంటున్నారు.
నగరాలు, నివాస ప్రాంతాల మౌలిక సదుపాయాల నిర్వహణ, నిర్మాణానికి బాధ్యత వహించే, చక్కగా పనిచేసే ఒక పట్టణ అధికార యంత్రాంగం ఉండేదనడానికి ఇది రుజువు.
వారి ప్రభుత్వ విధానం ఒక్క వ్యక్తికి పరిమితం కాలేదని ఆయన అంటున్నారు. అంటే అక్కడ పాలక వర్గం అంటూ ఏమీ లేదు, బదులుగా అది ఒక సామూహిక విధానం ఉండేది. దీని అర్థం, పరిపాలన వ్యవస్థలో ఎక్కువ మంది ప్రజలు పాలుపంచుకున్నారు.
ఇదే సింధు లోయ నాగరికతను ఇతర సమాజాలు, నాగరికతలకంటే ప్రత్యేకంగా నిలబెట్టిందని ఆయన చెప్పారు.
ఈజిప్టు ఫారోలు లేదా మెసొపొటేమియా రాజుల వంటి పాలకుడు లేడని, అలాగే పెద్ద రాజభవనాలు లేదా భవనాలు కూడా లేవని ఇక్కడి శిథిలాలనుబట్టి తెలుస్తుంది.
ఈజిప్ట్, మెసొపొటేమియాలో అధికారం, శక్తి ఒకే వ్యక్తి చేతిలో కేంద్రీకృతమై ఉండేవని, ఆ నాగరికతల ప్రాచీన భవనాలలో కూడా ఇది స్పష్టంగా కనిపిస్తుందని, అక్కడ అధికార యంత్రాంగం, రాజ వైభవం కూడా ఉండేవని డాక్టర్ రమేష్ చెప్పారు.

ఫొటో సోర్స్, AFP via Getty Images
ప్రశాంతమైన ప్రాంతం
సింధు లోయలో కొంత స్థాయిలో సామాజిక స్థాయిలు ఉన్నాయని ఆధారాలు ఉన్నాయి. కానీ అవి ఆ కాలంలోని ఇతర నాగరికతలతో పోలిస్తే చాలా తక్కువగా ఉండేవి.
"ఈజిప్టు, మెసొపొటేమియా శిథిలాల నుంచి సామాజిక వర్గాలలోని తేడాలను గుర్తించడం సులభం. కానీ సింధు లోయలో ఇళ్ల పరిమాణంలో తేడా ఉన్నప్పటికీ, ఇక్కడ వర్గాల మధ్య అంతరం ఎంత లోతుగా ఉందో చెప్పడం కష్టం" అని రమేష్ అన్నారు.
హింసకు సంబంధించిన ఆధారాలున్న కొన్ని మానవ అస్థిపంజరాలను పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారని రమేష్ వివరిస్తున్నారు. అయితే ఇతర సమాజాలతో పోలిస్తే సింధు లోయ నాగరికత చాలా శాంతియుతమైందని కొంతమంది నిపుణులు భావిస్తున్నారు.
ఇతర ప్రాచీన సమాజాలలో పెద్ద యుద్ధాలు సర్వసాధారణంగా ఉండేవని, కానీ ఇక్కడ అలాంటి ఆనవాళ్లు ఏవీ లేవని రమేష్ అంటున్నారు.
అయితే, హింస జరిగిన ఆనవాళ్లు మనకు కనిపించనంత మాత్రాన అది జరగలేదని అర్థం కాదని డాక్టర్ రమేష్ అభిప్రాయపడ్డారు.
"ఒక సమాజం తన యుద్ధాలను ప్రధానంగా చూపించకపోతే లేదా చరిత్రలో వాటి గుర్తులు వదిలిపెట్టకపోతే, వారు నిజంగా శాంతియుతంగా ఉన్నారా లేదా అన్న విషయంలో మనం తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది" అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, DEA / G Nimatallah via Getty Images
రహస్య అవశేషాలు
'సింధులోయ నాగరికత గురించి మనకు ఇంకా పెద్దగా తెలియదు. ఇంకా చాలా తవ్వకాలు జరగాల్సి ఉంది' అని రమేష్ అంటున్నారు.
ఈ ప్రాచీన నాగరికత అఫ్ఘానిస్తాన్ వరకు విస్తరించి ఉన్నందున, పశ్చిమ భారతదేశంలో అటువంటి ప్రదేశాల కోసం ఇప్పటికీ అన్వేషణ జరుగుతోందని ఆయన అంటున్నారు.
"అఫ్ఘానిస్తాన్‌లోని ప్రస్తుత పరిస్థితి కారణంగా, ఈ సమయంలో అక్కడి శిథిలాలను తవ్వడం చాలా కష్టం" అని ఆయన అన్నారు.
ఈజిప్టు, మెసొపొటేమియా నాగరికతలు మన్నికైన రాతి కట్టడాల శిథిలాలను వదిలి వెళ్లినందున, వాటి అవశేషాల నుంచి ఆయా సంస్కృతుల గురించి సమాచారం సేకరించడం సులభమైందని రమేష్ అంటారు. అయితే, మరోవైపు సింధులోయ నాగరికత మట్టి ఇటుకలను, కాల్చిన ఇటుకలను విస్తృతంగా ఉపయోగించింది.
"పెద్ద రాళ్లు, రాజభవనాలు లేదా రాజుల సమాధులు లేకుండా సింధు నాగరికత గురించి ఎక్కువగా తెలుసుకోవడం కష్టం. అంతేకాకుండా, ఇక్కడి లిపిని కూడా మనం పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాం అందుకే మరింత క్లిష్టంగా మారింది" అని ఆయన అన్నారు.
పతనానికి కారణమేంటి?
సింధులోయ నాగరికత పతనానికి గల ప్రధాన సిద్ధాంతాలలో వాతావరణ మార్పు ఒకటి.
సుమారు క్రీ.పూ. 1900లో ఈ ప్రదేశాలను విడిచి ప్రజలు వెళ్లిపోవడం మొదలైందని రమేష్ చెబుతుండగా, రుతుపవన సరళిలో మార్పులే దీనికి కారణమని పురావస్తు శాస్త్రవేత్తలు, వాతావరణ నిపుణులు అంటున్నారు.
ఈ నాగరికత అంతానికి ముందు ప్రజలు వరదల ప్రభావాన్ని తగ్గించడానికి ప్రయత్నించారనడానికి మొహంజోదారోలో జరిపిన తవ్వకాలలో ఆధారాలు కూడా బయటపడ్డాయని ఆయన అంటున్నారు.
సింధులోయ నాగరికతను అర్థం చేసుకోవడం ద్వారా ఆధునిక సమాజాలపై దాని ప్రభావాన్ని మనం గ్రహించగలమని రమేష్ అభిప్రాయపడ్డారు.
ఎందుకంటే ఒకవేళ హిమాలయ హిమానీనదాలు వేగంగా కరిగిపోతే, చరిత్ర పునరావృతమయ్యే అవకాశం ఉంది.
"సింధు నాగరికతలో ఉన్న సామూహిక పాలన శైలి వారిని రక్షించడానికి సరిపోలేదు. అయితే, నేటి ఆధునిక సమాజాలు వాతావరణ మార్పును నివారించడానికి చాలా మెరుగైన చర్యలు తీసుకోగలవు. సింధులోయ నాగరికత ప్రజలకు అసలేం జరుగుతుందో తెలుసుకునే సాంకేతిక పరిజ్ఞానం లేదు. కానీ నేడు మనకు ఈ సాంకేతిక సామర్థ్యం ఉంది. మన నాగరికత మనుగడ సాగించేలా మన సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత వివేకంతో ఉపయోగించుకోవచ్చు" అని డాక్టర్ రమేష్ అన్నారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

































