ఇస్లామాబాద్‌లో ముగిసిన శాంతి చర్చలు: అమెరికా, ఇరాన్ ఏమన్నాయంటే..

చదివే సమయం: 4 నిమిషాలు

అమెరికా, ఇరాన్ ప్రతినిధి బృందాల మధ్య పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో జరిగిన శాంతి చర్చలు ముగిశాయి.

చర్చల అనంతరం, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మీడియాతో మాట్లాడుతూ, అమెరికా, ఇరాన్ మధ్య ఎలాంటి ఒప్పందం కుదర్లేదని చెప్పారు.

అమెరికా మితిమీరిన డిమాండ్లను నియంత్రించుకుని, ఇరాన్ చట్టబద్ధమైన హక్కులను అంగీకరించాల్సి ఉంటుందని ఇరాన్ పేర్కొంది.

జేడీ వాన్స్ ఏమన్నారంటే..

'మేం గత 21 గంటలుగా చర్చలు జరుపుతున్నాం. కానీ, బ్యాడ్ న్యూస్ ఏంటంటే, మా మధ్య ఎలాంటి ఒప్పందం కుదర్లేదు' అని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మీడియాకు వెల్లడించారు.

అమెరికా తన "రెడ్‌ లైన్స్" (దాటకూడని హద్దులు) స్పష్టం చేసిందని, అయితే ఇరాన్ "మా షరతులకు అంగీకరించలేదు" అని ఆయన పేర్కొన్నారు.

అదే సమయంలో, ఈ చర్చలకు మధ్యవర్తిత్వం వహించిన పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ ఆసిఫ్ మునీర్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

'చర్చలు సఫలం కాకపోవడానికి పాకిస్తానీలు ఏమాత్రం కారణం కాదు. వారు తమ వంతుగా చాలా గొప్పగా ప్రయత్నించారు' అని అన్నారు.

‘ఇరాన్ నుంచి ఆ హామీ కావాలి’

'అమెరికా పట్టువిడుపులతో, మంచి ఉద్దేశంతోనే చర్చలకు వచ్చింది. కానీ, దురదృష్టవశాత్తూ ఇరుపక్షాలు ఎలాంటి ఒప్పందానికి రాలేకపోయాయి. పాకిస్తాన్ నుంచి మా బృందం తిరుగు పయనం అవుతుంది. ఇదే మా చివరి, అత్యుత్తమ ఆఫర్ అని వారు అర్థం చేసుకోవాలి. దీనికి ఇరాన్ అంగీకరిస్తుందో లేదో చూడాలి' అని వాన్స్ అన్నారు.

ఇరాన్ అణు సామర్థ్యంపై మీడియా ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు.

'ఇరాన్ అణ్వాయుధాల జోలికి వెళ్లదని, వాటి తయారీకి అవసరమైన పరికరాలను సేకరించబోదని వారి నుంచి మాకు ఒక కచ్చితమైన హామీ కావాలి. ఇదే ట్రంప్ ప్రధాన లక్ష్యం. ఇరాన్ అణు కార్యక్రమం ఇప్పటికే ధ్వంసం అయింది. భవిష్యత్‌లో అణ్వాయుధాలను తయారు చేయమని వారు హామీ ఇవ్వాలి. ఇరాన్ నుంచి అలాంటి హామీ ఇంకా రాలేదు. భవిష్యత్‌లో వస్తుందని ఆశిస్తున్నాం.

అణు సమస్యలతో పాటు మరెన్నో అంశాలపై మేం మాట్లాడాం. కానీ, మా షరతులకు ఇరాన్ అంగీకరించే పరిస్థితి మాత్రం కనిపించలేదు. మేం ఈ చర్చలకు చాలా పట్టువిడుపులతో వచ్చాం. వారి పరిస్థితిని అర్థం చేసుకుని సర్దుబాటు చేసుకునేందుకు కూడా సిద్ధపడ్డాం' అని వాన్స్ వ్యాఖ్యానించారు.

ఇరాన్ ప్రకటనలో ఏముంది?

అమెరికాతో జరిగిన శాంతి చర్చలపై ఇరాన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బకేయి తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.

'సమగ్ర చర్చలు జరిగాయి. అయితే, ఈ చర్చలు విజయవంతం కావడం అనేది ఎదుటి పక్షం (అమెరికా) ఎంత సీరియస్‌గా ఉంది, ఏ ఉద్దేశంతో ఉందనే దానిపైనే ఆధారపడి ఉంటుంది' అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు.

అమెరికా తన మితిమీరిన డిమాండ్లను, చట్టవిరుద్ధమైన కోరికలను మానుకోవాలని పేర్కొన్న ఆయన.. ఇరాన్ చట్టబద్ధమైన హక్కులను, దేశ ప్రయోజనాలను అమెరికా అంగీకరించాలని కోరారు.

హార్ముజ్ జలసంధి, ఇరాన్ అణు కార్యక్రమం, ఇరాన్‌లో యుద్ధానికి పూర్తిగా ముగింపు పలకడం వంటి అంశాలపై చర్చించినట్లు ఆయన పేర్కొన్నారు.

జేడీ వాన్స్ మీడియాతో మాట్లాడటానికి ముందే ఇరాన్ నుంచి ఈ ప్రకటన వచ్చింది.

సుదీర్ఘంగా సాగిన చర్చలు

ఈ ప్రకటనలకు ముందు, ఇస్లామాబాద్‌లో సమయం 04:50 గంటలు - భారత కాలమానం ప్రకారం 5.20 గంటల సమయంలో చర్చల ప్రస్తుత పరిస్థితి గురించి అడిగినప్పుడు, చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని వైట్‌హౌస్‌కు చెందిన సీనియర్ అధికారి ఒకరు తనతో చెప్పినట్లు బీబీసీ యూఎస్ రిపోర్టర్ క్రిస్టర్ హేజ్ తెలిపారు.

"15 గంటలుగా చర్చలు నిరంతరాయంగా సాగుతూనే ఉన్నాయి" అని వైట్‌హౌస్ అధికారి చెప్పినట్లు ఆమె పేర్కొన్నారు.

ఈ చర్చలకు సంబంధించి ఇస్లామాబాద్ నుంచి ఉదయం 3 గంటల సమయంలో దక్షిణాసియా కరెస్పాండెంట్ ఆజాదే మోషిరి కథనం ప్రకారం, ఇరుపక్షాల మధ్య చర్చలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే, శనివారం నాటికి అసలు ఇరాన్, అమెరికా ప్రతినిధి బృందాలు ఈచర్చలకు హాజరవుతాయా లేదా అనే విషయంలో సందేహం ఉండేది.

చర్చలు ఇంత సుదీర్ఘంగా సాగుతున్నాయంటే, గణనీయమైన పురోగతి ఉందని, పరిష్కరించుకోవాల్సిన కీలక అంశాలు ఉన్నాయని అర్థమవుతోంది.

ఇరుపక్షాల మధ్య చర్చలు జరుగుతున్న వేళ, సమాచారం బయటకు రాకుండా గట్టి నియంత్రణ ఉంది. అయినప్పటికీ, వేర్వేరు మూలాల ద్వారా కొన్ని అప్‌డేట్స్ లీకయ్యాయి.

ఈ చర్చలు ముగించుకొని, ఇరుదేశాల ప్రతినిధులు తమ దేశాలకు వెళ్లేటప్పుడు ఏదైనా ఒప్పందంతో వెళ్తారా లేదా అన్నది ప్రస్తుతం ఇంకా ప్రశ్నగానే ఉంది.

ఈ యుద్ధంలో 'మేమే గెలిచాం' అని చెప్పుకోవడానికి అమెరికా, ఇరాన్ దేశాలు పోటీపడుతున్నాయి. దీనివల్ల వారు చేసే రాజకీయ ప్రకటనల్లో ఏది నిజమో, ఏది అబద్ధమో తెలుసుకోవడం చాలా కష్టంగా మారింది.

(ఈ కథనం అప్డేట్ అవుతోంది)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)