ఆర్టెమిస్ II: 'చెప్పాల్సిన కథలు చాలా ఉన్నాయి'

నాసా, ఆర్టెమిస్, చంద్రుడు, అమెరికా, డోనల్డ్ ట్రంప్, ప్రయోగం, వ్యోమగాములు, అంతరిక్షనౌక, భూమి

ఫొటో సోర్స్, NASA

    • రచయిత, క్లెయిర్ కీనన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • చదివే సమయం: 4 నిమిషాలు

ఆర్టెమిస్ II మిషన్‌లో భాగంగా, ఓరియన్ అంతరిక్ష నౌకలో చంద్రుని చుట్టూ తమ ప్రయాణాన్ని పూర్తి చేసిన నలుగురు వ్యోమగాముల బృందం.. అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 8:00 గంటలకు (భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం 5:30 గంటలకు) శాన్ డియాగో తీరానికి సమీపంలో సముద్రంలో దిగనున్నారు.

అంతరిక్షం నుంచి ఇంటికి తిరిగొస్తున్న సమయంలో, మిషన్ పైలట్ విక్టర్ గ్లోవర్ మీడియాతో మాట్లాడుతూ, తాము చూసిన విషయాలను ప్రపంచంతో పంచుకోవడానికి సిబ్బంది ఎంతో ఉత్సాహంగా ఉన్నారని చెప్పారు.

చంద్రుని చుట్టూ ప్రత్యేక ప్రయాణం తర్వాత, మానవ చరిత్రలో ఎవరూ వెళ్లనంత దూరం వెళ్లిన తర్వాత, ఈ బృందం మొదటిసారిగా మాట్లాడింది.

ప్రపంచంతో పంచుకోవడానికి తమ వద్ద చాలా ఫోటోలు, ఎన్నో కథలు ఉన్నాయని ఆర్టెమిస్ II సిబ్బంది తెలిపారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
నాసా, ఆర్టెమిస్, చంద్రుడు, అమెరికా, డోనల్డ్ ట్రంప్, ప్రయోగం, వ్యోమగాములు, అంతరిక్షనౌక, భూమి

ఫొటో సోర్స్, NASA

ఫొటో క్యాప్షన్, ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్ నుంచి ఆస్ట్రోనాట్ క్రిస్టినా కోచ్ భూమిని చూస్తున్న ఫోటో.

"మేం తిరిగి రావాల్సిందే. మీరు ఇప్పటికే చాలా డేటా చూశారు, కానీ ముఖ్యమైన సమాచారాన్ని మేం తీసుకొస్తున్నాం" అని బుధవారం సాయంత్రం జరిగిన సమావేశంలో గ్లోవర్ చెప్పారు.

"ఇంకా చాలా ఫోటోలు ఉన్నాయి, చాలా కథలు ఉన్నాయి"అని గ్లోవర్ అన్నారు.

వారు అనుభవించిన ప్రతిదానినీ అర్థం చేసుకోవడం మొదలుపెట్టడానికి సిబ్బందికి ఇంకా రెండు రోజుల సమయం అవసరమని గ్లోవర్ తెలిపారు.

"నా జీవితాంతం ఈ విషయాలన్నిటి గురించి ఆలోచిస్తూ, మాట్లాడుతూనే ఉంటాను" అని ఆయన అన్నారు.

ఆర్టెమిస్ II మిషన్‌కు చెందిన ఓరియన్ వ్యోమనౌక మనుషులు చేరుకున్న దూరంలో కొత్త రికార్డ్ సాధించింది. సోమవారం సుమారు 13:56 ఈడీటీ (ఈస్టర్న్ డేలైట్ టైమ్ - భారత కాలమానం ప్రకారం రాత్రి 11.26 గంటల) సమయానికి ఇది 248,655 మైళ్లు (400,000 కిలోమీటర్లు) దాటి మానవ రికార్డులను బద్దలుకొట్టింది. 1970 లో అపోలో 13 మిషన్ నెలకొల్పిన రికార్డును ఇది అధిగమించింది.

ఈ అంతరిక్ష నౌక చంద్రుడిపై ల్యాండ్ అయ్యేందుకు కాకుండా, భూమి నుంచి ఎన్నడూ కనిపించని చంద్రుడి అవతలి వైపు చుట్టి రావడమే దీని లక్ష్యం. ఉపగ్రహాలు ఇదివరకే ఆ అవతలి వైపును ఛాయాచిత్రాలు తీశాయి, కానీ అవతలి వైపు ఉపరితలంపై ఉన్న కొన్ని భాగాలను, దాని విశాలమైన బిలాలను, లావా మైదానాలను మొట్టమొదట చూసినవారు వ్యోమగాములే.

చంద్రుని చుట్టూ ఓరియన్ బృందం ప్రయాణం చేసిన వెంటనే, వారితో మాట్లాడారు అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్.

"ఈ రోజు మీరు చరిత్ర సృష్టించారు. అమెరికా గర్వపడేలా చేశారు" అని వారిని ట్రంప్ అభినందించారు.

హ్యూస్టన్‌లోని నాసా జాన్సన్ స్పేస్ సెంటర్‌లో ఇటీవల జరిగిన వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో, ఆ నలుగురు ఆస్ట్రోనాట్లు మళ్లీ లైవ్ స్ట్రీంలో కనిపించారు. వారి మధ్య ఒక మైక్రోఫోన్ తేలుతూ ఉంది.

వారు ఒకరి తర్వాత ఒకరు, కాస్త ఆలస్యంగా విలేఖరుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు.

నాసా, ఆర్టెమిస్, చంద్రుడు, అమెరికా, డోనల్డ్ ట్రంప్, ప్రయోగం, వ్యోమగాములు, అంతరిక్షనౌక, భూమి

ఫొటో సోర్స్, NASA

ఫొటో క్యాప్షన్, ఆస్ట్రోనాట్లు తీసిన "ఎర్త్ సెట్" ఫోటోలో భూమి చంద్రుని అంచు నుంచి కిందకి జారుతున్నట్టుగా కనిపిస్తోంది.

భూమితో సంబంధాలు తెగిపోయినప్పుడు వారు ఎదుర్కొన్న 40 నిమిషాల "తీవ్రమైన ఒంటరితనం" గురించి లాస్ ఏంజిల్స్ టైమ్స్ పత్రిక సిబ్బందిని ప్రశ్నించింది.

"సిబ్బంది చేయవలసిన శాస్త్రీయ పరిశోధన పని చాలా ఉందని, మా భూగర్భ శాస్త్ర బృందానికి బహుశా ఇది అత్యంత కీలకమైన చంద్రుడి పరిశీలన" అని కమాండర్ రీడ్ వైస్‌మాన్ అన్నారు.

"కానీ, మేం నలుగురం ఒక క్షణం ఆగి, జెరెమీ తెచ్చిన మేపుల్ కుకీలను పంచుకుని, ఒక బృందంగా మేం ఏ స్థితిలో ఉన్నామో నిజంగా సమీక్షించుకోవడానికి సుమారు మూడు నాలుగు నిమిషాలు తీసుకున్నాం" అని ఆయన అన్నారు.

గ్లోవర్‌కు, ఈ యాత్రలో లభించిన "గొప్ప బహుమతి" చంద్రుని అవతలి వైపు నుంచి చంద్రగ్రహణాన్ని చూడటమే.

2020లో క్యాన్సర్‌తో మరణించిన తన దివంగత భార్య కారోల్ పేరును తన బృందం చంద్రునిపై ఉన్న ఒక బిలానికి పెట్టడమే, వైస్‌మన్‌కు అత్యంత కీలకమైన క్షణం.

"జెరెమీ కారోల్ పేరును పలికినప్పుడు... నాకైతే భావోద్వేగంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాను. నేను అటు చూసేసరికి క్రిస్టినా ఏడుస్తోంది" అని రీడ్ అన్నారు.

"వ్యక్తిగతంగా నా వరకైతే, ఈ మిషన్‌లో అదే అత్యున్నతమైన క్షణం" అని ఆయన చెప్పారు.

భూగ్రహం నుంచి తమకు కావాల్సిన వార్తలను తమ కుటుంబ సభ్యుల నుంచి తెలుసుకుంటున్నామని కూడా ఆ సిబ్బంది చెప్పారు.

"ప్రజలు ఈ మిషన్ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి వారే మాకు ఆధారం. స్పష్టంగా చెప్పాలంటే వారందరూ పక్షపాతంతో ఉన్నారు" అని వైస్‌మాన్ అన్నారు.

అంతరిక్షంలో ఉన్నప్పుడు సిబ్బంది దేనిని ఎక్కువగా మిస్ అవుతారని బీబీసీ న్యూస్ సైన్స్ ఎడిటర్ రెబెక్కా మోరెల్ అడిగినప్పుడు, క్రిస్టినా కోచ్ తాను 'సహవాసాన్ని' మిస్ అవుతానని చెప్పారు.

దేనిని మిస్ అవ్వరు అని అడగ్గా, అలాంటిదేమీ లేదని కోచ్ అన్నారు.

"కొన్ని అసౌకర్యాలను భరించకపోతే, కొన్ని త్యాగాలు చేయకపోతే, కొన్ని రిస్కులు తీసుకోకపోతే మనం మరింత లోతుగా అన్వేషించలేం. ఆ పనులన్నీ విలువైనవే" అని ఆమె అన్నారు.

సిబ్బంది చివరగా, ఒక తుది పరీక్షను ఎదుర్కోనున్నారు. అదేంటంటే.. గంటకు దాదాపు 25,000 మైళ్ల వేగంతో వాతావరణంలోకి దూసుకొచ్చి, పారాచూట్ సహాయంతో పసిఫిక్ మహాసముద్రంలో దిగడం.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)