హార్ముజ్‌ను మూసేస్తామన్న ట్రంప్ హెచ్చరిక భారత్‌కు ఎన్ని రూపాలలో సమస్యలు పెంచే అవకాశం ఉంది?

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, సందీప్ రాయ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- చదివే సమయం: 8 నిమిషాలు
యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా, ఇరాన్‌ల మధ్య జరిగిన చర్చలు విఫలమైన అనంతరం, హార్ముజ్ జలసంధిని మూసేయాలని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రకటించారు.
అధ్యక్షుడి ఆదేశాల మేరకు ఈఎస్‌టీ (తూర్పు ప్రామాణిక సమయం) ప్రకారం సోమవారం ఉదయం 10 గంటల (భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటల) నుంచి ఇరాన్ ఓడరేవులపై అమెరికా దళాలు నౌకా దిగ్బంధనాన్ని అమలు చేయడం మొదలుపెట్టాయి.
అయితే హార్ముజ్ జలసంధి ద్వారా ఇరాన్‌కి కాకుండా వేరే ఓడరేవులకు వెళ్లే నౌకల రాకపోకలను అమెరికా దళాలు అడ్డుకోబోవని సెంట్రల్ కమాండ్ చెబుతోంది.
ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఈ చర్చలు విఫలమైన తర్వాత, ముడి చమురు ధరలు మళ్లీ బ్యారెల్‌కు 100 డాలర్లను దాటాయి.
ఇప్పటికే కష్టాలతో సతమతమవుతున్న ప్రపంచానికి, పెరుగుతున్న చమురు ధరల వల్ల మరింత అనిశ్చితి ఏర్పడింది.


ఫొటో సోర్స్, Planet Lab

హార్ముజ్ జలసంధి ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన సముద్ర చమురు రవాణా మార్గాలలో ఒకటి. ప్రపంచ చమురు, ఎల్ఎన్‌జీలో సుమారు 20 శాతం ఈ జలమార్గం ద్వారా రవాణా అవుతుంది.
భారత్ తన పెట్రోలియం వినియోగంలో సుమారు 90 శాతాన్ని దిగుమతి చేసుకుంటుంది. ఈ దిగుమతిలో ఎక్కువ భాగం హార్ముజ్ జలసంధి ద్వారా జరుగుతుంది.
ప్రపంచంలో ముడి చమురును అత్యధికంగా వినియోగించే దేశాలలో భారత్ మూడో స్థానంలో ఉంది.
గత కొన్నేళ్లుగా భారత్ తన పెట్రోలియం దిగుమతులను గణనీయంగా విస్తరించుకుంది. ఇప్పుడు 41 దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
అయినప్పటికీ భారత్ దిగుమతి చేసుకునే లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్ఎన్‌జీ)లో అధికభాగం ఇప్పటికీ హార్ముజ్ జలసంధి ద్వారానే వస్తోందని విశ్లేషకుల అభిప్రాయం.
"భారత్ తన చమురు అవసరాలలో సుమారు 90 శాతాన్ని దిగుమతి చేసుకుంటుంది. అందులో 50 శాతం హార్ముజ్ జలసంధి ద్వారా వస్తుంది. ఇప్పుడు జరుగుతున్న కొనుగోళ్లన్నీ అధిక ధరలకే జరుగుతున్నాయి. ఈ దిగ్బంధనం వల్ల సమస్య మరింత తీవ్రమవుతుంది" అని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు హర్ష్ పంత్ బీబీసీతో అన్నారు.
2025లో భారత ముడిచమురు దిగుమతులలో 50 శాతానికి పైగా మధ్యప్రాచ్యం నుంచి, ముఖ్యంగా ఇరాక్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి వచ్చినట్టు భారత వాణిజ్య శాఖ గణాంకాల ద్వారా తెలుస్తోంది.
అయితే 2019 నుంచి 2022 మధ్య, మధ్యప్రాచ్యంపై భారత్ ఆధారపడటం 60 శాతానికి పైగా పెరిగింది.
దీంతో ఈ రంగంలో ఏ అంతరాయం కలిగినా సరఫరాలపై ప్రభావం పడవచ్చు.
మార్చి 11న భారత ప్రభుత్వం నిర్వహించిన అంతర్-మంత్రిత్వ శాఖల సమావేశంలో భారత ముడి చమురు దిగుమతులలో 70 శాతం ఇప్పుడు హార్ముజ్ జలసంధి వెలుపల నుంచి వస్తున్నాయని, ఇంధన సరఫరాలు సురక్షితంగా ఉన్నాయని చెప్పినట్టు పీఐబీ పేర్కొంది.

ఫొటో సోర్స్, AFP via Getty Images

ప్రపంచంలో లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్‌ఎన్‌జీ)ను దిగుమతి చేసుకునే దేశాలలో భారత్ నాలుగో స్థానంలో, ఎల్‌పీజీని దిగుమతి చేసుకునే దేశాలలో రెండో స్థానంలో ఉందని ఏఎఫ్‌పీ వార్తా సంస్థ పేర్కొంది.
"భారత్ తన ఎల్‌పీజీ అవసరాలలో 60 శాతాన్ని దిగుమతి చేసుకుంటుంది. అందులో 90 శాతం హార్ముజ్ జలసంధి ద్వారా వస్తుంది"అని హర్ష్ పంత్ అంటున్నారు.
ఎల్ఎన్‌జీని అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశమైన ఖతార్, దాని ఉత్పత్తిని నిలిపివేసిందని అల్ జజీరా నివేదిక పేర్కొంది.
"భారత్ తన ఎల్‌పీజీలో అధిక భాగాన్ని, ఎల్‌ఎన్‌జీ అవసరాలలో మూడింట రెండు వంతులను మధ్యప్రాచ్యం నుంచి కొనుగోలు చేస్తుంది. భారత్‌కి ఖతార్ అతిపెద్ద ఎల్‌ఎన్‌జీ సరఫరాదారు. అంతేకాకుండా ఎల్‌ఎన్‌జీని ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రగామి ఖతార్’’ అని బ్లూమ్‌బెర్గ్ తెలిపింది.
ఖతార్ తన ప్రొడక్షన్‌ను నిలిపివేసిందని కొన్ని నివేదికలు పేర్కొంటున్నాయి.
ప్రపంచ ఎల్ఎన్‌జీలో దాదాపు ఐదో వంతును ఖతార్ సరఫరా చేస్తుంది. రాస్ లఫాన్ గ్యాస్ క్షేత్రం ఇందులో కీలక పాత్ర పోషిస్తుంది. ఖతార్ ‘క్రౌన్ జ్యువెల్’గా పిలిచే ఈ క్షేత్రంపై ఇటీవల ఇరాన్ దాడి చేయడంతో భారీనష్టం వాటిల్లింది.
ఈ నేపథ్యంలో భారత్‌లోని కంపెనీలకు లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్ఎన్‌జీ) పారిశ్రామిక సరఫరాలో 20 శాతం కోతను ఇప్పటికే ప్రకటించారు.
గృహాలు, రవాణా రంగం, ఎల్‌పీజీ ఉత్పత్తికి ప్రాధాన్యత ఇవ్వాలని భారత ప్రభుత్వ పెట్రోలియం శాఖ గతంలో పేర్కొంది.
మొదట ఇరాన్, ఇప్పుడు అమెరికా విధించిన దిగ్బంధనం కారణంగా హార్ముజ్ నుంచి ఇంధన రవాణా సమస్య మరింత సంక్లిష్టంగా మారిందని, దీనివల్ల చైనా, భారత్, జపాన్, దక్షిణ కొరియాలపై అత్యధిక ప్రభావం పడుతుందని హర్ష్ పంత్ అంటున్నారు.
అయితే, అమెరికా సైన్యం హార్ముజ్‌ను దిగ్బంధిస్తుందని ట్రంప్ ప్రకటించిన సమయంలోనే 20 లక్షల బ్యారెళ్ల ముడిచమురుతో ఇరాన్ ట్యాంకర్లు భారత్‌కి బయలుదేరాయనే వార్త కూడా వచ్చింది.
గత ఏడేళ్లలో ఇలా జరగడం ఇదే మొదటిసారి. ఈ చమురు దిగుమతిదారుగా రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను గుర్తించారు.
రాబోయే రోజుల్లో ఇరాన్ నుంచి భారతదేశానికి మరికొన్ని మిలియన్ బ్యారెళ్ల చమురు రానుందని కొన్ని రిపోర్టులు పేర్కొంటున్నాయి.
గత ఆదివారం ఇరాన్ జెండా ఉన్న మూడు నౌకలు హార్ముజ్ జలసంధిని దాటి అరేబియా సముద్రానికి చేరుకున్నాయని మెరైన్ ట్రాఫిక్ ఇన్‌స్టిట్యూట్ నుంచి వచ్చిన డేటాను ఉటంకిస్తూ బీబీసీ పర్షియన్ పేర్కొంది.

ఫొటో సోర్స్, AFP via Getty Images

ప్రపంచంలోని ఎరువులలో సుమారు మూడింట ఒకవంతు (యూరియా, పొటాష్, అమ్మోనియా, ఫాస్ఫేట్లు వంటివి) సాధారణంగా హార్ముజ్ జలసంధి ద్వారా రవాణా అవుతాయని ఐక్యరాజ్యసమితి పేర్కొంది.
యుద్ధం మొదలైనప్పటి నుంచి ఈ మార్గం ద్వారా ఎరువులకు సంబంధించిన ఉత్పత్తుల రవాణా దాదాపుగా నిలిచిపోయిందని ప్రపంచ వాణిజ్య సంస్థ గణాంకాల ద్వారా తెలుస్తోంది.
చైనా తర్వాత ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఎరువుల వినియోగదారు భారత్. ముడి పదార్థాలు, తయారైన ఉత్పత్తులు రెండింటి కోసం దిగుమతులపై ఎక్కువగా ఆధారపడిందని మార్చి నెలాఖరులో ప్రచురితమైన బీబీసీ కథనం వెల్లడించింది.
ఈ దిగుమతులలో అధిక భాగం గల్ఫ్ దేశాల నుంచే వస్తాయి. అవి హార్ముజ్ జలసంధి ద్వారా రవాణా అవుతాయి.
భారత్ ప్రతిఏడాది సుమారు 40 మిలియన్ టన్నుల యూరియాను వినియోగిస్తుంది. దీనిపై ప్రభుత్వం సబ్సిడీని కూడా అందిస్తుంది.
దీని సరఫరాకు అంతరాయం కలగడం వల్ల రైతుల విత్తనాలు నాటే నిర్ణయాలపై ప్రభావం పడొచ్చని హర్ష్ పంత్ అంటున్నారు.
"భారత్లో ప్రధాన సాగు సీజన్ జూన్-జూలైలో రాబోతోంది. యూరియా తయారీకి సహజ వాయువు ప్రధాన ముడిపదార్థం. భారత్ దానిలో సుమారు 85 శాతాన్ని, ఎక్కువగా గల్ఫ్ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది" అని ఆయన అంటున్నారు.
హార్ముజ్ జలసంధి తెరుచుకున్నప్పటికీ, యుద్ధానికి ముందున్న పరిస్థితికి తిరిగి రావడానికి ఆరు నెలల నుంచి ఏడాది సమయం పడుతుందని హర్ష్ పంత్ అంటున్నారు.
ఇంధన రంగానికి జరిగిన నష్టాన్ని సరిచేయడం, హార్ముజ్‌లో అమర్చిన ల్యాండ్‌మైన్‌లను తొలగించడం, రవాణా బీమా ఖర్చులు భారీగా పెరగడం వంటివి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దీర్ఘకాలిక ప్రభావాలను చూపుతాయని ఆయన అంటున్నారు.

ఫొటో సోర్స్, AFP via Getty Images

నొప్పి నివారణ మందులు, యాంటీబయాటిక్స్, వ్యాక్సీన్‌లతో సహా ప్రపంచవ్యాప్తంగా ఔషధాల ఉత్పత్తిలో మిథనాల్, ఇథిలీన్ వంటి పెట్రోకెమికల్స్ కీలకమైన పదార్థాలు.
గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాలైన సౌదీ అరేబియా, ఖతార్, ఒమన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్, బహ్రెయిన్‌లు ప్రపంచ పెట్రోకెమికల్ ఉత్పత్తి సామర్థ్యంలో సుమారు 6% వాటాను కలిగి ఉన్నట్టు బీబీసీ వెరిఫై నివేదించింది.
ప్రపంచ ఫార్మా సరఫరా గొలుసులో భారత్ వాటా 20 శాతానికి పైగా ఉంది. వీటిలో చాలా వరకు అమెరికా, యూరప్‌లకు ఎగుమతి అవుతాయని ఫోర్బ్స్ పేర్కొంది.
ఈ ఔషధ ఉత్పత్తులలో చాలా వరకు గల్ఫ్ విమానాశ్రయాల ద్వారా, ముఖ్యంగా దుబయి ద్వారా ప్రపంచ మార్కెట్లకు రవాణా అవుతాయి. కానీ యుద్ధం కారణంగా ఈ మార్గం దాదాపు మూసుకుపోయింది.
భారత్‌లో తయారయ్యే జెనరిక్ మందులకు అమెరికా అతిపెద్ద ఎగుమతి మార్కెట్ కాగా, 2024లో భారత్ 9 బిలియన్ డాలర్ల విలువైన ఫార్మా ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతి చేసింది.
యుద్ధం వల్ల నెలకొన్న అనిశ్చితి ప్రపంచ ఫార్మా సప్లై చైన్‌ను చాలా వరకు ప్రభావితం చేసిందని, దీని ప్రభావం నుంచి భారత్ తప్పించుకోలేదని హర్ష్ పంత్ అంటున్నారు.
"హార్ముజ్‌ను పూర్తిగా మూసివేయకపోయినా, రవాణా ఖర్చులు పెరిగాయి. దీనితో పాటు, సరఫరా సమయం కూడా పెరుగుతోంది. దీనివల్ల ద్రవ్యోల్బణం పెరుగుతుంది" అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఇరాన్ యుద్ధం కారణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2027 ఆర్థిక సంవత్సరానికి తన జీడీపీ వృద్ధి అంచనాను 6.9 శాతానికి తగ్గించిందని, గత ఆర్థిక సంవత్సరానికి ఈ జీడీపీ వృద్ధి అంచనా 7.6 శాతమని ఎకనామిక్ టైమ్స్‌లోని ఒక కథనం పేర్కొంది.
దీంతో ఇంధన సరఫరా గొలుసులో అంతరాయం కారణంగా భారత ఆర్థిక వ్యవస్థపై పెద్దఎత్తున ప్రభావం పడే అవకాశం ఉందని స్పష్టమవుతోంది.
"ముడి చమురుతో పాటు, ఎల్ఎన్‌జీ, ఎరువులు, రసాయనాలకు సంబంధించిన సమస్యలు కూడా పరిశ్రమలకు సవాలుగా ఉన్నాయి. దీనివల్ల సామాన్యుడి రోజువారీ సమస్యలు పెరగడమే కాకుండా, ప్రభుత్వానికి కూడా ఇది కష్టకాలం అవుతుంది" అని హర్ష్ పంత్ అన్నారు.
‘‘దిగుమతులు ఖరీదైనవిగా మారితే ప్రభుత్వ ఆర్థిక లోటు పెరుగుతుంది. అలాగే వాణిజ్య సమతుల్యతపై కూడా ప్రభావం పడుతుంది. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థకు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి’’ అని ఆయన అన్నారు.
గత కొన్ని నెలల్లో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ కనిష్ఠ స్థాయికి చేరింది. దీనివల్ల ఎగుమతులకు కొంత మద్దతు లభించినా, దిగుమతులు మరింత ఖరీదైనవిగా మారుతాయి. ఇది కూడా ప్రభుత్వానికి పెద్ద ఆందోళన.
అయితే, యుద్ధం త్వరగా ముగిస్తే భారత ఆర్థిక వ్యవస్థ స్థిరపడటానికి కనీసం రెండు త్రైమాసికాలు పడుతుందని ఆర్‌బీఐ అంచనా వేసింది.
ప్రభుత్వం ఎదుర్కొంటున్న తక్షణ సవాలు వాణిజ్య లోటని హర్ష్ పంత్ అంటున్నారు. దీని తర్వాత, కరెంట్ ఖాతా లోటు కూడా ఒక సవాలుగా మారుతుంది.
ఈ యుద్ధం గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపుతుందని పలు నివేదికలు సూచిస్తున్నాయి. ఒకవేళ ఇలా జరిగితే, గల్ఫ్ దేశాల నుంచి భారతదేశానికి వచ్చే రెమిటెన్సులు (భారతీయులు పంపే విదేశీ కరెన్సీ) కూడా ప్రభావితమవుతాయి.
90 లక్షలకు పైగా భారతీయులు గల్ఫ్ దేశాలలో నివసిస్తున్నట్టు కొన్ని అంచనాల ద్వారా తెలుస్తోంది. వీరిలో చాలామంది జీవనోపాధి కోసం వెళ్లారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

































