ప్రీటర్మ్ డెలివరీ: నెలలు నిండకముందే పుట్టిన పిల్లలకు జీవితాంతం సమస్యలు తప్పవా? అపోహలు - సమాధానాలు

ఫొటో సోర్స్, Jennifer Polixenni Brankin/Getty Images
- రచయిత, డాక్టర్ హిమానీ, రేడియేషనల్ ఆంకాలజిస్ట్
- హోదా, బీబీసీ కోసం
- ప్రచురణ
- చదివే సమయం: 8 నిమిషాలు
గర్భధారణ అనేది ప్రతి కుటుంబంలో ఎంతో ఆనందాన్ని నింపే ఓ మధుర క్షణం.
సాధారణంగా, గర్భం 37 నుంచి 40 వారాల మధ్య పూర్తవుతుంది. అయితే, 37 వారాలు పూర్తికాకముందే శిశువు జన్మిస్తే దానిని 'ప్రీ-టర్మ్ డెలివరీ' లేదా 'నెలలు నిండకముందే ప్రసవం' అంటారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు 1.3 కోట్ల మంది శిశువులు ప్రీ-టర్మ్‌గా జన్మిస్తున్నారు.
ఐదేళ్లలోపు పిల్లల్లో మరణాలకు ప్రధాన కారణాల్లో ప్రీ-టర్మ్ జననం ఒకటి.
అయినప్పటికీ, నవజాత శిశు వైద్యంలో ఆధునిక విధానాల సాయంతో ప్రస్తుతం ఇలాంటి శిశువులు చాలా మంది ఆరోగ్యంగా పెరుగుతున్నారు.

గర్భధారణ కాలాన్ని బట్టి ప్రీ-టర్మ్ డెలివరీని నాలుగు రకాలుగా విభజించవచ్చు.
- అత్యంత ముందస్తు (Extremely Preterm) : 28 వారాల లోపు
- చాలా ముందస్తు (Very Preterm) : 28–32 వారాలు
- మోస్తరు ముందస్తు (Moderate Preterm) : 32–34 వారాలు
- చివరి దశ ముందస్తు (Late Preterm): 34–36 వారాలు
గర్భధారణ కాలం ఎంత తక్కువగా ఉంటే, శిశువుకు అంత ఎక్కువ వైద్య సహాయం అవసరం కావచ్చు.

ఫొటో సోర్స్, Rafael Rodriguez/NurPhoto via Getty Images
ప్రీ-టర్మ్ ప్రసవానికి కారణాలేమిటి?
కొన్ని సందర్భాల్లో స్పష్టమైన కారణం కనిపించకపోయినా, కొన్ని పరిస్థితులు ఈ ప్రమాదాన్ని పెంచుతాయి.
- సర్విక్స్ బలహీనంగా ఉండటం, గర్భాశయ నిర్మాణ లోపాలు వంటి గర్భాశయం లేదా గర్భాశయ ముఖద్వారం సమస్యలు.
- నీరు ముందుగానే కారిపోవడం (PPROM) - అమ్నియోటిక్ మెంబ్రేన్ పగిలి ప్రసవ నొప్పులు మొదలు కాకముందే నీరు కారిపోవడం.
- మూత్రనాళ, యోని, గర్భాశయ ఇన్ఫెక్షన్లు.
- తల్లికి అధిక రక్తపోటు, ప్రీ-ఎక్లాంప్షియా, మధుమేహం, థైరాయిడ్ సమస్యలు, రక్తహీనత వంటి ఆరోగ్య సమస్యలు.
- బహుళ గర్భధారణ - కవలలు లేదా ముగ్గురు శిశువులు గర్భంలో ఉండడం.
- ధూమపానం, మద్యం, మాదకద్రవ్యాల వినియోగం, తీవ్రమైన పోషకాహార లోపం వంటి జీవనశైలి కారణాలు.
ఇతర కారణాలు: గతంలో ప్రీ-టర్మ్ డెలివరీ చరిత్ర, తల్లి వయస్సు 18 సంవత్సరాల కంటే తక్కువ లేదా 35 సంవత్సరాల కంటే ఎక్కువ, గర్భాల మధ్య చాలా తక్కువ వ్యవధి, తీవ్రమైన మానసిక ఒత్తిడి.
ప్రీ-టర్మ్ ప్రసవం ఎలా గుర్తించాలి?
క్రమం తప్పకుండా వచ్చే నొప్పులు, నడుము నొప్పి, పొత్తి కడుపులో ఒత్తిడి, యోని ద్వారా నీరు కారడం, రక్తస్రావం, శిశువు కదలికలు తగ్గడం వంటి లక్షణాలు గర్భిణిలో కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి.
ఇలాంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయడం ప్రమాదకరం.

ఫొటో సోర్స్, NurPhoto via Getty Images
ప్రీ-టర్మ్ శిశువులలో వచ్చే సమస్యలు
శిశువు ఎంత త్వరగా పుడితే, అవయవాలు అంత తక్కువగా అభివృద్ధి చెందే ప్రమాదం ఉంటుంది.
శ్వాస సమస్యలు - ఊపిరితిత్తులు పూర్తిగా ఎదగకపోవడం వల్ల శిశువుకు శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. ఊపిరితిత్తులు పూర్తిగా ఎదగకపోవడం వల్ల రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ (RDS) రావచ్చు. అవసరమైతే సర్ఫాక్టెంట్ చికిత్స ఇస్తారు. వెంటిలేటర్ లేదా CPAP అవసరం కావచ్చు.
కామెర్లు - ప్రీ-టర్మ్ శిశువుల్లో కామెర్లు ఎక్కువగా కనిపిస్తాయి. చాలామందికి ఫోటోథెరపీతో తగ్గిపోతాయి.
రక్తంలో చక్కెర తగ్గడం - పుట్టిన తర్వాత మొదటి రోజుల్లో గ్లూకోజ్ స్థాయిలను తరచూ పరీక్షించాలి.
శరీర ఉష్ణోగ్రత - కొవ్వు నిల్వలు తక్కువగా ఉండటం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గిపోతుంది. అందుకే ఇన్‌క్యుబేటర్‌లో ఉంచాల్సి రావచ్చు.
పాలు తాగడంలో సమస్య - పాలు పీల్చడం (sucking), మింగడం, శ్వాస తీసుకోవడం అనే మూడు చర్యలు సమన్వయంతో జరగాలి. ఇలాంటి శిశువుల్లో ఈ సామర్థ్యం పూర్తిగా అభివృద్ధి చెందకపోవచ్చు.
ఇన్ఫె క్షన్లు - రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువ.
మెదడు అభివృద్ధి - కొంతమందిలో మెదడులో రక్తస్రావం, అభివృద్ధిలో ఆలస్యం వంటి సమస్యలు కనిపించవచ్చు. అయితే, సరైన ఫాలోఅప్‌తో వీటిని ముందుగానే గుర్తించి చికిత్స అందించవచ్చు.
కంటి సమస్యలు – ప్రీ-టర్మ్ శిశువుల్లో రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ (ROP) వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే కంటి పరీక్ష తప్పనిసరి.
వినికిడి సమస్యలు - కొంతమందికి వినికిడి పరీక్షలు అవసరమవుతాయి.
ప్రీ-టర్మ్ శిశువులందరికీ జీవితాంతం సమస్యలు తప్పవా?
అసలు కాదు.
ఇది సమాజంలో ఉన్న అతిపెద్ద అపోహలలో ఒకటి.
34–36 వారాల మధ్య పుట్టిన చాలా మంది పిల్లలు కొద్ది రోజుల వైద్య పర్యవేక్షణ తర్వాత పూర్తి ఆరోగ్యంగా పెరుగుతారు.
28–32 వారాల మధ్య పుట్టిన శిశువులు కూడా ఆధునిక NICU చికిత్స, సరైన పోషణ, క్రమం తప్పని ఫాలోఅప్‌తో సాధారణ జీవితాన్ని గడపొచ్చు.
కాబట్టి "నెలలు నిండకముందే పుట్టింది కాబట్టి భవిష్యత్తులో సమస్యలు తప్పువు" అనే భావన పూర్తిగా తప్పు.

ఫొటో సోర్స్, Anadolu via Getty Images
ప్రీ-టర్మ్ శిశువుకు NICU ఎందుకు అవసరం?
"బిడ్డను ఎన్ఐసీయూలో ఎందుకు ఉంచారు?" అని చాలామంది తల్లిదండ్రులు ఆందోళన చెందుతుంటారు.
కానీ, ఎన్ఐసీయూ (నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్) అంటే శిశువు పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉందని అర్థం కాదు.
శిశువుకు అవసరమైన ప్రత్యేక వైద్య సంరక్షణ అందించడానికి రూపొందించిన విభాగం అది.
అవసరాన్ని బట్టి ఎన్ఐసీయూలో అందించే సేవలు...
- శ్వాసకు CPAP లేదా వెంటిలేటర్ సహాయం
- ఇన్క్యుబేటర్ ద్వారా శరీర ఉష్ణోగ్రత నియంత్రణ
- సిర ద్వారా ద్రవాలు, మందులు
- తల్లి పాలు ట్యూబ్ ద్వారా లేదా ప్రత్యేక పద్ధతిలో ఇవ్వడం
- గుండె స్పందన, శ్వాస, ఆక్సిజన్ స్థాయిల నిరంతర పర్యవేక్షణ
- ఇన్ఫెక్షన్ల నివారణ, చికిత్స
గర్భధారణ కాలం, శిశువు బరువు, ఆరోగ్య పరిస్థితిని బట్టి ఎన్ఐసీయూలో ఉంచాల్సిన రోజులు మారతాయి.
ప్రీ-టర్మ్‌తో దీర్ఘకాలిక సమస్యలు వస్తాయా?
ప్రీ-టర్మ్ శిశువులు చాలా మంది పూర్తిగా సాధారణ జీవితాన్ని గడుపుతారు. అయితే, చాలా తక్కువ సమయం గర్భంలో ఉండి, జన్మించిన కొంతమందిలో కొన్ని సమస్యలు కనిపించే అవకాశం ఉంటుంది.
- ఎదుగుదల ఆలస్యం
- మాటలు ఆలస్యంగా రావడం
- నేర్చుకునే సామర్థ్యంలో కొంత ఆలస్యం
- చూపు లేదా వినికిడి సమస్యలు
- అరుదుగా సెరిబ్రల్ పాల్సీ
అయితే, ఇవి ప్రతి శిశువులోనూ రావు. క్రమం తప్పని ఫాలోఅప్ ద్వారా వీటిని చాలావరకు ముందుగానే గుర్తించి చికిత్స చేయవచ్చు.

ఫొటో సోర్స్, Christopher Furlong/Getty Images
కంగారూ మదర్ కేర్ (KMC)
తక్కువ బరువుతో పుట్టిన శిశువులకు ఇది ఎంతో ఉపయోగకరమైన పద్ధతి.
తల్లి లేదా తండ్రి ఛాతీపై శిశువును చర్మానికి చర్మం తగిలేలా ఉంచడం వల్ల...
- శరీర ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది.
- తల్లిపాలు బాగా పడతాయి.
- ఇన్ఫెక్షన్ ప్రమాదం తగ్గుతుంది.
- బరువు త్వరగా పెరుగుతుంది.
- తల్లి-శిశువు అనుబంధం బలపడుతుంది.
- ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా KMCని సిఫార్సు చేస్తోంది.

ఫొటో సోర్స్, AFP via Getty Images
తల్లిపాల ప్రాముఖ్యత
- ప్రీ-టర్మ్ శిశువులకు తల్లిపాలు ఒక ఔషధం లాంటివి.
- తల్లిపాలు ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి.
- పేగుల అభివృద్ధికి సహాయపడతాయి.
- మెదడు ఎదుగుదలను ప్రోత్సహిస్తాయి.
- NEC (నిక్రొటైజింగ్ ఎంటరోకోలైటిస్) ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
- శిశువు నేరుగా పాలు తాగలేకపోయినా తల్లి పాలను పిండి ఇవ్వవచ్చు.
తల్లిదండ్రులు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు
- వైద్యులు చెప్పిన ఫాలోఅప్ తేదీలను తప్పకుండా పాటించాలి.
- టీకాలను సమయానికి వేయించాలి.
- శిశువు బరువును క్రమం తప్పకుండా పరిశీలించాలి.
- కంటి పరీక్ష (ROP Screening), వినికిడి పరీక్ష అవసరమైతే తప్పకుండా చేయించాలి.
- అనారోగ్యంతో ఉన్నవారిని శిశువుకు దూరంగా ఉంచాలి.
- చేతులు శుభ్రంగా కడుక్కొని మాత్రమే శిశువును తాకాలి.

ఫొటో సోర్స్, AFP via Getty Images
ప్రీ-టర్మ్ డెలివరీ.. అపోహలు - నిజాలు
అపోహ: ప్రీ-టర్మ్ పిల్లలు ఎప్పటికీ సాధారణంగా ఎదగరు.
నిజం: ఆధునిక వైద్యం వల్ల చాలా మంది పిల్లలు పూర్తిగా సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు.
అపోహ: ఎన్ఐసీయూలో చేర్చారంటే ఆశలు వదిలేసుకోవాల్సిందే.
నిజం: ఎన్ఐసీయూ అనేది ప్రత్యేక సంరక్షణ కోసం మాత్రమే. చాలా మంది శిశువులు ఆరోగ్యంగా ఇంటికి వెళ్తారు.
అపోహ: ప్రీ-టర్మ్ బిడ్డకు తల్లిపాలు ఇవ్వకూడదు.
నిజం: పిల్లలకు తల్లిపాలే అత్యుత్తమ ఆహారం.
అపోహ: బరువు తక్కువగా ఉందంటే శిశువు ఎప్పటికీ బలహీనంగానే ఉంటుంది.
నిజం: సరైన పోషణ, వైద్య పర్యవేక్షణతో చాలా మంది పిల్లలు సాధారణ బరువును చేరుకుంటారు.
ప్రీ-టర్మ్ ప్రసవాన్ని నివారించవచ్చా?
ప్రీ-టర్మ్ ప్రసవాన్ని అన్ని సందర్భాల్లో నివారించలేం కానీ ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
- గర్భం వచ్చిన వెంటనే వైద్య పర్యవేక్షణ ప్రారంభించాలి.
- గర్భవతిగా ఉండగా చేయాల్సిన అన్ని పరీక్షలు సమయానికి చేయించుకోవాలి.
- రక్తపోటు, మధుమేహం వంటివి నియంత్రణలో ఉంచుకోవాలి.
- ఇన్ఫెక్షన్లకు వెంటనే చికిత్స తీసుకోవాలి.
- ధూమపానం, మద్యం పూర్తిగా మానాలి.
- సమతుల ఆహారం తీసుకోవాలి.
- ఫోలిక్ యాసిడ్, ఐరన్, కాల్షియం వంటి మందులను వైద్యుల సూచన ప్రకారం వాడాలి.
- గతంలో ప్రీ-టర్మ్ డెలివరీ జరిగితే తదుపరి గర్భధారణలో ప్రత్యేక పర్యవేక్షణ అవసరం.

ఫొటో సోర్స్, Getty Images
ఆసుపత్రికి ఎప్పుడు వెళ్లాలి?
ఈ లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి.
- యోని ద్వారా నీరు కారడం
- రక్తస్రావం
- తరచూ గర్భాశయ సంకోచాలు
- శిశువు కదలికలు తగ్గడం
- అధిక జ్వరం
- తీవ్రమైన కడుపు నొప్పి
- తీవ్రమైన తలనొప్పి, చూపు మసకబారడం
ప్రీ-టర్మ్ డెలివరీ అనేది తల్లిదండ్రులకు ఆందోళన కలిగించే పరిస్థితే కానీ, నేటి ఆధునిక ప్రసూతి వైద్యం, నవజాత శిశు సంరక్షణ, ఎన్ఐసీయూ సదుపాయాలు, తల్లిపాల ప్రాధాన్యం, కంగారూ మదర్ కేర్, క్రమమైన ఫాలోఅప్ వల్ల ఎంతో మంది ప్రీ-టర్మ్ పిల్లలు ఆరోగ్యంగా ఎదిగి, సాధారణ విద్య, ఉద్యోగం, కుటుంబ జీవితాన్ని గడుపుతున్నారు.
గర్భధారణ సమయంలో క్రమం తప్పని వైద్య పర్యవేక్షణ, హెచ్చరిక సంకేతాలను నిర్లక్ష్యం చేయకపోవడం, సమయానికి చికిత్స పొందడం ద్వారా తల్లి, బిడ్డ.. ఇద్దరి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
(గమనిక: రచయిత ఓ డాక్టర్. వైద్యపరమైన విధానాలు, చికిత్సలపై అవగాహన కల్పించడమే ఈ ఆర్టికల్ ఉద్దేశం. ఆరోగ్యపరమైన ఏ నిర్ణయమైనా డాక్టర్‌ను సంప్రదించి మాత్రమే తీసుకోగలరు)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)






























