‘నౌకల దిగ్బంధనం’ అంటే ఏమిటి హార్ముజ్‌ వద్ద దీని ప్రభావం ఎలా ఉంటుంది?

డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, AFP via Getty Images

    • రచయిత, జార్జ్ రైట్, రాచెల్ క్లూన్
    • హోదా, బిజినెస్ రిపోర్టర్
  • చదివే సమయం: 6 నిమిషాలు

ఇరాన్ ఓడరేవుల్లోకి వచ్చిపోయే అన్ని రకాల నౌకల రాకపోకలను సోమవారం నుంచి అడ్డుకుంటామని అంటే మారిటైమ్ ట్రాఫిక్ దిగ్బంధనం చేస్తామని అమెరికా సైన్యం తెలిపింది.

అయితే, హార్ముజ్ జలసంధి మీదుగా ఇతర ప్రాంతాలకు రాకపోకలు సాగించే నౌకలను అనుమతిస్తామని స్పష్టం చేసింది.

ఫిబ్రవరి 28న మొదలైన యుద్ధాన్ని ముగించేందుకు చర్చలు విఫలమైన తర్వాత అమెరికా సైన్యం నుంచి ఈ ప్రకటన వచ్చింది.

ఇరాన్ తన అణు కార్యక్రమ లక్ష్యాలను వదులుకోవడానికి ఇష్టపడకపోవడం వల్లే చర్చలు ఫలించలేదని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ అన్నారు.

అమెరికా మితిమీరిన డిమాండ్లు, చట్టవిరుద్ధమైన కోరికలే చర్చలు విఫలమవడానికి కారణమని ఇరాన్ విదేశీ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి విమర్శించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

దిగ్బంధనంపై ట్రంప్ ఏమన్నారు?

హార్ముజ్ జలసంధిలోకి ప్రవేశించే, లేదా అక్కడి నుంచి బయటకు వెళ్లే ప్రతీ నౌకను అమెరికా అడ్డుకోవడం మొదలుపెడుతుందని ఆదివారం ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ పేర్కొన్నారు.

'ఇరాన్‌కు టోల్ చెల్లించి అంతర్జాతీయ జలాల్లో ప్రయాణించే ప్రతీ నౌకను వెతికి పట్టుకోవాలని మా నౌకా దళాన్ని అదేశించాను. అక్రమంగా టోల్ చెల్లించే ఎవరికీ సముద్ర మార్గంలో రక్షణ ఉండదు.

జలసంధిలో ఇరాన్ అమర్చినట్లుగా చెబుతున్న మైన్లను కూడా అమెరికా ధ్వంసం చేస్తుంది. మాపై గానీ లేదా ఇతర నౌకలపై దాడులు చేసే ఏ ఇరానియన్‌ను అయినా మేం తుడిచిపెట్టేస్తాం.

హార్ముజ్ జలసంధిని తెరుస్తామని చెప్పిన ఇరాన్ ఉద్దేశపూర్వకంగా మాట తప్పింది. ముందుగా చెప్పినట్లుగా, వారు వీలైనంత త్వరగా ఈ అంతర్జాతీయ జలమార్గాన్ని తెరిచే ప్రక్రియను మొదలుపెట్టడం మంచిది'' అని ఆయన ఆ పోస్టులో రాశారు.

ఇరాన్, హార్ముజ్ జలసంధి

ఫొటో సోర్స్, Anadolu via Getty Images

బ్లాకేడ్ ఎలా చేస్తారు?

అమెరికా నౌకాదళ కార్యకలాపాల చట్టం 2022 నాటి నౌకాదళ కమాండర్ల హ్యాండ్‌బుక్ ప్రకారం, శత్రుదేశానికి చెందిన లేదా వారి ఆధీనంలో ఉన్న లేదా వారి నియంత్రణలో ఉన్న ఓడరేవులు, విమానాశ్రయాలు, తీరప్రాంతాల నుంచి ఏ దేశ నౌకలు లేదా విమానాలు లోపలికి రాకుండా, బయటకు వెళ్లకుండా సైనిక శక్తితో అడ్డుకోవడాన్నే దిగ్బంధనం(బ్లాకేడ్) అంటారు.

హార్ముజ్ జలసంధిని దిగ్బంధించే ప్రక్రియ తక్షణమే అమల్లోకి వస్తుందని ట్రంప్ మొదట చెప్పారు.

తర్వాత ఆదివారం అమెరికా ఫాక్స్ న్యూస్‌తో మాట్లాడుతూ, 'ఈ ప్రక్రియకు కొంత సమయం పడుతుంది. కానీ, త్వరలోనే ఇది ప్రభావం చూపుతుంది' అని అన్నారు.

సోమవారం ఉదయం 10:00 EDT (భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7:30 గంటలు) నుంచి తమ దళాలు హార్ముజ్ బ్లాకేడ్ మొదలుపెడతాయని యూఎస్ సెంట్రల్ కమాండ్ ఒక ట్వీట్ చేసింది.

'అరేబియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లోని ఇరాన్ పోర్టులు సహా ఇరాన్‌కు చెందిన అన్ని పోర్టులు, తీర ప్రాంతాలకు రాకపోకలు సాగించే అన్ని దేశాల నౌకలపై ఈ బ్లాకేడ్ అమలు చేస్తాం' అని ఆ ట్వీట్‌లో పేర్కొంది.

ఇరాన్ కాకుండా ఇతర పోర్టులకు వచ్చిపోయే నౌకలను తమ దళాలు అడ్డుకోవని అమెరికా స్పష్టం చేసింది.

ఈ దిగ్బంధనంలో తమతో పాటు ఇతర దేశాలు కూడా పాల్గొంటాయని చెప్పిన ట్రంప్, వాటి పేర్లను వెల్లడించలేదు. యూకే ఇందులో పాల్గొనడం లేదని సమాచారం.

'జలసంధిని శుభ్రం చేయడానికి నేటో సహాయం చేస్తానని చెప్పింది. యూకేతో పాటు ఇతర దేశాలు మైన్ స్వీపర్లను పంపుతున్నాయి' అని ట్రంప్ అన్నారు.

బ్రిటిష్ సైన్యానికి చెందిన మైన్ హంటింగ్ వ్యవస్థలు ఇప్పటికే ఆ ప్రాంతంలో ఉన్నాయని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ గతంలోనే చెప్పారు.

'నౌకల స్వేచ్ఛా ప్రయాణానికి మేం మద్దతు కొనసాగిస్తాం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు, జీవన వ్యయ నియంత్రణకు హార్ముజ్‌ను తెరవడం చాలా అవసరం' అని యూకే ప్రభుత్వ ప్రతినిధి ఒకరు అన్నారు.

ఈ దిగ్బంధనం, అంతర్జాతీయ సముద్ర చట్టాలను ఉల్లంఘించే అవకాశం ఉందని బీబీసీకి అమెరికా చెందిన ముగ్గురు న్యాయ నిపుణులు చెప్పారు. సైనిక బలంతో అమలు చేసే ఈ దిగ్బంధనం, ప్రస్తుతం ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని కూడా ఉల్లంఘిస్తుందా అనే సందేహాన్ని వారిలో ఒకరు వ్యక్తం చేశారు.

ఇరాన్ పోర్టులపై అమెరికా దిగ్భందనాన్ని అమలు చేయడానికి బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తమ బలగాలను పంపడం లేదు

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, డోనల్డ్ ట్రంప్, కీర్ స్టార్మర్

అమెరికా ఎందుకు దిగ్బంధిస్తోంది?

హార్ముజ్ జలసంధి భౌగోళిక స్థితి, ఇరాన్‌కు యుద్ధంలో ఒక అస్త్రంగా మారింది. ఈ ఇరుకైన మార్గంలో ఇరాన్ కొన్ని నౌకలను మాత్రమే అనుమతిస్తూ, మరికొన్నింటిని అడ్డుకుంటూ చమురు ధరల పెరుగుదలకు కారణమైంది.

అలాగే, కొన్ని నౌకలు ఈ మార్గం గుండా ప్రయాణించడానికి చాలా పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేస్తోంది.

ఈ మార్గాన్ని మూసేయడం ద్వారా, ఇరాన్ ప్రభుత్వానికి వచ్చే ప్రధాన ఆదాయ వనరును ట్రంప్ కట్ చేయొచ్చు. అయితే, దీనివల్ల చమురు, సహజవాయువు ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉంది.

'తనకు నచ్చిన వారికి చమురు అమ్ముకుంటూ, నచ్చనివారికి అమ్మకుండా ఇరాన్ డబ్బు సంపాదించడాన్ని మేం సహించం. అయితే, అందరూ ఆ మార్గాన్ని ఉపయోగించుకోవాలి. లేదా ఎవరికీ ఆ జలసంధి అందుబాటులో ఉండొద్దు. ఇదే మా లక్ష్యం' అని ఫాక్స్ న్యూస్‌తో ట్రంప్ అన్నారు.

అమెరికా షరతులకు లోబడి ఇరాన్ ఒప్పందం చేసుకునేలా ఒత్తిడి పెంచడమే అమెరికా అధ్యక్షుడి మాటల అంతరార్థమని విశ్లేషకులు భావిస్తున్నారు.

'హార్ముజ్ గుండా ఏ నౌక వెళ్లాలో.. ఏది వెళ్లకూడదో ఇరాన్‌ను నిర్ణయించనివ్వమని ట్రంప్ వ్యాఖ్యానించడం వెనుక మిత్రదేశాలన్నింటినీ ఒకతాటిపైకి తెచ్చే ప్రయత్నం ఉంది' అని సీబీఎస్‌కు చెందిన ఫేస్ ది నేషన్ అనే కార్యక్రమంలో రిపబ్లికన్ పార్టీకి చెందిన మైక్ టర్నర్ అన్నారు.

డెమొక్రాట్, సెనెటర్ మార్క్ వార్నర్ మాట్లాడుతూ, 'జలసంధిని దిగ్బంధనం చేయడం వల్ల ఇరాన్ దానిని ఎలా తెరుస్తుందో నాకు అర్థం కావట్లేదు' అని వ్యాఖ్యానించారు.

హార్ముజ్ జలసంధిలో ఓడ

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, హార్ముజ్ జలసంధిలో ఓడ

ఎలాంటి ప్రభావం పడుతుంది?

ప్రస్తుతం ఈ జలసంధి ద్వారా చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే నౌకలు రాకపోకలు సాగిస్తున్నందున అమెరికా నిర్ణయం వల్ల ఆ కొద్దిపాటి నౌకలు మాత్రమే ప్రభావితం అవుతాయని బీబీసీకి షిప్పింగ్ నిపుణుడు లార్స్ జెన్సెస్ తెలిపారు.

ఇరాన్‌కు సుంకం చెల్లించే ఏ నౌకనైనా అడ్డుకుంటామన్న ట్రంప్ హెచ్చరిక వల్ల పెద్దగా ప్రభావం ఉండదని వెస్పుచి మారిటైమ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జెన్సెన్ అభిప్రాయపడ్డారు.

'ఆ దారిలో వెళ్లే నౌకలే చాలా తక్కువ ఉన్నాయి. అందులోనూ ఇరాన్‌కు డబ్బు చెల్లించేవి మరీ తక్కువ. అలా ఇరాన్‌కు డబ్బు చెల్లించేవారు ఇప్పటికే అమెరికా ఆంక్షల పరిధిలోకి వచ్చి ఉంటారు' అని ఆయన అన్నారు.

చాలావరకు షిప్పింగ్ కంపెనీలు ప్రస్తుతం వేచిచూసే ధోరణిలో ఉన్నాయని జెన్సెస్ తెలిపారు. ఒకవేళ తాత్కాలిక శాంతి ఒప్పందం కుదిరి, అది నిలకడగా కొనసాగితే నౌకల రాకపోకలు నెమ్మదిగా మళ్లీ పుంజుకునే అవకాశం ఉందని ఆయన వివరించారు.

తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించినప్పటి నుంచి చాలా తక్కువ సంఖ్యలో నౌకలు హార్ముజ్ గుండా ప్రయాణించాయి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించినప్పటి నుంచి చాలా తక్కువ సంఖ్యలో నౌకలు హార్ముజ్‌లో ప్రయాణించాయి

హార్ముజ్ వద్ద ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది?

అమెరికా-ఇజ్రాయెల్ వద్ద ఏప్రిల్ 7న రెండు వారాల తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అందులో హార్ముజ్ జలసంధి ద్వారా నౌకల 'సురక్షిత ప్రయాణానికి' అనుమతివ్వాలనే షరతు కూడా ఉంది.

అయితే, అనుమతి లేకుండా జలసంధిని దాటడానికి ప్రయత్నిస్తే ఆ నౌకలను 'లక్ష్యంగా చేసుకొని నాశనం చేస్తాం' అని సందేశాలు అక్కడి నౌకలను అందాయి. కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాతి మూడు రోజుల్లో కేవలం కొన్ని నౌకలు మాత్రమే ఆ దారి గుండా ప్రయాణించాయి.

మెరైన్ ట్రాఫిక్ నుంచి సేకరించిన ఓడల కదలికల డేటాను బీబీసీ వెరిఫై విశ్లేషించింది. దీని ప్రకారం, కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటి నుంచి ఏప్రిల్ 10వ తేదీ 17:00 BST (భారత కాలమానం ప్రకారం రాత్రి 9:30 గంటలు) నాటికి ఆ జలసంధి మీదుగా 19 ఓడలు మాత్రమే ప్రయాణించినట్లు గుర్తించారు.

వీటిలో చమురు, సహజవాయువు లేదా రసాయనాలను తీసుకెళ్లే ట్యాంకర్లు నాలుగు కాగా మిగిలినవి సరకు రవాణా చేసే బల్క్ క్యారియర్లు లేదా కంటైనర్ షిప్పులు. కొన్ని నౌకలు తమ ఆచూకీ బయటపడకుండా ప్రయాణించాయి.

ఫిబ్రవరి 28న యుద్ధం మొదలవ్వకముందు ఈ జలసంధి గుండా రోజుకు సగటున 138 నౌకలు ప్రయాణించేవి.

(అడిషనల్ రిపోర్టింగ్ సరీన్ హబీషియాన్)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)