లేసిక్ సర్జరీతో మీ కళ్లద్దాలకు గుడ్‌బై చెప్పాలనుకుంటున్నారా? అయితే, మీరు తెలుసుకోవాల్సిన 8 కీలక విషయాలు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఓంకార్ కరంబేల్కర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- చదివే సమయం: 11 నిమిషాలు
'కళ్ల అద్దాల నుంచి ఒక్క రోజులో విముక్తి పొందండి'
లేసిక్ (ఎల్ఏఎస్ఐకే) సర్జరీ గురించి ఇలాంటి ప్రకటనలు మీరు వినే ఉంటారు. అయితే, లేసిక్ నిజంగా అందరికీ సురక్షితమైన, సరైన పరిష్కారమేనా?
కంటి నిర్మాణం, కార్నియా మందం, దృష్టి స్థిరత్వం వంటి విషయాలను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురుకావచ్చు.
ప్రకటనలకు అతీతంగా వైద్యపరమైన వాస్తవాల గురించి నేత్ర వైద్య నిపుణులు ఏం చెబుతున్నారు?
లేసిక్ చేయించుకోవాలని నిర్ణయించుకునే ముందు ఈ ముఖ్యమైన విషయాలను తప్పకుండా తెలుసుకోండి.

చాలామంది జీవితాల్లో కళ్లద్దాలు లేదా కాంటాక్ట్ లెన్స్‌లు వాడటం ఒక పెద్ద తలనొప్పిగా మారుతుంది. రోజువారీ ప్రయాణాలు, ఆఫీసు పని, ఆటలు, ఈత కొట్టడం లేదా సాధారణమైన సామాజికపరమైన సందర్భాల్లో కూడా కళ్లద్దాల వల్ల ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అందుకే గత కొన్నేళ్లుగా లేసిక్ సర్జరీ వైపు మొగ్గు చూపేవారి సంఖ్య వేగంగా పెరుగుతోంది.
ప్రకటనలు, సోషల్ మీడియాలో కనిపించే అనుభవాలు, తెలిసినవారి సానుకూల కథనాల వల్ల లేసిక్ అనేది చాలా సులభమైన, కచ్చితమైన ప్రక్రియ అనే నమ్మకం చాలామందిలో ఏర్పడుతోంది.
అయితే, వైద్యపరంగా అసలు వాస్తవాలు మాత్రం ఈ ప్రచార ఆర్భాటాల కంటే సంక్లిష్టంగా ఉంటుంది. లేసిక్ అనేది అత్యాధునికమైన, ప్రభావవంతమైన శస్త్రచికిత్స అయినప్పటికీ, అది ప్రతి ఒక్కరికీ సరైనది కాకపోవచ్చు.
అనువైన సమయం కాకపోయినా, అవసరమైన పరీక్షలు చేయించుకోకుండా లేదా రోగి కంటి నిర్మాణాన్ని సరిగ్గా పరిగణనలోకి తీసుకోకుండా లేసిక్ చేయించుకోవడం వల్ల భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదురుకావచ్చు.
అందుకే లేసిక్ ఎవరికి చేయాలి?, ఎవరికి చేయకూడదు? అనే విషయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న నేత్ర వైద్య నిపుణులు చాలా కచ్చితమైన అభిప్రాయాలతో ఉన్నారు.
లేసిక్ గురించి ఆలోచించేటప్పుడు కేవలం కళ్లద్దాలు పోతాయా లేదా అనేదే ముఖ్యం కాదు, ఆ నిర్ణయం భవిష్యత్తులో మీ కంటిచూపునకు సరైనదేనా అనేదే అసలు విషయం.

ఫొటో సోర్స్, Getty Images
లేసిక్ అంటే ఏమిటి?
లేసిక్ అంటే , లేజర్ అసిస్టెడ్ ఇన్ సిట్యు కెరటోమైల్యూసిస్ (Laser-Assisted In Situ Keratomileusis. ). ఇది దృష్టి దోషాలను సరిదిద్దడానికి చేసే లేజర్ ఆధారిత శస్త్రచికిత్స.
ప్రస్తుతం ధరిస్తున్న కళ్లద్దాల నంబర్‌కు అనుగుణంగా, కంటి ముందు ఉండే పారదర్శక భాగమైన కార్నియా ఆకారాన్ని మారుస్తారు. దీనివల్ల కాంతి కిరణాలు నేరుగా రెటీనాపై కచ్చితంగా కేంద్రీకృతమవుతాయి.
మయోపియా (హ్రస్వదృష్టి), హైపరోపియా (దూరదృష్టి), ఆస్టిగ్మాటిజం వంటి దృష్టి దోషాలను దీని ద్వారా ప్రధానంగా సరిదిద్దవచ్చు. అయితే, లేసిక్ అనేది అందరికీ ఒకేలా చేయగలిగిన ప్రక్రియ కాదు.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఫెమ్టోసెకండ్ లేజర్, టోపోగ్రఫీ - గైడెడ్ పద్ధతులు లేదా స్మైల్ (ఎస్ఎంఐఎల్ఈ), సిల్క్ (ఎస్ఐఎల్కే) వంటి శస్త్రచికిత్సల ప్రయోజనం ఏమిటంటే.. రోగి ఎంచుకున్న సర్జరీ, దానికి సంబంధించిన ప్రాథమిక పరీక్షలు ఎంత కచ్చితంగా జరిగితే అంత మెరుగ్గా ఉంటుంది.
అందుకే, ఈ శస్త్రచికిత్సకు సంబంధించి తలెత్తే 8 ముఖ్యమైన ప్రశ్నలకు నిపుణులైన వైద్యుల సమాధానాలు తెలుసుకుందాం.

ఫొటో సోర్స్, Getty Images
1.లేసిక్ ఎవరికి అవసరం?
లేసిక్ సర్జరీ చేయాలా వద్దా అనేది కేవలం కంటిచూపు నంబర్ ఎంత అనే దాని ఆధారంగా నిర్ధరించరు. రోగి వయస్సు, గత ఏడాది కాలంగా దృష్టి స్థిరంగా (నంబర్ మారకుండా)ఉందా, కార్నియా మందం, అది ఎంత బలంగా ఉంది, అలాగే కార్నియల్ టోపోగ్రఫీలో ఏవైనా అనుమానాస్పద మార్పులు కనిపిస్తున్నాయా? వంటి అన్ని విషయాలను క్షుణ్నంగా తనిఖీ చేస్తారు.
లేసిక్ అనేది కేవలం ఒక సాంకేతిక ప్రక్రియ మాత్రమే కాదు, ఇది కళ్ల దీర్ఘకాలిక ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయం. అందుకే, ఎవరికి ఈ సర్జరీ చేయాలి అనే విషయాన్ని కూడా అత్యంత కీలకంగా పరిగణిస్తారు.
ఒక వ్యక్తికి వయస్సు, కళ్లద్దాల నంబర్ సర్జరీ చేసేందుకు అనుకూలంగా ఉన్నప్పటికీ, వారి కార్నియా నిర్మాణం లేసిక్కు సురక్షితంగా లేకపోతే వైద్య నిపుణులు సర్జరీ నిరాకరిస్తారు. అందుకే, "నాకు తెలిసినవారు చేయించుకున్నారు కదా" అనే ఆలోచన ప్రాతిపదిక కాకూడదు.
పుణెలోని ఏఎస్జీ ఐ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ హేమంత్ కాంబ్లే దీని గురించి మనకు వివరణాత్మక సమాచారాన్ని అందించారు.
''లేసిక్ ఎవరికి అవసరమనే నిర్ణయం చాలా అంశాలపై ఆధారపడి ఉంటుంది. వైద్యపరమైన ఎన్నో అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఇక్కడ వయస్సు అనేది ముఖ్యమే, కానీ అంతకంటే ముఖ్యమైనది కళ్ల బయలాజికల్ స్టెబిలిటీ. రోగి కళ్లద్దాల నంబర్ గత ఏడాది కాలంగా పూర్తిగా స్థిరంగా ఉందా లేదా అనేది మొదటగా తనిఖీ చేస్తాం. ఆ తర్వాత కార్నియా మందం, దాని వక్రత, టోపోగ్రఫీలో ఎక్కడైనా 'కెరటోకోనస్' వంటి సమస్యల ప్రాథమిక సంకేతాలు ఏవైనా కనిపిస్తున్నాయా అని పరిశీలిస్తాం'' అని చెప్పారు.
పింప్రి - చించ్వాడ్లోని డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్ సోనాల్ ఎరోలే మాట్లాడుతూ, ''కేవలం కళ్లద్దాల నంబర్ అనుగుణంగా ఉంటే లేసిక్ సర్జరీ చేయొచ్చని కాదు. కంటి నిర్మాణం, మొత్తం నేత్ర పరీక్షల ఫలితాలు లేసిక్కు సురక్షితమని తేలినప్పుడే ఆ శస్త్రచికిత్స చేస్తారు. అలాగే, రోగి అంచనాలు కూడా వాస్తవికంగా ఉండటం చాలా ముఖ్యం" అని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
2.లేసిక్ సర్జరీ ఎవరికి అనుకూలం కాదు?
కొన్ని వైద్య కారణాల వల్ల లేసిక్ శస్త్రచికిత్స చేయించుకోవడం ప్రమాదకరంగా మారవచ్చు. కార్నియా పల్చగా ఉండటం, కెరటోకోనస్, షుగర్ నియంత్రణలో లేకపోవడం, ఆటోఇమ్యూన్ వ్యాధులు, కళ్లు పొడిబారడం లేదా కంటి ఇన్ఫెక్షన్లు ఉన్నప్పుడు లేసిక్ చేయించుకోకపోవడమే మంచిది. అలాగే, గర్భధారణ, తల్లి పాలు ఇచ్చే సమయంలో హార్మోన్ల మార్పుల వల్ల కూడా లేసిక్ చేయించుకోవద్దని సలహా ఇస్తారు.
ఈ అంశంపై థానేలోని కిమ్స్ హాస్పిటల్స్‌లో కన్సల్టెంట్ ఆప్తమాలజిస్ట్ డాక్టర్ రష్మీ బర్వే మరిన్ని వివరాలను అందించారు.
''లేసిక్ శస్త్రచికిత్సకు ముందుచేసే పరీక్షల్లో తరచుగా రోగులకు కూడా తెలియని కొన్ని ఆరోగ్య సమస్యలు బయటపడుతుంటాయి. కార్నియా పల్చగా ఉండటం లేదా ఇతర లోపాలు లేసిక్ తర్వాత తీవ్రరూపం దాల్చవచ్చు. అందుకే, కొన్ని సందర్భాల్లో లేసిక్ చేయించుకోకపోవడమే అత్యంత సురక్షితమైన, వైద్యపరంగా సరైన నిర్ణయం అవుతుంది'' అని ఆమె వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
3.వయస్సు, కంటిచూపు స్థిరత్వం ఎందుకు ముఖ్యం?
లేసిక్ శస్త్రచికిత్స కంటి ప్రస్తుత దృష్టి లోపంపై ఆధారపడి ఉంటుంది. అంటే, లేజర్ సహాయంతో మీ ప్రస్తుత కళ్లద్దాల నంబర్‌కు అనుగుణంగా కార్నియా ఆకారాన్ని మార్చుతారు.
ఒకవేళ రోగి కంటి నంబర్ ఇంకా మారుతూ ఉన్నట్లయితే, లేసిక్ శస్త్రచికిత్స తర్వాత కూడా దృష్టి లోపం మళ్లీ పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే, కనీసం ఒక సంవత్సరం పాటు కంటి నంబర్ స్థిరంగా ఉండటం అత్యవసరమని మెజారిటీ నేత్ర వైద్యులు భావిస్తారు.
అలాగే, 40 ఏళ్ల వయస్సు తర్వాత సహజంగా వచ్చే 'ప్రెస్బయోపియా', అంటే దగ్గరి వస్తువులను చూడటంలో ఇబ్బంది కలగడం అనే ప్రక్రియను లేసిక్ ద్వారా ఆపలేం. అందువల్ల, లేసిక్ శస్త్రచికిత్స జరిగిన తర్వాత కూడా కొందరు రోగులకు చదువుకోవడానికి కళ్లద్దాలు అవసరమవుతాయని వైద్యులు ముందే తెలియజేస్తారు.
డాక్టర్ సోనాల్ ఎరోలే మాట్లాడుతూ, "లేసిక్ చేయించుకునే ముందు దృష్టి స్థిరంగా ఉండటం చాలా ముఖ్యం. ఎందుకంటే, లేసిక్ లేజర్ మీ ప్రస్తుత కంటి నంబర్ ఆధారంగా పనిచేస్తుంది. ఒకవేళ నంబర్ ఇంకా మారుతూనే ఉంటే, శస్త్రచికిత్స తర్వాత కూడా అది పెరిగే అవకాశం ఉంటుంది, దీనివల్ల రోగి నిరాశకు గురవుతారు'' అని చెప్పారు.
''అదేవిధంగా, 40 ఏళ్ల వయస్సు తర్వాత దగ్గరి చూపు తగ్గడం అనేది ఒక సహజ ప్రక్రియ. లేసిక్ చేయించుకునే సమయంలోనే ఈ మార్పుల గురించి రోగికి స్పష్టమైన అవగాహన కల్పిస్తే, తర్వాత వారి అంచనాలకు, వాస్తవానికి మధ్య వ్యత్యాసం ఉండదు. సరైన వయస్సులో, సరైన సమయంలో చేయించుకున్న లేసిక్ శస్త్రచికిత్స దీర్ఘకాలిక సంతృప్తిని ఇస్తుంది" అని వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
4.లేసిక్ గురించి సాధారణ అపోహలు
లేసిక్ శస్త్రచికిత్స గురించి ఇప్పటికీ అనేక అపోహలు ప్రచారంలో ఉన్నాయి.
'లేసిక్ అంటే కచ్చితంగా 20/20 దృష్టి వస్తుంది', 'ఒకసారి లేసిక్ చేయించుకుంటే జీవితాంతం కళ్లద్దాల అవసరం ఉండదు', లేదా 'ఒక నిర్దిష్ట వయస్సు దాటిన తర్వాత లేసిక్ చేయించుకోలేం'... ఇలాంటి అపోహల వల్ల చాలామంది రోగులు తప్పుడు అంచనాలతో డాక్టర్ల వద్దకు వస్తుంటారు.
సోషల్ మీడియా, ప్రకటనలు, ఇతరుల మాటల వల్ల ఈ అపోహలు మరింత పెరుగుతున్నాయి.
వాస్తవానికి, లేసిక్ అనేది ప్రతి వ్యక్తి కంటి పరీక్షా ఫలితాల ఆధారంగా చేసే ఒక వైద్య ప్రక్రియ. దీనికి ఉన్న పరిమితులను రోగులు ముందే అర్థం చేసుకోవడం చాలా అవసరం.
డాక్టర్ హేమంత్ కాంబ్లే ఈ అపోహల గురించి వివరిస్తూ, ''లేసిక్ గురించి ఉన్న అతిపెద్ద అపోహ ఏమిటంటే, ఈ శస్త్రచికిత్స 'స్పష్టమైన కంటిచూపుకు గ్యారెంటీ' అని భావించడం. వాస్తవానికి, లేసిక్ అనేది ప్రస్తుత దృష్టి లోపాన్ని సరిచేసే ప్రక్రియ మాత్రమే, ఇది వయస్సుతో పాటు వచ్చే సహజ మార్పులను ఆపలేదు. ఉదాహరణకు, 'ప్రెస్బయోపియా' అనే మార్పును లేసిక్ ద్వారా నివారించలేం. అందుకే 40 ఏళ్ల తర్వాత రోగికి చదువుకోవడానికి కళ్లద్దాలు అవసరం కావచ్చు" అని చెప్పారు.
"అస్టిగ్మాటిజం లేదా ఎక్కువ కంటి నంబర్ ఉన్నవారు లేసిక్కు అనర్హులని మరొక అపోహ ఉంది. అయితే, ఆధునిక సాంకేతికత వల్ల ఇప్పుడు ఇలాంటి లోపాలను కూడా సరిచేయవచ్చు. అయితే, ఇదంతా కంటి పరీక్షలపైనే ఆధారపడి ఉంటుంది. కొందరు రోగులు గర్భధారణ సమయంలో 'ఖాళీ సమయం' దొరుకుతుందని లేసిక్ చేయించుకోవాలని ఆలోచిస్తారు. కానీ, ఆ సమయంలో హార్మోన్ల మార్పుల వల్ల కార్నియా ఆకారం మారవచ్చు. అందువల్ల, కేవలం ప్రకటనలను చూసి కాకుండా వైద్య సలహా ఆధారంగా లేసిక్ నిర్ణయం తీసుకోవాలి" అని సూచించారు.

5.లేసిక్ శస్త్రచికిత్సకు ముందుచేసే పరీక్షలేంటి?
లేసిక్ శస్త్రచికిత్సకు ముందు చేసే పరీక్షలు ఈ మొత్తం ప్రక్రియలో అత్యంత కీలకమైన భాగంగా పరిగణిస్తారు.
ఈ పరీక్షల్లో కార్నియల్ టోపోగ్రఫీ ద్వారా కార్నియా ఆకారం, బలాన్ని తనిఖీ చేస్తారు. దాని మందాన్ని కొలుస్తారు, కళ్లు పొడిబారే అవకాశం ఉందేమో పరిశీలిస్తారు. డైలేటెడ్ రిఫ్రాక్షన్ ద్వారా కంటి కచ్చితమైన నంబర్‌ను నిర్ధరిస్తారు. దీనితో పాటు, రెటీనాను క్షుణ్ణంగా పరీక్షించి, ఏవైనా బలహీనమైన భాగాలు ఉన్నాయా అని చూస్తారు. ముఖ్యంగా మయోపియా (హ్రస్వదృష్టి) ఉన్న రోగులకు ఈ పరీక్ష చాలా ముఖ్యం.
డాక్టర్ హేమంత్ కాంబ్లే వివరిస్తూ, "లేసిక్ ముందస్తు పరీక్షల ఉద్దేశం కేవలం రోగి ఈ శస్త్రచికిత్సకు అర్హుడా కాదా అని నిర్ణయించడం మాత్రమే కాదు, భవిష్యత్తులో వచ్చే ప్రమాదాలను గుర్తించడం, నివారించడం కూడా.
కార్నియల్ టోపోగ్రఫీ ద్వారా మాకు కార్నియాకు సంబంధించిన కచ్చితమైన ఆకారం, వక్రత, దాని బయోమెకానికల్ బలం అర్థమవుతాయి. చాలాసార్లు కెరటోకోనస్ వంటి వ్యాధుల తొలి సంకేతాలు ఈ పరీక్షల ద్వారా మాత్రమే బయటపడతాయి'' అని చెప్పారు.
''రోగులు తరచూ ఈ పరీక్షలను సమయం వృథా చేసే ప్రక్రియగా భావిస్తారు. కానీ, వాస్తవానికి ఈ పరీక్షలే భవిష్యత్తులో రాబోయే సంక్లిష్టతలను ముందుగానే గుర్తించడంలో సహాయపడతాయి. భవిష్యత్తులో తలెత్తే దృష్టి సమస్యలను నివారించడానికి ఈ పరీక్షలు చాలా అవసరం" అని డాక్టర్ రష్మీ బర్వే వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
6.లేసిక్ కాకుంటే, ప్రత్యామ్నాయాలేంటి?
లేసిక్ శస్త్రచికిత్స సాధ్యం కాకపోతే, రోగికి చూపు మెరుగుపడే అవకాశాలన్నీ ముగిసిపోయాయని అర్థం కాదు. కొంతమంది రోగులకు పీఆర్కే లేదా సర్ఫేస్ అబ్లేషన్ అనేది సురక్షితమైన ప్రత్యామ్నాయం కావచ్చు.
కంటి నంబర్ చాలా ఎక్కువగా ఉన్నట్లయితే, ఫాకిక్ ఇంట్రాకోక్యులర్ లెన్స్ (ఐసీఎల్) అనేది ఒక ప్రభావవంతమైన మార్గం. మరికొన్ని సందర్భాల్లో, రిఫ్రాక్టివ్ లెన్స్ ఎక్స్ఛేంజ్ అనేది దీర్ఘకాలిక పరిష్కారంగా ఉపయోగపడుతుంది.
డాక్టర్ సోనాల్ ఎరోలే మాట్లాడుతూ, "లేసిక్ చేయడానికి వీలుపడకపోయినా రోగులు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయ చికిత్సలు సురక్షితమైనవి, శాస్త్రీయంగా నిరూపితమైనవి. రోగి అవసరాలను బట్టి సరైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది" అని వివరించారు.
"లేసిక్కు అనర్హులైన రోగులు అన్ని రకాల చికిత్సలకు అనర్హులని అర్థం కాదు. ప్రతి రోగికి సరిపోయే ప్రక్రియ వేర్వేరుగా ఉంటుంది. ఒకవేళ కార్నియా పల్చగా ఉంటే, పీఆర్కే శస్త్రచికిత్స మరింత సురక్షితం. ఎందుకంటే, ఇందులో పొర (ఫ్లాప్)ను తయారు చేయాల్సిన అవసరం ఉండదు. కంటి నంబర్ చాలా ఎక్కువగా ఉన్నట్లయితే, ఫాకిక్ ఇంట్రాకోక్యులర్ లెన్స్ (ఐసీఎల్) ఒక అద్భుతమైన ఎంపిక, ఎందుకంటే ఇది కార్నియాపై ఎటువంటి ప్రభావం చూపదు" అని డాక్టర్ హేమంత్ కాంబ్లే చెప్పారు.
''కొంతమంది రోగుల వయస్సు, భవిష్యత్తు అవసరాలు, వారి కంటి నంబర్‌ను పరిగణనలోకి తీసుకుంటే, రిఫ్రాక్టివ్ లెన్స్ ఎక్స్ఛేంజ్ అనేది మరింత ఆచరణాత్మకమైన మార్గం. ఇందులో కంటిలోని సహజ లెన్స్‌ను తొలగించి కృత్రిమ లెన్స్‌ను అమర్చుతారు. దీనివల్ల భవిష్యత్తులో వచ్చే క్యాటరాక్ట్ సమస్యను కూడా ముందే నివారించవచ్చు. 'అందరికీ ఒకే ప్రక్రియ' అని కాకుండా, 'సరైన రోగికి సరైన ప్రక్రియ' అనే దృక్పథంతో చికిత్స అందిస్తాం" అని ఆయన తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
7.లేసిక్ సర్జరీలో ఉన్న ఇతర ఇబ్బందులు?
లేసిక్ అనేది, సురక్షితమైన శస్త్రచికిత్స అయినప్పటికీ ఇందులో అసలు ప్రమాదాలే లేవని చెప్పలేం. లేసిక్ తర్వాత కొంతకాలం పాటు కళ్లు పొడిబారడం, కాంతి చుట్టూ వలయాలు కనిపించడం లేదా వెలుతురును అస్సలు చూడలేకపోవడం వంటివి అనిపించవచ్చు.
అరుదుగా 'ఫ్లాప్'కి సంబంధించిన సమస్యలు లేదా కంటి నంబర్ మళ్లీ పెరిగే అవకాశం ఉంటుంది. అయితే, సరైన పరీక్షలు, జాగ్రత్తలు తీసుకుంటే మెజారిటీ ప్రమాదాలను నివారించవచ్చు.
ఈ విషయమై డాక్టర్ రష్మీ బర్వే మాట్లాడుతూ, "రోగి తనకున్న అన్ని ఆరోగ్య సమస్యల గురించి డాక్టర్‌కు స్పష్టంగా వివరిస్తే, అలాంటి ప్రమాదాలను చాలావరకు నివారించవచ్చు" అని చెప్పారు.
డాక్టర్ హేమంత్ కాంబ్లే మాట్లాడుతూ, "నేడు లేసిక్ సాంకేతికత ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ, ఇదొక సర్జరీ అనే విషయం రోగులు అర్థం చేసుకోవాలి. కళ్లు పొడిబారడం అనేది సర్వసాధారణంగా కనిపించే సమస్య. అయితే ఇది చాలావరకు తాత్కాలికమే. ఫ్లాప్‌కు సంబంధించిన సంక్లిష్టతలు లేదా కంటి నంబర్ మళ్లీ పెరగడం వంటివి చాలా అరుదుగా జరుగుతుంటాయి" అని వివరించారు.
"ఇక్కడ ప్రధానమైన విషయం ఏమిటంటే, సరైన రోగిని ఎంపిక చేయడం. ఒకవేళ శస్త్రచికిత్సకు సరిపడని రోగికి అత్యుత్తమ సాంకేతికత ఉపయోగించి సర్జరీ చేసినా ప్రమాదం పొంచి ఉంటుంది. అనుభవజ్ఞుడైన సర్జన్, కచ్చితమైన స్క్రీనింగ్ పరీక్షలు, శస్త్రచికిత్స తర్వాత డాక్టర్ ఇచ్చే సూచనలను కచ్చితంగా పాటించడం ద్వారా ఇబ్బందులను చాలావరకు తగ్గించవచ్చు" అని సూచించారు.

ఫొటో సోర్స్, Getty Images
8.లేసిక్ సాంకేతికతలో ఇటీవలి మార్పులు
గత దశాబ్ద కాలంలో లేసిక్ సాంకేతికతలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఫెమ్టో సెకండ్ లేజర్ వల్ల ఫ్లాప్ తయారీలో కచ్చితత్వం పెరిగింది. టోపోగ్రఫీ-గైడెడ్ లేసిక్ ద్వారా కార్నియా సూక్ష్మ ఆకృతిని బట్టి చికిత్స అందించడం సాధ్యమవుతోంది.
ఇక స్మైల్, సిల్క్ వంటి పొర కట్ చేయాల్సిన అవసరం లేని (ఫ్లాప్లెస్) పద్ధతుల వల్ల కార్నియా బలం దెబ్బతినదు. కళ్లు పొడిబారడం వంటి సమస్యలు తగ్గుతున్నాయి.
డాక్టర్ హేమంత్ కాంబ్లే ఈ మార్పుల గురించి వివరిస్తూ, "ఆధునిక లేసిక్లో వచ్చిన అతిపెద్ద మార్పు కచ్చితత్వం. ఫెమ్టో లేసిక్ వల్ల ఫ్లాప్ తయారీలో మానవ తప్పిదాలకు తావు లేకుండా పోయింది. టోపోగ్రఫీ-గైడెడ్ వ్యవస్థ వల్ల ప్రతి కంటికి తగినట్లుగా ప్రత్యేక చికిత్స అందించవచ్చు. స్మైల్ వంటి ఫ్లాప్లెస్ సాంకేతికత వల్ల కార్నియా నాడి వ్యవస్థపై ప్రభావం తక్కువగా ఉంటుంది, దీనివల్ల కళ్లు పొడిబారడం తగ్గుతుంది. సత్వరమే కోలుకుంటారు'' అని చెప్పారు.
"దీనికి తోడు ఐ-ట్రాకింగ్ సిస్టమ్స్ వల్ల కంటి అతి సూక్ష్మ కదలికలకు అనుగుణంగా లేజర్ సర్దుబాటు అవుతుంది. అందుకే నేడు లేసిక్ అనేది కేవలం వేగంగా జరిగే శస్త్రచికిత్స మాత్రమే కాదు, అత్యంత కచ్చితత్వంతో కూడిన వైద్య ప్రక్రియగా మారింది. అయితే, ఇందులో సరైన రోగిని ఎంపిక చేసుకోవడం చాలా కీలకం" అని ఆయన వివరించారు.
ఈ మారుతున్న సాంకేతికత గురించి డాక్టర్ రష్మీ బర్వే మాట్లాడుతూ, పరీక్షల ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.
''సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినప్పటికీ, లేసిక్ చేయించుకోవాలనే నిర్ణయం నేటికీ సరైన కంటి పరీక్షలు, నిపుణులైన వైద్యుల సలహాపైనే ఆధారపడి ఉండాలి" అని ఆమె అన్నారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

































