సార్కోమా అంటే ఏంటి? దీని గురించి మనం ఏం తెలుసుకోవాలి?

ఫొటో సోర్స్, Allan Tannenbaum/Getty Images)
- రచయిత, డాక్టర్ హిమాని, రేడియేషనల్ ఆంకాలజిస్ట్
- హోదా, బీబీసీ కోసం
- ప్రచురణ
- చదివే సమయం: 9 నిమిషాలు
ప్రతి ఏటా జులై నెలను ప్రపంచవ్యాప్తంగా 'సార్కోమా అవగాహన మాసం' గా నిర్వహిస్తారు.
క్యాన్సర్ అంటే చాలామందికి ఊపిరితిత్తులు, రొమ్ము, గర్భాశయ ముఖ ద్వారం, నోటి క్యాన్సర్ వంటివి మాత్రమే గుర్తుకు వస్తాయి.
కానీ శరీరంలోని ఎముకలు, కండరాలు, కొవ్వు, నరాలు, రక్తనాళాలు, కీళ్ల చుట్టూ ఉండే మృదు కణజాలాల నుంచి కూడా క్యాన్సర్ రావచ్చు. అలాంటి క్యాన్సర్లను 'సార్కోమా' అంటారు.
సాధారణ క్యాన్సర్లతో పోలిస్తే సార్కోమా అరుదైనదే అయినా ఇది పిల్లలు, యువకులు, మధ్యవయస్కులు, వృద్ధులలో కూడా కనిపించవచ్చు.
అందుకే దీనిపై అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యం.


ఫొటో సోర్స్, Getty Images
సార్కోమా అంటే ఏంటి?
మన శరీరంలో రెండు ప్రధాన రకాల కణజాలాలు ఉంటాయి.
ఒకటి - శరీర అవయవాలను ఏర్పరచే కణజాలం (ఎపితీలియల్ టిష్యూ). వీటి నుంచి వచ్చే క్యాన్సర్లను కార్సినోమా అంటారు.
రెండోది - శరీరానికి ఆధారం ఇచ్చే కండరాలు, ఎముకలు, కొవ్వు, రక్తనాళాలు, నరాలు వంటి కనెక్టివ్ టిష్యూలు. ఈ రెండో రకం కణజాలాల నుంచి ఏర్పడే క్యాన్సర్‌ను సార్కోమా అంటారు.
పెద్దల్లో వచ్చే అన్ని క్యాన్సర్లలో సార్కోమా సుమారు ఒక శాతం మాత్రమే ఉంటుంది. అయితే పిల్లల్లో వచ్చే క్యాన్సర్లలో సుమారు 10–15% వరకు సార్కోమా లే ఉంటాయి.
సార్కోమా లక్షణాలు మొదట్లో పెద్దగా కనిపించకపోవచ్చు. నొప్పి లేకుండా ఒక గడ్డ పెరగడం వల్ల చాలామంది నిర్లక్ష్యం చేస్తారు. కొందరు అది కొవ్వు గడ్డ (లైపోమా) అనుకొని సంవత్సరాల పాటు వైద్యుడిని సంప్రదించరు. ఫలితంగా క్యాన్సర్ పెద్దదిగా మారి చికిత్స కష్టమవుతుంది.
అందుకే దీని గురించి అవగాహన చాలా అవసరం. ప్రపంచవ్యాప్తంగా జులైలో సార్కోమా గురించి ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.

ఫొటో సోర్స్, Candace Dane Chambers for The Washington Post via Getty Images
సార్కోమా ఎక్కడ వస్తుంది?
శరీరంలో ఏ భాగంలోనైనా సార్కోమా రావచ్చు. ఎక్కువగా చేతులు, కాళ్ల కండరాలు, తొడలు, భుజం, పొత్తి కడుపు, ఛాతీ, వెన్నెముక చుట్టూ, తల, మెడ, ఎముకల నుంచి సార్కోమాలు ఏర్పడతాయి.
కొన్ని సందర్భాల్లో శరీరం లోపల పెరిగే వరకు బయటకు ఎలాంటి లక్షణాలు కనిపించవు.
సార్కోమా రకాలు
సార్కోమాను ప్రధానంగా రెండు విభాగాలుగా విభజిస్తారు.
1. సాఫ్ట్ టిష్యూ సార్కోమా
ఇది కండరాలు, కొవ్వు, రక్తనాళాలు, నరాలు, టెండాన్లు వంటి మృదు కణజాలాల నుంచి వస్తుంది. దీనిలో కూడా 70కి పైగా ఉపరకాలు ఉన్నాయి.
వాటిలో కొన్ని..
- లైపోసార్కోమా
- లియోమయోసార్కోమా
- సైనోవియల్ సార్కోమా
- అన్డిఫరెన్షియేటెడ్ ప్లియోమార్ఫిక్ సార్కోమా
- యాంజియోసార్కోమా
- మాలిగ్నెంట్ పెరిఫెరల్ నర్వ్ షీత్ ట్యూమర్
2. ఎముకల సార్కోమా
ఇవి ఎముకల నుంచి ప్రారంభమవుతాయి. దీనిలో ప్రధాన రకాలు...
- ఆస్టియోసార్కోమా
- ఈవింగ్ సార్కోమా
- కాండ్రోసార్కోమా
గతంలో రేడియేషన్ చికిత్స తీసుకున్నవారిలో, కొన్ని అరుదైన జన్యుపరమైన వ్యాధులు ఉన్న వారిలో, దీర్ఘకాలిక లింఫెడిమా గల వారిలో, కొన్ని రసాయనాల ప్రభావం వలన... సార్కోమా వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది.
అయితే చాలామంది రోగుల్లో స్పష్టమైన కారణం కనిపించదు.
ఈ సార్కోమాలు అన్నీ ఒకే విధంగా ప్రవర్తించవు. కొన్ని చాలా నెమ్మదిగా పెరుగుతాయి. మరికొన్ని వేగంగా పెరిగి శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించవచ్చు. అందుకే ప్రతి సార్కోమాను ప్రత్యేకంగా పరీక్షించి చికిత్స నిర్ణయిస్తారు.
భారత్‌లో సార్కోమా రోగుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ ప్రతి సంవత్సరం వేలాది కొత్త కేసులు నమోదవుతున్నాయి.
ఇది అరుదైన క్యాన్సర్ కావడంతో సార్కోమా చికిత్సలో అనుభవం ఉన్న కేంద్రంలోనే పరీక్షలు, బయాప్సీ, చికిత్స చేయించుకోవడం అత్యంత ముఖ్యం.

ఫొటో సోర్స్, Getty Images
సార్కోమా ఎందుకు వస్తుంది?
చాలా సందర్భాల్లో సార్కోమాకు ఒకే ఒక్క కారణాన్ని చెప్పడం సాధ్యం కాదు.
శరీరంలోని కణాల్లో జన్యుపరమైన (DNA) మార్పులు ఏర్పడటం వల్ల కణాలు అదుపు తప్పి పెరిగి క్యాన్సర్‌గా మారతాయి. ఈ మార్పులు ఎక్కువగా యాదృచ్ఛికంగా జరుగుతాయి.
అయితే కొన్ని ప్రమాద కారకాలు గుర్తించవచ్చు.
1. జన్యుపరమైన వ్యాధులు
Li-Fraumeni syndrome, Neurofibromatosis type-1, Familial adenomatous polyposis, Retinoblastoma జన్యు లోపం, Werner syndrome వంటి చాలా అరుదైన జన్యుపరమైన పరిస్థితులలో సార్కోమా వచ్చే అవకాశం కొంత ఎక్కువగా ఉంటుంది.
2. గతంలో రేడియేషన్ చికిత్స
ఇతర క్యాన్సర్ల కోసం కొన్ని సంవత్సరాల క్రితం రేడియేషన్ చికిత్స పొందిన కొద్దిమందిలో చాలా సంవత్సరాల తరువాత రేడియేషన్ కారణంగా సార్కోమా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇది చాలా అరుదు. ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఆధునిక రేడియేషన్ పద్ధతులతో ఈ ప్రమాదం మరింత తగ్గింది.
3. రసాయనాల ప్రభావం
కొన్ని పరిశ్రమల్లో ఉపయోగించే ప్రత్యేక రసాయనాల ప్రభావానికి దీర్ఘకాలం గురయ్యే వ్యక్తుల్లో కొన్ని రకాల సార్కోమాలు వచ్చే అవకాశం పెరుగుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి.
4. దీర్ఘకాలిక లింఫెడిమా
సంవత్సరాల తరబడి తీవ్రమైన చెయ్యి లేదా కాలు వాపుతో ఉండే కొద్దిమందిలో అరుదుగా యాంజియో సార్కోమా ఏర్పడవచ్చు.

ఫొటో సోర్స్, BSIP/UIG Via Getty Images
సార్కోమా లక్షణాలు
సార్కోమా లక్షణాలు అది శరీరంలో ఎక్కడ ఉందనే దానిపై ఆధారపడి ఉంటాయి.
1. గడ్డ కనిపించడం
అత్యంత సాధారణ లక్షణం – నొప్పి లేకుండా పెరుగుతున్న గడ్డ. ఈ గడ్డ నెమ్మదిగా లేదా వేగంగా పెరగవచ్చు.
2. నొప్పి
మొదట్లో సార్కోమా గడ్డ నొప్పి ఉండకపోవచ్చు. క్రమంగా గడ్డ పరిమాణం పెరిగే కొద్దీ నరాలు లేదా కండరాలపై ఒత్తిడి కలిగి నొప్పి ప్రారంభమవుతుంది.
3. చేతి లేదా కాలు కదలిక తగ్గడం
కీళ్ల దగ్గర ట్యూమర్ ఉంటే కదలిక తగ్గిపోవచ్చు.
4. పొత్తికడుపులో సార్కోమా
కడుపు లోపల పెరిగే సార్కోమాలలో పొత్తి కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం, మలబద్ధకం వంటి లక్షణాలు కనిపించవచ్చు.
5. ఎముకల సార్కోమా
రాత్రివేళ ఎక్కువగా నొప్పి, వాపు, చిన్న దెబ్బకే ఎముకలు విరగడం, నడవలేకపోవడం

ఫొటో సోర్స్, Smith Collection/Gado/Getty Images
ఎప్పుడు వైద్యుడిని సంప్రదించాలి?
- ఐదు సెంటీమీటర్ల కంటే పెద్ద గడ్డ
- ఆ గడ్డ క్రమంగా పెరుగుతుండటం
- లోతుగా ఉండే గడ్డ
- విశ్రాంతితో తగ్గని ఎముక నొప్పి
- రాత్రివేళ తీవ్రమయ్యే నొప్పి
- కారణం లేకుండా ఎముక విరగడం
ఈ లక్షణాలు ఉంటే ఆలస్యం చేయకుండా ముందుగా జనరల్ సర్జన్ లేదా ఆర్థోపెడిక్ సర్జన్‌ను సంప్రదించాలి.
సార్కోమా అనుమానం ఉంటే క్యాన్సర్ నిపుణుల బృందం ఉన్న కేంద్రానికి వారే రిఫర్ చేస్తారు.

ఫొటో సోర్స్, Simon Denyer/The Washington Post via Getty Images
ఎలా నిర్థరిస్తారు?
శారీరక పరీక్ష - మొదట వైద్యుడు గడ్డ పరిమాణం, స్థానం, కదలిక, చుట్టూ ఉన్న కణజాలంతో సంబంధం పరిశీలిస్తారు.
ఇమేజింగ్ పరీక్షలు - అల్ట్రాసౌండ్ చిన్న గడ్డలకు ప్రారంభ పరీక్షగా ఉపయోగపడుతుంది.
ఎంఆర్ఐ - చేతులు, కాళ్లలోని సాఫ్ట్ టిష్యూ సార్కోమాలకు అత్యంత ముఖ్యమైన పరీక్ష. ఎంఆర్ఐ ద్వారా గడ్డ పరిమాణం, నరాలు, రక్తనాళాలు, కండరాల సంబంధం స్పష్టంగా తెలుస్తుంది.
సీటీ స్కాన్ - ఛాతీ, పొత్తి కడుపు, ఊపిరితిత్తుల పరిశీలనకు ఉపయోగిస్తారు.
పీఈటీ-సీటీ - అన్ని రోగులకూ అవసరం ఉండదు. అవసరమైన సందర్భాల్లో మాత్రమే చేస్తారు.
బయాప్సీ – అత్యంత కీలక పరీక్ష. బయాప్సీ లేకుండా సార్కోమా చికిత్స ప్రారంభించకూడదు. బయాప్సీ ద్వారా ఇది నిజంగా క్యాన్సరేనా? ఒకవేళ క్యాన్సర్ అయితే అది ఏ రకం సార్కోమా? ఎంత గ్రేడ్? చికిత్స ఎలా చేయాలి? అనే విషయాలు తెలుస్తాయి.
ప్రస్తుతం ఎక్కువగా కోర్ నీడిల్ బయాప్సీ చేసున్నారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఓపెన్ బయాప్సీ అవసరం అవుతుంది.
చిన్న ఆసుపత్రిలో గడ్డను పూర్తిగా తీసేయడం కొన్నిసార్లు తర్వాత దశలో చికిత్సను క్లిష్టం చేస్తుంది. ముందుగా సరైన పరీక్షలు చేసి, అవసరమైతే బయాప్సీ చేసి, తరువాతే శస్త్రచికిత్స చేయడం ఉత్తమ పద్ధతి.
స్కాన్, బయాప్సీ ఆధారంగా ట్యూమర్ పరిమాణం, గ్రేడ్, సమీప కణజాలాలకు వ్యాపించిందా?ఊపిరితిత్తులు లేదా ఇతర అవయవాలకు వ్యాపించిందా? అనేది పరిశీలించి, స్టేజ్ నిర్ణయిస్తారు. ఈ స్టేజింగ్ ఆధారంగానే చికిత్స నిర్ణయిస్తారు.

ఫొటో సోర్స్, Simon Denyer/The Washington Post via Getty Images
ముందుగా గుర్తిస్తే మంచిది
చిన్న పరిమాణంలో ఉన్న సార్కోమాను ప్రారంభ దశలో గుర్తిస్తే అవయవాన్ని పూర్తిగా తొలగించకుండా కాపాడే విధంగా శస్త్రచికిత్స చేసే అవకాశం ఎక్కువ.
ప్రారంభ దశలోనే గుర్తించడం వలన రేడియేషన్ చికిత్స సులభంగా ఉంటుంది. తిరిగి వచ్చే ప్రమాదం తగ్గుతుంది. జీవించే అవకాశాలు మెరుగుపడతాయి.
అందుకే శరీరంలో కొత్తగా ఏర్పడిన గడ్డను నిర్లక్ష్యం చేయకూడదు. నొప్పి లేకపోయినా అది వైద్య పరీక్ష చేయించుకోవాల్సిన సంకేతంగా భావించాలి.
గతంలో సార్కోమా అంటే చాలామందికి 'చెయ్యి లేదా కాలు తొలగించాల్సిందే' అనే భయం ఉండేది.
కానీ గత మూడు దశాబ్దాల్లో వైద్యరంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులతో నేడు ఎక్కువ మంది రోగుల్లో అవయవాన్ని కాపాడుతూ విజయవంతంగా చికిత్స చేయగలుగుతున్నారు.
శస్త్రచికిత్స, రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ, లక్షిత చికిత్సలు, కొన్నిసార్లు ఇమ్యూనోథెరపీ - ఈ అన్ని చికిత్సలనూ సమన్వయంతో అందించడం ద్వారా ఫలితాలు గణనీయంగా మెరుగుపడ్డాయి.
ప్రతి సార్కోమా ఒకేలా ఉండదు. కాబట్టి ప్రతి రోగికి చికిత్స వ్యక్తిగతంగా నిర్ణయిస్తారు.
ఇందులో
- ట్యూమర్ రకం
- ట్యూమర్ పరిమాణం
- గ్రేడ్ (తీవ్రత)
- శరీరంలో ఉన్న స్థానం
- ఇతర అవయవాలకు వ్యాపించిందా?
- రోగి వయసు
- ఆరోగ్య పరిస్థితి
ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని మల్టీడిసిప్లీనరీ ట్యూమర్ బోర్డు ద్వారా చికిత్స విధానాన్ని నిర్ణయిస్తారు. ఇందులో శస్త్ర చికిత్స నిపుణుడు, మెడికల్ ఆంకాలజిస్ట్, రేడియేషన్ ఆంకాలజిస్ట్, రేడియాలజిస్ట్, పాథాలజిస్ట్, రిహాబిలిటేషన్ నిపుణులు కలిసి చర్చించి ఉత్తమ చికిత్సను సూచిస్తారు.
చాలా సాఫ్ట్ టిష్యూ సార్కోమాల్లో శస్త్ర చికిత్సే ప్రధాన చికిత్స.
దీని లక్ష్యం: ట్యూమర్‌ను పూర్తిగా తొలగించడం, చుట్టూ కొంత ఆరోగ్యకరమైన కణజాలంతో సహా తీసివేయడం, తిరిగి వచ్చే ప్రమాదాన్ని తగ్గించడం, లింబ్ సాల్వేజ్ సర్జరీ, చెయ్యి లేదా కాలు తొలగించకుండా ట్యూమర్‌ను మాత్రమే తొలగించి అవయవాన్ని కాపాడే శస్త్ర చికిత్స చాలా సందర్భాల్లో సాధ్యమవుతోంది.
దీనివల్ల నడక, చేతి పనితీరు మెరుగ్గా ఉంటుంది. జీవన నాణ్యత పెరుగుతుంది. మానసిక ఆందోళన తగ్గుతుంది.
సార్కోమా చికిత్సలో రేడియేషన్‌కు అత్యంత ముఖ్యమైన స్థానం ఉంది.
శస్త్రచికిత్సకు ముందు ట్యూమర్‌ను చిన్నదిగా చేయడానికి, శస్త్రచికిత్స తరువాత మిగిలి ఉండే సూక్ష్మ క్యాన్సర్ కణాలను నాశనం చేయడానికి, తిరిగి వచ్చే ప్రమాదాన్ని తగ్గించడానికి, శస్త్రచికిత్స సాధ్యం కానప్పుడు వ్యాధిని నియంత్రించడానికి, నొప్పి వంటి లక్షణాలను తగ్గించడానికి రేడియేషన్ చికిత్స ఇస్తారు.
అన్ని సార్కోమాలకు కీమోథెరపీ అవసరం ఉండదు. అయితే ఈవింగ్ సార్కోమా, ఆస్టియోసార్కోమా, అధిక గ్రేడ్ సాఫ్ట్ టిష్యూ సార్కోమాలు, మెటాస్టాటిక్ (వేరే అవయవాలకు పాకడం) వ్యాధి వంటి పరిస్థితుల్లో కీమోథెరపీ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
పునరావాసం (రీహాబిలిటేషన్) కూడా చికిత్సలో భాగమే. చికిత్స పూర్తయిన తరువాత ఫిజియోథెరపీ, చెయ్యి లేదా కాలు కదలికలను మెరుగుపరచే వ్యాయామాలు, పోషకాహారం, అవసరమైతే కృత్రిమ అవయవాల సహాయంతో రోగి త్వరగా సాధారణ జీవితానికి చేరుకునే అవకాశం ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఫాలోఅప్ ఎందుకు అవసరం?
చికిత్స పూర్తయిన తరువాత కూడా క్రమం తప్పకుండా వైద్యుడిని కలవాలి.
వ్యాధి మళ్లీ వచ్చిందా? ఊపిరితిత్తులకు వ్యాపించిందా? చికిత్స దుష్ప్రభావాలు ఉన్నాయా? ఫాలోఅప్ ద్వారా ఈ విషయాలను పరిశీలిస్తారు.
ఆశను కోల్పోవద్దు
సార్కోమా అరుదైన క్యాన్సర్ అయినప్పటికీ, సరైన సమయంలో గుర్తించి, అనుభవజ్ఞులైన వైద్య బృందం వద్ద చికిత్స తీసుకుంటే మంచి ఫలితాలు సాధ్యమే.
ముందస్తు గుర్తింపు, సరైన కేంద్రంలో చికిత్స, క్రమం తప్పని ఫాలోఅప్ – ఇవే సార్కోమా రోగులకు మూడు కీలక అంశాలు.
(గమనిక: రచయిత ఓ డాక్టర్. వైద్యపరమైన విధానాలు, చికిత్సలపై అవగాహన కల్పించడమే ఈ ఆర్టికల్ ఉద్దేశం. ఆరోగ్యపరమైన ఏ నిర్ణయమైనా డాక్టర్‌ను సంప్రదించి మాత్రమే తీసుకోగలరు)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)


























