ధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయించడం మోదీ ప్రభుత్వానికి కష్టతరమా?

ధర్మేంద్ర ప్రధాన్, కాక్రోచ్ జనతా పార్టీ, బీజేపీ, నరేంద్ర మోదీ ప్రభుత్వం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ధర్మేంద్ర ప్రధాన్ కుటుంబానికి ఆర్ఎస్‌ఎస్‌తో సన్నిహిత సంబంధాలున్నాయి.
    • రచయిత, గణేష్ పోల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 7 నిమిషాలు

కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, సోనమ్ వాంగ్‌చుక్‌తో పాటు వేలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, సామాజిక కార్యకర్తలు, పలు పార్టీల నేతలు దిల్లీలో నిరసన కొనసాగిస్తున్నారు.

కాంగ్రెస్‌ సహా ఇతర ప్రతిపక్ష పార్టీలు ఈ ఉద్యమంలో చేరాయి. వారందరి ప్రధాన డిమాండ్ ఒకటే. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.

కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధి బృందం జులై 20న కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కలిసి తమ డిమాండ్లతో కూడిన లేఖ సమర్పించింది.

ప్రభుత్వం తరపున జేపీ నడ్డా నిరసనకారులతో చర్చలు జరుపుతున్నారు. అంటే, నిరసనకారులు, ప్రభుత్వానికి మధ్య చర్చలకు ద్వారాలు తెరుచుకున్నాయని అర్థం.

దీంతో పాటు పార్లమెంట్ ప్రస్తుత వర్షాకాల సమావేశాల్లో ఈ అంశాలపై చర్చకు సిద్ధమని మోదీ ప్రభుత్వం తెలిపింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అయితే, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తేనే పార్లమెంట్‌లో చర్చ జరుగుతుందని కాంగ్రెస్ చెబుతోంది.

ఇదిలా ఉంటే, కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేసే వరకు తాను జంతర్ మంతర్‌ విడిచి వెళ్లేది లేదని సీజేపీ అధికార ప్రతినిధి అశుతోష్ రాంకా ప్రకటించారు.

ఏ విధంగా చూసినా ఈ పరిస్థితులు మోదీ ప్రభుత్వానికి అంత అనుకూలంగా కనిపించడం లేదు. ఈ పరిణామాల నేపథ్యంలో, ధర్మేంద్ర ప్రధాన్‌ను మంత్రి పదవి నుంచి తొలగించడం మోదీ ప్రభుత్వానికి కష్టమా? అనే ప్రశ్న తలెత్తుతోంది.

ధర్మేంద్ర ప్రధాన్, కాక్రోచ్ జనతా పార్టీ, బీజేపీ, నరేంద్ర మోదీ ప్రభుత్వం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మంత్రులతో రాజీనామా చేయించకూడదన్నది మోదీ ప్రభుత్వ వ్యూహంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

మోదీ ప్రభుత్వ వ్యూహం

మోదీ ప్రభుత్వంలోని పలువురు మంత్రులు రాజీనామా చేయాలని గతంలోనూ డిమాండ్లు వచ్చాయి.

బీజేపీ ఈ డిమాండ్లను పట్టించుకోలేదు. మంత్రులకు మద్దతుగా నిలబడింది.

2014 నుంచి మోదీ ప్రభుత్వ రాజకీయ శైలిని పరిశీలిస్తే రాజకీయ ఒత్తిడితో మంత్రులు రాజీనామా చేసిన ఉదాహరణలు చాలా తక్కువని సీనియర్ జర్నలిస్ట్ విజయ్ త్రివేది చెప్పారు.

ఇప్పటివరకు కేంద్ర సహాయ మంత్రి ఎంజే అక్బర్ మినహా నైతిక బాధ్యత కారణాలతో ఏ మంత్రి కూడా రాజీనామా చేయలేదు.

"కరోనా మహమ్మారి సమయంలో ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ రాజీనామా చేయాలని డిమాండ్ వచ్చింది. ఎప్‌స్టీన్‌ ఫైల్స్ కేసు తర్వాత హర్దీప్ సింగ్ పూరి రాజీనామా చేయాలని డిమాండ్ వచ్చింది. రైతుల ఉద్యమం సమయంలో నరేంద్ర సింగ్ తోమర్‌ను రాజీనామా చేయమని అడిగారు" అని సీనియర్ జర్నలిస్ట్, జాతీయ రాజకీయ వ్యవహారాల నిపుణులు విజయ్ త్రివేది చెప్పారు.

"రైలు ప్రమాదం జరిగినప్పుడు, అశ్విని వైష్ణవ్ రాజీనామా చేయాలని కూడా డిమాండ్లు వచ్చాయి. కానీ, వీరిలో ఎవరూ రాజీనామా చేయలేదు. మొత్తంగా చూస్తే మోదీ ప్రభుత్వం రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గడానికి సిద్ధంగా లేనట్లు అనిపిస్తోంది" అని ఆయన అన్నారు.

ధర్మేంద్ర ప్రధాన్, కాక్రోచ్ జనతా పార్టీ, బీజేపీ, నరేంద్ర మోదీ ప్రభుత్వం

2015 జూన్‌లో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన ఒక ప్రకటన ఈ అభిప్రాయాన్ని బలపరుస్తోంది.

రాజ్‌నాథ్ సింగ్ ప్రకటన వచ్చిన కొన్ని రోజుల తర్వాత జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో, ప్రతిపక్షాలు కొందరు కేంద్రమంత్రుల రాజీనామాను డిమాండ్ చేస్తున్న విషయాన్ని విలేఖరులు ఆయనతో ప్రస్తావించారు.

దీనికి ఆయన స్పందిస్తూ "ఇక్కడ రాజీనామాలు ఏమీ లేవు సోదరా. ఇది ఎన్డీయే ప్రభుత్వం. యూపీయే ప్రభుత్వం కాదు" అని అన్నారు.

బీజేపీలో ధర్మేంద్ర ప్రధాన్‌కు ఉన్న రాజకీయ పలుకుబడి కూడా ముఖ్యమైన కారణం కావచ్చని విజయ్ త్రివేది భావిస్తున్నారు.

"ధర్మేంద్ర ప్రధాన్ కుటుంబానికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌తో చాలా కాలంగా సంబంధాలు ఉన్నాయి. ఆయన 1984లో అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)తో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సన్నిహితుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. అటువంటి నాయకుడిని రాజకీయ ఒత్తిడితో తొలగించడం ప్రభుత్వానికి రాజకీయ ఓటమిగా పరిగణించవచ్చు" అని త్రివేది అభిప్రాయపడ్డారు.

"బాధ్యతల నిర్వహణలో వైఫల్యం, అవకతవకలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న మంత్రులు గతంలో రాజీనామా చేసేవారు లేదా వారి రాజీనామాలను తీసుకునేవారు" అని దిల్లీకి చెందిన సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ లో పొలిటికల్ సైంటిస్ట్ రాహుల్ వర్మ చెప్పారు.

"అయితే, మోదీ ప్రభుత్వ హయాంలో ప్రజా ఒత్తిడి కారణంగా మంత్రులు రాజీనామా చేసిన సందర్భాలు చాలా తక్కువ. ఇలాంటి ఉద్యమాలు ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటాయని, ప్రతిసారీ వాటికి రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రభుత్వం భావిస్తుండవచ్చు" అని ఆయన అన్నారు.

కాక్రోచ్ జనతా పార్టీ మూడు ప్రధాన డిమాండ్లను ముందుకు తెచ్చింది. వాటిలో అతి ముఖ్యమైనది ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.

ధర్మేంద్ర ప్రధాన్, కాక్రోచ్ జనతా పార్టీ, బీజేపీ, నరేంద్ర మోదీ ప్రభుత్వం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి నివాసం ఎదుట ధర్నాకు కూర్చోవడంతో కేంద్ర మంత్రులు ఆయనతో చర్చలు జరిపారు.

బీజేపీ ఎన్నికల కోణంలోనే ఆలోచిస్తుందా?

సీజేపీ మిగతా డిమాండ్లలో నీట్ పరీక్షకు సిద్ధమవుతూ ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం అందించడం, ఆందోళనకారులపై పోలీసు కేసుల ఉపసంహరణ, నీట్ ప్రశ్నపత్రాల లీక్‌పై పార్లమెంట్‌లో సమగ్ర చర్చ లాంటివి ఉన్నాయి.

తాజా పరిస్థితులకు కేంద్రంగా మారిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తొలిసారిగా సోషల్ మీడియాలో స్పందించారు.

నీట్ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ అంశంపై పార్లమెంటులో చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన అన్నారు.

"పార్లమెంటులో నీట్ పరీక్ష అంశంపై చర్చించి యువత అడిగే న్యాయమైన ప్రశ్నలన్నింటికీ సమాధానమిచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. మన విద్యార్థులకు సమాధానాలు, సంస్కరణలు, జవాబుదారీతనం కావాలి. కేవలం కోపం కాదు " అని ఆయన పేర్కొన్నారు.

అయితే, జులై 21న సామాజిక మాధ్యమంలో మాట్లాడిన ధర్మేంద్ర ప్రధాన్.. ఎక్కడా తన రాజీనామా గురించి ప్రస్తావించలేదు.

"నైతిక బాధ్యత తీసుకుని మంత్రులు రాజీనామా చేయడం మోదీ రాజకీయాల్లో భాగం కాదు. ఆయనే అంతా నడపాలనుకుంటున్నారు. మంత్రులు రాజీనామా చేసినా లేదా వారి రాజీనామాలను తీసుకున్నా, ప్రభుత్వం అసమర్థమైనదనే సందేశం వారి మద్దతుదారులకు వెళ్లొచ్చు. మోదీ ప్రభుత్వానికి నైతికత కంటే, రాజీనామాల వల్ల ఎన్నికలపై పడే ప్రభావం ఎలా ఉంటుందన్నదే ముఖ్యం" అని సీనియర్ జర్నలిస్ట్ రషీద్ కిద్వాయ్ బీబీసీతో చెప్పారు.

ఎన్నికల్లో గెలుపుపై ప్రజల ఒత్తిడి ప్రభావం చూపనంత వరకు మోదీ ప్రభుత్వం దానికి తలొగ్గదని రషీద్ కిద్వాయ్, రాహుల్ వర్మ భావిస్తున్నారు.

"రాజకీయంగా పరిస్థితులు చేజారిపోతున్నాయని ప్రధాని మోదీ భావిస్తున్నందువల్లే ఆయనిలా చేస్తూ ఉండవచ్చు. ఒక మంత్రి రాజీనామా చేస్తే భవిష్యత్తులో ఇతర మంత్రుల విషయంలో ప్రతిపక్షాల ఒత్తిడి పెరగవచ్చు. బహుశా అందుకే ప్రధాని తన మంత్రుల రాజీనామాలను కోరడం లేదు" అని రాజకీయ విశ్లేషకులు అభిషేక్ చౌదరి అభిప్రాయపడ్డారు.

"ఈ ఉద్యమం గత ఉద్యమాల కన్నా భిన్నంగా కనిపిస్తోంది. ఇందులో విద్యార్థులు, తల్లిదండ్రులు, పెద్ద సంఖ్యలో యువత చేరారు. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ బరిలోకి దిగాయి. ప్రభుత్వం వారి ఒత్తిడికి లొంగి మంత్రుల రాజీనామాలను ఆమోదిస్తే నిరసనకారుల నైతిక స్థైర్యం మరింత పెరుగుతుంది. ఇది మోదీ తరహా కఠిన, కేంద్రీకృత రాజకీయశైలికి అనువుగా ఉండదు" అని రషీద్ కిద్వాయ్ చెప్పారు

అయితే, వివాదాల్లో చిక్కుకున్న మంత్రులను మోదీ ప్రభుత్వం ఎన్నడూ తొలగించదనేది కూడా నిజం కాదని విజయ్ త్రివేది అంటున్నారు.

మంత్రివర్గ విస్తరణ లేదా పునర్వ్యవస్థీకరణ సమయం వచ్చినప్పుడు, ఎన్నికల తర్వాత కొంతమంది మంత్రులను వేరే చోట్లకు బదిలీ చేయడం లేదా మంత్రివర్గం నుంచి తొలగించడం గతంలో జరిగింది. రాజకీయ ఒత్తిళ్లకు మోదీ ప్రభుత్వం తక్షణమే స్పందించదనేది విజయ్ త్రివేది అభిప్రాయం.

ధర్మేంద్ర ప్రధాన్, కాక్రోచ్ జనతా పార్టీ, బీజేపీ, నరేంద్ర మోదీ ప్రభుత్వం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సీజేపీ చేపట్టిన పార్లమెంట్‌ మార్చ్‌లో నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు భాష్పవాయు గోళాలను ప్రయోగించారు.

బీజేపీకి రాజకీయంగా నష్టమా?

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే, అది బీజేపీకి రాజకీయ నష్టాన్ని కలిగిస్తుందో లేదో కాలమే నిర్ణయిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఏ ఉద్యమమూ శాశ్వతంగా నిలవదనేది వాళ్ల అభిప్రాయం. ప్రస్తుతం ఎన్నికలు జరగడం లేదు. అంతేకాకుండా ఒక ఉద్యమంలోని అంశాలు, ఎన్నికల అంశాలు దాదాపుగా భిన్నంగా ఉంటాయి.

ప్రస్తుత పరిస్థితిని ప్రతిపక్ష పార్టీలు రాజకీయంగా ఎంతవరకు సద్వినియోగం చేసుకోగలుగుతాయనే విషయం భవిష్యత్తులో తెలుస్తుందని రాహుల్ వర్మ విశ్లేషించారు.

రాబోయే ఆరు నెలల్లో కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయని ఆయన అన్నారు.

జులై 21 నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై నిరంతరం దాడి చేస్తూనే ఉంది.

ప్రతిపక్ష పార్టీల మధ్య ఐక్యత కొరవడిందని తాజా పరిస్థితులు బయటపెట్టాయని రషీద్ కిద్వాయ్ అంటున్నారు.

కోవిడ్-19 మహమ్మారిని ఎదుర్కోవడం, పెద్ద నోట్ల రద్దు, పాకిస్తాన్ - చైనాతో విదేశాంగ విధానం, మణిపూర్ హింసాకాండ, సీఏఏ వ్యతిరేక నిరసనలు, అనేక ఇతర అంశాలపై మోదీ ప్రభుత్వం విస్తృత విమర్శలను ఎదుర్కొన్నప్పటికీ ఎన్నికల్లో వాటి ప్రభావం పరిమితంగా ఉందని రషీద్ కిద్వాయ్ అన్నారు.

"ఉత్తరప్రదేశ్, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో వ్యవసాయ చట్టాలు బీజేపీకి నష్టం కలిగిస్తాయని ప్రభుత్వం భావించడంతో ప్రధాని మోదీ ఆ చట్టాలను ఉపసంహరించుకున్నారు. మోదీ ప్రభుత్వం ఇలాంటి లెక్కల మీద నడుస్తుంది" అని ఆయన అన్నారు.

విద్యార్థుల ఉద్యమం రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపవచ్చని ప్రభుత్వానికి సూచనలు కనిపిస్తే ధర్మేంద్ర ప్రధాన్‌ను విద్యాశాఖ మంత్రి నుంచి తొలగించవచ్చు లేదా ఆయన శాఖను మార్చవచ్చు. అయితే, ప్రస్తుతం అలాంటి సూచనలేవీ కనిపించడం లేదని విజయ్ త్రివేది చెప్పారు.

ధర్మేంద్ర ప్రధాన్, కాక్రోచ్ జనతా పార్టీ, బీజేపీ, నరేంద్ర మోదీ ప్రభుత్వం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నిరసనకారులపై పోలీసులు వ్యవహరించిన తీరుపై విచారణ జరపాలని మానవ హక్కుల సంఘాలు డిమాండ్ చేశాయి.

మంత్రులు ఎందుకు రాజీనామా చేస్తారు?

"ఏదైనా వివాదాస్పద విషయం విచారణలో ఉన్నప్పుడు, సంబంధిత మంత్రి రాజీనామా చేస్తే కనీస రాజకీయ బాధ్యతను అంగీకరించినట్లే. ఒకవేళ ఆ మంత్రికి పార్టీలో రాజకీయ ప్రాముఖ్యత ఉంటే, ప్రధాన మంత్రి తరువాత ఆయనను తిరిగి మంత్రివర్గంలోకి తీసుకోవచ్చు. కానీ ఆ సమయంలో, వైఫల్యానికి బాధ్యతను నిర్ధరించి, ప్రభుత్వ ప్రతిష్టను పెంచుకోవడానికి రాజీనామా ఒక మార్గంగా పరిగణిస్తున్నారు" అని రాజకీయ విశ్లేషకులు అభిషేక్ చౌదరి అభిప్రాయపడ్డారు.

దీనికి ఆయన అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వాన్ని ఉదాహరణగా ప్రస్తావించారు.

2001 మార్చిలో తెహల్కా స్టింగ్ ఆపరేషన్ తర్వాత అప్పటి రక్షణ మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్ నైతిక బాధ్యతను అంగీకరిస్తూ రాజీనామా చేశారు.

1956 నవంబర్‌లో జరిగిన రైలు ప్రమాదం అనంతరం, అప్పటి రైల్వే మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేశారు.

ఆయన చర్య ఇప్పటికీ జవాబుదారీతనానికి ఆదర్శప్రాయమైన ఉదాహరణగా పరిగణిస్తున్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా ఎందుకు అవసరమో కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ సవివరంగా చెప్పారు.

"విద్యా వ్యవస్థలో ఈ తీవ్రమైన వైఫల్యానికి అంతిమంగా మంత్రిత్వ శాఖే బాధ్యత వహిస్తుంది కాబట్టి, ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యతను స్వీకరించి పదవికి రాజీనామా చేయాలి. పరీక్షా విధానంలోని గందరగోళం, ఉద్రిక్తత, సంబంధిత సంఘటనల వల్ల ఎంతోమంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. అందువల్ల, ధర్మేంద్ర ప్రధాన్ పదవిలో కొనసాగడం తగదు" అని వాంగ్‌చుక్ అన్నారు.

"ఆయన రాజీనామా చేస్తే క్యాబినెట్‌లో ఇతర మంత్రులు, సీనియర్ అధికారులు కూడా జవాబుదారీగా ఉంటారు. తాము కూడా ఏదైనా తప్పు చేస్తే తమను కూడా పదవుల నుంచి తొలగించవచ్చని వారు గ్రహిస్తారు" అని అభిజీత్ దీప్కే చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)