'మళ్లీ ఇరాన్ వెళ్లను.. ఆ పడవలో ఉంటే నేను చనిపోయేవాడినే': ఇరాన్ నుంచి తిరిగొచ్చిన మత్స్యకారుడు

ఫొటో సోర్స్, UGC
- రచయిత, ప్రభురావ్ ఆనందన్
- హోదా, బీబీసీ కోసం
- చదివే సమయం: 5 నిమిషాలు
(ఈ కథనంలోని కొన్ని అంశాలు మిమ్మల్ని కలచివేయవచ్చు.)
తమిళనాడులోని కన్యాకుమారి, తూత్తుకుడి, తిరునల్వేలి, నాగపట్టణం జిల్లాలకు చెందిన కొందరు మత్స్యకారులు ఇరాన్, ఒమన్ వంటి దేశాల్లో చేపలు పట్టే పనులతో జీవనోపాధి పొందుతున్నారు.
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు మొదలైన తర్వాత, అక్కడ చిక్కుకున్న తమ వారిని క్షేమంగా భారత్‌కు తీసుకురావాలంటూ ఆ మత్స్యకారుల కుటుంబాలు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశాయి.
పది రోజుల తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత.. కేంద్ర ప్రభుత్వం, భారత రాయబార కార్యాలయం కృషితో తొలి విడతలో భాగంగా ఇరాన్‌లో చిక్కుకున్న తమిళనాడుకు చెందిన 345 మంది మత్స్యకారులను భారత్‌కు తీసుకొచ్చారు. ఏప్రిల్ 4న సాయంత్రం ప్రత్యేక విమానంలో వీరు చెన్నైకి వచ్చారు.
వీరిలో స్వగ్రామాలకు చేరిన కొంతమంది మత్స్యకారులతో బీబీసీ మాట్లాడింది.


ఫొటో సోర్స్, UGC
'మళ్లీ జన్మ ఎత్తినట్లుంది'
ఇరాన్ నుంచి స్వగ్రామానికి తిరిగి రావడం 'మరో జన్మ ఎత్తినట్లు' అనిపిస్తోందని బీబీసీతో రాజేంద్రన్ అనే మత్స్యకారుడు చెప్పారు.
'మేం సముద్రంలో చేపలు పట్టిన తర్వాత కిష్ ద్వీపంలో ఉన్నాం. అప్పుడు మాకు యుద్ధం తీవ్రత తెలియలేదు. కానీ యుద్ధం తీవ్రమై, బాంబులు పడటం మొదలైనప్పటి నుంచి వాటి ప్రకంపనలతో మాకు దాని తీవ్రత అర్థమైంది. యుద్ధం కారణంగా అక్కడ 40 రోజుల పాటు మేం కేవలం ఒక్క పూట భోజనంతోనే గడిపాం.
భారత ప్రభుత్వం మమ్మల్ని తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తుందని మా ఓడ యజమాని వారం రోజుల ముందు మాకు చెప్పారు. వెంటనే మేం 294 మంది మత్స్యకారులం ఏడు బస్సుల్లో బయల్దేరి రెండు రోజులు ప్రయాణించి కోమ్ అనే ప్రాంతానికి చేరుకున్నాం' అని ఆయన వివరించారు.
ఇరాన్‌పై అమెరికా దాడుల కారణంగా బస్సులో ప్రయాణించిన రెండు రోజులు బిక్కుబిక్కుమంటూ గడిపామని రాజేంద్రన్ చెప్పారు.
'కోమ్‌కు వచ్చాక భారత ప్రభుత్వం మాకు వసతి కల్పించి ఆహారం అందించింది. తర్వాత ప్రభుత్వ ఖర్చుతోనే భారత్‌కు తీసుకొచ్చింది' అని ఆయన చెప్పారు.
కిష్ ద్వీపంలో ఉన్నప్పుడు తమ కళ్లెదుట జరిగిన దాడులను ఆయన గుర్తు చేసుకున్నారు.
'ఆ ఏరియాలో దాడులు తీవ్రంగా జరిగాయి. చాలా మంది చనిపోయారు. ఓడలపై క్షిపణి దాడులు జరగడంతో మా కళ్ల ముందే చాలా ఓడలు సముద్రంలో మునిగిపోయాయి. అలాంటి పరిస్థితుల నుంచి అక్కడి నుంచి తప్పించుకొని బయటపడటం చాలా ఉపశమనంగా అనిపించింది' అని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, UGC
'అంతా ఓ కలలా అనిపిస్తోంది'
కిష్ ద్వీపంలో ఉన్నప్పుడు బాంబు దాడులు తీవ్రం కావడంతో వీలైనంత త్వరగా తమను అక్కడినుంచి స్వదేశానికి వెళ్లిపోమని ఓడ యజమాని చెప్పినట్లు మరో మత్స్యకారుడు సెల్వమ్ బీబీసీతో చెప్పారు.
'ఆయన అలా చెప్పడంతో మాలో భయం ఇంకా పెరిగింది. తర్వాత భారత విదేశాంగ మంత్రి జై శంకర్ వ్యక్తిగత కార్యదర్శిని మేం సంప్రదించి మమ్మల్ని రక్షించమని అడిగాం. ఆయనతోపాటు చాలామందిని మేం అభ్యర్థించాం. మా కుటుంబసభ్యులు కూడా భారత రాయబార కార్యాలయంపై ఒత్తిడి తెచ్చారు. దీంతో మమ్మల్ని స్వదేశానికి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తామని వారు హామీ ఇచ్చారు' అని సెల్వమ్ తెలిపారు.
కిష్ ద్వీపం నుంచి కోమ్ వరకు తమ బస్సు చార్జీలను తమ ఓడ యజమాని భరించారని ఆయన చెప్పారు. భారత ప్రభుత్వం తమను ఉచితంగా స్వదేశానికి తీసుకొచ్చిందని ఆయన తెలిపారు.
'మొదట విడతలో శనివారం ఉదయం 10:30 గంటల సమయంలో మొత్తం 347 మంది అక్కడ నుంచి బయల్దేరాం. సాయంత్రం 6 గంటలకు చెన్నై చేరుకున్నాం.
కోమ్ ప్రాంతానికి వచ్చే దారిలో బాంబు దాడుల వల్ల ధ్వంసమైన చాలా ఇళ్ళు, భవనాలను చూశాం. మేం క్షేమంగా ఇంటికి చేరుకోవడం అంతా ఒక కలలా అనిపిస్తోంది' అని సెల్వమ్ చెప్పారు.
'ఇక ఇరాన్ వెళ్లను'
చాలా ఉద్రిక్త పరిస్థితుల మధ్య తాము కిష్ ద్వీపం నుంచి కోమ్ ప్రాంతానికి చేరుకున్నామని మరో మత్స్యకారుడు తుత్తియూస్ గుర్తు చేసుకున్నారు.
'అక్కడ మమ్మల్ని ఒక హోటల్‌లో ఉంచారు. దానికి 20 కి.మీ దూరంలో బాంబులు పడ్డాయి. బాంబులు నేలపై పడగానే భూమి దద్దరిల్లింది. వాటి ప్రకంపనలు మా వరకు వచ్చాయి.
మా హోటల్‌కు దగ్గరలోనే ఒక మసీదు ఉంది. ఇది చాలా సురక్షిత ప్రాంతం, ఇక్కడ దాడులు జరుగవని భారత అధికారులు మాకు చెప్పారు. ఆ తర్వాత కాస్త భయం తగ్గింది. కానీ, రాత్రి వేళల్లో ఎక్కడ మాపై బాంబు దాడులు జరుగుతాయో అని చాలా భయమేసింది. తర్వాత మేం విమానంలో చెన్నై వచ్చేశాం' అని ఆయన చెప్పారు.
మూడు రోజుల క్రితం జరిగిన దాడిలో తమ యజమాని పడవలతో సహా మరో 10 పడవలు పూర్తిగా ధ్వంసమై సముద్రంలో మునిగిపోయాయని ఆయన తెలిపారు.
'నేను 40 రోజులు ఆ పడవలోనే ఉన్నాను. వాటిపై దాడి జరిగిందని తెలిసి భయంతో కంపించి పోయాను. ఇంకా అక్కడి ఉండి ఉంటే నేను కూడా చనిపోయి ఉండేవాడిని. యుద్ధం ముగిసినా ఇక నేను అక్కడికి వెళ్లను. మా కుటుంబం కూడా నన్ను పంపించేందుకు సిద్ధంగా లేదు' అని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, UGC
'మమ్మల్ని వెంటనే కాపాడండి'
కిష్ ద్వీపం నుంచి బయటపడి ఇరాన్ సరిహద్దు ప్రాంతమైన జుల్ఫాలో ఆశ్రయం పొందుతున్న మత్స్యకారుడు రాజీవ్ కూడా బీబీసీతో మాట్లాడారు.
'నాలుగు రోజుల క్రితం మమ్మల్ని కిష్ ద్వీపం నుంచి బస్‌లో జుల్ఫాకు తీసుకొచ్చారు. ఇక్కడ ఉంచారు. ఇక్కడ మాకు ఇచ్చిన ఆహారం తిన్న తర్వాత చాలామంది అనారోగ్యానికి గురయ్యారు. డయేరియాతో బాధపడుతున్నారు. భారత ప్రభుత్వం వెంటనే స్పందించి మమ్మల్ని తమిళనాడుకు తీసుకొచ్చే చర్యలు చేపట్టాలి' అని ఆయన అన్నారు.
ప్రభుత్వం ఏమంటోంది?
మత్స్యకారులను తమిళనాడుకు తీసుకొచ్చేందుకు చేపట్టిన చర్యల గురించి తమిళనాడు ప్రవాస సంక్షేమశాఖ అధికారి ఒకరు బీబీసీకి వివరించారు.
'ఇప్పటివరకు 345 మంది మత్స్యకారులను రక్షించాం. భారత రాయబార కార్యాలయం మరో 300 మందికి పైగా రక్షించి వారికి సురక్షితమైన హోటళ్లలో వసతి ఏర్పాటు చేసింది. వారిని కూడా తమిళనాడుకు తీసుకొచ్చే ప్రక్రియ నడుస్తోంది.
హోటళ్లలో ఉన్న కొంతమందికి భోజనం కారణంగా ఫుడ్ అలర్జీ వచ్చినట్లుగా భారత రాయబార కార్యాలయానికి సమాచారం ఇచ్చాం. వారిని వీలైనంత త్వరగా భారత్ పంపేందుకు చర్యలు తీసుకుంటున్నామని భారత రాయబార కార్యాలయం చెప్పింది' అని ఆయన తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)






























