ఇరాన్ యుద్ధంతో ఇండియాలో కండోమ్‌ల ధరలు పెరగనున్నాయా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఇమ్రాన్ ఖురేషీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
- చదివే సమయం: 7 నిమిషాలు
ఇరాన్‌లో యుద్ధం ప్రపంచంలోని ఇతర దేశాల్లో వివిధ రంగాలపై ప్రభావం చూపించింది. ఇప్పుడు దాని ప్రభావం జీవనశైలికి సంబంధించిన ఒక కీలక రంగంపై కూడా పడటం మొదలైంది. కండోమ్‌ల తయారీ పరిశ్రమలో ఇప్పుడొక రకమైన ఆందోళన నెలకొంది.
కండోమ్‌ల తయారీలో ఉపయోగించే పెట్రో-కెమికల్ ఉత్పత్తులు, అమ్మోనియా, సిలికాన్ ఆయిల్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీంతో వీటి ధరల పెరుగుదలపై చర్చ మొదలైంది. దీని ప్రభావం రీటైల్ విక్రయాలపై కూడా స్పష్టంగా కనిపించవచ్చు.
భారతదేశంలో కండోమ్‌ల వ్యాపారం 8,000 కోట్ల రూపాయలకు పైగా ఉంటోంది. అయితే, ధరల పెరుగుదలకు సంబంధించి ముడిపదార్థాల సరఫరాదారులు కీలక సంకేతాలు ఇచ్చినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
ఆయా వర్గాల సమాచారం ప్రకారం, అమ్మోనియా ధరలు 40 నుంచి 50 శాతం వరకూ పెరిగే అవకాశం ఉంది.
అమ్మోనియా ధరలు పెరిగితే, దానివల్ల సిలికాన్ ఆయిల్ ధరలు కూడా పెరుగుతాయి.
ఈ రంగానికి చెందిన ఒక అధికారి(పేరు వెల్లడించడానికి ఇష్టపడలేదు) బీబీసీతో మాట్లాడారు.
'కండోమ్‌ల తయారీ పరిశ్రమలో ఇలాంటి సమస్య వస్తుందని ఎవరూ ఊహించలేదు. ఎందుకంటే, కండోమ్ ఇప్పుడొక లైఫ్-స్టైల్ ప్రొడక్ట్‌గా మారింది. దీని వ్యాపారంలో వచ్చే మార్పులు ప్రజల జీవితాలపై ప్రభావం చూపుతాయి'' అని ఆ అధికారి చెప్పారు.

కండోమ్‌ల తయారీలో అవి కీలకం...
కండోమ్‌ల నాణ్యత, మన్నిక పెంచడంలో అమ్మోనియా, సిలికాన్ ఆయిల్ కీలకం.
లేటెక్స్ గడ్డ కట్టకుండా ఉంచడానికి అమ్మోనియా ఉపయోగిస్తారు. అలాగే, లేటెక్స్‌లో సహజంగా ఉండే అదనపు ప్రోటీన్లను తొలగించడానికి కూడా అమ్మోనియా సహాయపడుతుంది.
కండోమ్‌పైన సిలికాన్ ఆయిల్ కోటింగ్ వేస్తారు. ఇది లూబ్రికెంట్‌లా పనిచేసి, కండోమ్ ఉపయోగాన్ని సులభతరం చేస్తుంది.
అయితే, ముడిపదార్థాల ధరలు పెరగడం, దీనివల్ల రిటైల్ విక్రయాలపై ప్రభావం పడటం మాత్రమే ఈ విషయంలో ఆందోళనకు ఏకైక కారణం కాదు.
కండోమ్ పరిశ్రమలో తలెత్తిన ఈ సమస్య జనాభా, ఆరోగ్య అధ్యయనాల (ఉదాహరణకు కుటుంబ నియంత్రణ, ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమాల)తో సంబంధం ఉన్నవారికి కూడా ఆందోళన కలిగించే అంశంగా మారింది.
''మెరుగైన ఆరోగ్య ఫలితాలను సాధించాలంటే గర్భనిరోధక సాధనాలు అందరికీ అందుబాటులో ఉండేలా చూడటం, గర్భనిరోధంలో పురుషుల బాధ్యతను ఒక సాధారణ విషయంగా మార్చడం చాలా ముఖ్యం. అందువల్ల, కండోమ్‌ల కొరత ఏర్పడినా లేదా వాటి ధరలు పెరిగినా టీనేజ్ ప్రెగ్నెన్సీ కేసులు పెరిగే అవకాశం ఉంది'' అని పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పూనమ్ ముత్రేజా బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, Viviane Moos/CORBIS/Corbis via Getty Images
రవాణాలో అంతరాయాలు
'పీవీసీ ఫాయిల్, అల్యూమినియం ఫాయిల్, పాలీ కెమికల్స్‌తో పాటు ప్రధాన ముడిపదార్థాల సరఫరాలో ఏర్పడిన అంతరాయం, వాటి ధరల్లో వస్తున్న హెచ్చుతగ్గులు, రవాణాపరంగా ఎదురవుతున్న అడ్డంకుల కారణంగా... ఉత్పత్తి, ఆర్డర్లను సకాలంలో పూర్తిచేయలేకపోవచ్చు'' అని హెచ్‌ఎల్‌ఎల్ లైఫ్ కేర్ లిమిటెడ్ ప్రతినిధి ఒకరు బీబీసీతో చెప్పారు.
ఆరు దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర కలిగిన హెచ్‌ఎల్‌ఎల్ ఒక ప్రభుత్వ రంగ సంస్థ.
కేరళలోని తిరువనంతపురంలో హెడ్ క్వార్టర్స్ ఉన్న ఈ సంస్థను దేశంలో కుటుంబ నియంత్రణ కార్యక్రమానికి పూర్తిస్థాయిలో సహకారం అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసింది.
రబ్బరు తోటలు ఎక్కువగా ఉండటం వల్లే ఈ సంస్థను కేరళలో ప్రారంభించారు. తర్వాత కాలంలో హెచ్‌ఎల్‌ఎల్ తన కార్యకలాపాలను ఏడు వేర్వేరు ప్రాంతాలకు విస్తరించింది.
దేశంలోని మహిళల ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే ప్రధాన ఉద్దేశంగానున్న ఈ సంస్థ ప్రస్తుతం కండోమ్‌లతో పాటు, ఆసుపత్రులలో ఉపయోగించే వివిధ ఉత్పత్తులను, మందులను కూడా తయారుచేస్తోంది.
ఈ కంపెనీ ఏటా సుమారు 200 కోట్ల కండోమ్‌లను ఉత్పత్తి చేస్తోంది. ఇది దేశంలో తయారయ్యే మొత్తం కండోమ్‌లలో దాదాపు 50 శాతం.
2025-26 కాలంలో కుటుంబ నియంత్రణ, జాతీయ ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమాల కోసం రూ.100 కోట్లకు పైగా విలువైన మేల్ కండోమ్‌లను హెచ్‌ఎల్‌ఎల్ ఉచితంగా అందించింది. ఈ సంస్థ తన ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా 87 దేశాలకు ఎగుమతి చేస్తోంది.

ఫొటో సోర్స్, Kuni Takahashi/Bloomberg via Getty Images
ఫార్మా రంగంలో ఆందోళన
యుద్ధం వల్ల తలెత్తిన పంపిణీ, లాజిస్టిక్స్ సమస్యలే కండోమ్ పరిశ్రమలో నెలకొన్న ఆందోళనకు ప్రధాన కారణం.
''గ్లోబల్ షిప్పింగ్ కంటైనర్ల కొరత కారణంగా విదేశీ కస్టమర్లకు సరకు పంపడంలో ఆలస్యం జరుగుతోంది. హార్ముజ్ జలసంధి మీదుగా పెద్ద ఓడల రాకపోకలను నిలిపివేయడంతో సముద్ర మార్గంలో సరుకు రవాణా ఆలస్యమవుతోంది. ఇప్పుడు ఓడలను 'కేప్ ఆఫ్ గుడ్ హోప్' మీదుగా పంపడం వల్ల ప్రయాణానికి అదనంగా 15-20 రోజులు ఎక్కువ సమయం పడుతోంది'' అని ఒక అధికారి చెప్పారు.
మిడిల్ ఈస్ట్‌లో గగనతలంపై ఉన్న ఆంక్షల వల్ల విమాన రవాణా సామర్థ్యం కూడా తగ్గిపోయిందని, దీనివల్ల తయారైన సరకు భారీగా పేరుకుపోతోందని ఆయన వెల్లడించారు.
''ప్రస్తుతానికి ముడిపదార్థాల సరఫరాలో ఏర్పడిన తగ్గుదలను ఖచ్చితంగా అంచనా వేయడం కష్టం. అనిశ్చితి కొనసాగుతోంది. ఒకవైపు ముడిపదార్థాల లభ్యత, వాటి ధరల పెరగుదల, మరోవైపు తయారీ ఖర్చు, ఆపై పంపిణీలో అడ్డంకులు.. ఇవన్నీ కలిపి ఖచ్చితంగా కండోమ్‌ల లభ్యతపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి'' అని ఆ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

ఫొటో సోర్స్, Sanchit Khanna/Hindustan Times via Getty Images
కండోమ్స్ ఎగుమతిపైనా ప్రభావం
వాస్తవానికి, ప్రస్తుత పరిస్థితుల వల్ల మహారాష్ట్రలోని మాలేగావ్‌లో ఉన్న క్యూపిడ్ లిమిటెడ్ కూడా నష్టపోతోంది.
''సిలికాన్ ఆయిల్, అల్యూమినియం ఫాయిల్ ధరలు అదుపులో లేవు. సాధారణంగా ఈ సమయంలో లేటెక్స్ ధరలు కూడా పెరుగుతుంటాయి. అందుకే, దీని ప్రభావం ఉత్పత్తి వ్యయంపై పడుతోంది. అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే, పెరిగిన ఈ ఖర్చులను వెండర్లపై వేయలేం. ఎందుకంటే వారు దానికి సిద్ధంగా లేరు. అందుకే ఇది ఒక పెద్ద సమస్యగా మారింది'' అని క్యూపిడ్ లిమిటెడ్ సీనియర్ జనరల్ మేనేజర్ ఆర్.బాబు బీబీసీతో అన్నారు.
''మా మొత్తం ఉత్పత్తిలో 80 శాతం ప్రధానంగా రష్యా, దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌తో పాటు యూరప్ దేశాలకు ఎగుమతి చేస్తాం. అక్కడికి సరకును చేరవేయడానికి ప్రస్తుతం ఓడలు దొరకడం కూడా కష్టమవుతోంది'' అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, INDRANIL MUKHERJEE/AFP via Getty Images
‘ప్రస్తుతానికి కొరత లేదు’
కండోమ్ పరిశ్రమలో నెలకొన్న అనిశ్చితి, సాధారణ ఔషధ తయారీ రంగంలో కూడా కనిపిస్తోంది. ఈ రంగం ప్రస్తుతం రెండు రకాల సవాళ్లను ఎదుర్కొంటోంది.
ఇండియన్ డ్రగ్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఐడీఎంఏ) ప్రతినిధి, అహ్మదాబాద్‌కు చెందిన విరించి షా బీబీసీతో మాట్లాడుతూ, ''ఎగుమతుల పరంగా ఒక సవాలు ఉంది. ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్, యూరప్ దేశాలకు ఎగుమతి చేయడానికి ఓడల లభ్యత విషయంలో తీవ్రమైన సమస్య ఉంది. అది సముద్ర మార్గం కావచ్చు లేదా వాయు మార్గం కావచ్చు. దీనికి ప్రధాన కారణం రవాణా సదుపాయాల ఫ్రీక్వెన్సీ తగ్గిపోవడమే. దీనివల్ల రవాణా ఖర్చులు పెరిగాయి'' అని చెప్పారు.
ఇది నిశితంగా గమనించాల్సిన విషయమని, దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని ఆయన అన్నారు. అయితే, భారతదేశంలో మందుల లభ్యత లేదా మందుల ఎగుమతుల విషయంలో ప్రస్తుతానికి ఎలాంటి కొరత లేదని పేర్కొన్నారు.
అయితే, ఈ పరిశ్రమ ముందున్న మరో సవాలు ఏమిటంటే.. సాల్వెంట్స్ లేదా సింథటిక్ మందుల వంటి అనేక ఔషధాల తయారీకి అవసరమైన పదార్థాలుకు పెట్రో కెమికల్సే ఆధారం.
''ప్రస్తుతం మార్కెట్లో ఊహాగానాల హోరు నడుస్తోంది. వీటి వల్లే ముడిపదార్థాల కొరత ఏర్పడవచ్చనే భయాందోళనలు కలుగుతున్నాయి. దీనివల్ల ధరలు పెరిగాయి. ప్రస్తుతానికి ఇది నిజమైన కొరత కంటే ఎక్కువగా ఊహాగానాల వల్లే జరుగుతోంది'' అని షా అన్నారు.
ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుతం భయాందోళనలు నెలకొన్నాయని, వాస్తవానికి రేపు ఏం జరుగుతుందనేదీ ఎవరికీ ఖచ్చితమైన భరోసా లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
'కుటుంబ నియంత్రణ విభాగంలో ఆందోళన'
కండోమ్‌ల ధరల పెరుగుదల లేదా వాటి ఉత్పత్తి తగ్గడంపై కుటుంబ నియంత్రణ విభాగంలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
''ఒకవేళ ధరలు పెరిగినా లేదా లభ్యతకు ఆటంకం కలిగినా కండోమ్ వినియోగం తగ్గే ప్రమాదం ఉంది. ముఖ్యంగా యువత, తక్కువ ఆదాయ వర్గాల వారిపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఇప్పటివరకు సాధించిన ప్రగతి దెబ్బతినవచ్చు'' అని పూనమ్ ముత్రేజా అన్నారు.
''దీనివల్ల అవాంఛిత గర్భధారణల ముప్పు పెరగడమే కాకుండా, మహిళలపై పడే గర్భధారణ అనే అసమాన భారం మరింత పెరుగుతుంది. ఈ వివక్షను సరిదిద్దేందుకే భారత్ ప్రయత్నిస్తోంది'' అని ఆమె చెప్పారు.
భారతదేశంలో కండోమ్ వినియోగం ''తక్కువ''గా ఉంది. మరింత సమతుల్యమైన, సమానత్వంతో కూడిన కుటుంబ నియంత్రణ పద్ధతిగా దీన్ని ప్రోత్సహించడం అవసరం.
''జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్)-5 ప్రకారం, ప్రస్తుతం వివాహిత జంటలలో కేవలం 9 శాతం మంది మాత్రమే కండోమ్‌ను తమ ప్రధాన కుటుంబ నియంత్రణ పద్ధతిగా భావిస్తున్నారు. కండోమ్ ప్రాముఖ్యాన్ని, దీన్ని మరింత విస్తరించడానికి ఉన్న అవకాశాన్ని ఇది సూచిస్తోంది'' అని పూనమ్ ముత్రేజా అన్నారు.
''చాలామంది యువత కూడా కండోమ్‌లను ఉపయోగిస్తారు. భారత్ వంటి దేశంలో ప్రజారోగ్య కార్యక్రమాలు వాటి భారీస్థాయి కొనుగోళ్లపై ఆధారపడి ఉంటాయి. కాబట్టి కండోమ్‌ల సరఫరాలో స్వల్పకాలిక కొరత ఏర్పడినా అది ఉచిత లేదా రాయితీ కండోమ్‌లపై ఆధారపడే వారిపై తీవ్ర ప్రభావం చూపుతుంది'' అని చెప్పారు.
చివరిగా అసలు ప్రశ్న ఏమిటంటే, కండోమ్‌ల ధర ఎప్పటి నుంచి పెరగవచ్చు?
''ఈ యుద్ధం ఎంత త్వరగా ముగిస్తే, అందరికీ అంత మంచిది'' అని పరిశ్రమకు చెందిన అధికారులలో ఒకరు అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

































