You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
చిరైయా వెబ్‌సిరీస్: 'మ్యారిటల్ రేప్'పై మౌనాన్ని ఛేదిస్తుందా?
- రచయిత, గీతా పాండే
- హోదా, విమెన్, సోషల్ అఫైర్స్ ఎడిటర్
- చదివే సమయం: 6 నిమిషాలు
భారత్‌లో వైవాహిక అత్యాచారం(మ్యారిటల్ రేప్) అనే అంశాన్ని స్పృశిస్తూ వచ్చిన ఓ కొత్త వెబ్ సిరీస్ అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ అంశాన్ని నేరంగా పరిగణించడానికి నిరాకరిస్తున్న భారత్‌లో ఈ సిరీస్ ఒక పెద్ద చర్చకు దారితీసింది.
చిరైయా అనే వెబ్ సిరీస్ మార్చిలో జియోహాట్‌స్టార్‌లో విడుదలైంది. చిరైయా అంటే హిందీలో చిన్న పక్షులు(రెక్కలు విప్పుకునే దశలో ఉన్న పక్షులు) అని అర్థం.
ఇప్పటివరకు లక్షల మంది ఈ సిరీస్‌ను చూశారు. హాట్‌స్టార్‌లో గత కొద్దినెలల్లో అత్యంత ప్రజాదరణ పొందిన హిందీ షోలలో ఒకటిగా నిలిచింది.
సమాజంలో ఎక్కువగా నిషేధం (టాబూ)గా చూసే వైవాహిక అత్యాచారం అనే అంశాన్ని ధైర్యంగా ప్రస్తావించినందుకు మీడియా విమర్శకులు ఈ సిరీస్‌ను ప్రశంసిస్తున్నారు.
సమ్మతి(కన్సెంట్), స్త్రీల పట్ల చిన్నచూపు అనే అంశాలపై సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. అదేసమయంలో ఈ సిరీస్ 'పురుషులను వ్యతిరేకిస్తూ' తీశారని, పెళ్లి పవిత్రతను కించపరిచే ప్రయత్నమని కొంతమంది అభివర్ణించారు.
కమలేష్, పూజ అనే ఇద్దరు మహిళల చుట్టూ కథ అంతా తిరుగుతుందని ఈ షో స్క్రిప్ట్ రైటర్ దివి నిధి శర్మ చెప్పారు.
కమలేష్ పాత్రను నటి దివ్య దత్తా పోషించారు. కమలేష్ ఒక మధ్య వయస్కురాలైన గృహిణి. 'స్త్రీలు కేవలం వంటావార్పు, ఇంటిపనిపైనే ఆసక్తి చూపాలి' అని కమలేష్ గట్టిగా నమ్ముతుంది.
పూజ ఒక చదువుకున్న, సామాజిక స్పృహ ఉన్న అమ్మాయి. లింగ సమానత్వం, ఆత్మ గౌరవం గురించి గొంతెత్తే అమ్మాయి. ఈ పాత్రను నటి ప్రసన్న బిష్ట్ పోషించారు.
కమలేష్ మరిది(భర్త తమ్ముడు) అరుణ్. చిన్నతనం నుంచి అరుణ్‌ను కమలేష్ తన సొంత కొడుకులా పెంచుతుంది. అరుణ్‌కు భార్యగా పూజ అత్తారింట్లో అడుగుపెడుతుంది. పూజకు అరుణ్ సరైన జోడీగా అందరూ భావిస్తారు. కానీ, పెళ్లి జరిగిన మొదటి రాత్రే పూజను అరుణ్ అత్యాచారం చేయడంతో పెళ్లి గురించి ఆమె కన్న కలలన్నీ చెదిరిపోతాయి.
తనకు ఇష్టం లేకుండా జరిగిన ఈ ఘటన గురించి పూజ నిలదీసినప్పుడు, 'నాకు సొంతమైన దాన్ని నేను తీసుకున్నాను' అని అరుణ్ సమాధానమిస్తాడు.
'దాన్ని రేప్ అని నువ్వెందుకు పదేపదే అంటున్నావ్? భారత్‌లో వైవాహిక అత్యాచారం అసలు నేరమే కాదు. దేశంలో అలాంటి చట్టాలేమీ లేవు' అని అరుణ్ వాదిస్తాడు.
‘సర్దుకుపోవాలని’ సలహాలు
ఈ షో ముఖ్యంగా సమ్మతి గురించి, మరీముఖ్యంగా అత్యంత పవిత్రమైన బంధంగా భావించే వివాహ బంధంలో సమ్మతి గురించి వివరిస్తుందని దివ్య దత్తా అన్నారు.
'వైవాహిక అత్యాచారం గురించి మాట్లాడటం చాలా కష్టం. దీనిని అనుభవించే మహిళలంతా కేవలం తమకే ఇలా జరుగుతుందని అనుకుంటారు. దీని గురించి బయటకు చెప్తే సమాజంలో అవమానపడాల్సి వస్తుందని, ఇంట్లో ప్రశాంతత చెడిపోతుందని వారంతా భయపడతారు' అని బీబీసీతో ఆమె చెప్పారు.
ఈ సిరీస్‌లోని ఒక ఎపిసోడ్‌లో, తీవ్ర మనోవేదనకు గురైన పూజ తన భర్త అరుణ్ ప్రవర్తన గురించి బయటకు చెప్పినప్పుడు, తన తల్లితో సహా అందరూ ఆమెకు 'సర్దుకుపోవాలని' సలహా ఇస్తారు. ఇలాంటివి బయటకు చెబితే పరువు పోతుందని వారు భావిస్తారు.
పెళ్లి తర్వాత సెక్స్‌కు భార్య అనుమతి ప్రత్యేకంగా అడగక్కర్లేదని, అది పెళ్లితోనే భర్తకు వచ్చే హక్కు అని కమలేష్ మొదట్లో నమ్ముతుందని దివ్య దత్తా చెప్పారు.
కానీ, సిరీస్ ముందుకు సాగేకొద్ది ఆమె ఆలోచనా విధానంలో మార్పు మొదలవుతుంది.
'ఇన్నాళ్లూ తనకు అలవాటైన జీవితాన్ని ఎంచుకోవాలా? లేక తనకు అంతగా ఇష్టం లేని ఒక మహిళ (పూజ)కు అండగా నిలవాలా? అనే సందిగ్ధంలో పడుతుంది కమలేష్. తర్వాత సరైన మార్గంలోనే నడవాలని నిర్ణయించుకుంటుంది. అలా పూజకు అండగా నిలుస్తుంది' అని దివ్య దత్తా తన క్యారెక్టర్ గురించి వివరించారు.
భారత ప్రభుత్వ గణాంకాల ప్రకారం, పెళ్లైన మహిళల్లో 6.1 శాతం లైంగిక హింసను ఎదుర్కొంటున్నారు.
ఏళ్ల తరబడి కార్యకర్తలు పోరాటం చేస్తున్నప్పటికీ భారత్‌లో వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించట్లేదు. భారత్‌తో పాటు పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, సౌదీ అరేబియా వంటి 36 దేశాలు ఈ చర్యను చట్టబద్ధంగా నేరంగా గుర్తించట్లేదు.
భార్యతో బలవంతపు శృంగారం నేరం కాదా?
వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాలంటూ సుప్రీంకోర్టులో సామాజిక కార్యకర్తలు పలు పిటిషన్లు వేశారు.
అయితే, ప్రభుత్వంతో పాటు మత సంఘాలు, పురుషుల హక్కుల కార్యకర్తలు బ్రిటిష్ కాలం నాటి ఈ చట్టాన్ని సవరించే ప్రతిపాదనలను వ్యతిరేకిస్తున్నారు. ఈ చట్టం ప్రకారం, భార్య మైనర్ కానంతవరకు ఆమెతో భర్త బలవంతంగా శృంగారంలో పాల్గొన్నా, అది నేరం కాదు.
భార్యను అత్యాచారం చేసిన కేసులో దోషిగా తేలిన ఒక వ్యక్తిని అప్పీల్‌పై విడుదల చేయడం నిరుడు పెద్ద దుమారం రేపింది. భారత్‌లో వైవాహిక అత్యాచారాన్ని గుర్తించనందున అతన్ని విడిచిపెట్టామంటూ కోర్టు పేర్కొంది. అత్యాచారం జరిగిన తర్వాత కొన్ని గంటల్లోనే బాధితురాలు చనిపోయింది.
'ఇలాంటి అన్యాయాలు మన ఇళ్లలో, మన పరిసరాల్లోనే జరుగుతున్నాయి. ఇలాంటి వాటికి చట్టపరంగా, సామాజికంగా ఎలాంటి పరిష్కారాలు లేకపోవడమే నన్ను చాలా బాధించింది. కాబట్టి ఒక రచయితగా నా వంతు బాధ్యతగా దీని గురించి చెప్పాలనిపించింది' అని సిరీస్ స్క్రిప్ట్ రైటర్ నిధి శర్మ చెప్పారు.
‘ఫెమినిస్ట్ అనే స్పెల్లింగ్ కూడా తెలియదు’
బెంగాలీలో విజయవంతమైన 'సంపూర్ణ' అనే షో ఆధారంగా చిరైయా సిరీస్‌ను తెరకెక్కించారు. అయితే, పితృస్వామ్య ధోరణులు ఎక్కువగా ఉండే ఉత్తర భారత నేపథ్యానికి అనుకూలంగా కథలో కొన్ని మార్పులు చేశారు.
'సంపూర్ణలో కథానాయిక ఒక ఫెమినిస్టు. మా కథలో కమలేష్‌కు అసలు దాని స్పెల్లింగ్ కూడా తెలియదు. ఆమె మొత్తం పితృస్వామ్య సమాజం కట్టుబాట్ల మధ్య పెరిగింది. కనీసం ఏది తప్పు, ఏది ఒప్పు అని నిర్ణయించుకోలేని స్థితిలో ఉంటుంది. కానీ, చివరకు ఏది తప్పో తెలుసుకొని దానికి వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధపడుతుంది' అని తన కథలోని పాత్ర గురించి నిధి శర్మ వివరించారు.
‘సమాజాన్ని ప్రశ్నించడమే మా ఉద్దేశం’
'దేశంలోని లక్షల మంది మహిళలు తమను తాము చూసుకునేలా కమలేష్ పాత్రను సృష్టించాలని అనుకున్నాం' అని డైరెక్టర్ శశాంత్ షా చెప్పారు.
'కుటుంబ వ్యవస్థను బలంగా నమ్మే వ్యక్తి కమలేష్. కానీ, నెమ్మదిగా ఆమెలో మార్పు మొదలవుతుంది. ఇదంతా ఒక ముసుగు మాత్రమేనని, కుటుంబంలో మనుషులు ఎంతలా నలిగిపోతున్నారో అర్థం అయినప్పుడు ఆమె ప్రపంచం కూలిపోతుంది' అని ఆయన వివరించారు.
చిరైయా సిరీస్ రూపొందించడం వెనుక ఉద్దేశాన్ని ఆయన చెప్పారు.
'ప్రభుత్వాన్నో లేదా చట్టాన్నో ప్రశ్నించడం మా ఉద్దేశం కాదు. ఈ అంశాన్ని మీరెలా చూస్తారనే ప్రశ్నని సమాజాన్ని అడగాలని అనుకున్నాం. ప్రజల్లో అవగాహన తీసుకురావడమే మా లక్ష్యం' అని ఆయన వివరించారు.
'సిరీస్‌లో చూపించిన పూజ కథ కల్పితమే. కానీ, లక్షల మంది మహిళల జీవితాల్లో ఇదో చేదు నిజం. కమలేష్ పాత్ర ద్వారా సిస్టర్‌హుడ్ (సోదరి భావం) చూపించాలనుకున్నాం' అని శశాంత్ చెప్పారు.
ఈ వెబ్ సిరీస్ కథంతా మహిళల చుట్టూ తిరిగినప్పటికీ, ఇందులోని పురుషులను క్రూరమైన విలన్లుగా చూపించకుండా జాగ్రత్త పడ్డామని ఆయన తెలిపారు.
'వాళ్లు రాక్షసులు కాదు. మామూలుగా మన మధ్య కనిపించే మనుషులే. మనలో పితృస్వామ్య ధోరణి ఎంత పాతుకుపోయిందంటే, స్త్రీల పట్ల వివక్ష చూపుతున్నామన్న సంగతి కూడా మనలో చాలామందికి అర్థం కాదు' అని ఆయన అభిప్రాయపడ్డారు.
ఒక వర్గం పురుషుల నుంచి విమర్శలు
ఈ సిరీస్‌ను ప్రజలంతా అద్భుతంగా ఆదరించారని దివ్య దత్తా అన్నారు.
'నాకు అర్ధరాత్రి కూడా ఫోన్లు, మెసేజ్‌లు వస్తున్నాయి. వ్యక్తిగతంగా, ఇన్‌స్టాలో, ట్విట్టర్‌లో మెసేజ్‌లు పంపిస్తున్నారు. అందరూ ఈ సిరీస్ చూస్తున్నారు. ఈ పాత్ర పోషించినందుకు నన్ను సీనియర్లు అభినందిస్తున్నారు. ఒకరు నాకు చీరతో పాటు ఒక ఉత్తరం రాసి పంపారు. మరొకరు ఒక కవిత పంపించారు. ఈ కథ అందరి మనసులను తట్టిందని నేను అనుకుంటున్నా' అని దివ్య దత్తా చెప్పారు.
అయితే, కొన్ని ప్రతికూల స్పందనలు కూడా వస్తున్నాయని నిధి శర్మ తెలిపారు.
'కొంతమంది ఈ కథ చూసి అసహనానికి గురవుతున్నారు. ఇలాంటి షోలు పురుషులను చెడుగా చూపిస్తున్నాయంటూ ఒక వర్గం పురుషుల నుంచి విమర్శలు వస్తున్నాయి. కానీ, మా ఉద్దేశం ఈ అంశంపై చర్చను మొదలుపెట్టడమే. మేం కళాకారులం. మేం చట్టాలు చేయలేం. నేరాలను ఆపలేం. సమాజాన్ని ఒక్కసారిగా మార్చలేం. కానీ, ఇలాంటి టాబూ అంశాలను కళ ద్వారా అందరూ చర్చించుకునేలా చేయగలం' అని దివి నిధి శర్మ అన్నారు.
చిరైయా వంటి కథలకు ప్రపంచాన్ని మార్చగల శక్తి ఉందని దివ్య దత్తా అన్నారు.
'మనం ఎక్కడ తప్పు చేస్తున్నామో ఈ కథ చెబుతోంది. ఎవరో బయట వ్యక్తులు వచ్చి మనకోసం ఏదో చేస్తారని ఎదురుచూడటం కంటే, మన ఇంటి నుంచే మార్పు మొదలుపెట్టాలని ఈ కథ చెబుతుంది. అది మొదటి అడుగే కావొచ్చు. కానీ, చాలా బలమైన అడుగు' అని ఆమె అభిప్రాయపడ్డారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)