You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘‘హార్ముజ్ నుంచి వచ్చే, పోయే ప్రతి నౌకనూ దిగ్బంధిస్తాం..’’- ఇరాన్‌తో చర్చలు ఫలించని వేళ డోనల్డ్ ట్రంప్ ప్రకటన
హార్ముజ్ జలసంధిలోకి ప్రవేశించే లేదా బయటకు వెళ్లే "ప్రతీ నౌకను దిగ్బంధించే చర్యలు’’ ప్రారంభించబోతున్నామని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రకటించారు.
ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ పోస్టు చేస్తూ.. "సమావేశం బాగానే జరిగింది, చాలా అంశాలపై ఏకాభిప్రాయం కుదిరింది. కానీ, అసలైన 'న్యూక్లియర్' విషయంలో మాత్రం ఏకాభిప్రాయం రాలేదు" అని పేర్కొన్నారు. అంతకు ముందు ఇరాన్ ప్రతినిధులతో అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ చర్చలు జరిపారు.
ఏదో ఒక సమయంలో హార్ముజ్ జలసంధి మీదుగా స్వేచ్ఛాయుత ప్రయాణాలపై ఒప్పందం కుదరబోతుండగా, ఇరాన్ మాత్రం "ఎక్కడో మైన్ ఉండవచ్చు" అని సాకు చూపిస్తూ అడ్డుకుంటోందని ఆయన విమర్శించారు.
ఆ మైన్ల గురించి ఇరాన్‌కు తప్ప ఎవరికీ తెలియదని ఆరోపించారు ట్రంప్.
అయితే, అంతకు ముందు చర్చల్లో పాల్గొన్న ఇరాన్ ప్రతినిధులు మాట్లాడుతూ, తెహ్రాన్ నమ్మకాన్ని చూరగొనడంలో అమెరికా ట్రంప్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
ఇరాన్ మాట తప్పిందన్న ట్రంప్
అదే పోస్టులో ట్రంప్ మరికొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.
అంతర్జాతీయ జలాల్లో ఇరాన్‌కు పన్ను చెల్లించిన ప్రతి నౌకను అడ్డుకోవాలని నౌకాదళాన్ని ఆదేశించినట్లు డోనల్డ్ ట్రంప్ తెలిపారు. జలసంధిలో ఇరాన్ అమర్చిన మైన్ల ధ్వంసం ప్రక్రియను అమెరికా నౌకాదళం ప్రారంభిస్తుందని చెప్పారు.
"అక్రమంగా పన్ను చెల్లించే ఎవరికీ సముద్రంపై సురక్షిత ప్రయాణం ఉండదు" అని తెలిపారు ట్రంప్.
"మా మీద లేదా శాంతియుతంగా ప్రయాణించే నౌకల మీద కాల్పులు జరిపే ఏ ఇరానియన్ అయినా సరే.. పేలిపోతాడు"
"దిగ్బంధం త్వరలోనే ప్రారంభమవుతుంది" అని ట్రంప్ ప్రకటించారు.
మరో పోస్టులో ట్రంప్ "హార్ముజ్ జలసంధిని తెరుస్తామని ఇరాన్ హామీ ఇచ్చింది, కానీ కావాలనే ఆ పని చేయడం లేదు" అని విమర్శించారు.
దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు, ప్రజలు ఆందోళన, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ట్రంప్ తెలిపారు.
"మాట ఇచ్చినట్లుగానే ఆ అంతర్జాతీయ జలమార్గాన్ని వేగంగా తెరిచే ప్రక్రియను వారు ప్రారంభించడం మంచిది" అని చెప్పారు.
ఇస్లామాబాద్ చర్చల గురించి ట్రంప్ ప్రస్తావిస్తూ.. వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్‌కాఫ్, చర్చల ప్రతినిధి జేర్డ్ కుష్నర్ నుంచి పూర్తి వివరాలు తెలుసుకున్నట్లు చెప్పారు.
‘‘సుమారు 20 గంటల చర్చల తర్వాత తేలిందేమిటంటే.. ఇరాన్ తన అణు ఆకాంక్షలను వదులుకోవడానికి సిద్ధంగా లేదు" అని ట్రంప్ అన్నారు.
‘‘మేం సైనిక చర్యలను చివరి వరకు కొనసాగించడం కంటే, ఇప్పుడు కుదిరిన ఒప్పందాలే చాలా విషయాల్లో మెరుగ్గా ఉన్నాయి. కానీ, అస్థిరంగా ఉంటూ, ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో తెలియని వ్యక్తుల చేతుల్లో అణుశక్తి ఉండనివ్వడంకంటే ఈ ఒప్పందాలేవీ ముఖ్యం కాదు. అణుశక్తి ముప్పు ముందు ఈ అంశాలన్నీ దిగదుడుపే" అని ట్రంప్ అన్నారు.
చర్చల ద్వారాలు ఇంకా తెరిచే ఉన్నాయా?
వాషింగ్టన్ తన "చివరి, ఉత్తమ" ప్రతిపాదనను ఇచ్చిందని అమెరికా వైస్ ప్రెసిడెంట్ జెడీ వాన్స్ తెలిపారు.
మరోవైపు అమెరికా వైఖరిపై ఇరాన్ అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఈ చర్చల్లో ఇరాన్ ప్రతినిధిగా వ్యవహరిస్తున్న ఆ దేశ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘెర్ గాలిబాఫ్ మాట్లాడుతూ ‘‘నమ్మకాన్ని సాధించుకోవాలో వదులుకోవాలో అమెరికాయే నిర్ణయించుకోవాలి’’ అని అన్నారు. గత రెండు యుద్ధాల తర్వాత, ఆ దేశాన్ని నమ్మే పరిస్థితి లేకుండా పోయిందని గాలిబాఫ్ తన ఎక్స్ అకౌంట్‌లో రాశారు.
అయితే, పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో అమెరికా, ఇరాన్ మధ్య పరోక్ష చర్చలు కొనసాగుతున్నట్లు తెలుస్తోందని బీబీసీ ప్రతినిధి అజాదే మోషిరి అన్నారు. దీనిపై అమెరికా లేదా ఇరాన్ అధికారికంగా ఏమీ ధ్రువీకరించలేదని తెలిపారు.
మధ్యవర్తుల ద్వారా జరిగే చర్చల స్వభావాన్ని అర్థం చేసుకోవడం ఎప్పుడూ కష్టమేనని, అయితే చర్చలకు లేదా మధ్యవర్తిత్వానికి అవకాశం ఇంకా పూర్తిగా మూసుకుపోలేదని ఇది సూచిస్తోందని తెలిపారు.
బీబీసీ ప్రతినిధి అజాదే మోషిరి ప్రకారం,
"ఒకే ఒక్క సమావేశంలో" ఒప్పందం కుదురుతుందని ఇరాన్ ఎప్పుడూ ఆశించలేదని ఇరాన్ విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇరుపక్షాలు తమ దేశ ప్రజల కోసం చేసే ప్రచారానికి, అసలు వాస్తవాలకు మధ్య వ్యత్యాసం ఉంటుందని ఇది గుర్తుచేస్తోంది.
ప్రస్తుతానికి కాల్పుల విరమణ భవిష్యత్తు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, యుద్ధంలో చిక్కుకున్న ప్రజల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని స్పష్టమవుతోంది.’’
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)