అమెరికా, ఇరాన్ కాల్పుల విరమణ: ఈ విషయంలో పాకిస్తాన్‌కు దక్కిన గుర్తింపు భారత్‌కు ఎదురుదెబ్బా?

ఫొటో సోర్స్, Sonu Mehta/Hindustan Times via Getty Images
- రచయిత, సందీప్ రాయ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- చదివే సమయం: 7 నిమిషాలు
ఇరాన్‌తో అమెరికా - ఇజ్రాయెల్ యుద్ధంలో రెండు వారాల కాల్పుల విరమణను భారత్ స్వాగతించింది. అయితే, పాకిస్తాన్ పేరును గానీ, ఆ దేశ మధ్యవర్తిత్వ ప్రయత్నాల గురించి ఎలాంటి ప్రస్తావనా చేయలేదు.
"మేం కాల్పుల విరమణ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ఇది పశ్చిమాసియాలో శాశ్వత శాంతిని నెలకొల్పేందుకు సాయపడుతుందని ఆశిస్తున్నాం. ప్రస్తుత సంఘర్షణను ముగించేందుకు కాల్పుల విరమణ, చర్చలు, దౌత్యం చాలా అవససరం" అని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.
"ఈ యుద్ధం ఇప్పటికే భారీ విధ్వంసం సృష్టించింది. ప్రపంచ చమురు, ఇంధన సరఫరాలు, వాణిజ్య వ్యవస్థలకు అంతరాయం కలిగించింది. ఇప్పుడు వాణిజ్య, చమురు నౌకలు హార్ముజ్ జలసంధి మీదుగా ప్రయాణించగలవని మేం ఆశిస్తున్నాం" అని అందులో పేర్కొంది.
బ్రిటన్, యూరోపియన్ యూనియన్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది నాయకులు పాకిస్తాన్ మధ్యవర్తిత్వ ప్రయత్నాలను ప్రశంసిస్తున్నప్పటికీ.. ఇస్లామాబాద్‌లో ఇరాన్, అమెరికాల మధ్య జరగబోయే చర్చలపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ మౌనం వహించింది.

పాకిస్తాన్‌కు ప్రశంసలు
ఈ కాల్పుల విరమణ కోసం పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నాలకు అంతర్జాతీయంగా ప్రశంసలు లభిస్తున్నాయి.
కాల్పుల విరమణ ప్రకటన సందర్భంగా, అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ పాకిస్తాన్ పేరును ప్రస్తావించారు.
పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్‌ల అభ్యర్థన మేరకు తాను ఈ నిర్ణయం తీసుకున్నానని అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు.
ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ కూడా పాకిస్తాన్ ప్రయత్నాలను ప్రశంసించారు.
"ఈ ప్రాంతంలో సంఘర్షణలను ఆపేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్న మా మిత్రదేశమైన పాకిస్తాన్‌కు, ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్‌కు ఇరాన్ తరపున నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను" అని ఆయన అన్నారు.
ఘర్షణలను తగ్గించడంలో పాకిస్తాన్‌తో సహా మధ్యవర్తుల పాత్రను ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి కూడా ప్రశంసించారు.
"ఉద్రిక్తతలను తగ్గించడానికి పాకిస్తాన్, ఈజిప్ట్, తుర్కియే, సౌదీ అరేబియాతో సహా చర్చలలో పాల్గొంటున్న అన్ని పక్షాలు చేస్తున్న ప్రయత్నాలకు మేం కృతజ్ఞతలు తెలియజేస్తూ, మద్దతు తెలుపుతున్నాం" అని ఆయన అన్నారు.
యూరోపియన్ యూనియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్.. మధ్యవర్తిత్వం వహించినందుకు పాకిస్తాన్‌కు ధన్యవాదాలు తెలిపారు.

ఫొటో సోర్స్, Roy Rochlin/Getty Images for Newsweek
విదేశాంగ విధానంపై ప్రశ్నలు
అంతర్జాతీయ దౌత్యంలో పాకిస్తాన్‌కు పెరుగుతున్న ప్రాధాన్యం విషయంలో భారత విదేశాంగ విధానంపై ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నలు లేవనెత్తాయి.
"పాకిస్తాన్ చేసిన పనిని నిజానికి భారత్ చేయాల్సింది. కానీ, ప్రధాని మోదీ ఇజ్రాయెల్‌ను 'పితృభూమి'(ఫాదర్‌ల్యాండ్) అని పిలుస్తున్నప్పుడు, ఆయన కాల్పుల విరమణ గురించి ఏమని చర్చించగలరు?" అని కాల్పుల విరమణపై స్పందించిన ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకుడు రషీద్ అల్వీ అన్నారు.
ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ, నరేంద్ర మోదీ నాయకత్వంపై ప్రశ్నలు లేవనెత్తింది.
"పాకిస్తాన్ పోషించిన పాత్ర, కాల్పుల విరమణ మోదీ వ్యక్తిగత దౌత్యరీతికి పెద్ద ఎదురుదెబ్బ" అని కాంగ్రెస్ నాయకుడు జైరామ్ రమేష్ ఇన్‌స్టాగ్రామ్‌లో రాశారు.
"ఫిబ్రవరి 28న ఇరాన్ పాలకవర్గంలోని అగ్ర నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని హత్య చేయడంతో యుద్ధం మొదలైంది. ప్రధాన మంత్రి మోదీ ఇజ్రాయెల్‌లో పర్యటించిన రెండు రోజుల తర్వాత ఈ సంఘటనలు జరిగాయి. ఈ పర్యటన అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్ట, విశ్వసనీయతను తగ్గించిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి" అని ఆయన రాశారు.
"విదేశాంగ మంత్రి పాకిస్తాన్ మధ్యవర్తిత్వాన్ని తక్కువ చేసి మాట్లాడారు. కానీ, ప్రపంచానికి గురువునని చెప్పుకునే వ్యక్తి బండారం పూర్తిగా బట్టబయలైంది. ఆయన గొప్పగా చెప్పుకున్న 56 అంగుళాల ఛాతీ కూడా కుంచించుకుపోయింది" అని ఆయన రాశారు.
"భారత్ ఒక విశ్వసనీయ మధ్యవర్తిగా మెరుగైన స్థితిలో ఉన్నప్పటికీ.. బీజేపీ ప్రభుత్వ తప్పుల కారణంగా.. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య మధ్యవర్తిత్వం వహించే అవకాశం పాకిస్తాన్‌కు దక్కింది" అని కాంగ్రెస్ ఒక ప్రకటనలో పేర్కొంది.
"అమెరికా, ఇరాన్‌ల మధ్య జరిగే ఏ చర్చల్లోనైనా భారత్ ఎందుకు ఉండాలి? ఈ విమర్శ నాకు అర్థం కావడం లేదు, ఎందుకంటే ఇది మన పోరాటం కాదు. ఇక పాకిస్తాన్ విషయానికొస్తే, అది డబ్బు తీసుకుని సంక్షోభాన్ని పరిష్కరిస్తామని చెప్పే తాబేలు లాంటిది. ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రి అఖిలపక్ష సమావేశంలో చాలా చక్కగా చెప్పారు" అని శివసేన - యూబీటీ నాయకురాలు ప్రియాంక చతుర్వేది ఎక్స్‌లో రాశారు.
"కాల్పుల విరమణతో హార్ముజ్ జలసంధి మళ్లీ తెరుచుకుంది. అదే హార్ముజ్ జలసంధి, యుద్ధం ప్రారంభానికి ముందు హార్ముజ్ తెరిచే ఉంది. మరి ఈ 39 రోజుల యుద్ధంతో అమెరికా చివరికి ఏమి సాధించింది?" అని జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఇన్‌స్టాగ్రామ్‌లో రాశారు.

ఫొటో సోర్స్, whitehouse
పాకిస్తాన్ మధ్యవర్తా? లేక రాయబారి మాత్రమేనా?
ఇరాన్ యుద్ధంలో పాకిస్తాన్ దౌత్యపరంగా భారత్‌పై పైచేయి సాధించిందా?
ఈ విషయంలో ప్రతిపక్ష పార్టీల మధ్య ఏకాభిప్రాయం ఉన్నప్పటికీ.. విశ్లేషకులు, పాత్రికేయుల అభిప్రాయాలు భిన్నంగా ఉన్నాయి.
అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు హర్ష్ పంత్, దీనిని షార్ట్‌టర్మ్ డిప్లొమసీ (స్వల్పకాలిక దౌత్యం) అని అంటున్నారు.
"ఈ సంఘర్షణలో పాకిస్తాన్ కేవలం సందేశాలను చేరవేసే మాధ్యమంగా మాత్రమే వ్యవహరించింది. ఒక మధ్యవర్తికి ఉన్నట్లుగా, ఫలితాన్ని ప్రభావితం చేయగల గుర్తింపు గానీ, పాత్ర గానీ దానికి ఉన్నట్లు కనిపించడం లేదు. ఈ మధ్యవర్తిత్వం తుది ఫలితం ఇంకా తెలియదు. ఇరుదేశాల మధ్య సందేశాలను మార్పిడి చేసుకునే మాధ్యమంగా మారి, కాల్పుల విరమణను సాధ్యం చేయడం ద్వారా పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహించడానికి ప్రయత్నించిందన్నది నిజమే. కానీ, దీనికి మించి ఇంకో ఫలితం వచ్చినట్లు కనిపించడం లేదు" అని ఆయన బీబీసీతో అన్నారు.
"పాకిస్తాన్ ఇదెందుకు చేస్తోంది అనే ప్రశ్న కూడా ఉంది. నిజానికి, ఆపరేషన్ సిందూర్ కాలం నుంచే పాకిస్తాన్ అమెరికాకు దగ్గరవ్వడానికి ప్రయత్నిస్తోంది. ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని వాదించింది కూడా. ఆసిమ్ మునీర్ అమెరికా పర్యటనకు వచ్చినప్పుడు, పాకిస్తాన్ అరుదైన ఖనిజాలను అమ్మడం గురించి మాట్లాడింది. కాబట్టి, ఒకప్పుడు అమెరికా విదేశాంగ విధానంలో పక్కనపడేసిన తన పాత్రను పెంచుకోవడానికి పాకిస్తాన్ నిరంతరం ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న మధ్యవర్తిత్వాన్ని కూడా ఆ కోణంలోనే చూడాలి" అని ఆయన అన్నారు.
"పాకిస్తాన్ పాత్ర మధ్యవర్తిగా కాకుండా, సందేశాలను చేరవేసే, గడువులను పొడిగించే, ఒక చిన్న దౌత్యమార్గాన్ని తెరవడానికి సహాయపడే పాత్రగా ఎదిగింది" అని విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి నిరూపమా మేనన్ రావ్ ఎక్స్‌లో రాశారు .
పంత్ మాదిరిగానే ఆమె కూడా, 'సంప్రదాయంగా చూస్తే, ఇది మధ్యవర్తిత్వం కాదు, కానీ దీని ప్రాముఖ్యతను తక్కువ అంచనా వేయలేం' అని అంటున్నారు.
"భారత్ తన వైఖరిని స్పష్టం చేయాలి. అది కాల్పుల విరమణకు మద్దతు ఇవ్వాలి. సముద్ర మార్గాలను పరిరక్షించడానికి కృషి చేయాలి. ఈ యుద్ధంలో ఏ ఒక్క పక్షం ఆధిపత్యం చెలాయించకుండా నిరోధించాలి. ఇది మౌనంగా ఉండే సమయం కాదు, వివేకంతో, తెలివిగా మాట్లాడాల్సిన సమయం" అని నిరుపమా రావు అన్నారు.
"విజయవంతమైన కాల్పుల విరమణ చర్చలు.. పాకిస్తాన్‌పై అమెరికా, ఇరాన్‌కు మాత్రమే కాకుండా చైనాకి కూడా విశ్వాసం ఉందనేందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. మోదీ.. పాకిస్తాన్‌ను ప్రపంచవ్యాప్తంగా ఏకాకిని చేయాలనుకున్నారు. కానీ, దానికి విరుద్ధంగా భారత్ తనకు తాను ఏకాకిగా మిగిలింది."
పాకిస్తాన్ ఇంతకుముందు కూడా ఇలా చేసిందని హర్ష్ పంత్ అంటున్నారు. 1970లలో, ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో రష్యా, అమెరికా మధ్య మధ్యవర్తిత్వం వహించింది. అమెరికా విదేశాంగ విధానంలో ప్రభావాన్ని పెంచుకోవడానికి అది ఈ వ్యూహాన్ని నిరంతరం ఉపయోగించి, విజయవంతమైందని ఆయన చెప్పారు.
"ఒకానొక సమయంలో కాబూల్‌లో తాలిబాన్ ప్రభుత్వం ఏర్పడబోతోందని తెలిసినప్పుడు భారత్‌లో ఎంత ఆందోళన వ్యక్తమైందో చాలామంది మర్చిపోయుండొచ్చు. భారత విదేశాంగ విధానం విఫలమైందని అన్నారు. కానీ, చివరికి ఏమైంది? తాలిబాన్ నేడు భారత్‌తో మాట్లాడుతోంది, పాకిస్తాన్‌తో పోరాడుతోంది. అసలు విదేశాంగ విధానం అనేదాన్ని దీర్ఘకాల దృష్టితో చూడాలి" అని ఆయన అన్నారు.

'భారత విదేశాంగ విధానం సంయమనం ప్రదర్శించింది'
ఈ యుద్ధంలో భారత్ ఎంతో సంయమనం పాటించిందని అంతర్జాతీయ రాజకీయ వ్యవహారాల పలువురు నిపుణులు అంటున్నారు.
బీబీసీ పాడ్‌కాస్ట్ కార్యక్రమం 'దిన్‌భర్'లో మాట్లాడిన బీబీసీ హిందీ ఎడిటర్ నితిన్ శ్రీవాస్తవ, దీని వెనుక ప్రధాన కారణం అమెరికాతో జరిగిన వాణిజ్య ఒప్పందమేనని అన్నారు.
"ఇరాన్, అమెరికా - ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మొదలైప్పుడు, భారత్ దౌత్యం చాలా సున్నితమైన దశలో ఉంది. ఎందుకంటే, భారత్ చాలాకాలంగా అమెరికాతో సుంకాలపై చర్చలు జరుపుతోంది. అందులో చాలా సంక్లిష్టతలు ఉన్నాయి. మొదట సుంకం 25 శాతంగా ఉండేది, ఆ తర్వాత రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తుండడంతో అదనంగా మరో 25 శాతం సుంకం విధించారు. ఇరాన్ యుద్ధం సమయంలో, భారత్.. అమెరికాతో ఒక పెద్ద వాణిజ్య ఒప్పందం మధ్యలో ఉంది" అని ఆయన అన్నారు.
"ఇరాన్‌తో భారత్ సంబంధాలు ప్రజల స్థాయిలో చాలా బలంగా ఉన్నాయి. రెండు దేశాల మధ్య వ్యాపారం కూడా పెద్ద స్థాయిలో ఉంది. భారత్ నుంచి ఇరాన్‌కు బాస్మతి బియ్యం వంటి అనేక వస్తువులు ఎగుమతి అవుతాయి. అలాగే ఇరాన్ నుంచి ఖనిజ పదార్థాలు వంటి అనేక వస్తువులు దిగుమతి అవుతాయి. గ్యాస్ పైప్‌లైన్ విషయమై కూడా చర్చలు జరిగాయి, అందులో భారత్‌కు భారీ పెట్టుబడులు ఉన్నాయి" అని ఆయన అన్నారు.
నిజానికి, ఇరాన్ యుద్ధం మొదలు కావడానికి కొద్దిరోజుల ముందు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్‌లో పర్యటించారు.
దీని తర్వాత వెంటనే ఈ వివాదం మొదలవ్వడంతో, మోదీ ప్రభుత్వంపై కూడా ప్రశ్నలు తలెత్తాయి.
ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ హత్యకు గురైనప్పుడు, భారత్ నుంచి తక్షణ స్పందన ఏదీ రాలేదు.
అయితే కొన్ని రోజుల తర్వాత, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఒకరు న్యూదిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయానికి వెళ్లి సంతాప పుస్తకంపై సంతకం చేశారు.
యుద్ధం ఆగాలని భారత్ మొదటి నుంచి చెబుతూనే ఉంది, కానీ అంతకుమించి ఈ యుద్ధంలో దాని పాత్రేమీ లేదు.
తర్వాత ఇరాన్ అధ్యక్షుడు, విదేశాంగ మంత్రితో సహా పలువురు మధ్యప్రాచ్య నాయకులతో భారత ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ వరుస చర్చలు జరిపారు.
"భారత విదేశాంగ విధానం విషయానికి వస్తే, కాల్పుల విరమణ ప్రకటించడానికి రెండు వారాల ముందు, ఇరాన్‌తో చర్చలు జరిపి, వారి అంగీకారంతో, భారత నౌకాదళ పర్యవేక్షణలో భారత్‌కు వస్తున్న చమురు ట్యాంకర్లను హార్ముజ్ జలసంధి ద్వారా సురక్షితంగా తీసుకురావడంలో విజయం సాధించింది.
భారత్ స్వయంగా సంక్షోభం వైపు పయనిస్తున్న సమయంలో, ప్రధాని మోదీ పార్లమెంటులో ఆందోళనకర పరిస్థితి గురించి మాట్లాడిన సమయంలో ఇది జరిగింది" అని నితిన్ శ్రీవాస్తవ అన్నారు.
ఈ విషయంలో భారత విదేశాంగ విధానంలో ఎంతో సంయమనం పాటించడంతో పాటు, కొంత విజయం కూడా సాధించిందని అయన చెప్పారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
































