You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
చర్చల మధ్యవర్తి పాకిస్తాన్ చివరకు ఇరాన్, అమెరికా యుద్ధంలో చిక్కుకోవాల్సి వస్తుందా?
- రచయిత, అసద్ సుహైబ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- చదివే సమయం: 6 నిమిషాలు
'ఇస్లామాబాద్ చర్చలు' ఎలాంటి ఫలితం తేల్చకపోయినప్పటికీ, అమెరికా-ఇరాన్‌లకు మధ్యవర్తిగా తమ పాత్రను కొనసాగిస్తామంటూ పాకిస్తాన్ తన ఉద్దేశాన్ని చెప్పింది.
పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్.. రెండు పక్షాలు కాల్పుల విరమణకు కట్టుబడి ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్‌తో కలిసి, రెండు దేశాల మధ్య పలు రౌండ్ల చర్చలలో తాను సహాయం అందించినట్లు ఇషాక్ దార్ పేర్కొన్నారు.
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇరాన్ ప్రతినిధి బృందం కూడా చర్చల కోసం చేసిన మధ్యవర్తిత్వ ప్రయత్నాలను ప్రశంసించాయి.
అయితే, తుది ఒప్పందం కుదరకపోవడంతో ఇస్లామాబాద్‌లో నిరాశ వ్యక్తమవుతోంది.
'ఇస్లామాబాద్ చర్చల' ద్వారా పాకిస్తాన్‌కు ఏం లభించింది, రెండు పక్షాల మధ్య శాంతి ఒప్పందాన్ని కుదిర్చే సామర్థ్యం పాకిస్తాన్‌కు ఇంకా ఉందా? ఒకవేళ యుద్ధం మళ్లీ మొదలైతే పాకిస్తాన్ ముందున్న మార్గం ఏమిటి? అనే విషయాలను తెలుసుకోవడానికి బీబీసీ కొందరు నిపుణులతో మాట్లాడింది.
మిడిల్ ఈస్ట్ వ్యవహారాల నిపుణుడు, పంజాబ్ యూనివర్సిటీ (లాహోర్) రాజకీయ శాస్త్ర విభాగం మాజీ అధిపతి డాక్టర్ ఫారూక్ హస్నత్ మాట్లాడుతూ.. ఈ చర్చలను నిష్ఫలమైనవిగా చెప్పలేమని, ఎందుకంటే ఇలాంటి చర్చలకు చాలా సమయం పడుతుందని అన్నారు.
ఈ చర్చలు విఫలమయ్యాయని రెండు పక్షాలు చెప్పలేదని, కాకపోతే వారు తమ కొన్ని షరతులపై ఒప్పందానికి రాలేకపోతున్నారని ఆయన పేర్కొన్నారు.
‘అమెరికా, ఇరాన్ ఒక కిటికీని తెరిచే ఉంచాయి’
చర్చల అనంతరం ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఖాయ్ మాట్లాడుతూ, ఇస్లామాబాద్‌లో అమెరికాతో జరిగిన చర్చలలో పలు అంశాలపై ఏకాభిప్రాయం కుదిరిందని, అయితే రెండు మూడు కీలక అంశాలపై భేదాభిప్రాయాల వల్ల ఇప్పటివరకు సమగ్ర ఒప్పందం సాధ్యం కాలేదని చెప్పడం గమనార్హం.
చర్చలు 'అవిశ్వాస వాతావరణం'లో ప్రారంభమయ్యాయని, ఒకే సమావేశంలో ఒప్పందం కుదురుతుందని ఆశించడం కష్టమని అన్నారు.
ఈ విషయమై డాక్టర్ ఫారూక్ హస్నత్ బీబీసీతో మాట్లాడుతూ, ఈ మొత్తం వివాదంలో పాకిస్తాన్ తనను తాను ఒక తటస్థ పక్షంగా నిరూపించుకుందని చెప్పారు. ''అందుకే రెండు పక్షాలు ఇస్లామాబాద్ రావడానికి సిద్ధపడ్డాయి, ఒప్పందం కుదరకపోయినప్పటికీ, కొన్ని విషయాల్లో చర్చలు ముందుకు సాగాయని అంగీకరిస్తున్నాయి'' అని ఆయన పేర్కొన్నారు.
1979 తర్వాత ఎన్నడూ ప్రత్యక్షంగా మాట్లాడుకోని రెండు పక్షాలను ముఖాముఖిగా కూర్చోబెట్టడమే పాకిస్తాన్ సాధించిన అతిపెద్ద విజయమని డాక్టర్ ఫారూక్ హస్నత్ అన్నారు.
సీనియర్ రాజకీయవేత్త, మాజీ సెనేటర్ ముషాయిద్ హుస్సేన్ సయ్యద్ బీబీసీతో మాట్లాడుతూ, ఈ చర్చల ప్రక్రియను కొనసాగించడానికి అమెరికా, ఇరాన్ ఒక కిటికీని తెరిచే ఉంచాయని చెప్పారు.
చర్చలు 21 గంటల పాటు కొనసాగాయంటే ఇరు పక్షాలు చాలా వివరంగా చర్చించాయని, ఇందులో రెండు దేశాల సాంకేతిక నిపుణులు కూడా పాల్గొన్నారని అర్థమని ముషాయిద్ హుస్సేన్ సయ్యద్ విశ్లేషించారు.
ఈ చర్చల్లో రెండో ముఖ్యమైన అంశం ఉన్నత స్థాయి నాయకుల భాగస్వామ్యమని, ఇందులో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాకర్ గాలిబాఫ్ పాల్గొన్నారని ఆయన ప్రస్తావించారు.
సీనియర్ జర్నలిస్ట్, విశ్లేషకుడు జాహిద్ హుస్సేన్ బీబీసీతో మాట్లాడుతూ, ఇస్లామాబాద్ చర్చల్లో ఎలాంటి సంచలనం జరగలేదని, అయితే ఈ చర్చలు ముగియకపోవడం ఒక మంచి సంకేతమని అన్నారు.
21 గంటల పాటు జరిగిన సంక్లిష్టమైన చర్చల్లో పాకిస్తాన్ భాగమైంది కాబట్టి, ఈ చర్చల తర్వాత దాని ప్రాముఖ్యం పెరిగిందని, తదుపరి ఏ రౌండ్ చర్చలు జరిగినా రెండు పక్షాలు పాకిస్తాన్‌నే సంప్రదిస్తాయని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుత తరుణంలో ఈ విషయంలో పాకిస్తాన్ స్థానాన్ని భర్తీ చేయగల దేశం మరేదీ లేదన్నారు.
''ఎలాంటి ఒప్పందం కుదరకపోయినప్పటికీ, ఇరుపక్షాల ప్రకటనలు సమతుల్యంగా, ఆచితూచి చేసినట్లుగా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త వహిస్తూనే ఆశలు పెట్టుకోవచ్చు'' అని డాక్టర్ ఫారూక్ హస్నత్ అభిప్రాయపడ్డారు.
సీనియర్ జర్నలిస్ట్, విశ్లేషకుడు తలత్ హుస్సేన్ మాట్లాడుతూ, ప్రపంచానికి ఎంతో అవసరమైన సమయంలో పాకిస్తాన్ ఈ చొరవ తీసుకుందని అన్నారు. గందరగోళ పరిస్థితుల మధ్య ఒక యుద్ధాన్ని ఆపడం ద్వారా పాకిస్తాన్ మధ్యవర్తిగా తన పాత్రను అంతర్జాతీయ స్థాయిలో చాటుకుందని, శాశ్వత శాంతి కేవలం చర్చల ద్వారానే సాధ్యమని నిరూపించిందని ఆయన తన 'ఎక్స్' పోస్ట్‌లో పేర్కొన్నారు.
అట్లాంటిక్ కౌన్సిల్‌లో దక్షిణాసియా సీనియర్ ఫెలో మైఖేల్ కుగల్‌మన్ మాట్లాడుతూ, అమెరికా తన అంతర్గత రాజకీయ పరిస్థితుల కారణంగా ఈ యుద్ధం నుంచి బయటపడటానికి ఒక ఒప్పందాన్ని కోరుకుందని చెప్పారు.
ఉపాధ్యక్షుడి నాయకత్వంలో ఉన్నత స్థాయి ప్రతినిధి బృందాన్ని పంపడం ద్వారా అమెరికా తన దృఢ నిశ్చయాన్ని చాటిచెప్పిందని ఆయన తన 'ఎక్స్' పోస్టులో రాశారు.
యుద్ధం మళ్లీ మొదలైతే పాకిస్తాన్ పరిస్థితి ఏమిటి?
పాకిస్తాన్ నుంచి ఒక సైనిక బృందం తూర్పు ప్రాంతంలోని షా అబ్దుల్ అజీజ్ ఎయిర్‌బేస్‌కు చేరుకున్నట్లు సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ శనివారం ధ్రువీకరించింది.
సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ శనివారం 'ఎక్స్'లో విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ''రెండు సోదర దేశాల మధ్య జరిగిన ఉమ్మడి వ్యూహాత్మక రక్షణ ఒప్పందంలో భాగంగా ఈ మోహరింపు జరిగింది.''
ఆ సైనిక బృందంలో పాక్ వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానాలు, సహాయక విమానాలు ఉన్నాయని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
యుద్ధం మళ్లీ మొదలైతే పాకిస్తాన్ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని డాక్టర్ ఫారూక్ హస్నత్ అంటున్నారు. ''అమెరికా మళ్లీ ఇరాన్‌పై దాడులు ప్రారంభిస్తే, ఇరాన్ కూడా ఈ ప్రాంతంలోని అమెరికా మిత్రదేశాలపై దాడులు చేస్తుంది'' అని ఆయన అంచనా వేస్తున్నారు.
ఇప్పటివరకు ఇరాన్.. సౌదీ అరేబియాపై చాలా తక్కువ దాడులు చేసిందని, ఒకవేళ యుద్ధం మళ్లీ మొదలై ఇరాన్ సౌదీ అరేబియాపై కూడా దాడులు చేస్తే పాకిస్తాన్‌పై ఒత్తిడి పెరుగుతుందని ఆయన చెప్పారు.
''సౌదీ అరేబియా, ఇరాన్ మధ్య ప్రత్యక్ష యుద్ధం మొదలైతే, యెమెన్‌కు చెందిన హూతీలు సౌదీ అరేబియాపై దాడులు చేసే అవకాశం ఉంది" అని అన్నారు.
అలాంటి పరిస్థితి తలెత్తితే పాకిస్తాన్ సైన్యం యెమెన్‌కు చెందిన హూతీ తిరుగుబాటుదారుల చర్యలను అడ్డుకుంటుందని, అందువల్ల పాకిస్తాన్‌కు ఇరాన్‌తో నేరుగా యుద్ధం ఉండదని డాక్టర్ ఫారూక్ హస్నత్ అభిప్రాయపడ్డారు.
'ఇరాన్‌తో ఎలాంటి ఘర్షణనూ పాకిస్తాన్ భరించలేదు'
సౌదీ అరేబియా 2015లో యెమెన్‌పై దాడికి ముందు తన సైన్యాన్ని పంపాలని పాకిస్తాన్‌ను అభ్యర్థించిందని, అయితే పార్లమెంటులో తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాత దానిని తిరస్కరించారని గుర్తుంచుకోవాలి. ఆ సమయంలో పాకిస్తాన్, సౌదీ అరేబియా సంబంధాలలో చేదు అనుభవాలు కూడా ఎదురయ్యాయి.
నిరుడు సౌదీ అరేబియాతో కుదుర్చుకున్న రక్షణ ఒప్పందానికి కూడా పార్లమెంటు ఆమోదం తీసుకోలేదని ఫారూక్ హస్నత్ అన్నారు.
పాకిస్తాన్, ఇరాన్ పొరుగు దేశాలు కాబట్టి, ఇరాన్‌తో ఎలాంటి ఘర్షణ పడే ప్రమాదాన్ని పాకిస్తాన్ భరించలేదని ఆయన పేర్కొన్నారు.
2018లో పాకిస్తాన్ సైన్యం అదనపు దళాలను సలహాలు, శిక్షణ ఇచ్చే మిషన్ కోసం సౌదీ అరేబియాలో మోహరించాలని నిర్ణయించినట్లు ప్రకటించింది. అప్పుడు పాకిస్తాన్ పార్లమెంట్ ఎగువ సభ 'సెనేట్' దీనిపై ప్రభుత్వం నుంచి సమాధానం కోరింది.
ఆ సమయంలో పాకిస్తాన్ సైన్యం తన ప్రకటనలో, 1982లో జరిగిన ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం ఇప్పటికే 1180 మంది పాకిస్తాన్ సైనికులు సౌదీ అరేబియాలో ఉన్నారని తెలిపింది.
పాకిస్తాన్, సౌదీ అరేబియా మధ్య రక్షణ ఒప్పందం తొమ్మిది నెలల క్రితమే జరిగిందని, దీని గురించి అందరికీ తెలుసని జాహిద్ హుస్సేన్ అన్నారు.
''ఇస్లామాబాద్ చర్చలు నిష్ఫలమైనప్పటికీ ఇరుపక్షాలు యుద్ధ విరామాన్ని ముగిస్తున్నట్లు ప్రకటించలేదు, ఎందుకంటే ఇరు పక్షాలు ఇక యుద్ధాన్ని కోరుకోవడం లేదు. అందువల్ల ప్రస్తుతానికి యుద్ధం మళ్లీ మొదలవుతుందని లేదా ఇరాన్ సౌదీ అరేబియాను లక్ష్యంగా చేసుకుంటుందని అనిపించట్లేదు'' అని ఆయన చెప్పారు.
ఇరాన్, పాకిస్తాన్ సంబంధాలు చేరుకున్న స్థాయిని బట్టి చూస్తే పాకిస్తాన్‌ను ఈ వివాదంలోకి లాగేలా ఇరాన్ కూడా ఎటువంటి చర్య తీసుకోదని జాహిద్ హుస్సేన్ అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)